Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తోడొకరుండిన
#16
"మహీ! ఏమంది సునందా?" శేఖర్ క్యూరియస్ గా అడిగాడు మర్నాడు.
" ఏముంటుంది అక్కడ ఉదయ్ ఏమంటాడో అదే అంది. ఇలా కాదండి! మీరు మీ చిన్నన్నాగారితో మాట్లాడండి. మా అమ్మావాళ్ళని, ఉదయ్ ని నేను కన్విన్స్ చేస్తాను. ఎలాగైనా మనమే కాస్త ఫోర్స్ చెయ్యాలి" అంది సునంద.
"అవును సునందా! ఒకే సిట్యువేషన్లో ఉన్న వాళ్లిద్దరూ ఒకింటివాళ్లయితే అంతకన్నా మనకింకేం కావాలి?" శేఖర్ కి ఈ ప్రపోజల్ చాలా నచ్చింది.
పెళ్లి హడావిడంతా అయ్యాక అమ్మానాన్నలతో కూడా ఈ విషయం మాట్లాడాడు శేఖర్. అతడి తండ్రి రాజారాం, తల్లి సుందరి మొదట కాస్త ఆశ్చర్యపోయినా తర్వాత అది మంచి ఆలోచనే అనుకున్నారు. దాంతో తమ ప్రయాణం వాయిదా వేసుకున్నారు..
విశ్వనాధం, సంధ్యలిద్దరు ఆ ప్రపోసాల్ వినగానే మొదట చాలా సంతోషించినా "మహిని చూసి ఇంతకుముందు ఒకరిద్దరు అడిగారయ్యా. కానీ అది ఇష్టపడలేదు" అన్నారు.
"అలాగని మనం ఊరుకుంటే ఎలా చిన్నన్నా. ఈ పెళ్ళివల్ల ఉదయ్, మహిలే కాదు వాళ్ళ పిల్లలు కూడా సంతోషంగా వుంటారు.. మనమే ఎలాగైనా నచ్చచెప్పాలి."
"అవునురా విస్సూ. ఆ పిల్లాడు మాకు బాగా తెలుసురా. చాలా మంచివాడు. పెళ్ళాంపోయిన పది రోజులుకూడా తిరక్కుండానే మళ్ళీ పెళ్లికి తయారయ్యే ప్రబుద్దులున్న ప్రపంచంలో అసలింక.ఆ ప్రసక్తే వద్దంటున్నాడంటే అతనెలాంటివాడో ఆలోచించు" రాజారాం చెప్పాడు.
"మావయ్యగారూ! నేనెలాగైనా ఒప్పించి మా అమ్మావాళ్ళని, ఉదయ్ ని ఈ ఊరు తీసుకొస్తాను. ఓసారి వాళ్ళిద్దరిని మాట్లాడుకోమందాం" సునంద తన అభిప్రాయం చెప్పింది..
అదే మంచిదనుకన్నారంతా.
      *         *         *        *
"వైషూ నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను. నానమ్మని, శాంతిని విసిగించకుండా మంచమ్మాయిలా ఉండాలి" ఉదయ్, వైషూని వొళ్ళో కూర్చోబెట్టుకొని చెబుతున్నాడు.
"ఊహూ! నేను నీతో వస్తాను" ఉదయ్ ని వెళ్లనీకుండా పేచీలు పెడుతోంది వైషూ.
"అమ్మో! అక్కడ పెద్ద పెద్ద ఇంజెక్షన్లు ఉంటాయి. వెళ్తే నీకూ పొడిచిపారేస్తారు" ఉదయ్ వాళ్ళమ్మ లలిత భయపెట్టబోయింది.
"దాడి" పెద్ద రాగం మొదలెట్టింది వైషూ.
"అబ్బబ్బా! సునందా దీని పిచ్చిలతో చచ్చిపోతున్నామనుకో. రోజూ ఇంతే, వాణ్ణి ఓ పట్టాన ఇల్లు కదలనివ్వదు. ఇక ఆ తర్వాత మా ప్రాణాలు తీసిపారేస్తుంది" అంది లలిత.
సుందకి అదంతా తెలిసిన విషయమే కనుక విని ఊరుకుంది. ఈ రోజు పొద్దున్న ట్రైన్ దిగినప్పటి నుంచి ఎలా ఈ విషయం కదిపి అందరిని ఒప్పించాలా అనేదే ఆమె ఆలోచన.
