20-11-2018, 11:58 AM
అరవింద్ వస్తున్న విషయం మౌనికకు కూడా చెప్పాడు అచ్యుత్. తను కూడా వస్తానని చెప్పింది. సాయంత్రం 5 గంటలకే అందరు రాజీవ్ ఇంట్లో కలిసారు. నిరంజన్, రాజీవ్ లకు మౌనిక కూడా వస్తున్న విషయం చెప్పాడు అచ్యుత్. "ఎందుకు ?" అని అడిగారు. "అరవింద్ కోసం" చెప్పాడు అచ్యుత్. ఆశ్చర్యపోయారు ఇద్దరు. "అవునుర, బహుసా ఈ విషయం చెప్పడానికే ఇంటికి రమ్మని ఉంటాడు. వాడు ఊరు వెళ్లి తన ప్రేమ విషయం చెప్పి ఒప్పించి ఉంటాడు. మౌనికని ప్రేమిస్తున్న విషయం ముందు నాకు చెప్పాడు. మీకు చెపుదాం అంటే ఎవరి ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు." పూర్తి చేసాడు అచ్యుత్. వాళ్ళు మాటల్లో ఉండగానే సుధీర్తో పాటు కలిసి మౌనిక వచ్చింది. సుదీర్ రావడంతో కొంచెం కంగారు పడ్డారు. లోపలికి వస్తూనే సుధీర్ "హాయ్" అని పలకరించి " నా చెల్లెలు నాకు అంతా చెప్పింది. నా చెల్లెలుకు ఇష్టమైతే నాకు ఇష్టమే" అంటూ అడగకుండానే కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అందరు లోపల కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. అరవింద్ కోసం అందరి ఎదురుచూపు. అరవింద్ వైజాగ్ వచ్చి డైరెక్ట్ గా రాజీవ్ ఇంటికి బయలుదేరాడు. దారిలో ఉండగా మౌనికకి కాల్ చేసాడు. కాని మౌనిక మొబైల్ ఇంట్లో మర్చిపోయింది. రెండు మూడు సార్లు ప్రయత్నించి విరమించుకున్నాడు. అరవింద్ మనసు పరిపరివిధాల ఆలోచిస్తోంది. అదొక విచిత్రమైన స్థితి. స్నేహం నుండి పెళ్లి అనే పెద్ద అడుగు వేసిన గతం అది. ప్రేమ అనే అడుగు వదిలేసి ఏడు అడుగులు నడిచిన దారి అది. స్నేహాన్ని మరొక కోణంలో ప్రతిక్షేపించిన పరాధీన వ్యవస్థ అది.ప్రమోదతో పెళ్లి జరిగిన క్షణం నుండి అరవింద్ కి మతిపోతోంది.మౌనిక తన సొంతం అవుతుందని ఎన్నో అందమైన కలలు కన్నాడు. ఆకాశంలో చుక్కలు చూసి ఆనందించడంలాంటి విషయం అవుతుందని తరువాత తెలిసి వచ్చింది. ఇప్పుడు ప్రమోద తన జీవితంలో పూర్తి స్థానాన్ని ఆక్రమించింది. గుండెల్లో ఉన్న మౌనిక మాత్రం ఎంతకాలం ఆ ఇరుకులో కొట్టుమిట్టాడుతుంది. నిజం తెలిస్తే తనే బయటకు వెళ్ళిపోతుంది, లేదా భార్య అనే హక్కుతో ప్రమోదే మౌనికని బయటకు నెట్టేస్తుంది.అనామకుడులా , చేతకాని వాడిలా చూస్తూ ఉండాలే కాని ఏమి చేయలేని అచంచలమైన స్థితిలో ఉన్నాడు. ఆలోచనలు మారినట్టే ప్రదేశాలు మారి రాజీవ్ ఇంటికి చేరాడు అరవింద్...