09-05-2020, 07:18 PM
మాయ - 7
కాసేపు మౌనంగా వుండి కథ గురించి తలుచుకుంటున్నారు ఇద్దరూ. ‘చాలా బాగుంది కిరీటి. నేనైతే నమ్మేస్తాను ఇలాంటివి ఈజీగా. జీవితంలో కొంచెం మ్యాజిక్ లేకపోతే మజా ఏముంటుంది చెప్పు’ అంటూ వీపుపై పడుకొని ఆకాశంలో నక్షత్రాలు చూస్తోంది సునయన.
కాసేపాగి ‘మీ ఊరి గురించి మర్చిపోలేని విషయం చెప్పావు. నీ గురించి కూడా ఏమన్నా చెప్పవా. ఇంతే interestingగా వుండాలి’ అని అడిగింది.
‘నా లైఫ్ లో అంత interesting విషయాలు ఏమీ లేవండి. ఏదో నేనూ, మా ఫ్రెండ్స్ సర్కిల్. అందరు కుర్రాళ్లలానే నేనూ, అవే సరదాలు.’
‘కొయి కొయి కోతలు. నువ్వు పెద్ద ముదురు. బయటపడవు అంతే’ అంటూ అతనివైపు తిరిగి చిలిపిగా నవ్వింది.
ఎంత introvert కైనా ఎవరితోనైనా కుదిరితే సరదాగా మాట్లాడాలి అనిపిస్తుంది. కిరీటికి కూడా సునయనతో అలాంటి కనెక్షన్ ఏదో కుదిరింది. ఎవ్వరితోనూ చెప్పకూడదు, చెప్పలేను అనుకున్న విషయాలు ఫ్రీగా ఈ అమ్మాయితో చెప్పుకోవచ్చు అనిపిస్తోంది అతనికి. కొంచెం ఆలోచించి ‘మీ దగ్గర కార్డ్ తీసుకున్న రోజు చాలా లక్కీ అండి. కార్డ్ తీసుకున్న పది నిమిషాలకి నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ నేనొక అమ్మాయిని kiss చేశాను’.
సునయన గబుక్కున లేచి కూర్చుంది. ‘ha! నాకు తెలుసు నువ్వు పెద్ద జాదూ అని. చెప్పు చెప్పు, ఏ ఒక్క డీటైల్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం చెప్పు’ అంటూ కిరీటి భుజాల్ని పట్టుకుని ఊపేసింది. మొత్తం డీటైల్స్ కాదు కానీ ఎవరో అమ్మాయి తనని అంగట్ల మధ్యలోకి లాగి ముద్దు పెట్టుకోవడం, చివరకు కిరీటి తను అనుకుంటున్న వ్యక్తి కాదని తెలిసి పారిపోవటం గురించి టూకీగా చెప్పాడు.
‘నువ్వు ఇంకా సత్యకాలంలో వున్నవోయి. అడగకుండా అమ్మాయి ముద్దు పెడితే నేను నీ ప్రియుడ్ని కాదు అని ఎలా చెప్పబుద్ధి అయ్యింది నీకు. వచ్చిన బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నావు కదా!’
కిరీటి కొంచెంసేపు ఏమీ మాట్లాడకుండా కాళ్ళు దగ్గరికి తీసుకొని గడ్డం మోకాళ్ళపై పెట్టి మౌనంగా వుండిపోయాడు. సునయన కూడా అతడ్ని ఆనుకొని గోదాటి మీదనుంచి వస్తున్న చల్లగాలి ఆస్వాదిస్తూ వుండిపోయింది. కాస్సేపటి తర్వాత కిరీటి నోరు పెగల్చుకొని ఇలా చెప్పాడు. ‘ఆ అమ్మాయి ముద్దు నేను అడక్కుండానే నాకు దక్కింది. అదొక్కటీ చాలు అనిపించింది. ఇంకా ఎక్కువ ఆ అమ్మాయి దగ్గర్నుంచీ తీసుకునేవాడినేమో కూడా. ఇంతలో మీ దగ్గర కొన్న పుస్తకం అడ్డు పడింది. మీరు గుర్తొచ్చి ఆగిపోయాను.’ ఈ చివరి మాటలు కొంచెం నవ్వుతూ చెప్పాడు.
సునయన అతడ్ని ఇంకా గట్టిగా హత్తుకుపోయింది ఈ మాట విని. కిరీటి తల తిప్పి చూస్తే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వున్నాయి. ‘సునయనా..’ అని ఏదో అడగబోతుంటే అతడి నోటిపై వేలు వేసి ‘నువ్వు పూర్తిగా పప్పుసుద్దవి కాదు. అలా అని పూర్తిగా జల్సారాయుడివి కూడా కాదు. రెండూ కరెక్ట్ పాళ్లలో కలగలిసిన మంచి అబ్బాయివి.’
