22-11-2019, 10:04 AM
అని వెళ్ళిబోతున్నాడు. చిరునవ్వుతో అతనివంక చూస్తూ అతని భుజాలమీద చేతులువేసి, దగ్గిరికి వొంగి, నా కళ్ళల్లో మార్దవత్వాన్ని కల్పించి "నాతో చెప్పవా?" అన్నాను సొగసుగా.
తడబడ్డాడు. "ఏంలేదు ఏంలేదు" అని మెల్లిగా తనలో తను అనుకున్నాడు. అతని గడ్డంకింద చెయ్యేసి కళ్ళల్లోకి చూస్తూ "నాతో చెప్పాలి. నన్ను చూస్తే నీకెందుకు విరోధం? నేనేం చేశాను? నాకేదో ఆపద కలిగిస్తున్నావు. నా అమీర్ మనసుని పాడు చేస్తున్నావు. ఇంత మంచివాడివలె కనబడుతున్నావే....ఇంత అందంగా వున్నావే....నువ్వు ఇంకోళ్ళని, దిక్కులేని స్త్రీలని క్షోభపెట్టడం న్యాయమేనా? నీకే అక్క వుంటే యిట్లా యేడిపిస్తావా?"
నా కళ్ళు నీళ్ళతో నిండాయి.
"నేనేం చేశాను?" అన్నాడు మెల్లిగా.
"ఏం చెయ్యకపోతే, చెప్పు."
అమీర్ రహస్యం యింకొకరికి చెపుతున్నానే అని భయం ఒక మూల. నా కళ్ళు చూసి భరించలేకపోవడం ఒక మూల. కదిలే నీళ్ళలో కాంతి ప్రతిఫలిస్తున్నట్టుంది అతని మొహం. కాని అమీరే జయించాడు. మాట్లాడక తప్పించుకోవాలని చూస్తున్నాడు. అతని కళ్ళలో సౌందర్యారాధన నాకు కనబడ్డది గావును, జయిస్తానని రూఢిగా తేలింది.