01-04-2020, 01:03 PM
శ్రీనాథుడి పద్యాలు:
కవితల్ సెప్పిన బాడ నేర్చిన వృథా కష్టంబె యీ బోగపుం
జవరాండ్రే కద భాగ్యశాలినులు పుంస్త్వం బేల పో పోచకా
సవరంగా సొగసిచ్చి మేల్ యువతి వేషం బిచ్చి పుట్టింతువే
నెవరున్ మెచ్చి ధనంబు లిచ్చెదరు గాదే పాపపుం దైవమా
చాలా సందర్భాలో మనకు శ్రీనాథుడి అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కవిత్వాలు చెప్పే కవులూ పాటలు పాడే గాయకులకన్నా జవఱాండ్రు -వేశ్యలే మేలంటున్నాడు - అందరూ మెచ్చిధనం ఇస్తారు.
రసికులు కాని రాజుల్ని మెత్తగా, పొగడ్త అనిపించే విధంగా మందలించటానికి ఏమాత్రం వెనకాడడు - శ్రీనాధుడు
జననాథోత్తమ దేవరాయ నృపతీ చక్రేశ శ్రీ వత్సలాం
ఛన సంకాశ మహా ప్రభావ హరి రక్షా దక్ష నా బోటికిన్
గునృప స్తోత్ర సముద్భవంబయిన వాగ్దోషంబు శాంతంబుగా
గనక స్నానము చేసి గాక పొగడంగా శక్యమే దేవరన్
ఇదో అద్భుతమైన పద్యం. ఈ దేవరాయలు ఎవరో నాకు తెలియదు గాని శ్రీనాథుడికి బాగానే తిక్కరేపి నట్టున్నాడు. తొలి రెండు పాదాల్లోను అతన్నెంతగానో పొగిడినట్లనిపిస్తూ ఆ తర్వాత అసలు విషయం బయటపెడుతున్నాడు - నీలాటి కునృపుల్ని( చెడ్డ రాజులు) పొగిడీ పొగిడీ నాకు వాగ్దోషం వచ్చినట్టుంది, అది కనక ( బంగారం) స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప పోయేది కాదు, అని!