Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance భర్తృహరి శృంగార శతకము
#5
శరవణ భట్టు మంచె కథ!  – 03

అడవిలో భోజరాజు, అతడి పరివారమూ వారం రోజుల పాటు వేట కొనసాగించారు. అడవిలో కౄర, వన్యమృగాల సంఖ్య నియంత్రణలోకి వచ్చిందని రాజుకు తోచింది. వేట ముగించాలని నిర్ణయించాడు. మరునాటి ఉదయాన్నే.... భోజరాజు, తన పరివారంతో కలిసి తన రాజధానియైన ధారా నగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు. వేటాడి సంపాదించిన దుప్పికొమ్ములు, పులిచర్మాలు వంటి వస్తువులని గుర్రాలపై వేశారు. ప్రయాణం ప్రారంభించారు. ఆ రోజున ఎండ మండిపోతోంది. నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నట్లుంది. వారం రోజులుగా వేటలో అలిసిపోయిన భోజరాజు, సూర్యతాపానికి మరింత అలసటకి గురై, గుర్రపు స్వారి మాని, పల్లకిలో ప్రయాణించసాగాడు.

అతడి పరివారంలోని సైనికులు, యువకులూ కూడా ఎండ బడలికల కారణంగా నెమ్మదిగా నడవసాగారు. దారిలో వాళ్ళు ఓ పొలం ప్రక్కగా వెళ్ళసాగారు. పచ్చని పైరుతో ఆ పొలం నిండుగా ఉంది. అది శరవణ భట్టు అనే బ్రాహ్మణుడది. [సాధారణంగా ‘శరవణ’ అన్న పేరు తమిళులకు ఉంటుంది. భోజరాజు పరిపాలించిన రాజ్యం, మధ్య భారతదేశంలో, తమిళనాడు దాకా విస్తరించి ఉందేమో ‘నిజమైన చరిత్ర’ తెలిసిన చరిత్రకారులకి తెలియాలి.] శరవణ భట్టు తన పొలంలో పంటని జంతువుల బారి నుండి, పక్షుల బారి నుండి కాపాడుకోవటానికి, పొలం మధ్య ఎత్తుగా మంచె కట్టుకున్నాడు. అదీగాక, మంచె మీద కూర్చుని పొలానికి కావలి కాయటం సులభం కూడాను.

భోజరాజు, పరివారమూ పొలం ప్రక్కగా సాగుపోతున్నప్పుడు, శరవణ భట్టు ఆ మంచె మీదే ఉన్నాడు. అతడు వారిని చూసి "ఓ యన్నలారా! చూస్తే మీరు దూరం నుండి వస్తున్నట్లున్నారు. అలిసిపోయి ఉన్నారు. ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొండి. ఈ పొలం గట్టున నేనో చింత చెట్టు పెంచాను. ఆ చెట్టు నీడలో రవ్వంత సేపు విశ్రమించండి. ప్రక్కనే దిగుడు బావి ఉన్నది. అందులో నీళ్ళు చల్లగా, తియ్యగా ఉంటాయి. చూస్తే మీరంతా బాగా ఆకలితోనూ, దాహంతోనూ ఉన్నట్లుగా తోస్తోంది. మా బావి నుండి చల్లని నీటిని తాగండి. పొలంలో నేను మొక్కజొన్న పంట వేసాను. పైరు ఏపుగా ఎదిగి కంకి బట్టి ఉంది. కంకులు పాలుబట్టి ఉన్నాయి. కడుపునిండా తినండి. మొక్కజొన్న కంకులు మీకు నచ్చకపోతే.... చాళ్ళ మధ్యన దోసపాదులు పెంచాను. దోస కాయలు దోరగా పండి, పగుళ్ళు వారి ఉన్నాయి. పనసతొనల్లా తీయగా, సువాసన వీనుతున్నాయి. ఆకలి దప్పలూ అలసటా, తీర్చుకుని, అప్పుడు పోదురు గానీ, కాస్సేపు ఆగండి" అన్నాడు. భోజరాజు,

అతడి పరివారమూ ఈ మాటలు విని ఎంతో సంతోషించారు. తన రాజ్యంలోని సామాన్య రైతు సైతం, ఇంతటి వితరణ గుణం కలిగి ఉన్నందుకు రాజుకు సంతృప్తి కలిగింది. అతడు తన పరివారానికి, మొక్కజొన్న కంకులూ, దోసకాయలూ తినడానికి, చేలోని బావినీరు తాగటానికీ అనుమతినిచ్చాడు. ఉత్సాహంగా సైనికులూ, యువకులూ, పల్లకీ బోయిలూ పొలంలో జొరబడి ఆకలిదప్పలు తీర్చుకోసాగారు. కొన్ని నిముషాలు గడిచాయి. ఇంతలో శరవణ భట్టు మంచె దిగి క్రిందికొచ్చాడు. అంతే! ఒక్కసారిగా గావుకేక పెట్టాడు. "ఏయ్! ఎవరయ్యా మీరు? ఏం చేస్తున్నారు? నా పంటంతా ఎందుకు నాశనం చేస్తున్నారు? చూడబోతే రాజుగారి సైనికుల్లా ఉన్నారు! దొంగల్లా పొలంలో చొరబడి పంటంతా తినేస్తున్నారే!? మిమ్మల్ని కట్టడి చేసేందుకు గానీ, శిక్షించేందుకు గానీ ఎవరూ లేరా? నాలాంటి అమాయక రైతులకి, ఇంకెవరికైనా కష్టం కలిగిస్తే, రాజు గారి దగ్గరికెళ్ళి న్యాయం చెయ్యమని మొరపెట్టుకుంటాము. అలాంటిది... రాజూ, అతడి పరివారమే, నాలాంటి వాడికి అన్యాయం చేస్తే, ఇంకెవరి దగ్గరి కెళ్ళి మొత్తుకోవాలి? పేద బ్రాహ్మణుడి పంట దోచుకునే పాపానికి ఒడిగట్టారు. మిమ్మల్ని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు" అంటూ శాపనార్దాలు పెడుతూ అరవసాగాడు.

