17-11-2019, 11:24 AM
ఇతరత్రా జాగ్రత్తలు ఇంకేమన్నా...
* అంతర్జాలంలోకి ఒకసారి ఫొటో వెళ్లిందంటే దాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యం. కాబట్టి ఏవి పెట్టవచ్చో ఏవి పెట్టకూడదో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి.
* ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నామన్న విషయాల్ని అనుక్షణం సోషల్ మీడియాలో అప్‌డేట్ చేయటం మంచిది కాదు.
* అపరిచితులతో చాటింగ్ చేయటమూ, వ్యక్తిగత వివరాలూ ఫొటోలూ షేర్ చేయడమూ ప్రమాదకరం.
* ఏ గ్యాడ్జెట్‌ను అయినా ముందు సెక్యూరిటీ సెట్టింగ్స్ అన్నీ సరిగ్గా తెలుసుకున్నాకే ఉపయోగించాలి.
* ఫోన్ స్క్రీన్ లాక్ పెట్టుకోవాలి. అవసరమైన ప్రతిచోటా బలమైన పాస్‌వర్డులు పెట్టుకుని ఆర్నెల్లకోసారి తప్పనిసరిగా మార్చుకోవాలి. అవి కుటుంబసభ్యుల పేర్లూ పుట్టిన్రోజులూ కాకూడదు.
* ఇంట్లో వాడే డెస్క్‌టాప్ సెర్చ్ ఇంజిన్‌లో ‘సేఫ్ సెర్చ్’ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆఫీసులో ఒకే కంప్యూటర్‌ని ఎక్కువ మంది వాడాల్సి వస్తే బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు తొలగించాలి.
* ఈమెయిల్‌లో వచ్చిన లింకుల్ని క్లిక్ చేయకుండా కాపీ చేసుకుని అడ్రస్‌బార్‌లో పేస్ట్ చేసి తెరవాలి.
* ఆప్స్ ఏవీ వినియోగదారులకు మెయిల్, మెసేజ్, ఫోన్లు... చేయవు. వాటి పేరుతో బహుమతి వచ్చిందని మెయిలో ఫోనో వచ్చిందంటే అది మోసమే.
* వెబ్ క్యామ్ ఉపయోగించగానే కనెక్షన్ తీసేయాలి. కెమెరాని మూసెయ్యాలి. కనెక్ట్ అయివుంటే మన ప్రమేయం లేకుండా కెమెరాని ఆన్ చేసి మన కదలికల్ని రికార్డు చేసే ఆప్స్ ఎన్నో ఉన్నాయి.
* కంప్యూటర్ అయినా, ఫోన్ అయినా ఎప్పటికప్పుడు సమాచారాన్ని హార్డ్‌డిస్కులోకి కానీ, గూగుల్ డ్రైవ్‌లోకి కానీ బ్యాకప్ చేసుకుని గ్యాడ్జెట్‌లోనుంచి తీసేయాలి.
* ఫోన్ చార్జింగ్ పోర్టుల ద్వారా కూడా సమాచారాన్ని దొంగిలిస్తారు. వ్యక్తిగత చార్జరు వినియోగించాలి. దొరికిన పెన్‌డ్రైవ్‌లు వాడకూడదు.
* ఫోను పోయినప్పుడు వెంటనే సిమ్ లాక్ చేయించి, సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయాలి.
* * * * *
ఇంట్లో దొంగలు పడకుండా ఇంటికి తాళం వేస్తాం. అది సరిగ్గా పడిందో లేదోనని ఒకటికి రెండుసార్లు లాగి చూస్తాం.
అలాగే అంతర్జాల వేదికపై ఉండే ఎంతో విలువైన మన వ్యక్తిగత సమాచారాన్నీ నేరగాళ్ల నుంచి రక్షించుకోవాలి.
అందుకు వేసే తాళాలే ఈ జాగ్రత్తలన్నీ!