20-11-2018, 11:48 AM
"ఒరేయ్! ఊరికి వెళ్ళేది చదువుకోవడానికే, ప్రేమలు గీమలు అంటూ ఇంట వంటా లేని పనులు చేయకు. ఆ తర్వాత నీ ఇష్టం." కొడుక్కి చెప్పింది జానకి. "అబ్బబ్బ, మొదలెట్టావా? చదువుకోవడానికే వెళ్తున్నాను. కొత్త ఐడియాలు ఇవ్వకు" చెప్పాడు అరవింద్. "జాగ్రత్తర మరి" కొంచెం ప్రేమతో, కొంచెం భయంతో,ఇంకొంచెం హెచ్చరిస్తున్నట్టుగా చెప్పింది. "సరే, రేపు సాయంత్రమే నా ప్రయాణం. ఒకసారి ప్రమోదని కలిసి వస్తాను." అంటూ బయటకు వెళ్ళాడు. పచ్చని పొలాల మద్యలో ఉంది ప్రమోద ఇల్లు. ప్రమోద తండ్రి ఓ చిన్నకారు రైతు. ప్రమోద డిగ్రీ వరకు చదివింది.అదే ఊళ్లో టీచర్ గా పనిచేస్తింది. అరవింద్ ప్రమోదలు చిన్నప్పటి నుండి స్నేహితులు. ఇంటి బయట కూర్చుని ఉన్న ప్రమోద తండ్రిని నవ్వుతు పలకరిస్తూ లోపలి నడిచాడు. ఆయన అరవింద్ ని చూసి "ప్రమోదా!! అరవింద్ వచ్చాడు చూడు. " అంటూ బయటనుండే అరిచాడు. "ఇక్కడికి రా అరవింద్. పనిలో ఉన్నాను" అంది ప్రమోద పెరట్లో నుండి. పెరటిలోకి వెళ్లి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు. "మ్! ఏంటి సంగతులు?" మొక్కలకి అంటు కడుతూ అడిగింది "పి.జి అయింది కదా, పిహెచ్.డి కోసం వైజాగ్ వెళ్తున్నాను" అన్నాడు. "అలాగేర, మొత్తానికి డా.అరవింద్ అవ్వబోతున్నావ్ అనమాట" అంది నవ్వుతు. "మ్, అది సరే గాని. నీ సంగతేంటి?" "నాకా టీచర్ జాబు చాలు. పిహెచ్.డి లు అవసరం లేదు. చదివే ఓపిక అంతకంటే లేదు" అంది చేతులు కడుగుకుంటూ. "పోనీ నువ్వు కూడా వైజాగ్ వచ్చేయచ్చుగా. అక్కడే జాబు చేసుకోవచ్చు" మగ్గుతో ఇంకొంచెం నీళ్ళు అందిస్తూ అన్నాడు. "మ్ ...! చూద్దాంలే! ఇప్పుడేమంత ఇంట్రెస్ట్ లేదు. అమ్మతో చెప్పావా?" అడిగింది చీరకొంగుతో చేయి తుడుచుకుంటూ. "చెప్పాను. ఏ తల్లి అయినా ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తుంది. కానీ మా అమ్మ మాత్రం అమ్మాయిలతో జాగ్రత్త అని చెప్పింది" అన్నాడు. ఒక నవ్వు నవ్వి "అవును. అమ్మాయిలు అణుబాంబులతో సమానం. జాగ్రత్తగానే ఉండాలి." అంది "ఒక అణుబాంబు చాలులే నాకు" అన్నాడు "దొంగ సచ్చినోడ "అంటు వీపు మీద చెళ్ళుమనిపించింది. "సరే!