Thread Rating:
  • 7 Vote(s) - 3.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు & English books
#11
విశ్వ విఖ్యాత నవల...

అలెక్స్ హేలీ రచన..

"ఏడు తరాలు"


Review From హరి కుమార్ రెడ్డి



ఏడు తరాలు

---------------------

ఏడు తరాలు... ఇది ఒక బానిసల కథ. అమెరికాకు ఆఫ్రికానుండి బలవంతంగా రప్పించబడిన అమెరికాలోని ఆఫ్రికా బానిసల కథ. అగ్రరాజ్యమైన అమెరికాలో చీకటి కోణం, నల్లవాళ్లపై తెల్లవాళ్ళ ఆకృత్యాలు ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అప్పటిదాకా నా అనే వాళ్ళతో సొంత ఊరి జనం మధ్య సంతోషంగా ఉన్న జీవితాలు ఒక్కసారిగా తలకిందులైతే? వీళ్ళందరికీ దూరంగా, భవిష్యత్తు అంటే ఏంటో తెలీక, దొరలకు కండలు కరిగేలా స్వేదాన్ని చిందించిన దానికి ప్రతిఫలంగా చర్మం ఊడిపోయేలా కొరడా దెబ్బలు తింటూ, గతాన్ని గుర్తు చేసుకోలేక - భవిష్యత్తును ఊహించలేక నాగరిక సమాజంలో ఒక జాతి మరో జాతిపై ముసుగులో చేసిన దమనకాండకు అక్షరరూపం ఈ "ఏడుతరాలు" నవల! ఇదొక వాస్తవిక చరిత్ర!!



స్వేచ్ఛనుండి సంకెళ్లకు, సంకెళ్లనుండి స్వేచ్ఛా వాయువుల్లోకి వెళ్లిన ఆఫ్రికా నిగ్గర్ల (నిగ్గర్లు అంటే బానిసలు) చరిత్ర ఈ ఏడు తరాలు. బానిసలపై జాలి, దయ, కరుణ, మానవత్వం లాంటివేమీ లేకుండా అగ్రరాజ్యం అమెరికా జరిపిన ఆకృత్యాలు చదువుతుంటే నరాల్లోని రక్తం ఉడికి పోతుంది, కన్నీళ్ల సముద్రంలో కనుగుడ్లు తేలియాడుతాయి.



క్రీస్తుశకం 1750 లో ఆఫ్రికా ఖండంలో గాంబియా అనే దేశంలో మొదలవుతుంది ఈ కథ. కల్లా కపటం తెలియని , స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు అడ్డులేని జాఫురు అనే గ్రామంలో ఉమురా-బింటో దంపతులకు కుంటా పుట్టడంతో కథ ప్రారంభం అవుతుంది. అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో, నానమ్మ చెప్పే కథలతో, తోటి పిల్లలతో వాళ్ళ సంప్రదాయాల ప్రకారం పెరుగుతూ ఉంటాడు. పొలం పనులు చేస్తూ, సాయంత్రాలు చదువుకుంటూ ఉంటాడు. కఠినమైన గ్రామ సంప్రదాయ పురుష శిక్షణ తీసుకొని ఇంటికి తిరిగొచ్చి తన వైవాహిక జీవితం గురించి కలలు కంటూ ఉంటాడు.