బయట ఆటో శబ్దం వినిపడగానే అందరు బయటకు చూసారు. లోపలికి నడుచుకుంటూ వస్తున్న అరవింద్ ని చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా కౌగిలించుకుంది. మౌనికని అక్కడ చూసేసరికి షాక్ అయ్యాడు. "ఎన్ని రోజులైంది చూసి? ఎలా ఉన్నావ్? వెళ్ళాక ఒక్కసారే కాల్ చేసావు, మళ్ళీ చేయలేదేంటి? యు నో వాట్ మా అన్నయ్య కూడా మన ప్రేమని ఒప్పుకున్నాడు. ఇంట్లో వాళ్ళను ఒప్పించే డ్యూటీ కూడా వాడిదే. సో తొందరలో మన పెళ్లి " సంతోషం పట్టలేకపోతోంది. ఆమె మాటలన్నీ విని " నువ్వెంటిక్కడ?" అని ప్రశ్నించాడు. "నేనే రమ్మని చెప్పానురా" వెనకనుండి వస్తూ అన్నాడు అచ్యుత్. అచ్యుత్ వైపు చూసాడు. ఆ చూపుల్లో అర్ధం ఏమిటో గ్రహించలేకపోయాడు అచ్యుత్. "సరే ప్రయాణం చేసానుగా, కొంచెం అలసటగా ఉంది. రెస్ట్ తీసుకుంటాను. మనం రేపు కలుద్దాం" అని అన్నాడు అరవింద్. మౌనిక అరవింద్ మూడిగా ఉండటం గమనించినా అది ప్రయాణం బడలికే కారణం అయ్యుంటుందని "సరే నీ ఇష్టం" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మౌనిక వెళ్ళిన అరగంట తరువాత "ఏమైందిరా? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అదోలా ఉన్నావు. అంతా ఓకే కదా?" అడిగాడు నిరంజన్. "లేదురా.. ఏదీ ఓకే కాదు. నాకు పెళ్లి అయిపోయింది" చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు అరవింద్. ఒక్కసారిగా కింద భూమి కంపించిపోయింది. ఎవరి ముఖాల్లోనూ నెత్తురు చుక్క లేదు. కరెంటు షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయారు అందరు. తలవంచుకు కూర్చున్న అరవింద్ దగ్గరగా నడిచి భుజంపై చేయి వేసాడు నిరంజన్. తడిసిన కళ్ళతో చూసి " నాకు పెళ్లి జరిగిపోయిందిర, " అంటూ జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చాడు. ఇది చెప్దామనే నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను అని చెప్పాడు. "ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్? " అని అడిగాడు రాజీవ్. "ఏమో తెలియదు. వచ్చేవారం ప్రమోదను ఇక్కడకు తీసుకురావాలి. ఆ తరువాత ఏమి జరిగితే అది" చెప్పాడు అరవింద్. "ఇలా జరుగుతుందనుకోలేదు" అన్నాడు అచ్యుత్. "నేను అస్సలు ఊహించలేదు. అతిధిగా వెళ్లాను. పెళ్లి పీటలెక్కాను. ఒక్కోసారి దేవుడు ఇంతలా పరీక్షలెందుకు పెడతాడో తెలీదు. నేను ఎప్పుడు ప్రమోదను ఆ విధంగా చూడలేదు కాని నా భార్యను చేసాడు. నేను ఇప్పుడు ప్రమోదకు అన్యాయం చేయలేను. మౌనికను మోసం చేయలేను. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం ఆ భగవంతుడే నిర్ణయించాలి" అని చెప్పాడు అరవింద్.కష్టాలు తెచ్చేది భగవంతుడే కష్టాలు తీర్చేది భగవంతుడే... మనిషై పుట్టాక కష్టాలు వచ్చినపుడు ఆ దేముడిని తిట్టుకుని మళ్ళి అవన్నీ తీర్చమని అతడినే అడగడం చాలా విచిత్రమైన విషయం!!!