22-11-2019, 10:22 AM
అమీర్ కోసం అంటే మళ్ళీ వెళ్ళిపోతాడేమో.
"ఎందుకు వెళ్ళిపోయినావు?"
"నా మనసు మంచిదికాదు. దుష్టుణ్ణి. నా సంగతి పోనీ, నువ్వేమిటి యీ రాత్రి యోచిస్తున్నావు?"
"చెపితే నీకు కోపం వస్తుంది."
"అమీర్ని గురించేనా?"
"అవును"
"నాకు కోపమెందుకు? నాతో చెప్పు."
అమీర్ నన్నెందుకు వొదిలాడో మీరాకి తెలీదు.
కన్నీళ్ళతో, నిట్టూర్పులతో అంత సంగతీ మధ్యమధ్య సిగ్గుపడుతూ చెప్పాను, నిదానంగా విన్నాడు. అమీర్ని తిట్టలేదు, నాకోసం జాలిపడలేదు. ఆ సంగతి మరిపించేసి నాతో ఆదుకుని నేను నిద్రపోయిం తర్వాత వెళ్ళిపోయినాడు. మర్నాడు ఒకత్తె వొచ్చింది.
"ఎన్ని నెల్లు అయింది?" దాని మాట నా కర్థం కాలేదు.
రాత్రంతా అమీరు కలలు కన్నాను. పగలంతా, అతను లేడనే విరహంతో మాడిపోతున్నాను. నా వికారంతో, డోకులతో, వొంటరి తనంతో, విరహంతో, శూన్యభావంతో, నా మాతృభావం అడుగంటింది. నేను వెర్రిపట్టుపట్టి నా అమీర్ని వెళ్ళగొట్టానా? ఈ బిడ్డ పుడితే మాత్రం యెట్లా పెంచను? ఏం చేసుకోను? పోషణ యెట్లా?