07-05-2020, 11:20 PM
మాయ - 6
కిరీటి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఏకైక సంతానం. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇంట్లో ఇద్దరు మగవాళ్ళు. ఆడవాళ్ళతో కలవటం తక్కువ. ఇదిగో ఇప్పుడే డిగ్రీలో మొదటిసారి కో-ఎడ్ కాలేజీలో అమ్మాయిలతో కొంచెం మాట్లాడడం. తండ్రి నేర్పిన సంస్కారం, స్వతహాగా వున్న సిగ్గరితనము అమ్మాయిలని ఎప్పుడూ వక్రబుద్ధితో చూడనివ్వలేదు. ఇలాంటి ఒక కుర్రవాడికి సునయన, నిక్కీ వంటి వారు తమంతట తామే మీద పడితే ఎలా వుంటుందో ఆలోచించండి! ఇలా మొదలైన ఆడవారి సాన్నిహిత్యం అతడి characterలో ఏమన్నా మార్పులు తెచ్చిందా, అది యే రకంగా రూపాంతరం చెందింది అనేది కథాగమనంలో చూద్దాం.
మెత్తటి సునయన వొళ్ళు హత్తుకుపోతుంటే కిరీటికి ఆమె మాటలపై గురి పెట్టడం చాలా కష్టంగా వుంది. కొంత తేరుకొని తను కూడా ఆమె కంపెనీని ఆస్వాదించడం మొదలెట్టాడు. సరదాగా సంత అంతా కలియతిరుగుతున్నారు. ‘మీకు ఆకలి వెయ్యటం లేదా? ఏమన్నా తింటారా?’ అని అడిగితే ‘చూశావా, నువ్వు కాబట్టి అడిగావు. ఆ రాతిమనిషి తన పొట్ట సంగతి చూసుకుందుకు పోయాడు కానీ నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. ఆకలి వేస్తోంది కానీ మా డబ్బులన్నీ ధనుంజయ్ దగ్గర వున్నాయి. ఇప్పుడు అతగాడిని వెదికే ఓపిక నాకు లేదు.’ అన్నది.
మారు మాట్లాడనివ్వకుండా ఆమెని తినుబండరాలు దొరికేచోటికి తీసుకువెళ్లి సునయన ఏది అడిగితే అది ఇప్పించాడు. ‘Many thanks కిరీటీ, ఇప్పుడు నేను నీకోక భోజనం బాకీ. పద ఎక్కడైనా కాసేపు విశ్రాంతిగా కూర్చుందాం’ అని చెప్పి నాటకం జరిగే స్టేజ్ వైపు వెళ్లారు. స్టేజి ఎదురుగా వున్న కుర్చీల్లో కూలబడి కాసేపు గోదారి పైనుంచి వచ్చే చల్లగాలి ఆస్వాదిస్తూ వున్నారు ఇద్దరూ.
ఎదురుగా స్టేజిపై ఏవో నాటకాలు సాగుతున్నాయి కానీ కిరీటి వాటినేవీ పట్టించుకునే స్థితిలో లేడు. భుక్తాయాసమో, అలసట వల్లనో కానీ సునయన కుర్చీలో జారగిలబడి కన్నులు మూసుకుంది. రెప్ప వాల్చకుండా కిరీటి ఆమెనే చూస్తున్నాడు. మళ్ళీ జీవితంలో ఇలాంటి అమ్మాయిని చూస్తానని కానీ ఇంత దగ్గరగా, చనువుగా వుంటానని కానీ అతడికి నమ్మకం లేదు.
‘అలా పీక్కుతినేలా చూడకోయి, సిగ్గేస్తోంది’ అని సునయన అంటే గతుక్కుమని ‘నేను మిమ్మల్నే చూస్తున్నానని ఏమిటి గ్యారంటీ. ఐనా మీరు కళ్ళు మూసుకుని వుంటే మీకెలా తెలుసు నేనేమి చూస్తున్నానో. ఇది ఇంకొక మ్యాజిక్ ట్రిక్కా?’ అన్నాడు. ‘నీలాగా వయసులో వున్న కుర్రాళ్ళు చూసేదేమిటో చెప్పడానికి మా అమ్మాయిలకి మ్యాజిక్ అక్కర్లేదు’ అని నవ్వుతూ అంటోంది. సీరియస్ గా ఏమీ లేకపోయేసరికి కిరీటి ఆమె పైనుంచి చూపు తిప్పుకోలేక పోతున్నాడు.
