21-11-2019, 10:07 AM
ఒకరోజు మధ్యాహ్నం 'నాతో వచ్చేయి' అన్నాడు. అదే మొదటిసారి, నాతో గొంతుకలోంచి మాట్లాడ్డం అతను. అప్పుడతని తురకల తెలుగు వింటే నాకెంత ముద్దొచ్చిందని! చిన్నపిల్ల మాట్లాడ్డానికి చేసిన ప్రయత్నంలాగే వుంది. అదివరకు తురక తెలుగు పరమ అసహ్యంగా వినపడేది. కాని ఆనాటినుంచి గొప్ప సంగీతమై నా ముసల్మాన్ తెలుగంత మధురం యింకేదీలేదు అన్పించింది. ప్రేమ-కాదు-పశుకామం-యెన్ని మార్పులు కలుగజేస్తుందో మనసులో!
అతనడిగిన ప్రశ్న నన్ను విభ్రమంలో ముంచగా తేరిపార చూస్తున్నాను. పళ్ళు బిగపట్టి తనకి కూడా వూపిరాడని అవస్థ కలిగించుకుని 'రావూ? రావూ? రాకపోతే చంపేస్తా నిన్ను' అన్నాడు. అతని కళ్ళల్లో మొదటిసారి చూశాను, భయంకరమైన ఎరుపురంగు. నన్ను తినెయ్యాలి. నన్ను చంపెయ్యాలనే ఉగ్రం-మళ్ళీ వారం క్రిందట చూశాను.
"చెపుతాను తరవాత. మళ్ళీ నువ్వు రావూ. అప్పుడు సావకాశంగా మాట్లాడాలి" అన్నాను.
మళ్ళీ వారంరోజులుదాకా వీలుకాదు ఆయన వూరికి వెళ్ళిన రాత్రి అమీర్ని రమ్మన్నాను. పదిగంటలైంది. పడక గదిలో అద్దం ముందు నుంచుని నన్ను నేను చూసుకున్నాను. చీకట్లో సిల్కు జాకెట్టు చూస్తాడా?