Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance భర్తృహరి శృంగార శతకము
#9
అలంకార వల్లి – చంద్రవర్ణుడు – 07

అప్పుడు సంభవించిందొక అద్భుతం!

ఆకాశం నుండి దేవరధం రెక్కలల్లార్చుతూ దిగి వచ్చింది. బ్రహ్మ రాక్షసుడు దివ్య పురుషుడిగా మారిపోయాడు. చంద్రవర్ణుడు సంభ్రమంగా చూస్తూన్నాడు.

ఆ దివ్యపురుషుడు చంద్రవర్ణుడు వైపు తిరిగి "ప్రియ శిష్యా, చంద్రవర్ణా! నేనొక యక్షుడను. సకల శాస్త్రాలూ నేర్చిన వాణ్ణి. అయితే దురదృష్టవ శాత్తూ ఆ పాండిత్యం నాలో అహంకారాన్ని పెంచింది. విద్యా గర్వాంధుడినై మహర్షులని అగౌరవించాను. కోపోద్రిక్తులై వారు, నన్ను ‘రాక్షసుడవు కమ్మని’ శపించారు. క్షమించమని వారి పాదాల బడి ప్రార్దించగా, దయతో వాళ్ళు నాకు శాపవిమోచనం అనుగ్రహించారు. యోగ్యుడైన శిష్యుడికి విద్యాదానం చెయ్యవలసిందిగా చెప్పారు. ఆనాటి నుండి, ఈ రావి చెట్టుపై నివసిస్తూ, తగిన శిష్యుని కోసం ఎదురు చూస్తూ, తపమాచరిస్తూ కాలం నడుపుతున్నాను.

నా భాగ్యమా అన్నట్లు, దైవమే అనుగ్రహించి నిన్ను నా వద్దకు పంపించాడు. జ్ఞానతృష్ణతో నీవు నన్ను వెదుక్కుంటూ వచ్చావు. వినయ విధేయలతో విద్యార్జన చేశావు. నీ కారణంగా ఇన్నాళ్ళకు శాప విముక్తుడ నైనాను.

నాయనా చంద్రవర్ణా! నీకివే నా ఆశీస్సులు. జీవితంలో శాంతి సంతోషాలు, సకల భాగ్యాలూ పొందెదవు గాక! నేనిదే నా లోకమునకు బోవుచున్నాను. దేవుడు నిన్ను అనుగ్రహించు గాక!" అంటూ, అప్పటి వరకూ బ్రహ్మరాక్షసుడులా ఉన్న యక్షుడు, చంద్రవర్ణుడి తలపై చేయి ఉంచి దీవించాడు.

చంద్రవర్ణుడు గురువుకి వినయంగా నమస్కరించి, సంతోషమూ, ఎడబాటు దుఃఖమూ ముప్పిరిగొనగా వీడ్కొలు పలికాడు. దివ్యవిమానం ఆకసాన అంతర్హితమైంది. చంద్రవర్ణుడు అప్పటి వరకూ గురువు చెప్పిన శ్లోకాలు వ్రాసి ఉన్న రావి ఆకులని మూటగట్టుకున్నాడు. ఇక తిరుగుప్రయాణమైనాడు. మార్గవశాన అతడు కన్యాపురం అనే పట్టణాన్ని చేరాడు. అప్పటికే అతడు బాగా అలిసిపోయాడు. యక్షుడు చెప్పిన మంత్ర ప్రభావం పూర్తి కావస్తుండటంతో, అతణ్ణి ఆకలి, దప్పిక, నిద్ర ముప్పిరిగొన్నాయి.

అప్పటికి అతడొక ధనికుల ఇంటి ముందరికి చేరాడు. ఆ ఇంటి గుమ్మం అందమైన దీపాలతో, తోరణాలతో అలంకరించి ఉంది. ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు పరచి ఉన్నాయి. అదెవరో సదాచార సంపన్నులైన బ్రాహ్మణుల ఇల్లయి ఉంటుందనుకున్నాడు చంద్రవర్ణుడు. ఆ ఇంటి అరుగుపై జారగిలబడ్డాడు. అప్పటికే అతణ్ణి ఆక్రమించిన నిస్సత్తువ కారణంగా క్షణాలలో స్పృహ కోల్ఫోయాడు.

అతడనుకున్నట్లు అది బ్రాహ్మణుల ఇల్లు కాదు. [ఆ రోజులలో భారత దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఆచరణలో ఉండేది. సమాజంలో నాలుగే వర్గాలుండేవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర!] ఆ భవంతి రాజ నర్తకియైన ఒక వేశ్యది. ఆమె పేరు అలంకార వల్లి. [ఆమె పేరుకు అర్ధం అలంకారం కొరకు ఉపయోగించు దండ లేదా లత అని!] అలంకార వల్లి, అందమైన లత వంటి శరీర సౌందర్యం కలది. ఒంపు సొంపులతో కూడిన ఎంత అందమైన దేహము కలదో, అంతకంటే సౌకుమార్యమైన మనస్సు కలది. నర్తకిగా దైవభక్తీ, ధర్మనిరతీ గలది. తన వృత్తి ధర్మం పాటించడంలో నీతి నియమాలు పాటించునట్టిది.

