Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#20
అరవింద్ ఇంట్లోకి వెళ్తూ టి.వి చూస్తున్న ప్రమోదతో " కొంచెం వేడి నీళ్ళు పెడతావా?" అని అడిగాడు.  "మ్.. సరే" అని టి.వి ఆఫ్ చేసి వంటింట్లోకి వెళ్లి స్టవ్ ఆన్ చేసి నీళ్ళ గిన్నె పెట్టింది. గదిలోకి వెళ్లి చొక్కా విప్పాడు. కట్టు కనపడకుండా తువ్వాలు భుజంపై వేసుకున్నాడు. దాచుదాం అంటే దాచేంత చిన్న దెబ్బ కాదు. నెమ్మదిగా ప్రమోద దగ్గరకు నడిచి "కొంచెం నాకోసం ఏమైనా వండుతావా? బాగా నీరసంగా ఉంది" అన్నాడు. సరే అన్నట్టు తల పంకించింది. నెమ్మదిగా నీలుగుతూనే నీతో ఒక విషయం చెప్పాలి. అమ్మతో చెప్పనని మాట ఇవ్వు అని చేయి చాచాడు. "ఏంటా విషయం?" అని అడిగింది.  "ముందు మాట ఇవ్వు " అంటూ తనవైపు తిప్పుకున్నాడు.  "ఏమో ! తరువాత నిలుపుకోకపోతే?"  "అంత పెద్ద దేవ రహస్యం కాదులే .."  "సరే చెప్పు." అని చేతిలో చేయి వేసింది.  భుజంపై ఉన్న తువ్వాలు తీసాడు. కట్టు చూసి " అయ్యో, ఏమైంది..?.. ఇంతలా ఎలా తగిలింది" దాదాపుగా ఏడ్చేసింది కంగారుపడుతూ.  "చిన్నదేలే .." అన్నాడు సముదాయిస్తూ  "చిన్నదేమిటి! నీకేమైనా బుద్ధి ఉందా? ముందు వెనక చూసుకోవచ్చుగా, ఎంత నెత్తురు పోయుంటుందో!!" చాలా బాధతో వస్తున్న మాటలవి.  "లేదు ప్రమోద.... " అంటూ జరిగిన విషయం చెప్పాడు.  "నీ పని ఒకటి చూసుకోవడం రాదుగాని, అందరి బాగోతాలు కావాలి నీకు. చూడు ఎంత పెద్దగా తగిలిందో.!! ఎంత లోపలికి తెగిందో.!! ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తావు. చిన్నప్పుడు కూడా అంటే ఏదో ఒక దెబ్బ తగిలించుకుని వచ్చేవాడివి. ఎందుకురా ఇలా చేస్తుంటావు అన్ని ?" కళ్ళల్లో నీళ్ళు సుడులై తిరిగాయి.  "అబ్బా! అంత కంగారుపడాల్సింది ఏమి లేదు. నువ్వు ఇలానే కంగారుపడిపోయి అమ్మకు చెప్పేస్తావు. కాల్లో ముల్లు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకున్నంత రాద్దాంతం చేస్తావు. అలానే అమ్మకి చెప్తావు." అన్నాడు.  "పోరా!! నీతో నాకు మాటలేమిటి. ఒక్కసారైనా జాగ్రత్తగా వ్యవహరిస్తావేమోనని చూస్తాను. కాని నువ్వు ఉండవు. ముందు ఆ దెబ్బ చుట్టూ చిన్నగా గోరువెచ్చటి నీటితో కాపడం పెడతాను. ఆ తరువాత నీ స్నానానికి సాయం చేస్తాను. ఆ తరువాత తిందాం." అంది.  ఆ కాగిన నీళ్ళతో నెమ్మదిగా కాపడం పెట్టింది. ఆ గాయం తడవకుండా ప్లాస్టిక్ కవర్ కట్టింది. తరువాత వీపు రుద్దింది. అరవింద్ స్నానం చేసి వచ్చిన తరువాత దేవుడికి దండం పెట్టుకోమంది. అతను కళ్ళుమూసుకుని దండం పెట్టుకుంటున్నప్పుడు కుంకుమ తీసి నుదుటన పెట్టింది. అన్నం కంచంలో వడ్డించి తానూ తింటూ అరవింద్ కి తినిపించింది. అరవింద్ పరమానందభరితుడైయ్యాడు. భోజనం అయ్యాక మందులు ఇచ్చి వేసుకోమంది. పడుకునే ముందు దిష్టి తీసి, కాళ్ళు చేతులు కళ్ళు నీళ్ళతో తుడిచింది. పడుకునే ముందు " అమ్మతో చెప్పవు కదా" అని అడిగాడు నెమ్మదిగా.  "చెప్పనులే..." అంది "కాని నువ్వు జాగ్రత్తగా ఉండు, ప్లీజ్"  "సరే , ఉంటాను" చెప్పాడు. కాసేపు ఇద్దరు ఏమి మాట్లాడుకోలేదు. చాలా రోజుల తరువాత అరవింద్ తో ఇంత చనువుగా ప్రవర్తించింది. చాలా కాలం తరువాత కడుపునిండా భోజం చేసింది. అరవింద్ బయటపడలేదుగాని అతడి మనసు కూడా హాయిగా తోచింది. అది ఒక మధురానుభూతి. మనసనే కొలనులో స్వేచ్చగా విహరించినట్టుంది. 

