13-12-2019, 04:36 PM
(This post was last modified: 13-12-2019, 04:52 PM by naresh2706. Edited 2 times in total. Edited 2 times in total.)
అప్డేట్ : 2
2023ఏప్రిల్ 1st
స్థలం: కరాచీలో గుల్షన్ నగరానికి పక్కగా ఉన్న చిన్న మురికివాడ.
ఉదయాన్నే లేచి తన అమ్మీ పెట్టిన రోటీ క్యారేజ్ లో సర్దుకుని సైకిల్ మీద టౌన్ కి వెళ్తున్నాడు అమీర్ భాషా.
దారిలో మురికి గుంట పక్కన పొదల్లో కుక్కలు గుంపులుగా కీచులాడుకుంటున్నాయి. వాటి రొద విని అటువైపుగా దృష్టి సారించాడు భాషా.
"ఏదో ఆవుని పట్టేసాయి ఇవి" అని మనసులో అనుకుంటూ కుతూహలం కొద్దీ కర్ర తీసుకుని వాటిని అదిలిస్తూ కుక్కలు ఉన్న వైపు వెళ్ళి చూడగానే అదిరిపడ్డాడు.
అక్కడ కుక్కలు ఎవరో చనిపోయిన యువకుడి శవాన్ని పీకుతున్నాయ్.
వెంటనే వెనక్కి పరిగెత్తి సైకిల్ కి తగిలించిన తన బుట్టలోంచి ఫోన్ తీసి సెక్యూరిటీ అధికారి ఎమర్జెన్సీ నెంబర్ 15 డయల్ చేసాడు.
"హలో.. సెక్యూరిటీ అధికారి ఎమర్జెన్సీ.. చెప్పండి"
" సర్ ఇక్కడ ఒక శవం ఉంది సార్"
"మీ పేరు?"
"భాషా.. అమీర్ భాషా సర్"
"మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?"
"కరాచీలో గుల్షన్ సిటీకి 10కిలోమీటర్ల దూరంలో ఉన్న మురికివాడ నుంచి సార్"
"హ్మ్... చూడండి భాషా.. ఈ రోజు ఇది 15వ కాల్. ఏప్రిల్ 1st కదా అని డైరెక్టుగా సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ తో పెట్టుకోవడం మంచిది కాదు. మర్యాదగా ఫోన్ పెట్టేయ్యండి."
"సార్ నన్ను నమ్మండి సర్. నేను నిజమే చెప్తున్నాను. "
"ఓకే. బట్ ఇది ప్రాంక్ అయితే నా రియాక్షన్ బియాండ్ ద లిమిట్స్ ఉంటుంది."
"ఓకే త్వరగా రండి సర్"
ఆ ఆఫీసర్ లైన్ కట్ చేసి అక్కడికి దగ్గర్లో ఉన్న సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి రిపోర్ట్ చేసాడు.
మరొక 20నిమిషాల్లో అక్కడికి సెక్యూరిటీ అధికారి జీప్ వచ్చి ఆగింది. ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళి "ఇక్కడ ఫోన్ చేసింది నువ్వేనా" అని అడిగాడు అక్కడే నిలబడి ఉన్న ఒక యువకుడ్ని.
అవునన్నట్టు తలూపాడు అతను.
"శవం ఎక్కడ?" అని అడిగి అతను చెప్పిన వైపు నడిచిన ఇన్స్పెక్టర్ ఆ శవాన్ని చూడగానే తుళ్ళిపడ్డాడు.
" ఇది... ఇది మొహమ్మద్ రిజ్వాన్?..." చుట్టుపక్కల పిచ్చిగా చూస్తూ అడిగాడు.
అవునన్నట్టు తలూపాడు మళ్ళీ ఆ యువకుడు.
"మొహమ్మద్ రిజ్వాన్"
ఆ పేరు వినగానే మిగిలిన కానిస్టేబుల్స్ అందరూ పరుగుపరుగున చేరుకున్నారు శవం దగ్గరికి.
క్షణాల్లో విషయం పై అధికారులకి చేరవేశాడు ఇన్స్పెక్టర్.
ఈ లోపు మీడియా అక్కడికి చేరుకుంది. పొద్దెక్కే కొద్దీ జనం కూడా మూగడం, క్షణాల్లో ఈ విషయం వైరల్ కావడంతో న్యూస్ చానెల్స్ క్షణం తీరిక లేకుండా బులెటిన్లు ప్రసారం చేస్తున్నాయి.
ఎక్కడ చూసినా ఒకటే వార్త " 31 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ కి ఒంటి చేత్తో ప్రపంచకప్ అందించిన మొహమ్మద్ రిజ్వాన్ అనుమానాస్పద మృతి"
ప్రపంచం మొత్తం ఈ వార్త రేపిన కలకలం అంతా ఇంతా కాదు.
ఇన్స్పెక్టర్ అక్కడి స్థానికుల సహాయంతో శవాన్ని రోడ్ మీదకు తీసుకువచ్చి పోస్టుమార్టం నిమిత్తం తరలించాడు.
పోస్టుమార్టం జరుగుతున్న స్థలం వద్ద క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సెక్యూరిటీ ఆఫీసర్లు, జనంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా ఉంది.
........
స్థలం: పీసీబీ ఆఫీస్.
పీసీబీ ప్రెసిడెంట్ ఇషాన్ మణి కి తీరిక లేకుండా ఫోన్లు వస్తున్నాయి. ఐసీసీ ఈ విషయంలో బోర్డ్ నుంచి ఒక సవివరమైన రిపోర్ట్ అన్ని ఆధారాలతో సహా అందించాలని ఆజ్ఞ జారీ చేసింది.
మొహమ్మద్ రిజ్వాన్ మృతికి సంతాపం ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
" దేశం ఒక ఉజ్వల భవిష్యత్తు కలిగిన క్రికెటర్ ని కోల్పోయిందని, అతని స్థానం భర్తీ చెయ్యడం పాకిస్తాన్ టీం కి ఒక తీరని లోటని, కేవలం 11 మ్యాచుల్లోనే అతని ప్రతిభ చూసి తమ బ్యాట్స్ మన్ గొప్పతనం మరుగున పడుతుందనే భయంతో ఎవరో చేతకాని వారే అతన్ని చంపించి ఉంటారని" తమ అనుమానం వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ ప్రభుత్వం చివర్లో అన్న మాటలు భారతదేశ ప్రధానమంత్రికి ఎక్కడో రగిలేలా చేసాయి.
అసలే పాకిస్తాన్ తో ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఓడిపోని ఇండియా మీద, వరల్డ్ కప్ ముందు వరకూ అసలు పసికూన చేతిలో అయినా మ్యాచ్ గెలుస్తుందా అనిపించిన పాకిస్తాన్ ఫైనల్లో భారత్ ని అలవోకగా ఓడించి భారత్ లో భారత్ మీద గెలిచి కప్ పట్టుకెళ్ళడంతో పుండు పడిన సగటు భారత అభిమాని గుండె మీద ఈ మాటలు కారమేం ఖర్మ ఆచి చికెన్ మసాలానే చల్లాయి.
ప్రధాని హుటాహుటిన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశాడు.