Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మరాత
#1
బ్రహ్మరాత :::

అనగనగా ఓ  ముని చాలా ప్రతిభావంతుడు. సకలశాస్త్రాలు, విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి. 
వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు. ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు. 
ఇదిలావుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. 
కాసేపట్లో లోపలి నుండి చంటిబిడ్డల ఏడుపులు వినవచ్చాయి. గురుపత్ని కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అనరి వినమ్రపూరితంగా అడిగాడు. 
బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు - నాయనా! ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. 
ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువుగారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది. 
ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా? అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. దానికితోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు. 
వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. 
ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. 
వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా! అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ, నువ్వు బాధపడకు. ఇప్పటినుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా! ఇకనుండి నువ్వు ఎలా చెపితే అలానే చేస్తాను'' అన్నాడు శంకరుడు. 
ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు. 
తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా! ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ, నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు. 
ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు. 
ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు. 
వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది.

 అన్నయ్యా! నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ! ఊరుకోమ్మా! ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. 
ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా! ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు. 

ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు.

Source:Internet/whats'up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)