అరవింద్ మాట్లాడడం పూర్తయ్యాక రాజీవ్ నెమ్మదిగా తన గురించి చెప్పడం మొదలు పెట్టాడు. "నేను నవ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" చెప్పాడు రాజీవ్. అచ్యుత్, నిరంజన్ లు ఆశ్చర్యపోయారు. అరవింద్ కి విషయం తెలుసు కనుక మామూలుగానే " మంచి నిర్ణయం తీసుకున్నావు " అని చెప్పాడు. రాజీవ్ చిన్నగా నవ్వి "అవునురా మీతో ఒక విషయం చెప్పలేదు. మేఘన నేను ఒకప్పుడు ప్రేమించుకున్నాము. తరువాత మనస్పర్ధలు వచ్చి విడిపోయాము. ఆ తరువాత నవ్య నా జీవితంలోకి వచ్చింది. తను నన్ను ప్రేమిస్తోందని తెలిసికూడా నేను మేఘన కోసం ఆలోచించో, భయపడో, సిగ్గుపడో, పరువుపోతుందనో ఇంతకాలం వెనకడుగు వేసాను. మేఘన నా జీవితంలో ఉంటే నాకు రోజు నరకమే. కాని నవ్య ఉంటే నేను చాలా ఆనందంగా ఉండగలను. ఆవిషయం చెపుదామనే తనతోపాటు గుడికి వెళ్లాను. కాని ఆ సమయంలో మేఘన అక్కడికి వచ్చింది. మమ్మల్ని చూసి నవ్యతో " నేను కాదన్నాను. నిన్ను ప్రేమించాడు" అంటూ మాట వదిలేసింది. దాని అహం సంతృప్తి చెందడానికి ఏమైనా చేస్తుంది. "నన్ను మోసం చేసావు" అంటూ కేకలు పెట్టింది. ఇదంతా చుసిన నవ్య ఏడ్చుకుంటూ నా మాట పట్టించుకోకుండా నేను పిలుస్తున్న వినిపించుకోకుండా వెళ్లిపోయిందిరా.... " అని కాసేపు ఆగి ఊపిరితీసుకుని, “ప్రేమ ఇస్తున్నపుడు పుచ్చుకోలేదు. ఇప్పుడు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాను. నవ్య లేకుండా నేను బ్రతకలేను. ఆ మాటే మేఘనతో నిర్మొహమాటంగా చెప్పేసి వచ్చేసాను. ఇప్పుడు నవ్యతో మాట్లాడాలి. తన నిర్ణయంపైనే నా జీవితం ఆధారపడి ఉంది." ముగించాడు. "నవ్య తప్పకుండా నిన్ను అంగీకరిస్తుంది.కంగారుపడకు" అంటూ ధైర్యం చెప్పాడు అచ్యుత్. అచ్యుత్ వైపు జాలిగా చూసాడు అరవింద్. వెంటనే తల పక్కకు తిప్పుకుని " జీవితంలో ఏమైనా వద్దనుకున్నపుడు వస్తుంటాయిరా , కాని వాటితోనే మన ఆనందం ఉంటుందని అప్పుడు మనకి తెలియదు. మరొకదాని కోసం వెంపర్లాడడంతో సమయం అంతా వృధా అయిపోతుంది. ఇంతలో ఇది కూడా దూరమయ్యాక తెలుస్తుంది సమయం విలువ , ఆ మనిషి విలువ.." అని అన్నాడు. "నేను కూడా మానసతో మాట్లాడుతాను. తనని చాలా బాధ పెట్టాను. తనని మిస్ అవడం నాకు ఇష్టం లేదు." అని అన్నాడు నిరంజన్. అచ్యుత్ “భలే మలుపులు తిరిగాయి మన జీవితాలు. ఎంత విచిత్రమో చూడు. మానస నిరంజన్లు మొట్టమొదటి నుండి ప్రేమికులు కాని ఇప్పుడు విరహ వేదనలో ఉన్నారు. వీడేమో ఒకప్పుడు నవ్యని కాదన్నాడు. ఇప్పుడు తనలేకుండా ఉండలేను అంటున్నాడు. వీడు మౌనికని ప్రేమించాను అని పరిస్థితుల వాళ్ళ ప్రమోదను పెళ్లి చేసుకున్నాడు. ఎటొచ్చి నేనే అప్పుడు ఇప్పుడు ఒంటరివాడిలాగానే ఉన్నాను. బలవంతంగా కన్నీళ్లు ఆపుకోబోయాడు. నేను చైతన్యాని మిస్ అవుతున్నానురా అంటూ ఏడ్చాడు. వెంటనే తేరుకుని ప్రతి కధకి ఒక ముగింపు ఉంటుంది. మన కధకి కూడా అందమైన ముగింపు ఉండి తీరుతుంది. ఎవరు కోరుకున్న తీరాలకు వారు తప్పకుండా చేరుతారు. ఇది సత్యం. జీవితం అంటే సుఖ ధుఖ్ఖాల సారం. అనుభవాల మణిహారం. చివరకు అందరం గెలవడం ఖాయం" అని ముగించాడు.
