సామవేద సారమిది
“వెల్కమ్ సర్! న్యూ కపుల్స్ కు మా హోటల్ సవేరా వెల్కమ్ చెబుతోంది..."
కారులోంచి కాలు బైటపెట్టగానే పుష్పగుచ్చంతో ఎదురొచ్చి వెల్కమ్ చెప్పారు మేనేజర్.
విసుగ్గా చూశాడు అభిమన్యు. మనస్విని నిర్లిప్తంగా నవ్వింది. బాయ్ పరుగెత్తుకొచ్చాడు.
"సర్ ని కాటేజ్ నెంబర్ ఫోర్ కి తీసుకెళ్ళు..." మేనేజర్ పురమాయించగానే బాయ్ కారులోంచి సూట్కేస్ తీసుకుని కాటేజ్ వైపు నడిచాడు.
హోటల్ కి కొంచెం దూరంగా హనీమూన్ కాటేజెస్ న్యూ కపుల్స్ కోసం యాజమాన్యం ఏర్పాటు చేసింది. బోయ్ వెంట నడుస్తున్న అభిమన్యుని సర్ అంటూ పిల్చి కార్డ్ అందించాడు మేనేజర్
"ఇందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సర్! ఏ అవసరం ఉన్నా కాల్ చెయ్యండి. ఎక్కడికైనా సైట్ సీయింగ్ కోసం వెళ్ళాలంటే కారు మీ పేరున బుక్కయి ఉంది.మేమెవరం డిస్టర్బ్ చెయ్యం. హ్యాపీ హనీమూన్ ఎంజాయ్ డేస్ సర్... "వీళ్ళ బిల్డప్ చూస్తుంటే ప్రవరాఖ్యుడు కూడా మన్మథుడు అయిపోయేటున్నాడు. కానీ వాళ్ళకి తెలీదు. నిట్టూర్పు సెగని తనలోనే దాచుకుని సిగ్గుని నటించింది మనస్విని.
కాటేజ్ తలుపు తియ్యగానే మల్లెల పరిమళం ముక్కుని తాకి పరవశింపజేసింది. బోయ్ సూట్కేస్ లోపల పెట్టి రూమ్ ఓసారి పరిశీలించి వాళ్ళవైపు చూశాడు. తర్వాత కాటేజ్ కీస్ అందించాడు".
"నువ్వు వెళితే మేము ఫ్రెష్షవ్వాలి" అన్నాడు అభిమన్యు. "డిన్నర్ కోసం వస్తారా? ఆర్డర్ చేస్తారా?"
"మేమే వస్తాం... నువ్వెళ్ళు" అంటూ పర్సులోంచి రెండునోట్లు తీసి బోయ్ కి అందించాడు.
బోయ్ వెళ్ళగానే తలుపుమూసి వచ్చి బెడ్ పైన కూర్చుని సెల్లో మెసేజెస్ చూసుకుంటున్నాడు.
"స్నానం చేద్దామా?" అడిగింది మనస్విని.
"చేసిరా... నేను తర్వాత చేస్తాను"
"ఇద్దరం కలిసి చేద్దామా!"
"నాకు అలవాటు లేదు"
'నాకు అలవాటు మరి' కచ్చిగా అనుకుంటూ సూట్కేస్ ఓపెన్ చేస్తూ కెవ్వుమంది మనస్విని.
“ఏమైంది' అన్నట్టు చూశాడు అభిమన్యు.
"నా సూట్కేస్ ఏదీ... నా డ్రస్సెస్, శారీస్ మేకప్ కిట్ అన్నీ అందులోనే ఉన్నాయి" “అంటే కారులోంచి బైటకి తీయలేదా! ముందు చూస్కోలేదా! ఆగు ఫోన్ చేస్తాను" అంటూ కార్డ్ లో నెంబర్ చూసి ఫోన్ చేశాడు.
"సర్! నేను చాలా దూరంలో ఉన్నాను సర్ రేపు ఎర్లీ మార్నింగ్ మీ కాటేజ్ ముందుంటాసర్" అన్నాడు డ్రైవర్ చేసేది లేక ఫోన్ ఆఫ్ చేశాడు. ఇప్పుడేం చేస్తావు అన్నట్టు మనస్విని వైపు చూశాడు.
"నాకు విప్పిన బట్టలు మళ్ళీ వేసుకునే అలవాటు లేదు" బిక్కమొహంతో అంది. 'నాకు అలవాటు మరి'లోపల అనుకుంటూ "ఈ
నైట్ ఎలాగో అడ్జస్ట్ అయిపో" అన్నాడు తేలిగ్గా.
“మీ టవల్ వాడుకోనా?" అడిగింది మనస్విని.
"సరే" అన్నాడు కనికరించినట్టు అభిమన్యు.