సరే! రేపు సాయంత్రమే నా ప్రయాణం. మళ్ళి వచ్చినపుడు కలుస్తాను." అన్నాడు కొంచెం దిగులుగా. "అలాగేరా. ఇప్పుడు సినిమాలోలాగ నువ్వు డల్ గా నడుచుకుంటూ ముందుకు వెళ్ళు. నేను అలా కళ్ళల్లో నీళ్ళతో వెళ్తున్న నీకేసి చూస్తూ ఉంటాను. కాసేపయ్యాక సన్నగా గాలి వీస్తుంది. ఆగి వెనక్కి తల తిప్పి నన్ను చూస్తావు. నేను చేయి ఊపుతూ టాటా చెప్తూ ఉంటాను. నువ్వు అలానే నడుస్తూ చేయి ఊపుతూ...." "ఊపుతూ ... వెళ్లి అక్కడి గొయ్యిలో పడిపోతాను దరిద్రం వదిలిపోతుంది" "హ.. హ... హ.. చాలా అందంగా నవ్వి, ఏదో ఫీల్ ఉంటుందని అలాచెప్పనురా. అయినా నీకంత సీన్ లేదు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న నీ స్థానం నీదే" అంది "ఓకే. వస్తాను. అమ్మని చూసుకోవాల్సిన భాద్యత నీదే" అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు అరవింద్. అనుకున్నట్టుగా ఆ తర్వాత రోజు బయలుదేరి వైజాగ్ చేరుకున్నాడు.యూనివర్సిటీకి దగ్గరగా రూమ్ తీసుకుందాం అని చాలా సేపు తిరిగాడు. యూనివర్సిటీకి కొంచెం దూరంలో ఒక ఇంటి ముందు టూలేట్ బోర్డు చూసి "సార్...ఎవరైన ఉన్నారా?" అని పిలిచాడు. "ఎవరూ?" అంటు బయటకు వచ్చాడో పెద్దమనిషి. "టూలేట్ బోర్డు ఉంది కదా గది ఏమైనా అద్దెకు ఇస్తారేమో అని " అన్నాడు. "చదువుకుంటూన్నావా?" కళ్ళజోడు ఫైనుండి చూస్తూ అడిగాడాయన. "అవునండి.పిహెచ్.డి చేయడానికి వచ్చాను" "పెళ్లి అయిందా?"అడిగాడాయన. "లేదండి. ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వాలి "అన్నాడు సిగ్గుపడుతూ. "అయితే ఇవ్వటం కుదరదు " అన్నాడు ఆ పెద్దాయన. "సార్, సార్ అలా అనకండి సార్. మూడు గంటల నుండి వెతకగా ఇదొక్కటే దొరికింది.ప్లీజ్ సార్, మీ షరతులు ఏమైనా సరే పర్వాలేదండి" అన్నాడు ప్రాదేయపడుతూ. ఇంతలో ఆ ఇంట్లోంచి ఓ అమ్మాయి బయటకు వచ్చింది. చాలా అందంగా ఉంది.ఆ అమ్మాయి వైపు తిరిగాడు. ఏదో తెలియని ఆలోచన కదలాడింది. ఆమెకేసి అలా చూస్తూ ఉండిపోయాడు. "అందుకే ఇవ్వనన్నాను" అన్నడా పెద్దమనిషి కొరకొర చూస్తూ . తేరుకుని "అయ్యో! సార్ ప్లీజ్ సార్. మీరు నన్ను అపార్ధం చేసుకున్నారు. మంచివాడినండి. ఏ చెడు అలవాట్లు లేవు. బుద్ధిమంతుడు 001 అంటారండి మా ఊరిలో నన్ను. మీరు కాదంటే ఈ రోజు నా పరిస్థితి ఫుట్ పాత్ " అన్నాడు బ్రతిమాలుతూ. అరవింద్ మాటలు విని "నాన్న, అద్దెకు ఇవ్వండి "అని చెప్పింది ఆ అమ్మాయి. కూతురివైపు చూసి "సరే, మా అమ్మాయి చెప్తోంది కాబట్టి ఇస్తున్నాను" అని చెప్పి అద్దె వివరాలు చెప్పి అడ్వాన్సు పుచ్చుకున్నాడు, ఆ అమ్మాయితో "థాంక్స్ అండి. మీరు కనక చెప్పకపోతే ఈ రాత్రి నా బ్రతుకు బస్టాండ్లోనే" అని అన్నాడు ఆమె మాత్రం ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.
* * *