* * *
అరవింద్ వేరే ఇల్లు తీసుకున్నాడు. ప్రమోదతో కలిసి అక్కడే ఉన్నాడు. కాని యూనివర్సిటీలో వాళ్ళ నలుగురికి తప్ప మరెవరికి తెలియదు అరవింద్ కి పెళ్లి జరిగిందని!! ప్రమోద తండ్రి అరవింద్ కి మోటార్ సైకిల్ కొని ఇచ్చాడు. ఇద్దరు బండిపై గుడికి వెళ్లి బండి పూజ చేయించారు. ఇద్దరు దైవ దర్శనం చేసుకుని ఇంటికి తిరిగొచ్చారు. ఇలా చేయమని అరవింద్ తల్లి ఆర్డర్. చేయక తప్పలేదు. కాని అరవింద్ ప్రమోదతో ఏమి మాట్లాడలేదు. ఆమె కూడా మాట్లాడటానికి ప్రయత్నించలేదు. ఆమెను ఇంటి దగ్గర దించేసి అలానే బండిపై యూనివర్సిటీకి వెళ్ళాడు. కావాలనే లంచ్ బాక్స్ వదిలేసి వెళ్ళిపోయాడు. యూనివర్సిటీలోకి వెళ్తుండగా మౌనిక కనిపించింది. బండి ఆపి పలకరించాడు. "ఏంటి కొత్త బండా?" "అవును" "నేను ఎక్కనా?" "ఎక్కు" బండి ఎక్కి కూర్చుని " బహుసా నేనే అనుకుంట నీ వెనక కూర్చున్న మొదటి వ్యక్తిని" అంది భుజంపై చేయి వేస్తూ. ఏమి మాట్లాడకుండా చిన్నగా నవ్వేడు. మౌనిక కూడా నవ్వింది. ఒక్కొక్కసారి చిరునవ్వు చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కాని నిజానికి సరైన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే చిరునవ్వు సమాధానంగా ఉంటుంది. అరవింద్ మౌనికలను ఈసారి యూనివర్సిటీ మొత్తం చూసేసింది. కొందరు ఆశ్చర్యపోయారు. కొందరు ఈర్ష్య పడ్డారు. కొందరు జంట బాగుందనుకున్నారు. కొందరి గుండెలు బద్ధలైపోయాయి. అలా ఈర్ష్య పడిన జాబితాలు రెండు రకాలు. మొదటిరకంలో అంత అందమైన అమ్మాయిని ప్రేమలో పడేసినందుకు కొంతమంది కుర్రాళ్ళు ఉన్నారు. ఇక రెండో రకంలో తన ప్రేమ ఓడిపోయినా వ్యధలో, పక్కవాడు సంతోషంగా ఉండినందుకు కలిగిన ఈర్ష్య. ఇలా ఈర్ష్య పడింది మేఘన. వాళ్ళిద్దరిని చూసిన ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. "హాయ్ మేఘన" బండిమీంచే పిలిచి " అరవింద్, అటువైపు పోనీయ్" అని అంది మౌనిక. మేఘన ముఖంలో మార్పు లేదు. " హాయ్, ఎలా ఉన్నావే?" అని అడిగింది బండి దిగుతూ. "నాగురించి ఎందుకే ? నువ్వు బాగున్నావుగా అది చాలు" అంది మేఘన, అరవింద్ వైపు చూసి "మొత్తానికి పందెం గెలిచావుగా" అంది . కంగారు పడ్డాడు అరవింద్. "ఏం పందెం?" అని అడిగింది మౌనిక. "అరవింద్ నే అడుగు" అంది మేఘన. "ఏంటి?" అంది మౌనిక నవ్వుతూనే. "ఏమిలేదు , తరువాత చెప్తాను " అన్నాడు "ఏం భయమేస్తోoదా? పోనీ నేను చెప్పనా?" అంది మేఘన. అరవింద్కి పట్టరానంత కోపం వచ్చింది. దాన్ని అణుచుకుంటూ "ప్లీజ్ నీ పని నువ్వు చూసుకో" అన్నాడు. "మౌనిక నీకు ప్రియురాలు కాకముందు నుండి నాకు ఫ్రెండ్. తన విషయం అంటే నాకు అది విషయమే" సమాధానం ఇచ్చింది మేఘన. అరవింద్ మౌనికతో " నేను వెళ్తున్నాను మౌనిక" అన్నాడు. "ఏంటిది?" అంది మౌనిక ఏమి అర్ధంకాక. "నువ్వు వస్తావా?రావా? " అని అడిగాడు. "అది రాదు. నువ్వు వెళ్ళొచ్చు" మౌనిక వైపునుండి వకాల్తా పుచ్చుకుని మేఘనే చెప్పింది. బండి స్టార్ట్ చేసి "ఐ యామ్ గోయింగ్" అన్నాడు. "నేను వస్తాను, సారినే ఏమనుకోకు..." అని బండి ఎక్కేసింది మౌనిక. మేఘన కళ్ళల్లోకి సూటిగా చూసి బండి కదిలించాడు అరవింద్. మేఘనకు తల తీసేసినట్టైంది. అవమానభారంతో రగిలిపోయింది. ఆరోజు అరవింద్ తో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. "15 రోజుల్లో ఆమె నీతో ఫ్రెండ్ షిప్ చేయాలి. ఆమె నీకోసం వెయిట్ చేయాలి. నీకోసం నన్ను ఇగ్నోర్ చేసేంతగా చేయాలి. నేను ఓడిపోతే నువ్వేమి చెప్తే అది చేస్తాను. నేను గెలిస్తే ..." మాటలు అంతవరకే గుర్తుకు వచ్చాయి. తాను ఓడిపోయింది. ఆ రోజు పంతంగా కాసిన పందెం ఇలా పరువు తీస్తుందనుకోలేదు. ఇప్పుడు అరవింద్ ఏమి చెప్తే అది చేయాలి . నిజంగా అతను చెప్తే చేసేరకమైతే కాదు. కాని ఇది చాలా అవమానంగా ఉంది ఆమెకు. తన అహం చాలా దెబ్బతింది. పగ తీర్చుకోవాలనిపిస్తోంది. ఆలోచనలు పాదరసంలా కదలాడాయి. దెబ్బకు దెబ్బ తీయాలి. ఈసారి కొట్టే దెబ్బకు జీవితాంతం కోలుకోకూడదు. ఆజన్మాంతం పుట్టుమచ్చలా ఉండిపోయేలాంటి ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోవాలి. 'మేఘన' అనే పేరు వింటే వణికిపోవాలి. మేఘన దృడ నిశ్చయంతో ఉంది ఎలాగైనా అరవింద్కి తానేమిటో చూపించాలాని... అందరి ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయి. ఇలానే ప్రతి సంవత్సరం చేయాలని ప్రిన్సిపాల్ చెప్పారు. రెండు నెలలలో నిరంజన్, అరవింద్ లకు మొదటి సంవత్సరం పూర్తి అవుతుంది. మిగిలిన వాళ్ళందరికీ పి.జి పూర్తవుతుంది.
* * *