ఒకానొక దురదృష్ట సమయంలో తెల్లవాళ్ళ కంటబడి వేట కుక్కలతో, మారణాయుధాలతో వేటాడి బందీగా చిక్కుతాడు. చిన్నప్పుడు తన తండ్రి చెప్పిన "తెల్లవాళ్లు మన చుట్టూ ప్రక్కల ఉన్నప్పుడు కోడిమాంసం వాసన వస్తుంది" అన్నవిషయంలో ఏమరపాటుగా ఉన్నందుకు చింతిస్తాడు. అలా తెల్లవాళ్ళకు చిక్కి, స్పృహ కోల్పోయి కళ్ళు తెరిచేప్పటికీ ఓడలో వివస్త్రై బందీగా ఉంటాడు. శరీరమంతా గాయాలై ఎర్రగా పుండ్లు పట్టి ఉంటుంది. కాళ్ళు చేతులు కట్టి పడేసి ఉంటాయి. ఆ ఇరుకు ఓడలో తన తోటి బందీలతో భోజనాలు, మలమూత్రాలు ఒకేచోట చేస్తూ కొన్నివారాల పాటు సముద్రయానం చేసి అమెరికా చేరుతాడు. రచయిత వర్ణించిన ఓడ ప్రయాణం చదువుతుంటే అందులో ప్రయాణించడం కన్నా చావడం అతి ఉత్తమమని అనిపించకమానదు. విసర్జించిన మలమూత్రాలు బందీల చుట్టూ అట్టలు అట్టలుగా పేరుకున్న చోటే నిద్రాహారాలతో ప్రయాణమంటే ఎంత జుగుప్సాకారంగా ఉంటుందో చదువుతున్న మనకే కడుపులోని ప్రేగులు నోట్లోకి వచ్చేస్తాయా అని అనిపిస్తుంది . ఒకవేళ బానిస నోరుతెరిచాడో కొరడాతో చర్మం చెమడాలు చెమడాలు కింద వొలిచేవారు. దారిలోనే గాల్లో కలిసిపోయిన ప్రాణాలను సముద్రంలోకి పడేస్తారు. బ్రతికిన వాళ్ళతో ఎలాగోలా తీరానికి చేరుకున్న కుంటాను సంతలో పశువులను కొన్నట్లు ఒక తెల్లదొర వేలంలో కొంటాడు.



నిగ్గరుగా బ్రతుకుతున్న కుంటా చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృతీ సంప్రదాయాలను విడిచిపెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. దొంగచాటుగా వాటిని పాటిస్తూ అవకాశం చిక్కినప్పుడల్లా పారిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు. దొరికిన ప్రతిసారి చావుదెబ్బలు తిన్నా విశ్వ ప్రయత్నాలను మాత్రం ఆపడు. ఒకసారి ఇలానే పారిపోయి దొరకనప్పుడు శిక్షించదలచిన తెల్లవాడు నీ పురుషాగము, కాలి పాదాల్లో ఏదోటి కోరుకో అని అడిగితే తన వంశం తనతోనే అంతమవడం ఇష్టంలేక తన రెండు చేతుల్ని అడ్డు పెట్టుకోడంతో.. చర్మం నుండి, నరాల నుండి, కండలనుండి, ఎముకలనుండి ఒక్కవేటుతో కుడికాలు పాదం తెగి ఎగిరి అవతల పడుతుంది. ఇక విధిలేని పరిస్థితుల్లో అక్కడే నిగ్గరుగా బానిస బతుకు బతుకుతూ తనతోటి మరో నిగ్గరు స్త్రీ భెల్ ని పెళ్లిచేసుకుంటాడు .



కొన్నాళ్లకే వీరికి పుటిన పాపకి కిజ్జీ అని పేరు పెట్టి ఆఫ్రికా సాంప్రదాయాల ప్రకారం పెంచుతాడు. చిన్నప్పటి నుండి తన కథనంతా కిజ్జీ కి చెప్పి నీ ముందుతరాలకు కూడా ఇలానే చెప్పమని కోరతాడు. తవాత కిజ్జీ తన బాధలు, తన తండ్రి బాధలు తన సంతానానికి చెబుతూ రాబోయే తరాలకు కూడా ఇలానే చెప్పాలని చెబుతుంది. ఇక్కడ కిజ్జి కూడా అమ్మా నాన్నలకు దూరమై వేరే దొరదగ్గరకి బానిసగా బ్రతకడానికి అమ్మబడుతుంది. అలా కుంటా కథ తరతారలకు చెప్పబడుతూ ఏడవ తరం వాడైనా రచయిత అలెక్స్ హైలీ కి చేరుతుంది. ఇక్కడినుంచి రచయిత దేశదేశాలు తిరిగి, ఎన్నో గ్రంధాలు, ప్రభుత్వ రికార్డులు పరిశీలించి కుంటా స్వగ్రామమైన జాఫురుకు చేరుకుంటాడు. కందెన నలుపు శరీరం గల తన పూర్వీకులను చూసి తన శరీర వర్ణాన్ని పోల్చుకొని చుస్తే తన వర్ణ సంకరత్వానికి కుమిలిపోతాడు. ఇక్కడితో కథ ముగుస్తుంది.



