22-11-2019, 10:19 AM
6
అమీర్ ఒక్కరోజు కనబడకపోతే ఒక్కరోజయినా యెట్లా బతకనా అనుకునేదాన్ని, వెళ్ళింతరవాత నేననుకున్నంత ఒంటరిగా లేనేలేదు.
నన్ను అన్యాయం చేసి వొదిలాడే అనే రోషం, నా అభిమాన నష్టమే నన్ను బాధపెట్టాయి. అమీర్ మీద కోపం కలిగింది. ఎట్లానన్నా అతను నా కోసమే పరితపించి బాధపడేటట్టు చెయ్యాలనిపించింది. ఇంక అతనికి కనపడకుండా వెళ్ళిపోతే. దేంటోనయినా పడి చచ్చిపోతే? మళ్ళీ వెళ్ళి అమ్మదగ్గిర చేరితే? ఇన్నీ అనుకున్నాను.
మీరా పదహారేళ్ళ కుర్రవాడు. చాలా నాజూకైనవాడు. తరతరాల నించి వొచ్చే గొప్ప వంశపు లక్షణాలు అతనిలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఆ వేళ్ళ యెర్రని చివర్లలో, ఆ కళ్ళ కొలుకుల తేటలో, ఆ చంపల పాల మెత్తదనపు నునుపులో, మాట్లాడేప్పటి వొంపు ధీరత్వంలో, చేతుల నెమ్మదీ, గంభీరమూ అయిన ఊపులో, మర్యాదలో, గౌరవంలో, ధీయుతమైన కాంక్షలో సహజంగా పుట్టిన 'నొబిలిటీ' తోస్తుంది. వందల కొలది యేళ్ళనించీ నీచమైన తలంపులు లేనటువంటి వాళ్లూ, సౌందర్యాన్నే ఆరాధించి, దేహాన్నీ, ఆత్మనీ మెరుగుపెట్టి తేజస్సుతో నింపినవాళ్ళూ మీరాని కన్నట్టున్నారు. అట్లా సుందరమైన పటంలాగ, విగ్రహంవలె, ప్రపంచాత్మానందం కోసం ఉండిపోవలసిన వాడుగాని, సామాన్య మానవుల వలె పనికీ వ్యవహారానికీ ఉపయోగపడవలసినవాడుగా కనబడడు. నాలుగు రోజుల్లో నాకు వశుడైనాడు. భోజనానికీ, నిద్రకి ఇంటికి వెడతాడు. తక్కిన సమయాలలో యెప్పుడూ నాకెదురుగా మాటలు చెపుతూ కూచుంటాడు. నేనేమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా చెవులూ, కళ్ళూ వొప్పజెప్పి ఒక్కమాటెక్కడ మాయమౌతుందో, ఒక్క చూపెక్కడ జారిపోతుందో అన్నట్టుంటాడు. త్వరలో అమీర్ నాకు జ్ఞాపకం రావడమూ, నేను విచార పడడమూ తక్కువై పోయినాయి. నా కళ్ళవెంబడి నీళ్ళచుక్క చూశాడంటే మీరా గిలగిల లాడేవాడు. నా ఆలోచనలోకి కొంచెం విచారం తోచగానే నా ముఖాకాశం మీదికి మబ్బు వొచ్చిందని, తాను గాలిననీ, వీచి మబ్బుల్ని తరిమేస్తాననీ మాటలు చెప్పి నవ్విస్తాడు. నా వొళ్ళో పడుకుని వూరికే పాటలు పాడుతూ యిటూ అటూ దొర్లుతాడు. నా కళ్ళలో పడే జుట్టుని పైకి తోస్తూ, దాంతో 'సీరియస్'గా పోట్లాడతాడు. నా నవ్వును దాచుకుంటానని అల్లరి యత్నాలు చేస్తాడు. నా వేళ్ళు బొమ్మలైనట్టు గంటలకొలది ఆడుకుంటాడు. పది వేళ్ళకీ పది ముద్దు పేర్లు పెట్టాడు. వాటిని పిలుస్తాడు. మాటాడతాడు. అతని అందమైన బుగ్గలు నిమురుతూ, అతన్ని కావలించుకుంటూ వుడికిస్తూ, నేను కాలం గడిపేదాన్ని.