చివరికి ఉదయ్ సాయంత్రం వచ్చేటప్పుడు ఏవేవో తెస్తానని ప్రామిస్ చేస్తే అప్పుడు వైషూ పర్మిషనిచ్చింది.
"అక్కా! బాయ్. ఈవినింగ్ వస్తాను" ఉదయ్, సుందకి చెప్పి వెళ్ళిపోయాడు.
లంచ్ అయ్యాక పనిపిల్ల శాంతి, వైషూని పొడుకోబెడుతుంటే, అప్పుడు కాస్త రెలాక్సగా కూర్చున్నారు.
"సునంద! ఇంతకీ పెళ్లెలా జరిగింది?" అప్పుడే లలితకి తీరిక దొరికి అడిగింది. మహిమ విషయం కధపటానికి మంచి దారి దొరికిందనుకుంది సునంద
"భ్రహ్మాండంగా జరిగింది" అంది.
"ప్చ్!" లలిత నిట్టూర్చింది.
"ఏమిటో సునందా! అందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి. వీడికా ఘడియలొచ్చే సూచనే లేదు" నిరాశగా చెప్పింది.
"అమ్మా! ఉదయ్ ఇంకా ఆ మాటెత్తటంలేదా?" ఏదో ఆలోచిస్తూ అడిగింది.
"అంతా నా ఖర్మ" ఆవిడ తలకొట్టుకుంది.
"ఈ వయసులో అందరిలా కృష్ణా రామా అనుకుంటూ బతికే యోగం నాకులేదే. ఓరోజు లేస్తే ఓరోజు లెవలెను. ఎప్పుడేలా వుంటానో నాకే తెలీదు. ఎన్నాళ్ళు నేనా పసిదాని బాధ్యతలు మోయగలను? పోనీ దాన్ని వాళ్ళమ్మమ్మా వాళ్ళూ అర్చన పోయాక తీసుకెళ్తామంటే ఇచ్చాడా? ససేమిరా అన్నాడు. ఇవ్వాలంటే నేనున్నాను. తర్వాతయినా దాన్ని చూసుకోటానికో మనిషుండాలిగా. ఆ మాట నీ తమ్ముడి చెవికెంత చెప్పినా ఎక్కనే ఎక్కదు. నేను ఎంత గోలపెట్టినా బెల్లంకొట్టిన రాయిలా ఉలకడు పలకడ. ఇక మీ నాన్న నిమ్మకి నీరెత్తినట్లు చల్లగా కూర్చుంటారు. ఆయనకేం పట్టదు" ఆవిడ తన గోడంతా వెళ్ళబోసుకుంట్టోంది.
"అమ్మా నేను చెప్పేది వింటానంటే ఉదయ్ కో మాచ్ తెచ్చాను" అంది సునంద.
"మనం తెస్తే సరిపోతుందా? ఇప్పటికి నేనెన్ని తెచ్చాను. వాడు మన మాటేమన్నా వింటాడా?" నిష్ఠూరంగా అంది లలిత.
"అవన్నీ వేరు ఇది వేరు. బహుశా దీనికి వాడోప్పుకోవచ్చు" అంది సునంద.
లలిత, ఆ పక్కనే కూర్చుని వింటున్న విష్ణుమూర్తిగారు ఇద్దరూ ఒక్కసారి ఆశ్చర్యంగా చూసారు.
"మీకు మా పినమావగారు తెలుసుకదా?" వివరాల్లోకొచ్చింది సునంద.
"ఆ...ఎప్పుడో మీ పెళ్ళిలో చూశాం. వాళ్ళమ్మాయి పెళ్లెగా ఇప్పుడు జరిగింది"
"అవును. ఈ అమ్మాయి చిన్నది. తనకంటే రెండేళ్లు పెద్దది మహిమ గురించి మీకిదివరకోసారి చెప్పాను గుర్తుందా? పెళ్ళయిన ఆర్నెళ్లకే అన్ని పోగొట్టుకొని నాలుగేళ్ళ కొడుకుని తానే చూసుకుంటోందని..."
"అయితే?" లలిత అనుమానంగా అడిగింది.
"ఆ అమ్మాయయితే ఉదయ్ కి..." అనబోతోంది సునంద.
"నీకేమన్నా మతిపోయిందా? పోయిపోయి నాలుగేళ్ళ కొడుకున్న అలాంటమ్మాయిని నా కోడుక్కి చేసుకోమంటావా? నలుగురూ వింటే నవ్వి పోరూ..." వినగానే లలిత కూతురు మీద ఇంతేత్తున లేచింది.
