22-11-2019, 09:25 AM
లేకుండా చిన్నప్పుడు నవ్వూ, అర్థంలేని ఆనందం కలిగి ఇంకా ఏంచేద్దాం, తిరుగుదాం, గంతులేద్దాం, నవ్వుదాం అనిపించేదే! అట్లా వుండేది గంట గంటా నాకు. వూరికీ, మాకూ మధ్య పెద్దచింతతోట వుంది; ఆ గుడిశ తప్ప యింక చుట్టూ ఏమీలేవు. ఎటుచూసినా నీలపు కొండల్లోనూ, ఆకాశంలోనూ అంతమయ్యే పెద్ద మైదానం. ఒక్క పెద్ద కొండ మాత్రం మా యింటికి అరమైలు దూరంలో వుంది. దానిమీద శిథిలమైన కోట ఒకటుంది. మా గుడిశ పక్కన చిన్న యేరు ఎప్పుడూ తొరగా పరిగెత్తుతూ వుంటుంది. దాన్నిచూస్తే, ఎవ్వరితో మాట్లాడక ఇంట్లో పనిమీద యెప్పుడూ తిరిగే మా అమ్మ జ్ఞాపకం వొచ్చేది.
ఆ దేశంలో ఆకాశం ఎప్పుడూ నీలం కారుతున్నట్టే వుంటుంది. వాన కురిసినా శుభ్రమైన కొండల్నీ, నేలనీ ఇంకా శుభ్రంగా కడుగుతుంది. టపటపమని చినుకులుపడితే, కడుపులో ఉన్న స్త్రీవలె నా యేరు నిండి పోయేది. కొండలన్నీ మేఘాల్ని కప్పుకుని తెల్లనయేవి.
మొదట కుండల్లో వండడం నెయ్యీ కూరలూ లేకుండా తినడం, పరదాపేసుకుని ఆరుబైట పడుకోవడం కొత్తగా కష్టంగా వుండేది. అప్పుడప్పుడు పిచ్చి పట్టుదలలు కూడా పట్టేదాన్ని, కాని కష్టపడ్డానికీ, కొత్త పడడానికీ వ్యవధి వుంటేనా? అమీర్ వుండనిస్తేనా? అయినప్పటికి నాకు చిన్నప్పటి అలవాట్లు వదలడం ఎంతో కష్టమయింది. వంట చేసేప్పుడు అమీరావేపు వొస్తే అన్నీ పారేసి దూరంగా పోయినాను.