22-11-2019, 09:35 AM
ఏదో ఆనందం, యేమిటో చెయ్యమని పురిగొల్పుతుంది. కూచుని వూరికేనా లేక నవ్వుతో పరిగెత్తడం, తప్పించుకోవడం, దాక్కోడం, అందినా అందుకోనట్టూ అందనట్టూ నటించడం, అంతా అనుభవం కలిగినా, ఇష్టంలేనట్టూ, కొత్తవారైనట్టు నటించడం, అలిసి కిందపడగానే రెండోవారు కూడా అక్కడే పడి.... మనుషుల కుండే బద్ధకాలూ, చికాకులూ మర్యాదలూ పోయి అందమైన మృగాలమల్లే, పిల్లి పిల్లలవలె ఆడుకునే వాళ్ళం.
మొదట నా సౌందర్య బాధని పొందినవాడు అమీర్. ప్రపంచమంతా వెతికి నన్నేరుకున్నట్టున్నాడు. ఆనాటి ఉదయం ఆఫీసు గదిలో నా వీపు చూడగానే నేనే తనకి కావాలని, నేను తప్ప ఎవ్వరు అక్కర్లేదనిపించిందని చెప్పాడు.
ఆ రాత్రులు ఈ భూమి మీదేనా, యే ఇంద్రజాల లోకాలలో నన్నాననా, అదంతా కలా, భ్రాంతా, ఈ ప్రపంచమే యింత అందంగా వుండగలదా అనిపించేది నాకు. కాని అమీర్ మాత్రం అమితమైన బాధపడేవాడు. ఒక్కొక్కప్పుడు జాలి వేసేది. భయమేసేది. కాని ఆ బాధే తన ఆనందమంటాడు. ఏమిటంటే- ఆనందం చూసి వెర్రెత్తిపోతాడు అతడు. ఒక్క నిమిషం నా వొంటిమీద బట్టని నిలవనియ్యడు. నా రెవికలన్నీ ఒక్క పదిరోజులలో చించేశాడు. మళ్ళీ కుట్టుకోలేదు. ఏం లాభం? చీరెలు చిరిగిపోయినాయి. కాని ఏమైతేనేం? చీరెలు చూస్తాడా అమీర్.