21-11-2019, 05:38 PM
అపాయమంటే ఏమిటో అర్థంకాని మనిషి అతనొకడు కనపడ్డాడు నాకు. అదేమి అదృష్టమో ఆ అపాయం అతన్ని చూసి తొలగిపోయేది. అతని నిర్లక్ష్యం చూస్తే ఒకప్పుడు అతని పాదాల్ని నా ప్రాణాలతో కడగాలనిపిస్తుంది. ఒకప్పుడు మీదపడి చీల్చి చంపెయ్యాలనిపించేది.
కొంత సేపయిం తర్వాత స్వస్థపడి నెమ్మదిగా మాట్లాడుకున్నాము. ఇద్దరికీ దగ్గిరిగా బల్లమీద కూచుని, మామిడిచెట్టు పూతలోంచి మిణుగురు పురుగులూ ఆర్ద్రా కలిసి మెరుస్తున్నాయి. చలిగాలి మమ్మల్నప్పుడప్పుడు పలకరిస్తోంది. కాలవలో కప్ప మూలుగుతోంది. రోడ్డుమీద లాంతరు వెలుతురు కొంచెంగా బీరువా మీదపడి, ఆ లావాటి పుస్తకాల మీది బంగారపు అక్షరాలు తమాషాగా మెరుస్తున్నాయి.
'ఎక్కడికి తీసికెడతావు నన్ను.'
'నిజాం?'
'వెళ్ళి?'
'హాయిగా వుందాం?
'అందరూ వూరుకుంటారా?'
'తెలిస్తే కద! వెళ్ళిపోయాక తెలిస్తే మాత్రం యేం చేస్తారు?'
'అక్కడి వాళ్ళూ!'