22-11-2019, 10:34 AM
"అది తెలుగూ కాదు. తురకం కాదు నాకు మాత్రం ఎట్లా తెలుస్తుంది? ఏమో ముద్దుకి అట్లా పిలుస్తాడు."
"దీదీ దాదా" అని వెక్కిరింపుగా అని యింకా యేదో అనబోయి వూరుకున్నాడు అమీర్.
'దీదీ' అన్నమాట మీరా నోట్లోంచి వొచ్చినప్పటి మాధుర్యమంతా చితికిపోయింది.
మళ్ళీ రెండురోజులు మీరా కనపళ్ళేదు. అమీరు కొత్త ప్రేమతో కొత్త కాంక్షతో అన్నీ మరచిపోయినాను. కాని అమీరైనా నాన్ను కావలించుకుని పడుకుని నా మొహంలోకి కళ్ళలోకి చూస్తూ యేదో యేదో స్పష్టంగాని తనసందేహాన్ని నా లోపల, నా హృదయం లోపల కళ్ళలోంచి వెతుకుతున్నట్టుగా చూస్తూ పరధ్యాన్నంతో పడతాడు. చప్పున మళ్ళీ నా అందంలో మైమరుస్తాడు. ఏదో తనని బాధించే అంతర శత్రువులతో పోరాటుతున్నట్టు బాధపడతాడు. నాకతనిపైన, అతని బాధపైన ఎంతో జాలి కలుగుతుంది. కాని అడగటం భయం. అడిగితే ఏం వెళ్ళబెడతాడో? మధ్య మధ్య మీరాని మరిచిపోయినానే! ఎక్కడున్నాడో! మళ్ళీ ఏ పొదల వెనక తిండిలేక మాడుతున్నాడో! రాడేం? అనుకుంటూనే మళ్ళా మరచిపోతాను. మళ్ళీ యెందుకు మరచిపోయినాను? ఎంత క్రూరురాల్ని! నాకేం అధికారముంది యింత అందంగా వుండేందుకు? అని నాలిక కొరుక్కుంటాను. కృతఘ్నురాలినా?