22-11-2019, 09:34 AM
ప్రేమ చూపుకునేవి, నిశ్చలలైన మధ్యాహ్నం కునుకుపట్టే వేళ ఆప్టిలు పలుకుతో పాడుతో వుంటే మనుషులదికాని గొప్ప సంతోషం కలిగి దాన్ని భరించలేక అమీర్ని కావలించుకుంటాను....చూడు అర్ధరాత్రి చిన్న వాయువులమీద నువ్వెన్నడూ వినని కొత్తపాట చెవిని తాకితే, యేటి నీటిలోంచి నువ్వెన్నడూ యెరుగని యేదో కొండ గడ్డివేళ్ళ వాసన వస్తే, యెలాగో యేదో మరచిపోయిన సుందరానుభవాలు మనసుకి తట్టవా? అలా స్ఫురించేది ఆశ్చర్యంగా, ఆ పక్షి రెక్కల్లోంచి చిన్న యీకె గాలిలో సోమరిగా తేలుతూ వచ్చి వాలేది నామీద. దాని పాటలతోకూడా ఎక్కడో, ఎప్పుడో, ఏ జన్మలోనో అనుభవించి, అధికానందం పొందిన విషయాలు అలా బాధపెడతాయి గావును మనసుని! ఆ పిట్టలన్నీ నాకు గుర్తు. ప్రతి మధ్యాహ్నమూ యెదురు చూసేదాన్ని. ఏదో బంధుత్వం నాకూ వాటికీ వున్నట్లే తోచేది.
అన్ని దిక్కులా రాత్రి కమ్ముకున్నప్పుడు, యీదురు గాలిలో నిప్పు ముట్టించి మళ్ళీ బియ్యం వండేదాన్ని. అంత చీకట్లోనూ, గాలిలో వూగే- వొకటే మంట వెలిగించడం యెంతో గంభీరంగా వుంటుంది. ఇద్దరి మొహాలమీదా వెలుగు చీకట్లు వుయ్యాల లూగుతూ, ఆ పొయ్యి దగ్గర కూచుని వుడికే అన్నపు సంగీతానికి ఆకలితో వుడికే పొట్టలు గంతులేస్తో.... వొంటరిగా లోకానికంతా చక్రవర్తులవలె కూచుంటాము. ఎందుకో విశాలమైన మైదానంలో రాత్రులు ఆకాశంకింద మంట, యేవో యెరగని భావాల్ని కలిగిస్తుంది.