Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#16
ఎకడమిక్ ప్రాజెక్ట్ పనులు చివరికి రావడంతో నవ్య రికార్డు వర్క్ తో బిజీ ఉంది. ఇంతలో తన మొబైల్ కి మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే బ్లాంక్ మెసేజ్, రాజీవ్ పంపించాడు.  నవ్యకి ఒక్కసారిగా ఆనందం అనిపించింది. "ఏమిటి బ్లాంక్ మెసేజ్ " రిప్లై ఇచ్చింది.  "ఏమి లేదు" రిప్లై ఇచ్చాడు.  "ఏమి చేస్తున్నావ్?" అడిగింది.  "ఏమి చేయడం లేదు" చెప్పాడు.  "అన్నం తిన్నావా?"  "ఇంకా లేదు"  "మన ప్రాజెక్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసేసాను.నువ్వేం చేయనవసరం లేదు. చేసిన వర్క్ ఒకసారి చదువు. ఏమైనా యాడ్ చేయాలంటే చేద్దాం" అని చెప్పింది.  "సరే" అన్నాడు ముభావంగా.  "ఏంటి ఒంట్లో బాగోలేదా?"  "బాగానే ఉంది."  "...ఇంకా ఏంటి?"  "చెప్పాలి నువ్వే!!"  "ఏమైనా మాట్లాడాలా?" అని మెసేజ్ పంపింది. బదులుగా బ్లాంక్ మెసేజ్ పంపాడు.  "నువ్వలా బ్లాంక్ మెసేజ్ పంపితే నాకేం అర్ధమవుతుంది" అని రిప్లై ఇచ్చింది.  "అరవింద్ మొబైల్ లో నీ మెసేజ్ చూసాను" బోల్డ్ లెటర్స్ లో టైపు చేసి రిప్లై ఇచ్చాడు.  ఈ సారి నవ్య బ్లాంక్ మెసేజ్ పంపింది ఏం రిప్లై ఇవ్వాలో తెలియక.  "నేనంటే ఎందుకంత ప్రేమ నీకు?" అడిగాడు  "తెలీదు" చెప్పింది.  “నిన్ను నేను అంతలా అవైడ్ చేస్తున్నానని తెలిసినా నాపై నీకు కోపం రాలేదా?"  "లేదు"  “నేను నిన్ను చాలా బాధ పెట్టాను , ఐ యామ్ రియల్లీ సారీ నవ్య"  "సారీ ఏమి వద్దు"  "మరి ఏమి కావాలి?"  "నీకు తెలియదా?"  "ఇచ్చే పరిస్థితిలో నేను ఉన్నాను. తీసుకునే స్థితిలో నువ్వు ఉన్నావా?, నిర్ణయం నీదే!"  "నా నిర్ణయం ఎప్పుడు ఒక్కటే!" రిప్లై చదివేసరికి రాజీవ్ చాలా ఆనందపడ్డాడు.  "నీతో ఒకవిషయం చెప్పాలి. ఆ తర్వాత నీ ఖచ్చితమైన నిర్ణయం నాకు చెప్పు" అని రిప్లై చేసాడు  "సరే, ఎక్కడ కలుద్దాం?"  " రేపు యూనివర్సిటీలో డిసైడ్ చేద్దాం "  "ఓకే, ఐ మిస్ యు రాజీవ్ " రిప్లై ఇచ్చింది  "ఐ .........." అని రిప్లై పంపాడు. 

