22-11-2019, 09:36 AM
నా నడుం వొంపుల్ని చూస్తే మా యేరు చప్పున వొంగి తిరిగినచోట కలవరపడే ప్రవాహపు నునుపు తోస్తుందిట. నా మెడమీద రేఖలు చూస్తే సోమరి అలలమీద మెత్తని యెండ ప్రతిఫలించి మెల్లిగా పైకి ప్రాకే కాంతి గీతలు కనపడతాయట.
అలా అంటూ అంటూ చప్పున గోదావరి మీద లేచే ఎండాకాలపు తుఫానువలె విజృంభించి నన్ను కావలించుకుని, వూయించి, తిప్పేసి అలవ కొడతాడు. ఒక్కక్కప్పుడు అతను నన్ను విరిచేస్తాడేమో, తినేస్తాడేమో అన్నంత భయమేసేది. నా మొహాన్ని ఆ వెన్నెట్లో ముద్దు పెట్టుకున్నాడంటే, నా వూపిరి ఆగి, కళ్ళు తిరిగి చెమటలు పోసేవి. నన్ను అదుముకుని, యింకా అదుముకుని, ఇంకా తనలో నన్ను కలిపేసుకోవాలని అతను పడే బాధని చూస్తే నేను బతకడమే ఇతనికి ఇష్టంలేదా? ఆ కళ్ళలో వెలిగేది ద్వేషం కాదా అనిపించేది. తన పెదవులతో తన చేతులతో నా నున్నటి శరీరాన్ని వొత్తెయ్యడం, నలిపెయ్యడం, తన కాళ్ళతో నా కాళ్ళని మెలిపెట్టి విరిచెయ్యడం చూస్తే, యితనికి సౌందర్యం విరోధమా, దాన్ని ధ్వంసం చెయ్యాలని చూస్తున్నాడా అని అనుమానపడతాను.