Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
మాఘ పురాణం - 12
12వ అధ్యాయము - శూద్రదంపతుల కథ


వశిష్ఠమహర్షి దిలీపునితో మహారాజా మరియొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడి వాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి యిష్టము కలవాడు, వ్యవసాయము చేయును. పశువులవ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను యింకను సంపాదించ లేకపోవు చున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని యింటికి వచ్చెను. "అమ్మా నేను బాటసారిని అలసినవాడను, చలి, చీకటి మిక్కుటములుగ నున్నవి. ఈ రాత్రికి నీ యింట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే వెళ్లిపోదునని" యింట నున్న కుముదను అడిగెను. ఆమెయు వానిస్థితికి జాలిపడి యంగీకరించెను. ఆమె యదృష్టమో ఆ బ్రాహ్మణుని యదృష్టమో యజమానియగు సుమనందుడు వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్లసావిడిలో ఒక చోట బాగుచేసి కంబళిమున్నగు వానినిచ్చి, పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరి నామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలపాడుచుండెను.

కుముద "ఓయీ నీవెచటినుండి వచ్చుచున్నావు యెచటికి పోవుచున్నావని యడిగెను. అప్పుడా విప్రుడు "తుంగభద్రాతీరము నుండి శ్రీ రంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందులకై యిట్లు వచ్చితిని సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను, కుముదయు మాఘస్నానము చేయుటకైన నదికి పోవలయునని యనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసిరావలెననుకొనెను. తన యభిప్రాయమును చెప్పగ బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీస్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు, అనారోగ్యమునకు, ధనవ్యయమగును వలదు అని యడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండ బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి. నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా నా దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడ కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచుకొట్టుచు యింటికి తీసికొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసికొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి.

అప్పుడామె విష్ణుదూతలారా! నామాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమ లోకమునకు తీసికొనిపోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో బాటు యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొనిపోవుచున్నారని యడిగెను. అప్పుడు విష్ణుదూతలు అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగ నరకమునకు పోవలసియున్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడుపనులు నీ కిష్టము కాకున్నను, భయమువలన గాని, పతిభక్తి వలన గాని నీ భర్తకు యెదురు చెప్పలేదు. కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివికావు. ఇంతే గాక మాఘమాస స్నానమును కూడ మనః పూర్వకముగ భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము నందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి.అప్పుడామే నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా! మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీటమునిగి లేచెను కదా! బలవంతముగ చేసినను యిష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా! ఆవిధముగా జూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు నాతోబాటు విష్ణులోకమునకు రావలెను కదా యని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి.

అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను జూచెను. సుమందుడుని పట్టికలో నన్నియును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీజలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసికొని రావలయునను ప్రయత్నమున, నీటిలో పలుమార్లు మునిగి తేలుటవలన నితడు యిష్టములేకున్నను. బలవంతముగ మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణు లోక ప్రాప్తిని పొందవలసియున్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి. రాజా! బలవంతముగ నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగ పూర్వము చేసిన పాపములుపోయి, విష్ణులోకమును చేరు పుణ్యమువచ్చిన దన్నచో మాఘమాసమంతయు నదీస్నానము చేసి, యిష్ట దేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని, యధాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము.

మానవుడు తెలిసికాని, తెలియకకాని బలవంతముగ దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగ చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవజన్మ దుఃఖ భూయిష్టము పాపబహుళము. ఇట్టివారికి చెడు కార్యములయందాసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పని సరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలయును, తన పనులను నూరింటినైనను వదలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లుకాక స్నానము, పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒకదినమైనను స్నానము పూజా, పురాణశ్రవణము, దానము యధాశక్తికిగ పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందులవలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసినవానికి పునర్జన్మ వుండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, కోణభద్ర, గౌతమీ యిత్యాది నదులయందు స్నానము చేసినను, కూడ యింతటి పుణ్యమే కలుగును. మానవులందరును వారెట్టి వారయినను మాఘస్నానము పూజ, పురాణశ్రవణము, దానము వీనినన్నిటినిగాని, కొన్నిటిని యధాశక్తిగ చేయుటయే వారికి పాపతరణోపాయము, మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠమహర్షి దిలీపునకు వివరించి చెప్పెను.