శరవణ భట్టు మాటలకి భోజరాజు పరివారం దిగ్ర్భమ చెందారు. విషణ్ణ వదనాలతో నిలబడిపోయారు. వారి ముఖాల్లో, కొంత అయోమయం, కొంత అపరాధ భావన, కలగలసి పోయాయి. పొలం నుండి బయటకి వచ్చేసారు. ఇంతలో శరవణ భట్టు మళ్ళీ మంచె పైకి ఎక్కాడు. వెళ్ళుపోతున్న సైనికుల్ని చూసి "అయ్యో భగవంతుడా! అన్నలారా ఆగండి! ఎందుకని వెళ్ళిపోతున్నారు? మీ ఆకలి తీర్చుకోకుండానే పొలం వీడి పోతున్నారేం? నా ఆతిధ్యంలో ఏమైనా లోపమున్నదా? ప్రియమైన సోదరులారా! రండి. దయచేసి వెళ్ళకండి! ఆకలీ దాహమూ తీర్చుకొండి. విశ్రాంతి తీసుకోండి. ఎండవేడి తగ్గాక, తిరిగి ప్రయాణం ప్రారంభిద్దురు గానీ!" అన్నాడు ఎంతో వేడికోలుగా! పూర్తిగా విభిన్నమైన, విచిత్రమైన ఈ రకపు ప్రవర్తనకు, శరవణ భట్టుని చూసి, భోజరాజు అతడి పరివారమూ నివ్వెర పోయారు. భోజరాజు తన ప్రధానమంత్రిని పిలిచి "బుద్దిసాగారా! గమనించావా!? ఈ బ్రాహ్మణుని ప్రవర్తన కడు వింతగా నున్నది. మంచె మీద ఉన్నప్పుడు అతడి మాటతీరు ఎంత దయాపూర్ణమై ప్రేమపూరితమై ఉన్నది. మంచె దిగినంతనే కర్ణ కఠోరమైన మాటలాడుచున్నాడు. ముందటి ప్రవర్తనకు, దీనికీ పొంతనే లేదు. దీని కేదో ప్రబల కారణం ఉండి ఉండాలి" అన్నాడు. బుద్ది సాగరుడు "నిజము మహారాజా! నేనూ దీని గురించే ఆలోచించుతూ ఉన్నాను. ‘మంచె ఉన్న స్థానంలోని మట్టిలో ఏదో మహత్తు ఉండి ఉండవచ్చు’ అని నా ఊహ" అన్నాడు, సాలోచనగా! భోజరాజు "అదీ నిజమై ఉండవచ్చు. మనము ఆ రైతుతో మాట్లాడెదము గాక! అతణ్ణి వెంటనే పిలిపించండి" అన్నాడు.

ఉత్తర క్షణంలో శరవణ భట్టు భోజరాజు ఎదుట ఉన్నాడు. భోజరాజు మందహాసంతో "ఓయీ శరవణ భట్టూ! మాకు నీ పొలము పై ఆసక్తిగా ఉన్నది. నీకు ఇంతే సారవంతమైనదీ, విస్తీర్ణము గలదీ అయిన మరియొక భూమినిచ్చెదను. ఇంకనూ నీకు అయిదు గ్రామములపై పన్ను వసూలు చేసుకొను హక్కునిచ్చెదను. బదులుగా నీ పొలమును నాకు అమ్మివేయుము" అన్నాడు. శరవణ భట్టు వినమ్రతతో "మహారాజా! ఈ రాజ్యమున ఏదైనా మీ సొత్తు! అన్నిటిపైనా మీకు అధికారమున్నది. మీరు నా పొలము ఊరికినే తీసికొన్ననూ, మిమ్ములను అభ్యంతర పరచు వారెవ్వరూ లేరు. అట్టిచో మీరు నాపట్ల ఎంతో దయ చూపించుచున్నారు. మీరు ఆదర్శ ప్రభువులు! మీ ధర్మబుద్ది దేవతలకు సరితూగ గలది. నా పొలమునకు బదులుగా మీరు ఎంతో ఇచ్చుచున్నారు. నేనెంతో సంతోషముగా నా పొలమును ఈ క్షణమే మీ పరము చేయిచున్న వాడను" అన్నాడు. బుద్దిసాగరుడు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. శరవణ భట్టుకు వేరొక పొలమునూ, ఇతర బహుమతులూ ఇచ్చాడు. శరవణ భట్టు పొలంలో మంచె నిర్మించిన చోట తవ్వేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఒక మంచి ముహుర్తాన, పూజాదికాలు నిర్వహించి, తవ్వకం ప్రారంభించారు.
Like Reply


Messages In This Thread
RE: భట్టి విక్రమాదిత్యుల కథలు - by rraji1 - 21-11-2019, 03:28 PM



Users browsing this thread: 1 Guest(s)