తెల్లవాళ్లు నల్లవాళ్ళ స్వేదంతో పంటలు విరగ పండించి లాభాలు ఆర్జించారు! తమ లైంగిక వాంఛను తీర్చుకోవడం కోసం అనేకమంది నల్లవాళ్ళ మహిళలపై ఘోరమైన హత్యాచారాలు చేశారు!! వాళ్లకు పుట్టిన పిల్లలు తమ వారసులని తెలిసికూడా వాళ్ళతో ఊడిగం చేయించారు!! స్వేచ్ఛ కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న సమయంలో లేనిపోని ఆంక్షలను వారిపై రుద్ది, తెల్లవాళ్ళ అనుకూల చట్టాలను తయారు చేసి ఎక్కడికక్కడ వాటిని అణచివేయసాగారు!!!

నాగరికులమని, అభివృద్ధి చెందిన వారమని చెప్పుకొనే అమెరికన్లలో అత్యంత పాశవికమైన చీకటి కోణాన్ని ఈ నవల మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. బానిసలుగా ఆఫ్రికన్లు బ్రతికిన బ్రతుకు, తెల్లవాళ్లు పెట్టిన చిత్రహింసలు, చేసిన హత్యాచారాలు హృదయవిదారకంగా ఉంటాయి. స్వేచ్చావాయువుల్లోనుండి బలవంతంగా బానిస బతుకులోకి ఈర్చబడిన కుంటా మళ్ళీ స్వేచ్చావాయువుల్లోకి వెళ్ళడానికి పడిన తపనని... చదివేకొద్దీ వచ్చే కన్నీళ్లు చుస్తే ఆకాశానికి చిల్లులు పడ్డాయా అని అనిపించకమానదు! ముఖ్యంగా కుంటా ఆఫ్రికాకు దూరమైనా తన భాషా, సంస్కృతీ సాంప్రాదాయాలను, మతాన్ని విడిచిపెట్టడు. తన వంశ చరిత్ర రాబోయే తరాలకు కూడా తెలియాలని తాపత్రులపడుతుంటాడు.

రూట్స్' పేరుతో 1976 లో ప్రచురితమైన ఈ రచన మూడు దశాబ్దాల క్రితం ఏడు తరాలు పేరుతో సహవాసి గారు తెలుగులోకి అనువదించారు.


Download

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply


Messages In This Thread
తెలుగు & English books - by Rajkumar1 - 02-02-2019, 09:46 PM
RE: తెలుగు & English books - by ~rp - 02-02-2019, 09:59 PM
RE: తెలుగు & English books - by ~rp - 02-02-2019, 10:45 PM
RE: తెలుగు & English books - by Rajkumar1 - 05-02-2019, 07:57 PM
RE: తెలుగు & English books - by k3vv3 - 07-02-2019, 07:55 PM
RE: తెలుగు & English books - by hai - 07-03-2019, 10:00 PM
RE: తెలుగు & English books - by LEE - 24-02-2019, 02:19 PM
RE: తెలుగు & English books - by ~rp - 16-03-2019, 08:57 AM
RE: తెలుగు & English books - by ~rp - 16-03-2019, 10:00 PM
RE: తెలుగు & English books - by RICHI - 28-05-2019, 01:28 AM
RE: తెలుగు & English books - by ~rp - 22-03-2019, 10:06 AM
RE: తెలుగు & English books - by ~rp - 22-03-2019, 10:26 AM
RE: తెలుగు & English books - by Yuvak - 24-03-2020, 03:48 PM
RE: తెలుగు & English books - by skrra - 03-01-2020, 12:50 PM
RE: తెలుగు & English books - by skrra - 03-01-2020, 12:51 PM
RE: తెలుగు & English books - by viswa - 04-05-2021, 03:57 PM
RE: తెలుగు & English books - by N...B - 26-07-2022, 10:08 PM
RE: తెలుగు & English books - by Aavii - 10-08-2023, 06:23 PM



Users browsing this thread: 2 Guest(s)