22-11-2019, 10:12 AM
ఈ పర్వత రంగంమీద ఎందరు వెన్నెలలో కూడా కందగల లావణ్యంగల రాచ స్త్రీలు, ప్రియులకోసం విరహాలు పడ్డారో, ఎన్ని రహస్య సంకేతాల నేర్పరచుకున్నారో, వాళ్ళలో అదృష్టవంతులెందరు ప్రియుల్ని కలుసుకుని, శీఘ్రరహస్య గాఢాలింగనాన్ని అనుభవించారో, ఎన్ని భగ్నమైన హృదయాలో, వెన్నెలి వేడెక్కించే నిట్టూర్పులో, కన్నీళ్ళో, నవ్వులో - ఏమైనారు వాళ్ళందరూ! ఇక్కడే యీ కొండచుట్టూ వేళ్ళాడుతున్నారా? నేను అమీర్ కూడా అంతేనా, అట్లానే కాలంలో మాయమైపోతామా?
అమీర్ పెదిమెలు నా ముఖాన్ని గట్టిగా ఆఘ్రాణిస్తున్నాయి తుఫాను మొదలని వాకర్థమవుతోంది. ఇంత శాంతంగా పాల సముద్రంలో తేలే పర్వత శిఖరాలమీద నిద్రపోతున్నట్టు వున్న ఆ మధురమైన శాంతాన్నెందుకు అతను కలవరపరచడం?
"ఇంత వెన్నెలలో నిన్ను చూడాలి. నీటి చిన్ని అలమీద వలె నాట్యమాడే వెన్నెల నీ జుట్టుమీద చిన్న చిన్న చిందులు తొక్కితే చూడాలి. అలిసి నీ పక్షాల నీడలకింద నిద్రపోతాను" అని నన్ను ఒక్క నిముషంలో వివస్త్రను చేసి చూశాడు ఆనంద ముద్రిత నేత్రాలతో.
అమీర్ తెలుగుదేశంలో పుట్టి, నన్ను పట్టుకుని యీ యెడార్లలో పడివుండక, యే పారవీక దేశంలోనో పుట్టివుంటే మహాకవి అయ్యేవాడని నా ఉద్దేశ్యం.
"నల్లని గోదావరీ తరంగాలమీద చూశాను. మళ్ళీ నీ జుట్టుమీద చూస్తున్నాను, యీ వెన్నెల చిందులు" అంటాడు.