స్టేజ్ మీద దుర్యోధనుడు పాంచాలి మీద పగ సాధిస్తాను అని భీకరంగా ప్రతిజ్ణ చేసి జనాల చప్పట్ల మధ్య తన పాత్ర ముగించాడు. ఒకసారి స్టేజ్ వంక చూస్తే దుర్యోధనుడి పాత్రధారితో మాట్లాడే వ్యక్తి ముఖం బాగా పరిచయం వున్నట్టు తోచింది కిరీటికి. మైండ్లో బల్బు వెలిగి ‘కిట్టీ’ అంటూ సడన్ గా లేచి నుంచున్నాడు. రికార్డ్ రాయాల్సినవాడు ఇక్కడకి ఎందుకు వచ్చాడో అర్ధం కాలేదు. క్లాస్ fail అవుతామన్న జ్ణానం కూడా లేకుండా ఇలా చేసేసరికి వాడి మీద కోపం వచ్చింది.
‘ఏమయ్యింది, ఎవరికైనా దెబ్బలు తగిలయా అంత react అయ్యావు’ అని సునయన అడిగితే ‘ఇప్పుడు కాదు లెండి, రేపు తగులుతాయి వాడికి దెబ్బలు’ అంటూ మళ్ళీ కూర్చున్నాడు కానీ ఇంక restless గా అయిపోయాడు. ఓ పక్క ఇప్పుడే వెళ్ళి కిట్టిగాడిని చెడామడా తిట్టాలని వుంది. కానీ సునయన పక్కనుండి కదలాలని లేదు! కిట్టి సంగతి రేపు చూడొచ్చు అని ఫిక్స్ అయి మళ్ళీ సునయన వంక చూస్తూ కూర్చున్నాడు.
‘ఇలాగే వుంటే నువ్వు నన్ను చూపుల్తోనే తినేస్తావు. పద, ఎక్కడికైనా పోయి కాసేపు కబుర్లు చెప్పుకుందాం’ అని కిరీటిని అక్కడ్నుంచి లాక్కుపోయింది. కొంచెం జనసందడి లేకుండా ఖాళీగా వున్న చోటకు వెళ్ళి నెల మీద కూలబడ్డారు ఇద్దరూ. ‘హమ్మయ్య’ అనుకుంటూ విష్ణుమూర్తి ఫోజులో పడుకొని ఎడమ చెయ్యి మడిచి తల కింద పెట్టుకొని కిరీటినే చూస్తూ, ‘నిన్నూ, మీ ఊరినీ మర్చిపోకుండా వుండేలా ఏమన్నా విశేషమో, కథో చెప్పవోయ్’ అని అడిగితే ఏం చెప్పాలబ్బా అని ఆలోచించి ఒక పుల్ల తీసుకొని నేల మీద ఏదో గీయటం మొదలెట్టాడు.
ఏం గీస్తున్నాడా అని కొంచెం వాలుగా వంగి చూస్తోంది సునయన. ఆమెను ఆ యాంగిల్లో కన్నార్పకుండా చూడాలని వుంది కానీ చూస్తే దొరికిపోతామని డిసైడ్ అయ్యి తను గీసినదాన్ని చూపించి చెప్పడం మొదలెట్టాడు.
‘మా వూరి పేరు ఒకప్పుడు సూరారం అట. సూర్యవరం అనే పేరుకి shortcut అనుకోండి. ఆ పేరు ఎందుకు పేరొచ్చిందంటే..’ అంటూ తను గీసిన బొమ్మ చూపించాడు. అది crudeగా గీసిన సూర్యుడి బొమ్మలా వుంది. అంటే, ఒక circle, దానినుంచి కిరణాల వలే ఏడు గీతలు గీసినట్టు వుంది. సునయన కళ్ళలో కుతూహలం చూసి కిరీటి చెప్పడం కంటిన్యూ చేశాడు. ‘ఇదిగో circleలా వుందే, ఇది మా ఊరు. ఇప్పుడు పంచాయితీలు, నియోజకవర్గాల బోర్డర్లు మార్చాక మరీ ఇంత రౌండ్ గా లేదు కానీ ఒకప్పుడు ఇలానే వుండేదిట.’
‘ఇదుగో ఈ ఏడు గీతలున్నాయే, ఇవి మా ఊళ్ళోకి వచ్చే దారులు. చూసారూ, ఇవి ఏడు దిక్కులనుంచి మా ఊరికి వచ్చే దారులు. అలాగే ఎనిమిదో దిక్కు నుంచి కూడా ఒకప్పుడు దారి వుండేదట’ అంటూ ‘ఇది ఉత్తరం దిక్కు’ అని చూపుతూ మిగతా గీతలకంటే కొంచెం సన్నగా ఒక గీత గీశాడు. ‘ఇప్పుడు ఉత్తరాన శ్మశానం తప్పితే ఇంకేమీ లేదు. అట్నుంచి ఎవరూ ఊళ్ళోకి అడుగుపెట్టరు కూడా.’
‘అన్ని ఊళ్లలాగానే ఇదీనూ. కాకపోతే మీ ఊళ్ళోకి రోడ్లు ఎక్కువ. ఇందులో విశేషం ఏముంది’ అంటూ తన ముఖంపైన పడుతున్న జుట్టు చెవి వెనక్కు తోసుకుంటూ అడిగింది సునయన.
