22-11-2019, 10:09 AM
అమీర్ నన్ను చప్పున వొదిలి, లేచి కూచున్నాడు. నేను దూరంగా జరిగి చీరె కోసం వెతుక్కున్నాను. ఆమె వొచ్చి అమీర్ దగ్గిరగా కూచుంది. నేను లేచి యేటి దగ్గిరికి వెళ్ళి, నీటి వొడ్డునే యిసకలో కూచున్నాను. ఏటి ప్రవాహంలో చుక్కలు పువ్వుల్లా కొట్టుకొని పోతున్నాయి. ఇసికలోంచి యీడ్చుకుంటూ పోయే గాలి చప్పుడూ, గులకరాళ్ళ మీద దొర్లే నీళ్ళ గలగలా వినబడుతున్నాయి. వొంటరిగా కూచున్న నన్ను రాత్రీ ఏరూ గుర్తుపట్టాయి. నా ముందరి పెద్ద ఆకాశం. విస్తీర్ణ మైదానం చీకట్లో ఆ మూల ప్రేమించుకునే వాళ్ళిద్దరూ-అంతా ఈశ్వరుడి సౌందర్యాన్ని నాకు దగ్గిరగా తీసుకొచ్చాయి. నా హృదయం ఆనందంతో నిండింది. అమీర్ కోసం నేను ఆ నిమిషాన చేసిన త్యాగం పరమేశ్వరుడి కరుణని నామీద వర్షింప చేసిందేమో అన్నంత ఔచిత్యాన్ని కలిగించింది. నా కింకేం కావాలి లోకంలో! నా ప్రేమని, నా గతిని, నా ఆనందాన్ని తలుచుకున్నన్నాళ్ళు నా హృదయం మండి అమీర్ని తలుచుకున్నప్పుడల్లా ద్వేషంతో వుడికి, బాధతో తపించాను. కాని ఎప్పుడు నా స్వంతసౌఖ్యాన్ని, స్వంత బాధ్యతని మరిచి అమీర్ ఆనందంతో నా జీవిత సమస్యల్ని ఐక్యం చేశానో, ఎప్పటినించి నా జీవితోద్దేశ్యం అతని ఆనందానికి త్యాగమేనని నిశ్చయించుకున్నానో ఆ నిముషాన్నించి ఆ కోపమే ద్వేషమే అమృతంగా, మాధుర్యంగా మారి నన్ను దివ్య ప్రేమానుభవంలో ఓలలాడించింది. ఆ యిద్దర్నీ అక్కడ, నాచోట, నా మైదానంలో నా భుజమానుకున్న చోటనే ఆమె భుజం.