* * *
"జీవితంలో అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం కాదు. జరిగిందేదో జరిగిపోయింది. ఒకరి తప్పుకి మరొకరికి శిక్ష వేయడం భావ్యం కాదు నిరంజన్. స్వాతి తప్పుకి మానస ఏం చేసిందిరా? అంతమందిలో అవమానించావు. కోపంలో పొమ్మన్నావు. నిదానంగా ఆలోచించు. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం కూడా బాగానే ఉంది కదా. ఒకసారి వెళ్లి మానసతో మాట్లాడు.తను నిన్ను తప్పకుండా అర్ధం చేసుకుంటుంది. మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదు. దూరమైనపుడే తెలుస్తుంది. సమయం ఏమి మించిపోలేదు నిరంజన్, మానసతో మాట్లాడు." చెప్పాడు అచ్యుత్.  అచ్యుత్ చెప్పిన మాటలను మౌనంగా విన్నాడు నిరంజన్. లేచి నిలబడుతూ "ఆ రోజు ఎందుకలా ప్రవర్తించానో నాకే అర్ధం కావడం లేదు. నాన్న పోయిన బాధతోనో, చెల్లెలు పనికిమాలిన పని చేసిందనే కోపంతోనో, అమ్మకేమైనా అవుతుందనే బెంగాతోనో అలా మాట్లాడేసాను. అలాంటి పరిస్థితుల్లో నాకెందుకో నా ప్రేమ కనిపించలేదు. మానసను చాలా బాధ పెట్టాను" గుండె పొరల్లోంచి తన్నుకొచ్చిన మాటలను కన్నీటి సాక్షాలుగా అన్నాడు నిరంజన్.  అచ్యుత్ స్నేహపూర్వకంగా భుజంపై చేయి వేసి " మానసతో ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా మాట్లాడు" అని చెప్పాడు. "ఇంతకీ నా చెల్లెలు ఎక్కడ ఉంది?" అని ప్రశ్నించాడు నిరంజన్.  "అంజలి ఇంట్లో... " చెప్పాడు అచ్యుత్.  " మరి అశోక్?‘"  "ఇబ్బంది పడుతూ స్వాతికి అశోక్ కి పెళ్లి జరగలేదట. " అన్నాడు మెల్లిగా. ఆకాశం ఊడిపడ్డట్టు అదిరి పడ్డాడు నిరంజన్.  "ఏం మాట్లాడుతున్నావ్ అచ్యుత్" అని అడిగాడు కంగారుపడుతూ.  "అవును,.అశోక్ బంధువులు అతన్ని కొట్టి పెళ్లి మండపం మీంచి లాక్కెళ్ళిపోయారట. ఏమి తోచని స్థితిలో మళ్ళీ ఇంటికొస్తే నువ్వూ పొమ్మన్నావు. అప్పుడు అరవింద్ ఆలోచనతో మేము స్వాతిని అంజలి ఇంట్లో ఉంచాము. అక్కడ తను క్షేమంగానే ఉంది" చెప్పాడు అచ్యుత్.  "ఛ! ఎంత తప్పు చేసాను. కాని పరిస్థితులు అప్పుడలా మాట్లాడించాయిర. రేపే నా చీల్లెల్ని కలిసి ఇంటికి తీసుకొస్తాను. పాపం దానికి నేను తప్ప ఇంకెవరున్నారు" అన్నాడు కళ్ళల్లో నీళ్ళతో. 
* * *
అరవింద్ తల్లి దగ్గరకు వెళ్లి "అమ్మా, రేపు నేను వైజాగ్ బయలుదేరుతున్నాను" అన్నాడు.  "నేను ఏమిట్రా ? ప్రమోద రావడం లేదా నీతో ?" మాములుగా అడిగింది తల్లి.  "తర్వాత వస్తుంది. ఇప్పుడు కాదు " అని చెప్పాడు  "అలా ఏమి కుదరదు. తనని కూడా తీసుకెళ్ళు. అక్కడ అద్దె ఇల్లు తీసుకుని కలిసి ఉండండి" చెప్పింది.  "అమ్మ, ఇప్పుడు వద్దన్నానా?" గొంతు పెంచుతూ అన్నాడు.  "నీవాలకం చూస్తుంటే తేడాగా ఉంది. అక్కడేమైనా వ్యవహారం నడిపావా?" అని ప్రశ్నించింది. తల్లి ఒక్కసారిగా అలా అడిగేసరికి భయమనిపించింది అరవింద్ కి. నిజం చెప్పడానికి ధైర్యం చాలాలేదు. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. అబద్ధం ఆడటానికి ఆలోచన కావాలి. ఆలోచనతో "అబ్బే, అలాంటిదేమీ లేదు" అన్నాడు.  "నమ్మచ్చా?"  "నమ్ము నమ్మకపో. నేను చెప్పేది నిజం."  "అయితే ఇద్దరు కలిసి వెళ్ళండి"  "అది కాదమ్మా, నేను వెళ్లి ఇల్లు వెతికి మళ్ళి వచ్చి అప్పుడు ప్రమోదను తీసుకెళ్తాను. అంతవరకూ ఓపిక పట్టు " అన్నాడు నెమ్మదిగా  తల్లి సాలోచనగా "సరే, వచ్చేవారం ప్రమోద ఇక్కడ ఉండటానికి వీలు లేదు" అంది  "సరే,.." అన్నాడు అయిష్టంతో.  విసుగుతో తన గదిలోకి వెళ్ళాడు. ప్రమోద అరవింద్ బట్టలు సద్దుతోంది. దగ్గరకు వెళ్లి "నా పనులు నువ్వేమి చేయకు. నేను చేసుకుంటాను. " అంటూ ఆమె చేతిలో బట్టలు లాక్కుని ఎలా పడితే అలా బాగ్ లోకి విసిరేసి కుక్కుతూ " అసలు నిన్ను తీసుకెళ్లకూడదు అనుకున్నాను. మా అమ్మ పట్టుబడుతోంది. వచ్చేవారం వస్తాను. రెడీగా ఉండు" చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు. ప్రమోద ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. అరవింద్ తన మొబైల్ తీసుకుని రాజీవ్ కి ఫోన్ చేసాడు.  "హలో, చెప్పు అరవింద్? ఎలా ఉన్నావ్?"  "నేను రేపు వైజాగ్ వస్తున్నాను. డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేస్తాను. సాయంత్రం ఆరు అవుతుంది.నిరంజన్ ని, అచ్యుత్ ని కూడా రమ్మని చెప్పు. మీతో మాట్లాడాలి."  "సరే" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు రాజీవ్ . రాజీవ్ వాళ్ళిద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పి తర్వాత రోజు సాయంత్రం ఇంటికి రమ్మన్నాడు. 
***
ఆ తరువాత రోజు మామూలుగా యూనివర్సిటీకి వెళ్ళాడు అచ్యుత్. చైతన్య గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది.  ఆమె వైపు చూడలేకపోయాడు. ఆమె తన మనిషి కాదనే బాధతో తల తిప్పుకున్నాడు. ఏమి మాట్లాడలేదు.  "ఏంటి అచ్యుత్ నాతో మాట్లాడవా?" అని అడిగింది...... "..... నీతో మాట్లాడడం కోసమే ఇంతకాలం తపించిపోయాను. ఇప్పుడు మాట్లాడటానికి మాటలు లేని పరిస్థితి". మౌనం వహించాడు.  "ఏంటి మౌనం , నామీద కోపం వచ్చిందా?" అని అడిగింది.  ".... కోపం ఎందుకు?, నీపై ప్రేమ తప్ప కోపం ఉంటుందా? అసలు అలాంటి అవకాశమే లేదు". మౌనంగానే ఉన్నాడు.  "ఇంకా నాగురించే ఆలోచిస్తున్నావా?" అని మరొక ప్రశ్న అడిగింది.  ".....నాగురించే ఆలోచిస్తున్నావా!, అవును నీగురించే నా ఆలోచన. గత నాలుగేళ్ళుగా నీగురించే ఆలోచించాను. నిజంగా ప్రేమను వ్యక్తపరచనపుడు చెట్టు చాటునుండో, దూరంగా నిలబడో, ఆదమరపుగానో నిన్ను చూస్తూ ఆనందించడమే బాగుంది. ఇప్పుడు నువ్వు ఇంత దగ్గరగా ఉన్న నీవైపు చూసే ధైర్యంలేదు". మౌనంగానే ఉండిపోయాడు.  చైతన్య అచ్యుత్ చేయి పట్టుకుని "ఏమి మాట్లాడవేంటి అచ్యుత్? నువ్వు అలా ఉంటే నాకు నచ్చలేదు" అంది. ".... ఎలా ఉండాలి? మళ్ళీ మామూలుగా మాట్లాడాలంటే నా వల్ల కాని పని చైతన్య". సమాధానం ఇవ్వలేదు.  "నేను నీకు చెప్పాను కదా అచ్యుత్. నాకు నా బావ అంటే ప్రాణం అని. ఇంకా ఎందుకు దక్కని వాటి గురించి, అందనివాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటావు? ఇలా ఆలోచించి ప్రయోజనం లేదు. నీకు మంచి జీవితం ఉంది అచ్యుత్ , ప్లీజ్ నార్మల్ గా ఉండు" అని అచ్యుత్ గడ్డం పట్టుకుని అతని ముఖాన్ని తనవైపు తిప్పుకుని “ప్లీజ్…” అంది ఆమె కళ్ళని చిన్నవిగా చేస్తూ బ్రతిమాలినట్లుగా.  