మాఘ పురాణం - 13
13వ అధ్యాయము - సుశీలుని కథ


రాజా! మాఘమాసస్నానము వలన వైకుంఠప్రాప్తిని యెట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి యొక కథను వినుము. పూర్వము గోదావరీ తీరమున సుశీలుడను కర్మిష్ఠి అయిన వేదపండితుడు కలదు. అతనొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ దప్పి భయంకరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోను, ఉన్నతములగు వృక్షములతోను, పులి మొదలగు భయంకర జంతువులతోను కూడియుండెను. అతడా అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెడకుచు అటు నిటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్రచెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగియుండెను. అచటి కొమ్మలు ముళ్లు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదలునట్టి యవకాశములేదు. ఆహారపానీయాదులను తీసికొను అవకాశములేదు. ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదువనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను.

కొంత సేపటికి సుశీలుడు స్తిమితపడెను. ఓయీ! నీవెవరవు? నీకీ పరిస్థితియేమి? చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు మహాత్మా! నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నియు పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగనుంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడెడి వాడను, ఎవనికిని యేపనియు చేసెడి వాడనుకాను. అసత్యములు పలికెడివాడను పరులసొమ్ము నపహరించుచుండువాడను. ఎంతయో ధనమును కూడబెట్టితిని. ఎవరికిని యేమియు నీయలేదు. స్నాన, దాన పూజాదికములను వేనిని ఆచరింపలేదు. దైవపూజయన నేమోయెరుగను. ఇట్లందరిని బాదించుచు చివరకు మరణించితిని. నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టుగా దాని ముళ్ల కొమ్మలు భాధింపగా ఎచటికి కదలలేని యీ జన్మలోనుంటిని. నీవంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు యీ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహువిధములుగ ప్రార్థించెను.

సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయీ! యిచట సమీపమున నీరున్నదాయని అడిగెను. పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదాయని సుశీలుడడిగెను. అప్పుడా రాక్షసుడు అయ్యా! నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటివారే, వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగ నున్నాడని చెప్పెను. సుశీలుడు ఓయీ ధైర్యముగ నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని భాష్కలుడను వానిని వెదకుచుపోయెను.

సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపమున నున్న నా పూర్వీకునకు రాక్షసరూపము పోవలెనున్న యేమి చేయవలయునో చెప్పునని అడిగెను. అప్పుడు ఓయీ! నీవు మాఘమాసమున నదీస్నాన చేయుము. శివునిగాని, కేశవునికాని నీ యిష్టదైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక, పూర్వులైన నీ పితృదేవతలును పాపక్షయము నంది పుణ్యలోకముల నందుదురు. స్నానము యేడు విధములు. అవి,
మంత్రములను చదువుచు చేయు స్నానము, మంత్రస్నానము.
మట్టిని రాచుకొని చేయు స్నానము, మృత్తికాస్నానము.
భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము, ఆగ్నేయస్నానము.
గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము, వాయవ్యస్నానము.
నదులు, చెరువులు మున్నగువానిలో చేయు స్నానము, వరుణ స్నానము.
ఎండగనున్నప్పుడు వానలో చేయు స్నానము, దివ్యస్నానము.
మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానము, మానసస్నానము.

ప్రాతః కాలమున స్నానము చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్ఠివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయ వచ్చును, జుట్టుముడి వేసికొని స్నానము చేయవలెను.

స్నానము చేయునప్పుడు కౌపీనము(గోచి)ఉండవలయును. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరీయినచో ఆచమనము చేయవలయును. భగవంతుని స్మరించుచు కుడిచెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్రస్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను. శ్రీహరిని లేదా యిష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో నుంచవలయును. బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి, ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను, ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను, నదీ స్నానము చేసిన పిమ్మట తడివస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును, పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము నిచ్చును.

స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు యిష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయును. సూర్యుని, గంగను, దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా, యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్థమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడ తలచుకొని నమస్కరింపవలయును. అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును, పూజాదులను నిర్వహించెను. స్నానాంతమున రాక్షసరూపము నన్ను పూర్వుని ఉద్ధేశించి తర్పణము కూడ చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను.
[+] 1 user Likes dev369's post
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM
RE: బ్రహ్మ జ్ఞానం - by dev369 - 12-02-2020, 06:52 PM



Users browsing this thread: 7 Guest(s)