22-11-2019, 10:34 AM
నా సౌఖ్యం ముందు ఏ భారాన్నీ అణగ తొక్కేస్తానా? నా గుండె విపరీతమైన రాయా? ఏమో? కాని యిప్పుడు తలుచుకుంటే ఏమనిపిస్తుందంటే- అంతకంటే యేం చెయ్యగలుగుదను? ఎటు ఏమి చేసినా, దోవలేని మహా అగాధం ఈ జీవన నదికి ఈ మహా సముద్రమే అంతం. ఇటు ప్రవహించినా అంతేనా పుట్టక. నేను ఏ పరిస్థితులలో పడ్డానో అది నా ఖర్మ. యీ ప్రపంచాన్ని పాలించే మహాశక్తి. మన హృదయాన్ని నడిపించే రహస్య సూత్రం. అదే నన్నూ, అతన్నీ, ప్రేమనీ, అన్నిటినీ చిరునవ్వుతో-యిట్లా మా అల్పశక్తుల్ని, దాన్నించి తప్పించుకోవాలని చూసే మా అల్ప వ్యర్థ ప్రయత్నాలని చూసి, చిరునవ్వుతో క్రూరంగా నిరాఘాటంగా, సునాయాసంగా దొర్లించుకుంటూ పోయింది. దానికి కళ్ళు లేవు, చెవులు లేవు ఆత్మలేదు, ఆ శక్తే నీతిలోంచి, జడత్వంలోంచి, శాంతిలోంచి, మర్యాదలోంచి మిమ్మల్ని, పాపంలోంచే, నరకంలోంచే, మహా బాధలోంచే నన్నూ అందర్నీ ఎక్కడికో ఒకచోటికే నేమో తీసుకుపోతోంది. ఊరికే మీరూ నేనూ అట్లా చేశాం. యిట్టా చెయ్యకపోయినామే అని యేడుస్తాము. అంతే నామీదాగ్రహించి, తరుముతారుగాని, మీరు చెప్పే వేదాంతమూ అదేగా! చివరికి 'దాని ఖర్మం పొమ్మం'టారు. నేను 'మీ ఖర్మం' పొమ్మంటాను.