నాకు నువ్వంటే ప్రాణం అందామనుకున్నాడు. నీకోసం ఆలోచించిన ప్రతి నిమిషం నాకు చాలా విలువైనది అని చెపుదామనుకున్నాడు. మంచి జీవితం అంటే నువ్వు ఉంటేనే అని అనాలనుకున్నాడు. కాని అవి అని ప్రయోజనంలేని మాటలు. అనాలనిపించలేదు అచ్యుత్ కి. కాని నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు. లేచి నుంచుని రెండు అడుగులు ముందుకు నడిచి "నేను మాట్లాడే విషయాలు ఏమి లేవు. మన ప్రాజెక్ట్ అవగానే నేను వెళ్ళిపోతాను. నేను మళ్ళీ నీ జీవితంలోకి రాను. నావల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు. కాని నీగురించి ఆలోచించకుండా ఉండే శక్తి నాకు లేదు. ఎందుకంటే నిన్ను చూసిన క్షణం నుండి అన్ని నువ్వే అనుకున్నాను.కాని ఇప్పుడు.... కళ్ళల్లో నీళ్ళు సుడులై తిరిగాయి., కళ్ళు తుడుచుకుని నీకు దూరమైపోతాను అని తెలిసినప్పట్టినుండి తట్టుకోలేకపోతున్నాను చైతన్య!!!!, నిన్ను బ్రతిమాలాలని ఉంది. నన్ను ప్రేమించమని ప్రాధేయపడి అడగాలని ఉంది. మరొక నిమిషంలో ప్రాణం పోతుంది అని తెలిస్తే పడే బాధ నాది. గొప్ప చిత్రకారుడికి సడెన్ గా కళ్ళు పోతె పడే వ్యధ నాది. చెప్పినా నీకు అర్ధం కాదు. ఆపాడు. మళ్ళీ తానే కొనసాగిస్తూ “ఒక్క విషయం చెప్తాను చైతన్య, నువ్వు కాకపొతే నాకు భార్యగా మరొకరు వస్తారు. కాని కచ్చితంగా నువ్వు లేని లోటు ఫీల్ అవుతాను. సింపుల్ గా చెప్పాలంటే అనుకున్న బస్సు మిస్ అయితే తరువాత ఉండే బస్సు ఎక్కడమే!! ప్రయాణం ఆగదు. గమ్యం చేరేవరకు. ఇష్టం ఉన్న లేకున్నా పయనం సాగించాల్సిందే...ఆఖరి కట్టె కాలేవరకు." చెప్పి వెళ్ళిపోయాడు. చైతన్యకు కూడా ఆమెకు తెలియకుండా కన్నీళ్లు వచ్చాయి. 
* * *
యూనివర్సిటీలో రాజీవ్ నవ్యని కలిసాడు. అతను మాట్లాడేవరకు తానూ మాట్లాడకూడదు అని అనుకుంది. చాలాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. నెమ్మదిగా పెదాలు కదుపుతూ "సాయంత్రం బయటకు వెళ్దామా?" అని అడిగాడు రాజీవ్.  "ఎక్కడికి?" అని అడిగింది.  "నీ ఇష్టం" అన్నాడు.  "గుడికి వెళ్దాం " అని చెప్పింది.  "సరే, షార్ప్ 5 కి మీ ఇంటి దగ్గరకు వస్తాను" అని చెప్పి క్లాస్ కి వెళ్ళిపోయాడు.  ఏ రోజుకోసమైతే నవ్య ఇంతకాలం ఎదురు చూసిందో ఆ రోజు రానే వచ్చింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. సాయంత్రానికల్లా రెడీ అయి పాట పాడుకుంటూ అద్దంలో తన అందాన్ని చూసుకుంది. తన మెరుపు బొట్టు సద్దుకుంది. చిన్నగా నవ్వుకుని, సిగ్గుపడుతూ కళ్ళు ఎత్తి తన అదృష్టాన్ని అద్దంలో మరోసారి చూసుకుని మురిసిపోయింది. కురులు ఒకటికి రెండు సార్లు సవరించుకుంది. కూల్ కూల్ అని పదే పదే చెప్పుకుంది. ఈలోపులో బయట నుండి హారన్ వినిపించింది. పరిగెత్తుకుంటూ గుమ్మం వరకు వెళ్ళింది. రాజీవ్ ని చూసి పొంగిపోయింది. అతను ఆమెవైపు చూసాడు. నెమ్మదిగా వెళ్లి బండి ఎక్కి కూర్చుంది. వాళ్ళ ప్రయాణం ప్రారంభమయింది.........  