‘ఇది నీలోని చిలిపితనానికి’ అంటూ రెండు బుగ్గలపైనా ముద్దులు పెట్టింది. ‘ఇది నీలోని innocenceకి’ అంటూ అతడి పెదవులను తన పెదవులతో పెనవేసి గాఢమైన ముద్దు పెట్టింది. ఆ ముద్దు కిరీటిలో సెక్సువల్ ఫీలింగ్ కలిగించలేదు. అది ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఇచ్చిన ముద్దు. అందులో కామం లేదు, ఒక ఆర్తి మాత్రమే వున్నది.
‘సునయనా, నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. నేను మీకు ఏమి ఇవ్వగలను?’
ఆమె అతడి గుండెపై చెయ్యి వేసి ‘నీ innocenceని ఇక్కడ పెట్టి తాళం వెయ్యి. ఆ తాళం ఎక్కడైనా పారెయ్యి. నీ దగ్గర ఆ innocence వున్నంత కాలం నా ముద్దు నీ దగ్గర వుంటుంది. అది కోల్పోయావో, నువ్వు నాలా అవుతావు. నాలాగా ఎప్పటికీ తయారవకు’ అంటూ అతడ్ని కరుచుకుపోయింది.
కిరీటిది చాలా చిన్న పరిధి. వేనవేల పల్లెటూళ్ళల్లో ఓ పల్లెటూరు ఈ పెంచలాపురం. అందులో శతకోటి లింగాల్లో మానవాడొక బోడి లింగం. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఈ అమ్మాయి అంతటి కాంప్లికేటెడ్ మనిషిని ఎప్పుడూ చూడలేదు. కొంతసేపటి క్రితం వరకూ కూడా ఆమెపై ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే వుంది. కానీ ఇప్పుడో... ఇప్పుడు సునయన అతని హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంది. ఇట్లాంటి అమ్మాయితో ఈ అనుభవం తర్వాత మామూలు ఆడపిల్లలు ఇక జీవితంలో నచ్చలేదు అతనికి. ఇది అతనిలో వచ్చిన మొదటి మార్పు.
ఆమె గురించి ఎంతో తెలుసుకోవాలని వుంది కిరీటికి. ఆమె మూలాలు ఎక్కడ వున్నాయి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చదువు, ఇష్టాయిష్టాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో అడగాలని వుంది. కానీ పర్సనల్ డీటైల్స్ అడిగితే వేటగాడ్ని చూసిన జింకపిల్లలా పారిపోతుంది అని ఒక బలమైన నమ్మకం మటుకు కుదిరింది అతనికి. బలవంతాన అడిగేకంటే తనంతట తను చెప్పిన దాంట్లో ఏమన్నా సమాచారం దొరుకుతుందేమో చూద్దాం అని డిసైడ్ అయ్యాడు.
‘ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు. మళ్ళీ ఎప్పుడైనా ఇటు వస్తారా?’ అని కిరీటి అడిగితే ‘తెలీదు. ప్రస్తుతానికి నా నుంచీ ఏమీ ఆశించకుండా నా మానప్రాణాల్ని కాపాడేది ధనుంజయ్ ఒక్కడే. అందుకే అతను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను’ అంది.
మళ్ళీ కాసేపు మౌనం రాజ్యమేలింది అక్కడ. ‘నాక్కూడా ఇదే మొదటి ముద్దు తెలుసా?’ అని ఆమె అంటే కిరీటి ఆమె భుజాలపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఈ సారి వారి ముద్దులో గాఢత ఇంకాస్త ఎక్కువగా వుంది. ఇద్దరూ మాటలతో చెప్పలేని భావాల్ని ఇలా పెదాలతో పంచుకున్నారు.
‘ఎప్పటికైనా ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీరు ఎక్కువగా ఏ వూళ్ళో వుంటారో కనీసం అదొక్కటైనా చెప్పండి’ అన్నాడు. ఆమె అతని చెవిలో ఒక మాట చెప్పింది. విని మౌనంగా తల ఊపాడు.
ఇద్దరూ ఒకరిని ఒకరు వీడి పోవటానికి సిద్ధంగా లేరు. కానీ సమయం ఎవరి కోసమూ ఆగదు కదా. ఎవరి దారిన వారు పోయే సమయం వచ్చింది. ‘పాడు పిల్లడా, నన్ను ఏడిపించావు. చూడు నా ముఖమంతా అసహ్యంగా తయారయ్యింది. ముఖం కడుక్కోవాలి, నీళ్ళెక్కడుంటాయో చెప్పు. కాస్త జనం లేని చోట సుమా’ అంటే ‘బస్టాండ్ దగ్గర పంచాయితీ కుళాయి వుంది రండి. నాకు తెలిసి ఈ రాత్రి బస్సులో మీ ఇద్దరే ప్రయాణికులు’ అంటూ ఆమెను అక్కడకు తీసుకుపోయాడు.
