08-01-2020, 08:09 PM
రూపమే మారిపోవచ్చు!
ఇప్పటివరకు చేతిలో నిండుగా ఉంటూ పర్సు లేకపోయినా పర్వాలేదు, ఫోను ఉందిగా అన్న భరోసానిస్తూ వచ్చిన ఈ
ఫోన్ ఇంకొన్నాళ్లయితే అసలు కన్పించకపోవచ్చు. అయ్యో... ఫోను లేకుండా ఎలా అని కంగారుపడకండి. ఫోను ఉంటుంది
కాకపోతే రూపమే మారిపోతుంది. రాబోయే కొత్త తరం ఫోన్లు విడిగా ఓ పరికరంలా కాకుండా మనలో ఒక భాగంగా
మారిపోవచ్చు. ముంజేతి కంకణంగానో, వేలి ఉంగరంగానో, కళ్లద్దాలుగానో అమరిపోవచ్చు. మనం రోజువారీ చేసే ఎన్నో
పనులకు అవి రిమోట్‌లా పనిచేయవచ్చంటున్నారు నిపుణులు. ఫోను రూపంలోనూ పనితీరులోనూ వచ్చే దశాబ్దం
గొప్ప మార్పుల్ని తీసుకురానుందనీ ఇప్పటివరకూ జరుగుతున్న పరిశోధనలే అందుకు నిదర్శనమనీ అంటున్నారు
వారు. ఉదాహరణకు మడత పెట్టగల ఫోన్ గత ఏడాది సంచలనం సృష్టించింది. నిజానికి కేంబ్రిడ్జిలోని తమ
రీసెర్చ్ సెంటర్ లేబొరేటరీ డైరెక్టర్ తపానీ టైహనెన్ తయారుచేసిన ‘ద మార్ఫ్’ కాన్సెప్ట్ ఫోను డిజైన్‌ని నోకియా
2008లోనే ప్రదర్శించింది. అన్ని కంపెనీలూ దాన్ని అందిపుచ్చుకుని ప్రయోగదశలన్నీ దాటి మార్కెట్లోకి
తీసుకురావడానికి పదేళ్లు పట్టింది. అలా ఇంకా ఎన్నో విషయాల్లో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ
ఈ ఏడాది కాకపోతే మరో రెండేళ్లకైనా మన ముందుకు వస్తాయని గ్యాడ్జెట్ నిపుణుల అంచనా.