అప్పటికి రాత్రియైనది. దేవాలయములో నాట్యం వంటి పనులన్నీ ముగించుకొని, అలంకార వల్లి ఇల్లు చేరవచ్చింది. చీకటి మాటున ఆమె తన ఇంటి అరుగుపై ఎవరో ఒరిగి ఉండటాన్ని గమనించింది. "ఎవరూ?" అంటూ తట్టి లేప ప్రయత్నించింది గానీ, అరుగుపై బడి ఉన్న వ్యక్తి పలక లేదు, ఉలకలేదు. అంతట ఆమె ఇంటిలోనికి బోయి పెద్ద దీపము తెచ్చి చూసినది.
చూడగా ఏమున్నది?

ఇంటి అరుగుపై ఆదమరిచి పడి ఉన్న అందమైన యువకుడు[చంద్రవర్ణుడు]. రావి ఆకుల మూట అతడి తలక్రింద ఉన్నది. అలంకార వల్లి దాస దాసీ జనాన్ని పిలిచి, అతణ్ణి లోపలికి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. చంద్రబింబము వంటి ముఖము, చంద్రకాంతి వంటి దేహకాంతి గల చంద్రవర్ణుని చూసి ఆమె ఆశ్చర్యాన్ని పొందింది. అతడిపై ఆమెకు మోహము, ఆకర్షణా కలిగాయి.

అతడి వివరాల కోసమై మూట విప్పి చూసింది. రావి ఆకులపై సంస్కృత శ్లోకాలున్నాయి. అతడెవ్వరో గొప్ప పండితుడై ఉంటాడని తోచింది. ఆమెకతడిపై ఎంతో ప్రేమ కలిగింది. వెంటనే అలంకార వల్లి వైద్యులని రప్పించింది. వాళ్ళతణ్ణి క్షుణ్ణంగా పరీక్షించి "ఓ అలంకార వల్లీ! ఈ యువకుడు ఆరునెలలు నుండి నిద్రాహారాలు లేక యున్నాడు. కాబట్టే ఈ విధముగా స్పృహ కోల్పోయినాడు. ఇతడి నిట్లే వదలి వైచిన మరణించట తధ్యం" అన్నారు.

ఇది విని అలంకార వల్లి మిగుల దిగులు చెందింది. ఆందోళన నిండిన హృదయంతో "అయ్యా! మీరు గొప్ప వైద్యులు! శాస్త్రములు తెలిసిన వారు. ఇతడి నెట్లు కాపాడ గలము? దయ చేసి చెప్పండి" అన్నది.

వైద్యులు "ప్రతి దినమునా నీవు ఒక పడి బియ్యమును వండి, ఒక పడి ఆవు నేతితో కలిపి, మెత్తని లేహ్యము వలె చేయుము. ఆ లేహ్యముతో ఈతని దేహమును తల నుండి కాలి వేళ్ళ వరకూ మర్ధనా చేయవలయును. దినమున కిట్లు రెండు మారులు చేయవలెను. నెయ్యి, అన్నముల సారము, సూక్ష్మమైన ఇతడి దేహ రంధ్రములు ద్వారా నరములకు చేరి, ఇతడికి శక్తి రాగలదు. ఆ విధంగా అతడి ప్రాణాలు కాపాడవచ్చును. కొన్ని దినములు లిట్లు చేసిన ఇతడు నిద్ర నుండి లేచినట్లుగా స్పృహ చెందగలడు" అన్నారు. [పడి అన్నది ఇప్పటికీ గ్రామీణుల్లో ఆదరణ ఉన్న కొలమానం. ఒక పడి అంటే ఒకటిన్నర కిలో గ్రాములు.]

అలంకార వల్లి ఎంతో సంతోషంతో వైద్యులకు కృతజ్ఞతలు తెల్పింది. విలువైన బహుమతులూ ఇచ్చింది. దాసీజనుల చేత సిద్దము చేయించిన నేయి అన్నముల లేహ్యముతో, చంద్రవర్ణుడి దేహానికి మర్ధనా చేస్తూ, స్వయంగా తానే దగ్గరుండి సేవలు చేసింది. ఈ విధంగా ఎనిమిది రోజులు గడిచాయి.

~~~~~~~~~
Like Reply


Messages In This Thread
RE: భట్టి విక్రమాదిత్యుల కథలు - by rraji1 - 21-11-2019, 04:20 PM



Users browsing this thread: 1 Guest(s)