మెల్లిగా మొహమాట పడుతూనే అతని భుజంపై చేయి వేసింది. బండి నడుపుతూనే ఆ చేతిని చూసాడు. అతనికి చాలా భయంగా ఉంది. ఇప్పుడు తానూ చెప్పబోయే విషయం విన్న తరువాత నవ్య ఎలా ఉంటుందో అని చాలా భయంతో ఉన్నాడు.  అది ఒక అమ్మవారి గుడి. ఆ దేవతను ఏమి కోరుకున్న అది నెరవేరుతుందని దారిలో నవ్య చెప్పింది. కళ్ళు మూసుకుని " అమ్మా! నేను ఎప్పుడు గుడికి వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా వచ్చాను. మొట్టమొదటి కోరిక కోరుకుంటున్నాను. నేను కావాలనుకుంది నాకు దక్కేలా చేయి" అని ప్రార్ధించాడు. ఆమె అతనివైపు చూస్తూ నుంచుంది, అతను కళ్ళు తెరిచాక "బొట్టు పెట్టుకో" అంది. అక్కడున్న కుంకుమ తీసి పెట్టుకున్నాడు. "నాకు కూడా పెట్టు " అంది నవ్వుతూ. ఆమె నుదిటిపై పెట్టాడు. అప్పుడు ఆమె ఆనందం ఆమె పెదవుల్లో కదలాడింది. ఉద్వేగం ఆమె కళ్ళల్లో మెదిలింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని కళ్ళలోకి చూసింది. ప్రసాదం పుచ్చుకుని మెట్లదగ్గర పక్కగా కూర్చున్నారు.  రాజీవ్ విషయం చెప్పడానికి సంకోచిస్తుండగా "ఏదో మాట్లాడుతాను అన్నావ్?" అని అడిగింది. జంకుతూనే "ఏమి లేదు నవ్య .. నేను....." అంటూ నీళ్ళు నమిలాడు.  "ఏంటో చెప్పు" అంది మాములుగా. ఇంతలో మేఘన అక్కడికి వచ్చింది. వాళ్ళిద్దరిని చూసి అదిరిపడింది. రాజీవ్ కూడా ఖంగుతిన్నాడు. మేఘనను చూస్తూ లేచి నుంచున్నాడు. ఇద్దరిని చూసి తానూ కూడా లేచి నుంచుంది నవ్య. నవ్య " హేయ్, మేఘన," అంటూ దగ్గరకు వెళ్లి " రాజీవ్ నా ప్రేమను అంగీకరించాడు" అంది పట్టరాని సంతోషంతో.  "నేను కాదన్నాను. నిన్ను ఒప్పుకున్నాడు " అంది అక్కసుతో.  నవ్య కళ్ళు పెద్దవయ్యాయి. గుడిలో గంటలు గణ గణ మ్రోగాయి. ఒక అడుగు వెనక్కి వేసి ఇద్దర్ని చూస్తూ ఉండిపోయింది నవ్య. రాజీవ్ తలవంచుకుని నుంచున్నాడు. అతనికి దగ్గరగా నడిచి " నువ్వు నాకోసం తిరిగి వస్తావని ఇంతకాలం ఎదురుచుసాను రాజీవ్. నా నమ్మకాన్ని వమ్ము చేసావు. నా ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసావు. నన్ను మోసం చేసావు. నన్ను మోసం చేసావు...." అంటూ గొంతు నరాలు తెగిపోయేలా అరిచింది మేఘన. నవ్యకి అక్కడ ఉండాలనిపించక బాధతో అక్కడినుండి బయటకు పరిగెత్తింది. నవ్యా అని పిలిచాడు. పట్టించుకోలేదు."ఆగు నవ్య…… !!! ప్లీజ్... " అంటూ అరిచాడు. ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి మేఘనవైపు చూసి "ఎదురు చూసావా? ఎప్పుడైనా నాకోసం ఆలోచించావా? నువ్వు నీ మూర్ఖత్వంతో నన్ను కట్టిపడేసావేగాని, నీతో జీవితం సాగించడం కన్నా ఆ సముద్రంలో దూకడం నయం. ఇప్పుడు చెపుతున్నాను విను, నేను పెళ్లి అంటూ చేసుకుంటే నవ్యనే చేసుకుంటాను. ఎవరు అవునన్నా కాదన్న,, ఆ అమ్మవారిమీద ఆన" బయటకు కదిలాడు. 
* * *





[+] 4 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:57 AM



Users browsing this thread: 1 Guest(s)