‘మీకు impatience ఎక్కువ అండీ’
‘నోరు మూసుకుని చెప్పేది వినమని ఇంత గౌరవంగా ఎవ్వరూ చెప్పలేదయ్యా నాకు ఇన్నాళ్ళలో’
‘అహహ... అది కాదండీ నా వుద్దేశం’ అని కంగారు పడుతున్న కిరీటిని చూసి నవ్వి ‘ఆట పట్టించటానికి అన్నానోయి’ అని అతని చెయ్యి నొక్కి ‘ఇంక disturb చెయ్యనులే, చెప్పు’ అంది సునయన.
‘ఇంతకీ మా ఊరి పేరు ఎందుకు మారిందో చెప్పాలి. ఒకప్పుడు ఇక్కడ పెద్ద గుడి వుండేదిట. అలాంటి ఇలాంటి గుడి కాదండీ. చాలా పెద్ద సూర్యుడి గుడి. అంతే కాదండీ, సకల దేవతలకూ ప్రత్యక్ష స్వరూపం సూర్యుడు కాబట్టి ఆయన విగ్రహంతో పాటుగా చాలామంది దేవుళ్ళ విగ్రహాలు వుండేవి అట ఆ గుళ్ళో. అవన్నీ వెలకట్టలేని పంచలోహ విగ్రహాలు అట. దాదాపు 50 విగ్రహాలు వుండేవిట. కాలక్రమంలో గుడి శిధిలమైపోయి విగ్రహాలు అన్నీ కనుమరుగైపోయాయి.’
‘ఇలా వుంటే, ఒక రోజు పెంచలయ్య అనే పశులకాపరికి చిన్న సూర్యుడి విగ్రహం దొరికిందట. విగ్రహం దొరికిన రోజు ఆ టైమ్ లో సూర్యగ్రహణం. కానీ విగ్రహం చేతిలోకి తీసుకోగానే గ్రహణం చీకట్లో ఏదో దారి కనిపించిందట పెంచలయ్యకు. ఆ దారెమ్మట వెళ్తే, పాత గుడి అందులో విగ్రహాలు అన్నీ కనిపించాయట. గ్రహణం పూర్తి అవ్వగానే విగ్రహాలు అన్నీ తుడిచి శుభ్రం చేసి దణ్ణం పెట్టుకొని వచ్చాడుట పెంచలయ్య. అప్పట్నుంచీ ఆ పెంచలయ్య వంశస్థులు ప్రతి సంవత్సరం సూర్యగ్రహణం రోజు ఆ చిన్న విగ్రహం పట్టుకు పోయి ఆ గుళ్ళో పూజ చేసి వచ్చేవాళ్లుట. అదుగో ఆ పెంచలయ్య పేరు మీద మా ఊరు పెంచలాపురం అయ్యింది’.
‘Wow! అద్భుతం. నాకిలాంటి కథలంటే ఎంత ఇష్టమో తెలుసా! మరిప్పుడు ఆ విగ్రహం ఎక్కడుంది? ఇప్పటికీ ఆ పెంచలయ్య వంశం వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తున్నారా?’ అంటూ కుతూహలంగా అడిగింది సునయన.
కిరీటి చిన్నగా నవ్వి ‘లేదండీ, పెంచలయ్య వంశం వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. ఇది ఒట్టి కథ. ఇందులో నిజం ఎంతో ఎవ్వరికీ తెలియదు. మా ఊళ్ళో ఒక చిన్న సూర్యుడి విగ్రహం మటుకు వుందండి. ప్రతి సంవత్సరం రెండు సార్లు - సంక్రాంతి రోజు, రథసప్తమి రోజు ఊరేగిస్తారు. అది పంచలోహ విగ్రహం అనీ, గుళ్ళో వుంటే దొంగలు ఎత్తుకుపోతారని ప్రెసిడెంటు గారి ఇంట్లో భద్రంగా పెట్టి వుంచుతారు.’
‘మరి సూర్యగ్రహణం రోజు ఎప్పుడూ తీసుకెళ్లి పాత గుడి కోసం వెదకలేదా?’ చిన్నపిల్లలా కళ్ళు పెద్దవి చేసి అడిగింది సునయన.
‘అయ్యో రామ, చాలా సార్లు గవర్నమెంట్ ఆఫీసర్లు, పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి try చేశారు. గుడి కోసమని ఊళ్ళో చాలా చోట్ల తవ్వకాలు కూడా జరిపారు. ఏమీ దొరకలేదు. మా ఊరి గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎవరో ఎప్పుడో అల్లిన కథ అని చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు మమ్మల్ని ఏడిపిస్తారు’ అంటూ చెప్పడం పూర్తి చేశాడు కిరీటి.