* * *
అచ్యుత్ వెళ్లి మేఘన ఇంటి గేటును బలంగా తన్నాడు. మేఘన తండ్రి బయటకు వస్తు "ఎవడ్రా నువ్వు?" అనడిగాడు.  "ముందు నీ కూతురిని బయటకు రమ్మని చెప్పు" అన్నాడు.  "మర్యాదగా మాట్లాడు"  మేఘన రావడం చూసిన అచ్యుత్ ఆ పెద్దాయన్ని తోసుకుని ముందుకు వెళ్లి "నువ్వసలు ఆడదానివేనా?" అని అడిగాడు.  "తాగోచ్చావా ? గొడవ చేస్తున్నావు " అనడిగాడు మేఘన తండ్రి.  "కూతురిని పెంచడం రాదు. నీతో నాకు మాటలేంటి? " మేఘనవైపు తిరిగి  "ప్రేమంటే ఇవ్వడమే. రాజీవ్ నీ ప్రేమని కాదన్నాడని వాడిని చంపించాలాని చూస్తావా? కాస్తలో ప్రమాదం తప్పింది. వాడికేమైనా అయి ఉంటే నీ ప్రాణాలు ఈపాటికి గాలిలో కలిసిపోయేవి. ఛి! నీలాంటిదాన్ని నేనెక్కడా చూడలేదు" చాలా చీదరింపుతో అన్నాడు. రాజీవ్ కి తగిలిందనగానే మేఘన కంగారుపడింది.  మేఘనకి రాజీవ్ పై పగేమి లేదు. వాళ్ళు తెలీక అరవింద్ అనుకుని రాజీవ్ ని కొట్టారు.  "చూడు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈసారిగాని ఇలాంటిది రిపీట్ అయ్యిందో, ఆడదానివని కూడా చూడను. గుర్తుంచుకో." చెప్పి వెళ్ళిపోయాడు.  తండ్రి వెనక్కి తిరిగి మేఘన చెంప చెళ్లుమనిపించాడు. "ఇంత విషం ఇచ్చి చంపేయవే మమ్మల్ని కూడా! ప్రతి అడ్డమైనవాడితో మాటలు పడాల్సి వస్తుందనుకోలేదు. గారం చేయడం వల్లనే ఇలా తయారయ్యావు" అని విసురుగా లోపలి వెళ్ళిపోయాడు.  "క్షమించమనే అర్హత కూడా కోల్పోయావే" అంది తల్లి , కూతిరిని ఇంకేమి అనలేక. 
