22-11-2019, 10:19 AM
అతని ఆటలూ, స్నేహితుల అల్లర్లూ, చిన్నపిల్లలమీద చిన్నప్పటి ప్రేమలూ, అన్నీ సంతోషంగా వినేదాన్ని. ఆ చేతులు కొంచెంగా వూయిస్తూ రాజఠీవితో తల ఆడిస్తూ మాట్లాడుతూ వుంటే యీ నవాబు నా వొళ్లో కెట్లా వొచ్చాడనిపించేది. ఎక్కడనించో తెచ్చేవాడు కూరలూ, ఫలహారాలూ, పాలూ, పళ్ళూ, ఇంటిదగ్గిర పెట్టినవన్నీ దాచి నాకు పట్టుకొచ్చేవాడేమో? రోజూ సాయంత్రం పూలదండ చేతిలో లేనిది నాకు కనపడడు. నన్ను రాత్రి పడుకోబెట్టిగాని యింటికి పోడు. నాకు వొంటరిగా భయం వేస్తుందని యింటికి వెళ్ళడు, నేనెంత బతిమాలినా.
అయినప్పటికి వెన్నెలరాత్రులు నీటికి వెళ్ళినప్పుడు చందమామ యేటినీటిలో కనబడితే, అర్థరాత్రి నక్క అరుపుకి మెలుకువ వొస్తే, అరుద్ర పడమట పెద్దగా అస్తమిస్తూ వుంటే, అమీరులేని లోటు నన్నావరించి బాధపెట్టేది. మీరా నన్నెంత వుత్సాహ పెట్ట ప్రయత్నించినా వ్యర్థమయ్యేది.
"నిన్నంత బాధపెడుతున్నాడు. వాడు నీ శత్రువు" అంటాడు మీరా.
"నేను పెద్దవాణ్నయితే నాకోసం యెవరన్నా యింత బాధపడతారా, నువ్వు అమీర్ కోసం పడుతున్నట్టు?" అన్నాడొక రోజు.
ఒకసారి యాలక్కాయలన్నీ జేబులో పోసుకొస్తే వాళ్ళ పిన్ని చూసి "అది నీ చేత దొంగతనాలు కూడా చేయించుకుంటోందా? ఉండు ఒకసారి నౌకరిని పంపి తిట్టిస్తానంది."