22-11-2019, 10:23 AM
మా ఆనందానికీ, మా షికార్లకీ ఆటంకమనేకదా, అమీరు యీ కడుపు వొద్దన్నది అనుకున్నాను. ఆ పిల్లకి పాలిచ్చుకుంటూ, ఆ పిల్ల ఏడుపు సముదాయిస్తూ, దాని మురికితో నిండి, ఆ ధ్యానలోనే మునిగి....ఆ బిడ్డ మా ప్రేమని నాశనం చెయ్యదా? నాకంటె దూరదృష్టి కలవాడు అమీర్. అతనికి కోపం వచ్చిందంటే తప్పా మరి!
ఇప్పుడు నన్ను అమీర్ వొదిలి వెడితేనే దిక్కుమాలిన పక్షినైనానే. ఆ పిల్లతో సహా ఏనాడో నన్ను వొదిలేస్తే యిద్దరమూ యామైపోతాము? ఇప్పుడు బతుకు దుర్భరమైతే యే యేటిలోనో ముంచి అంతం చేసుకోగలను నా బాధని! అప్పుడో? అని అనుకుంటూ వుండగా వొచ్చిందా మనిషి.
"నెల లేమిటి?"
"మీరాగారి అక్కగారు నన్ను పంపించారు."
"ఎందుకు?"
తెలిసింది. వొప్పుకోనా?
కాని నా చిన్నపాపని. నన్ను నమ్ముకుని నాలో దాక్కున్న పాపని....కాని మళ్ళీ అమీర్ రావడమూ, నేనూ అతనూ ఆ మైదానంలో పూర్వం మల్లేనే....'సరే' అన్నాను.
ఒక్కమాటలో, ఒక్క తలవూపుతో యీ దుస్వప్నం చెదిరిపోతుంది. మళ్ళీ మెలకువ వచ్చేటప్పటికి, మళ్ళీ అమీర్ నా ప్రక్కన వుంటాడు. మళ్ళీ జీవితమంతా ఆనందమయ మవుతుంది.