కుళాయి దగ్గర ముఖం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ధనుంజయ్ కోసం వేసి చూస్తున్నారు ఇద్దరూ. ‘నేను wait చేస్తానులే ఇక్కడ. చీకటి పడిపోయింది. నువ్వు ఇంటికి పోవా?’ అంటే ‘మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తాలెండి. దార్లన్నీ నాకు కొట్టిన పిండే’ అన్నాడు.
‘నువ్వేమన్నా నా చుట్టానివా? నేను పండక్కి మీ ఊరోస్తే సాగనంపినట్టు ఏమిటి ఇదంతా, పో పో’ అని నవ్వింది సునయన. ‘అలాంటిదే అనుకోండి. అదుగో మీ ఫ్రెండ్ ఎలాగూ వచ్చేస్తున్నాడు’ అంటూ పెట్టె మోసుకొస్తున్న ధనుంజయ్ ను చూపించాడు.
‘నువ్విక్కడుంటే నేను బస్ ఎక్కేటప్పుడు మళ్ళీ ఏడుస్తాను. వెళ్లిపోవా ప్లీజ్’ అని అడిగింది సునయన.
ఇక ఆ మాటకి ఎదురు చెప్పలేకపోయాడు కిరీటి. ‘గుడ్ బై’ అని షేక్ హాండ్ ఇచ్చి ఆమె చెయ్యి మెల్లగా నొక్కి మరి వెనుతిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. వెళ్ళేటప్పుడు ఎదురుపడ్డ ధనుంజయ్ కి చెయ్యి ఊపి సైకిల్ స్టాండ్ వైపు వెళ్ళాడు.
‘కుర్రాడు special అని ఇప్పటికైనా ఒప్పుకుంటావా?’ అని ఆమె పక్కన కూలబడుతూ అడిగాడు ధనుంజయ్. ‘జరిగిందంతా నక్కి నక్కి చూసేసి ఇప్పుడు మళ్ళీ నన్ను అడగటం ఎందుకు? He is a gem. ఎక్కువ రోజులు బతకలేడు ఊరు దాటి వెళ్తే. ఇంత మంచి వాళ్ళని లోకం పీక్కుతినేస్తుంది’ అంది సునయన. ఆమె కళ్ళల్లోంచి మళ్ళీ నీళ్ళు కారిపోతున్నాయి.
ధనుంజయ్ ఆమె భుజం తట్టి ఓదార్చాడు. ‘Control yourself Sunayana… నీకు తెలుసు కదా, మన line of work లో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోకూడదు. ఎడారిలో నడిచేవాడికి దగ్గర్లో ఒయాసిస్ వుందన్న ఊహే కొండంత బలం. ఈ కిరీటి నీ మనసుకి ఒయాసిస్ లాంటివాడు అనుకో. లోకం మరీ దారుణంగా అనిపించినప్పుడు ఈ అబ్బాయిని గుర్తు తెచ్చుకో. He will be a source of strength for you. అలాగే ఎడారిలో బతకాలంటే ఒయాసిస్ లో నీళ్ళు తాగాలి. మన పనిలో ఒకవేళ అవసరం ఐతే ఈ అబ్బాయిని వాడుకుంటావు కదా?’ అని అడిగాడు.
సునయన కళ్ళల్లోంచి ఉబుకుతున్న నీటిని తుడుచుకుంటూ ‘ఊ’ అని చెప్పింది.
‘మనం ఈ ఊరు వచ్చిన పని పూర్తి అయినట్లేనా’ అడిగాడు ధనుంజయ్. ‘ఆ, అనుకోకుండా పరిచయం ఐనా మనకు కావాల్సిన చాలా డీటైల్స్ కిరీటే చెప్పాడు. మిగతా వాళ్ళ దగ్గర విన్నట్లే ఈ ఊళ్ళో పంచలోహ విగ్రహం వున్నది నిజం. అన్నిటికంటే ముఖ్యమైన detail. పండుగ టైమ్ లో కాక మిగతా రోజుల్లో విగ్రహం ప్రెసిడెంట్ గారి ఇంట్లో పెట్టి వుంచుతారుట’ అని చెప్పింది సునయన.
‘గుడ్, గుడ్. మన పని మనం చేశాం. మిగతా అంతా వినయ్ చేతిలో వుంది. విగ్రహం దొంగిలించడం ఎలా అన్నది అతగాడికి వదిలిపెడదాం’.