22-11-2019, 10:20 AM
సాయంత్రపు పశ్చిమదిశవలె యెరుపుజారి మొహంలో సిగ్గు సలుపు కమ్మింది. చప్పున నన్ను వొదిలి పరుగెత్తి వెళ్ళిపోయినాడు. ఇంక రాడేమోనని భయమేసింది నాకు. కాని సాయంత్రం మెల్లగా తలవంచుకుని వచ్చి వొంగి నా కాళ్ళు పట్టుకున్నాడు.
"ఇంకెప్పుడూ చెయ్యను."
లేవనెత్తి గట్టిగా కావలించుకున్నాను.
"నా కట్లా బాగుండదు. ఏం?" అన్నాను.
"మరి నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు?"
నా తప్పు తెలిసింది.
"మీ అక్క ముద్దు పెట్టుకోదూ. పోనీ మానేస్తాలే."
"వొద్దు, మానెయ్యవొద్దు. నాకు కోపం తెప్పించకు మరి" అన్నాడు.
అమీర్లేని సంగతి వూళ్ళో తెలీడం కొంత కాలం పట్టింది.
అతనికి పట్టిన అదృష్టాన్ని చూసి యీర్ష్యపడి నావంక కన్ను వేసి వుంచినవారు లేకపోలేదనీ మీరా పుచ్చుకున్న ముందు జాగ్రత్త వృధా కాదనీ. నా కొకనాటి రాత్రి స్వప్నమయింది. నిద్రపోతున్న నాకు ఎవరో దగ్గిరగా నడుస్తున్నట్లు తోచి మెలుకువ వొచ్చింది. చీకట్లో యింకా నల్లగా కనబడ్డది.
"ఎవరు?" అన్నాను భయంతో.
"నువ్వెవరే?"