22-11-2019, 10:23 AM
ఈ పిల్ల లేకపోతేనేం-కాలమంతా గంతులేస్తే, నా ముందు నవ్వుతూ పరుగెత్తుతూ వుంటే! ఎంత వెర్రివాళ్ళీ మనుషులు! ఆశపడి నవ్వుల్ని చేతుల్నిండా పోగుచేసుకుని అతి ఆశతో గుప్పెట్లు తెరిచి చూసుకుంటే, భరించలేని కన్నీళ్ళుగా మారి కనపడతాయి.
ఆ మూడు రోజులూ యమ బాధపడ్డాను. ఇంక మీరా నన్నంటి పెట్టుకొని నాకు పరిచర్య చేస్తూ నీతో కలిసి పడ్డ వేదన, రుణం యెన్ని జన్మాలలో తీర్చుకోగలను? నానించి యేమాత్రం ప్రత్యుపకారమూ వొస్తుందనే ఆశైనా లేక నాకు చూపిన అట్లాంటి ప్రేమని పొందిన నా జీవితాన్ని తలుచుకుంటే నా వొళ్ళు పొంగిపోతుంది. నన్ను తాకుతూ, నా జుట్టు దువ్వుతూ, నా నోట్లో జావా పోస్తూ, 'తగ్గిందా?' అని ప్రతి నిమిషం అడుగుతూ, నా కళ్ళలోకి చూస్తూ, నా చీర సర్దుతూ నా పక్కన కూచుంటే, నిజంగా యింకా నాలుగు రోజులు బాధలో పడుకోవాలనిపించింది.
ఆదుర్దాతో వెలవెలబోయే అతని మొహం చూస్తూంటే నా బాధ మరచి అతని బాధకై బాధపడేదాన్ని. నేనొక్క పెద్ద మూలుగు మూలిగి నప్పుడల్లా అతను విలవిలలాడి హడలిపోయేవాడు. అతని కళ్ళలోని వ్యథని చూడలేక ఆ నెప్పినంతా కుక్కుకుని కళ్ళు మూసుకు పడుకుంటే మళ్ళీ మళ్ళీ పలకరిస్తాడు. నేనెటు తిరిగితే అటు వొచ్చి కూచుంటాడు. నేను నిద్రపోతూంటే పాదాల దగ్గిర తల పెట్టుకుని పడుకుని నేను కదలినప్పుడల్లా చప్పున లేచి కూచుంటాడు. నా మీరాని, ఉరితీస్తారుట అతన్ని. యామవుతుందో అతని అందం, అతని హృదయం?