Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
మాఘ పురాణం - 15
15వ అధ్యాయము - జ్ఞానరావుకథ - మాఘపూర్ణిమ

గృత్నృమదుడుజహ్నువుతో నిట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను, బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి ఓయీ నీవు మరల నారాకను గోరి తపమచరించితిని యెందులకు? నీ మనస్సులో నేమియున్నది చెప్పుమని యడిగెను. అప్పుడా విప్రుడు 'స్వామీ! నాకు పుత్రవరము నిచ్చి సంతోషము కలిగించితిని, నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను, కాని నారదమహర్షి వచ్చి యీ బాలుడు పండ్రెండు సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది, నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను.

అప్పుడు శ్రీహరి 'ఓయీ! ఉత్తముడైన నీ పుత్రునకు పండ్రెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే యిప్పుడీ గండమునకు కారణము. పూర్వజన్మమున గూడ మీరిద్దరును భార్యాభర్తలే అప్పటి నీ పేరు జ్ఞానరావు. ఈమె అప్పుడును నీ భార్యయే.ఆమె ఉత్తమశీలము, గుణములు కలిగియుండినది.ఆమె భర్తయగు జ్ఞానరావు ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్యపుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము నాచరించినందున యీ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమనాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయును రెండు దోషముల వలన పండ్రెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషముపోయి నీ పుత్రుడు చిరంజీవియగును.


ఓయీ! మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును యిచ్చును. మాఘస్నానము చేయనివరికి, వారి సంతానమునకు ఆపదలు కల్గును, అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు దీర్ఘాయువులు, బుద్దిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్టుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు, మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ అందరికిని తెలియదు. నా భక్తులు, మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును, నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను.

బ్రాహ్మణుడును శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను, బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుదును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు వాని భార్యా, పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుదు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విదిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

జహ్ను మునివర్యా! మాఘవ్రతమునకు సాటియైనది మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి యిహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖమును గూడ పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్నృమద మహర్షి జహ్నుమునికి వివరించెను.



మాఘ పురాణం - 16
16వ అధ్యాయము - విద్యాధరపుత్రిక కథ

రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మనుద్దేశించి గంగాతీరమున తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్దలతో చిరకాలము తపమాచరించెను. అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ "నయనా! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపముంకౌ మెచ్చి పుత్రిక ననుగ్రహించుచున్నానని" యంతర్దానమునందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను, మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని, తనను చూచినవారికిని, సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు నీమెను యెవరికోయిచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుని కూడ నా యింటనే యుంచుకొందునని నిశ్చయించుకొనెను. ఒకనాడొక రాక్షసుడామెను చూచెను, ఆ రక్షసుడు దేవీ భక్తుడు ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను, కోరిన రూపము ధరింపగల శక్తిని కూడ సంపాదించెను. ఆ రక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుకొనెను. ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను. ఆ రక్షసుడు మిక్కిలి శక్తిమంతుదు, శివును తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమునిచ్చుచు "ఓయీ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని" చెప్పి యిచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువెవ్వడు నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వర గర్వితుడై యెవరిని లెక్కచేయక ప్రవర్తించుచుండెను.

అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి "సుందరీ! నన్ను వరించుమని యడిగెను, ఆమెయు నా తండ్రినడుగుమని చెప్పెను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తె నిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తె నిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక మరల వచ్చెను, విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగ సముద్రము క్రిందనున్న తన యింట ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను, విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని యడుగగా బ్రహ్మ యెనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తమున్నది అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును, ఈ లోపుననిన్నేమియు బాదింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి యిత్తుననగా నామెయేమియు మాటలాడలేదు, రాక్షసుడు మరల మరల నడుగగా 'నాకిప్పుడేమి అక్కరలేదు, ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది, దర్శించి పూజించుటకు శివలింగమెచటనున్నదో చూపూ మని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళములో వున్న హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను. అప్పుడఛటకు త్రిలోకసంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి యామెను జూచెను. ఆశ్చర్యపడి 'అమ్మాయి! నీవిచటనున్నావేమని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.

నారదుడామె చెప్పినదంతయును వినెను. అమ్మాయీ! భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త విచారింపకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకెదురుగ మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవీ సరస్సు స్నానమాచరింపుము. గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.

విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను. మాగమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను. నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడపెను. నారదుడును లోకసంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీమహావిష్ణు భక్తుడగు హరిద్రధుడను మహారాజును జూచెను. ఆరాజు సర్వకాల సర్వా వస్థలయందును శ్రీమహావిష్ణువును స్మరించుచుండును. అందరియందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరీయని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును. దామోదరాయనుచు భుజించును, కేశవాయనుచు నిద్రించును. నరసింహాయని స్మరించును, హృషీకేశాయని మేల్కొనును, వామనాయనుచు తిరుగును, ఏపని చేయుచున్నను యెవరితో మాటలాడుచున్నను యేదో ఒక విధముగ శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకునారదమహర్షి వెళ్లెను.

హరిద్రధుడును నారదమహర్షిని జూచి యెదురువచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగ నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి, సద్గుణశీల నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును. అని వానికి తగినరీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థముపోయెను. హరిద్రధుడును సముద్రము వద్దకు పోయెను, నారదుడు చెప్పినట్లుగ సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రధుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింట లేడు. అతదు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతదు పోవుచు శూలము ఇంటిలో వుంచి వెళ్లెను. రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును గ్రహించియుండెను. రాక్షసుడింటికి వచ్చునప్పటికి తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను. రాక్షసుడు హరిద్రధుడు చాలా కాలము యుద్ధము చేసిరి, హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను, వానిని భర్తగా వరించెను. హరిద్రధుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులును విష్ణుభక్తులై విష్ణుపూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి, అని వశిష్టుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను.


మాఘ పురాణం - 17
17వ అధ్యాయము - ఇంద్రునికి కలిగిన శాపము

వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్నృమదుడను మహర్షి గంగాతీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును వివరించుచుండెను. జహ్నువనుమహాముని మాఘమాసస్నాన మహిమను వివరింప కోరగా గృత్నృమదమహర్షి యిట్లు పలికెను. సూర్యుడు మకరరాశిలో నున్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడ అగుచున్నది. మాఘమాసమున ప్రాతఃకాలమున నదీస్నానము చేసిన వరు ఇంద్రుడు మహా పాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు.

పూర్వము తుంగభద్రా నదీతీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని యొకడు ఆశ్రమమును నిర్మించుకొని యుండెను. మిత్రవిందుని భార్య అతిలోకసుందరి, ఆమె యొకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములనారబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో గలసి యాకాశ మార్గమున పోవుచున్న యింద్రుడామెను చూచి మోహపరవశుడయ్యెను. అమెనెట్లైన పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగివచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును, ఆమె చేష్టలను గమనించుచుండెను.

మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యముగ ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను, విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశయై యింద్రునిపొందు అంగీకరించెను, కోరిక తీరిన యింద్రుడు ఆశ్రమము నుంది వెళ్ల యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని యడిగెను. నేనింద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గమునకుపోలేక భూలోకముననే యుండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడియుండుమని శపించెను. ఆ చోటున్ విడిచి గంగాతీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమునువిడిచి పరమాత్మలో లీనమయ్యెను.


ముని శాపమువలన యింద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగనేయుండును. అచటనుండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలోనుండి యెచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు యింద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు యింద్రుని వెదకుచు నదీతీరములయందు సముద్రతీరమునందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే మాఘమాసమున నదీస్నానము చేసి తీగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి, మునులు వారికిట్లనిరి.

దేవతలారా వినుడు మేము చేయువ్రతము మాఘమాసవ్రతము సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతఃకాలమున నా/తటాకదులందు స్నానము చేయుట శ్రీమహావిష్ణుపూజ, పురాణ పఠనము, యధాశక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘ్మాసమున చేసిన మాధవస్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి యదృష్టమనంతము. మాఘశుద్ధ చతుర్దశియందు గోదానము, వృషోత్పర్జనము, తిలదానము ఆవూప దానము, పాయసదానము, వస్త్రకంబళములదానము, విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములైయుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలును దివ్యమునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగియుండెను. శంఖచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగ నుండెను. కంకణములు వారములు వైజయంతీమాలమున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును డేవతలిట్లు స్తుతించిరి.

స్వామీ: నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీయనుగ్రహము లేనిదే యెవరును నిన్నెంతటి వారైనను యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామీ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామీ! యిట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితిలయముల నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయ మైనప్పుదు మఱ్ఱి ఆకుపై పరుండి చిదానంద స్వరూపడువైయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్పమరెవరును యెరుగజాలరు. కర్మప్రకృతి గుణభేదముల ననుసరించి సృష్టించి వాని యాందాసక్తుడవై యున్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయరూపమున నున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటిని సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉర్దవుడు మొదలగు ఉత్తమపురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును నిన్ను స్తుతించుట తప్పయేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.

దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై యిట్లనెను. దేవతలారా యింద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతదు ముని భార్యను మోహించి ఆమెననుభవించి దోషము చేసి మునిశాపమునందెను. పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్దభ ముఖుడైన ఇంద్రునిచే నదీస్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖముకవాడై, పూర్వమువలె దివ్య శక్తులను పొంది మమ్ము రక్షింపగలడు, కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయపుణ్యకాలమున నదీస్నానము చేయింపుడని చెప్పెను.


దేవతలు శ్రీమహావిష్ణువు మాటలనువిని విస్మితులైరి. స్వామి ముని శాపపీడితుడైన ఇంద్రుడు కేవల మాఘస్నానముచే స్వ్స్థుడగునా? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా! మాఘమాసస్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము విస్వామిత్ర మహర్షియునింద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వ స్థితి నందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత యాశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాసకాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీస్నానము చేయుచు భార్యను కూడ నదీస్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగాతీరమును చేరిన ఆమె ఈ చలిలో నకీచన్నీటి స్నానము బాదాకరము నేను స్నానము చేయజాలను. మీకు శక్తి యిష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో గలసి స్నానము చేసెను. గంధర్వును భార్య మాఘస్నానమును ధూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.

ఆమె అడవిలో తిరుగుచూ విస్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విస్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ కామక్రీడలలో తెలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విస్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీదించుచుందిరి. ఆ దృస్యమును చూచి మందిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని విస్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విస్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, " విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము", అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్త్రీ రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నందిన విస్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.

దేవతలారా! మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు యింద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను.
[+] 2 users Like dev369's post
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM
RE: బ్రహ్మ జ్ఞానం - by dev369 - 12-02-2020, 06:55 PM



Users browsing this thread: 9 Guest(s)