* * *
రాజీవ్ ని చూడటానికి నవ్య పరిగెత్తుకుని వచ్చింది. నీరసంగా మంచంపై పడుకుని ఉన్న అతని గదిలోకి వెళ్లి పక్కన కూర్చుంది. నెమ్మదిగా రాజీవ్ తల నిమిరింది. ఆమె కళ్ళు అప్పటికే తడిసి ఆ కన్నీటి చారలు బుగ్గలపై ఉన్నాయి. ఆమె స్పర్శకి రాజీవ్ కళ్ళు తెరిచి చూసాడు. ఆమెను చూసి చిన్నగా నవ్వడానికి ప్రయత్నించాడు.  "నాకేమైనా అయితేగాని రావాలనిపించాలేదా?" అని మాటలు తెచ్చుంటూ మెల్లగా అడిగాడు,  "ఐ యామ్ సారీ " అంది.  ఆమెవైపు అలానే చూసి "ఐ లవ్ యు " అని చెప్పాడు.  అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. కాసేపాగి "ఎలా ఉంది?" అని అడిగింది అతని కళ్ళల్లో చూస్తూ.  "నొప్పా? ముద్దా?"  ఆమె నవ్వుతూ "రెండూ .."  "ముద్దు పెడుతున్నప్పుడు నొప్పి తెలియలేదు "  "దొంగా..." అంది చిలిపిగా.  "మళ్ళీ ఎప్పుడు?" అని ప్రశ్నించాడు  "ఏంటి ముద్దు గురించా? మళ్ళీ నేను రావడం గురించా?" అనడిగింది.  "రెండు..."  "రోజూ వస్తుంటాను. ముద్దు....... ఏమో!!!!" అంది.  "నువ్వు ముద్దు పెట్టకపోతే తగ్గదేమో తొందరగా"  నవ్వుతూ " నువ్వు తొందరగా కోలుకుంటే అదే చాలు " అని అతని చేయిని ఆప్యాయంగా తడిమింది.  "థాంక్స్ " అన్నాడు  "ఎందుకు?" అనడిగింది  "ఊరికనే, చాలా ఆనందంగా ఉంది నాకు. మళ్ళీ కలవవేమో అనుకున్నాను" అన్నాడు  "నేను నిన్ను కలవకుండా ఉండలేను రాజీవ్" అంది.  "నాకు తెలుసు . కాని కొంచెం భయం కూడా ఉంది"  "ఇంకేమి భయం లేదు. నిన్ను విడవను"  మనస్పూర్తిగా నవ్వేడు .. ఆమె కూడా నవ్వింది. 
* * *
అందరి గాయాలు మానాయి. అరవింద్ మనసుకు తగిలిన గాయం ఇంకా మారలేదు. అది ఇంకా పెరుగుతోందే తప్ప, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో అని సతమతమావుతున్నాడు. ఇలా ఆలోచనలో ఉండగా అంజలి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేసి "హలో" అన్నాడు.  "హలో ఎలా ఉంది ఇప్పుడు?"  "పరవాలేదు. తగ్గింది"  "ఒకసారి మా ఇంటికి రాగలావా?"  "సాయంత్రం వస్తాను" చెప్పి ఫోన్ పెట్టేసాడు.  సాయంత్రం బయటకు వెళ్ళే ముందు "గంటలో వస్తాను" అని ప్రమోదకు చెప్పి వెళ్ళాడు.  అంజలి చేతిలోంచి కాఫీ అందుకుంటూ " చెప్పు, ఏంటి రమ్మన్నావు? ఏంటి విషయం?" అని అడిగాడు.  "ఏమి లేదు. పెయింటింగ్ కాంపిటిషన్ కి వెళ్తున్నాను. నా దగ్గరో ఐడియా ఉంది. కాని అది వర్క్ అవుట్ అవుతుందో లేదో అని "  "ఎందుకవదు? తప్పకుండా వర్క్ అవుట్ అవుతుంది. "  "ఐడియా చెప్పనా?"  "నాకేమి అర్ధమవుతుంది చెప్పు. బొమ్మ వేసాక చూపించు. నేనేమి పెయింటర్ ని కాను"  "అలా ఏమి కాదు. విను. సింపుల్ ఐడియా. చాలా మందికి అన్నం లేక రోడ్ల పక్కన ఖాళి కడుపులతో పడుకుంటూ ఉంటారు. మరోవైపు గొప్పింటి పెళ్ళిళ్ళలో చాలా ఫుడ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకు అన్నం విలువ తెలియదు. వాళ్ళ స్టేటస్ కోసం అంతంత వండించడం. మిగిలినదంతా పాడేయడం పాపం కదా! ఆకలి అన్నవాడికి కాస్త పెడితే ఎంత బాగుంటుంది. అదే పెయింటింగ్లో చెప్పబోతున్నాను. భారతదేశ దుస్థితిని చెప్పాలి. ఇవ్వాలనిపించడం వేరు. ఇవ్వడం వేరు. చేయాలనిపించడం వేరు. చేయడం వేరు. అందరికి ఇవ్వాలని చేయాలని ఉంటుంది. కాని చాలామంది అక్కడే ఆగిపోతారు. అదే చెప్పబోతున్నాను." ముగించింది .   "చాలా చాలా బాగుంది ఐడియా. నువ్వు బొమ్మ గీయి. నీకే ప్రైజ్" అన్నాడు.  "ప్రైజ్ ఏమి వద్దు. ఒక్కడైనా ఫీల్ అయి మారితే చాలు" అంది. మెచ్చుకోలుగా నవ్వేడు. బయలుదేరి ఇంటికి వచ్చేసాడు.  ఆ రాత్రి బాగా ఆలోచించాడు. తన జీవితంలో ఏదో నిర్ణయానికొచ్చినట్టుంది అతని ముఖం. వెంటనే లేచి ఫోన్ తీసుకుని అంజలికి ఫోన్ చేసాడు. చాలా రింగ్స్ తరువాత లిఫ్ట్ చేసి హలో అంది.  "హలో, అంజలి. పడుకున్నావా?" అనడిగాడు.  "ఇప్పుడు టైం 2 అయింది. మరేం చేస్తాను?" అంది నిద్ర మత్తులో  "సారీ, నీతో ఒక విషయం మాట్లాడాలి. నాకొక సాయం చేయాలి" అన్నాడు  "ఏంటది?"  "రేపు చెప్తాను"  "ఆ మాత్రం దానికి ఇప్పుడెందుకు ఫోన్ చేసావు.. స్టుపిడ్ " కట్ చేసేసింది.  ఉదయం అంజలి కోసం ఎదురు చూస్తుండగా ఆమె వచ్చింది.  " ఏంటి? ఏదో చెప్పాలన్నావ్?" అనడిగింది.  "ఇక్కడ కాదు. ఎక్కడికైనా బయటకు వెళ్దామా?"  "ఎక్కడికి?"  "నీ ఇష్టం.."  "రుషి కొండ బీచ్ "  "ఓకే,.." ఇద్దరు బండిపై బయలుదేరారు. వెళ్తున్న ఇద్దరినీ మౌనిక గమనించింది. అరవింద్ కి ఫోన్ చేసింది. అరవింద్ కట్ చేసాడు.  సముద్రపు హోరు వింటూ కూర్చున్నారు. చాలా సేపటి మౌనం తరువాత "నాకేమి పాలుపోవడం లేదు" అన్నాడు.  "ఏమైంది?"  "నాకొక సాయం చేయగలవా?, అది నువ్వొకదానివే చేయగలవు" అన్నాడు సముద్రంవైపు చూస్తూ "ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను" అంటూ తిరిగాడు.  "ఏమిటది?"  "నేను మౌనికను పెళ్లి చేసుకోలేను. ఆ విషయం తనకు నువ్వే చెప్పాలి" అన్నాడు. కెరటం వచ్చి కొట్టినట్టైంది.  "ఎందుకు? అసలేమైంది?" ప్రశ్నించింది.  "నాకు పెళ్లై పోయింది .." నిలకడగా అన్నాడు. పెద్ద ఉప్పెన భయంకరమైన హోరుతో ఎగసి పడింది. ఒంట్లో రక్తం ఒక్కసారిగా ఎగబాకింది.  "ఏం మాట్లాడుతున్నావ్? నేను నమ్మలేకున్నాను" అంది. ఆమెకు జరిగిన విషయం అంతా చెప్పి "తప్పనిసరి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. ప్రమోదకు అన్యాయం చేయదల్చుకోలేదు. తను ఇప్పుడు నా భార్య. నేనే లోకంగా బ్రతుకుతోంది. విడిపోయే బంధం కాదు కదా మా ఇద్దరి మద్యన ఉన్నది! నువ్వే ఏదో ఒకటి చేయాలి అంజలి అంటూ ఆమె చేయి పట్టుకుని బ్రతిమాలాడు అర్ధిస్తున్నట్టుగా.  అంజలి గాలి పీల్చుకుని "ఇప్పుడు నేనేం చేయాలి ?" అనడిగింది.  "మౌనిక మనసు విరగొట్టేయాలి. నాపై అసహ్యం కలిగేలా చేయాలి" అన్నాడు.  "అలాంటివి సినిమాల్లో వర్క్ అవుట్ అవుతాయి. జీవితంలో కాదు" అంది  "మరి ఏమి చేద్దాం?"  "ఆలోచిస్తాను. తరువాత ఏ విషయం చెప్తాను.  "తొందరగా నిర్ణయం తీసుకుని ఏదో ఒకటి చేయి"  "మ్.. బయలుదేరుదామా?"  ఇద్దరు అక్కడినుండి బయలుదేరారు. అంజలిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తానూ ఇంటికెళ్ళాడు. తీరం అంచుల్లో రాసిన పేర్లు వచ్చే అలలకు చెదిరిపోయినట్టైంది.. 
* * *





[+] 4 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 12:00 PM



Users browsing this thread: 1 Guest(s)