"ఏం! నీ కొడుకేమన్నా బాలాకుమారుడా? వాడికి ఓసారి పెళ్లయింది. భార్య పోయింది. మూడేళ్ళ కూతురుంది" సునంద కలాంటి  మాటలు వింటే చిర్రెత్తుకొస్తుంది.
"వాడికేం మగమహారాజు. పైగా పెద్ద డాక్టరు. కో అంటే కోటిమందొస్తారు" లలిత కాస్త గర్వంగానే చెప్పింది.
"వస్తారొస్తారు, కావాలంటే నీ కోడుక్కి పెళ్ళాంగా వస్తారు. కానీ, నీ మనవరాలికి తల్లిగా ఆ కోటిమందిలో ఏ ఒక్కర్తే రాదు" సునంద ఖచ్చితంగా చెప్పేసింది.
"నాన్నా! మనం ఆలోచించాల్సింది నలుగురి గురించి కాదు. బయటి వాళ్లకేం పోయింది. వాళ్ళేమైనా ఆరుస్తారా తీరుస్తారా? మనం ఆలోచించాల్సింది వైషూ గురించి, ఉదయ్ గురించి మాత్రమే.." ఇక లలితనొదిలి వాళ్ళ నాన్నవైపు తిరిగింది.
"అవునమ్మా! ఆ మాట నేను ఒప్పుకుంటాను" అన్నాడాయన.
"నాన్నా! మహిమ నాకు చిన్నపిల్లప్పటి నుంచి తెలుసు. ఆ అమ్మాయి నేచర్, వాళ్ళ ఫ్యామిలీ, ప్రస్తుతం తన సిట్యువేషన్ అవన్నీ చూసే నేనీ ఆలోచనకొచ్చాను. మన వైష్ణవికెలా అమ్మకావాలో, మహీ కోడుక్కి అలాగే నాన్న కావాలి. మహిమైతే వైషూని కన్నతల్లిలా కడుపులో దాచుకుంటుంది. తన కొడుకుతో సమానంగా చూసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. అందుకే మీరొప్పుకుంటే ఉదయ్ తో నేను మాట్లాడతాను"
కూతురు చెప్పింది విన్నాక కాసేపు మౌనంగా.ఉన్నారు.
"ఏం నాన్నా! మీకీ ప్రపొజల్  నచ్చలేదా?" అనుమానంగా అడిగింది సునంద.
"వినడానికైతే బానే ఉందమ్మా. ఆచరణలో ఎంత వరకు ఫలిస్తుందో?" సందేహంగా లలితని చూస్తూ చెప్పారాయన. ఆవిడొప్పుకుంటుందని ఆయనకి నమ్మకం లేదు.
"నాన్నా! మనసుంటే మార్గముంటుంది. నేను ఉదయ్ నెలాగైనా ఒప్పిస్తాను" వాళ్ళ నాన్న నుంచొచ్చిన ఆమాత్రం పాజిటివ్ సైన్ సునందకి ఉత్సాహాన్నిచ్చింది.
"ఈ ఇంట్లో నామాట అప్పుడు చెల్లింది గనుకనా ఇప్పుడు చెల్లటానికి" లలితప్పుడే సణగటం  మొదలెట్టింది.
       *           *      *         *
            party  Vishu99  party
[+] 1 user Likes Vishu99's post
Like Reply


Messages In This Thread
తోడొకరుండిన - by Vishu99 - 19-01-2019, 11:50 AM
RE: తోడొకరుండిన - by krish - 23-01-2019, 05:39 AM
RE: తోడొకరుండిన - by Vishu99 - 27-01-2019, 09:57 AM
RE: తోడొకరుండిన - by Uma_80 - 05-02-2019, 10:04 PM
RE: తోడొకరుండిన - by raaki - 06-02-2019, 12:33 AM
RE: తోడొకరుండిన - by ravi - 06-02-2019, 10:25 AM
RE: తోడొకరుండిన - by ~rp - 06-02-2019, 01:01 PM
RE: తోడొకరుండిన - by Uma_80 - 11-02-2019, 07:08 PM
RE: తోడొకరుండిన - by RAANAA - 06-10-2022, 05:47 AM



Users browsing this thread: 2 Guest(s)