22-11-2019, 09:26 AM
ఇంక బతకడానికి వీలులేదనీ ఆకలేసి మధ్య మధ్య ఆనందానికి అవాంతరంగా మనసు మళ్ళించుకుంటానే గాని, ఇంక యింటిదగ్గరవలె ఈ కూరలో ఉప్పు సరిపోయిందా, ఈ చారులో పోపు చాలిందా అనే ఆలోచనలు వుంటాయా? పచ్చడిలో యిసక పడ్డదనీ, అన్నం చిమిడిందనీ, పులుసు ఉడకలేదనీ తిట్లూ - లేచిపోవడాలూ - విస్తరి మొహాన కొట్టడాలూ పవిత్రమైన మానసిక ప్రేమగల ఆదర్శ సంసారాల్లో జరుగుతాయిగాని, పశువులవలె కామంతో పొర్లాడే గుడిసెల్లో జరగనే జరగవు! మానసిక ప్రేమగనక- దాంట్లో వుప్పెక్కువైందనీ, కారమెక్కువయిందనీ, తగాదా! ఈ మానసిక ప్రేమమీద నాకెందుకంటే అంతకోపం - మామయ్య తీసుకొచ్చాడు దాన్ని వాళ్ళ వూరినించి, దాని సంగతి చెపుతా తరవాత. కామంతో పడి కళ్ళు మూసుకుని నరకంలోకి జారేవాళ్ళకి ఈ విచక్షణలన్నీ యెందుకుంటాయి! గంజే పరమాన్నంగా వుంటుంది. అది మళ్ళీ ప్రేమలక్షణమే నంటారు కొందరు పూర్వులు. కాని మామయ్యవంటి విమర్శకులు మాత్రం దాన్ని పశుకామమే నంటారు! ఎందుకు? వారి నీతి హృదయాలకి నెప్పి కలిగిస్తోంది! నావంటి వారి పాడుజీవిత చరిత్రలనీ చదివీ, వినీ వారి భార్యలూ, కూతుళ్ళూ లేచిపోతే యెట్లా?