Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

నేను చదివిన - పెళ్ళి చూపులు

ముద్ద బంతి పూలు


[Image: Picture1.png]

రచన: యశోద గొట్టిపర్తి


అందమైన పరికిణీ లో కాళ్ళకు వెండి పట్టీల శబ్దంతో, బుట్ట బొమ్మలా పరుగులు తీస్తూ, “నాకు ఒక బొమ్మ చేసియ్యవా? నానమ్మ!” అంటూ పచ్చితాటాకును తెచ్చి అమ్మమ్మ చేతిలో పెట్టింది మంజు. 


“ఒకటేమిటి? చాలా బొమ్మలు చేసిస్తాను. వాటికి పట్టుచీరలు తయారు చేయాలి. మేర అతను ( బట్టలు కుట్టే వాళ్ళు)ఇంటికి వెళ్ళి కత్తిరించి మిగిలిన కొత్త బట్టలు తెస్తే చీరలు చేస్తాను”. అక్కడికి వచ్చిన పెళ్ళికూతురు అమ్మమ్మ, ప్రక్కన కూర్చుని, తన చిన్నతనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంది. 


“అమ్మమ్మ.. నేను కూడా.. ఆడుకుంటాను నాకో బొమ్మ కావాలి..” 


“ఎంత చిన్నపిల్లవే నువ్వు? రేపో మాపో అత్తగారింటికి పోవాలి. లోపలికి వెళ్ళి మీ అమ్మ దగ్గర పనులు నేర్చుకో తల్లి” అంటూ బుజ్జగించింది. 


“అమ్మాయిగారూ! ఇంకో పదిరోజుల్లో మీ పెళ్ళి. ఈ ఎండలో కూర్చుని ఏమి చేస్తున్నారు?"


“చిన్నపిల్లల ఆటలు చూస్తున్న, మళ్లీ ఇంతమంచి అవకాశం దొరకక పోవచ్చు నాకు చంద్రం”. 


“మీరు నీడపట్టున ఉండి, సమయానికి భోజనం చేస్తూ, నిద్రపోతూ, అలసిపోకుండా పుత్తడి బొమ్మలా తయారు కావాలి. పెద్ద చదువులు చదివినోరు.. పట్నం పోయి, పెద్ద భవంతిలో కాపురం చేస్తూ, పెనిమిటి దొరతో కాలక్షేపం కోసం, అదేదో ఒక రాజు, మంత్రి పోటీ ఆట అంటారు అమ్మాయిగారు.. సెప్పండి”


“ ఓ అదా ?చదరంగం ఆట..” 


“ఆ.. ఆ చదరంగం తెలివితేటలు పెంచే ఆట ఆడుతారు. 
మీ పెళ్ళి చూపులకు వచ్చినపుడు, పెద్ద అయ్య గారు మిమ్మల్ని చూసి పడిన సంబరం నా కన్ను లతో నేను చూసాను. అమ్మాయిగారూ! మీ పెళ్ళి మీ ఇంటికే కాదు, ఊరంతటికీ పండుగ”, 
లోలోన సంతోష పడుతూ, ఒక్కొక్కటి చెప్తూ, 


“శుద్ధదశమి నాటికి, ఈ వాకిలి యంతయు, పచ్చి తాటియాకుల పందిరిలో, బంతి పూల తోరణాలతో అలంకరించాలి అమ్మగారూ! ఆవుల పేడతో నేల అంతా అలికి ముగ్గులు వేయాలి. వంటలు చేయుటకు వంటశాల, భోజనాలు చేయుటకు ప్రత్యేక పందిళ్ళు, పెళ్ళి మండ పాన్ని రంగు రంగుల పూలతో అలంకరించి, దూర ప్రాంతాలనుండి వచ్చిన బంధువు లందరికీ విడిది గదులను, అన్ని వసతులు చూడాలి మీ పెళ్లoటే ఏమను కున్నారు అమ్మాయిగారు.. " అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు సెప్పుకోవాలి”. 


“ఇంత గొప్ప, మాటలు ఎట్లా తెలిసాయి చంద్రం నీకు” అని అడిగింది నక్షత్ర. 


“అయ్యగారి దగ్గర నేర్చుకున్నా అమ్మా! అదే అనుభవం, పనిలో నేర్పరితనం, పట్టు పెంచుకున్న". 


కొంచెం దూరం పోయి వాసు, చంద్రం ఇద్దరూఎదురెదురుగా కూర్చుని, గుoజల మీద పచ్చి తాటాకులు కప్పడానికి, పందిళ్ళు కదలకుండా ఉండడానికి కావలసిన జనపనార తాళ్ళు పేనుతున్నారు. 


చంద్రo మాటలు విన్న నక్షత్ర లోలోపల మురిసిపోతూన్నట్లు నటిస్తూ, “నేను అత్తగారింటికి పోతే నీకు చదువు ఎవరు నేర్పుతారు?” 


“నాకు ఇంకా సదువా? అమ్మాయిగారు.. మీరు పంతులమ్మ లా నేర్పించినా కూడా మీ పాదాల దగ్గర పాచిపని చేసుకుని బతికేతోనికి”. 


“కేవలం పని చేస్తే బుద్ధి వికసింపదు. మన చుట్టూ ఉండే విషయాలపైనే బుద్ధి ప్రసరిస్తుంది. విషయాలను చూచి ఊరకుండక, ఆవిషయం లోని తత్వమును పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు చదువు కోవాలి చంద్రం. 


 నేను అత్తగారింటికి వెళ్లి అక్కడి ముచ్చట్లు ఎన్నో తెలియ చేయాలని అంటే నీకు ఉత్తరం వ్రాస్తాను. చదువు వస్తేనే కదా.. నువ్వు చదివి అర్థం చేసుకునేది”. 


లోపలికి పోయి కొన్ని పుస్తకాలు పట్టుకొచ్చిoది నక్షత్ర. 


 చంద్రాన్ని కూర్చోబెట్టి కొన్ని పదాలను వల్లె ( ఒకే పదాన్ని రెండుసార్లు అనడం)వేయించింది. 
 
‘పంతులమ్మ పాఠాలు నిజం చేయాలి, బాగా చదువుకోవాలి’ అనుకున్నాడు.. కానీ రెండు సంవత్సరాల నుండి పుస్తకాలపై మనసు పెట్టీ చదివినా, అన్ని పుస్తకాలలో మొదటి పది పేజీలు కూడా దాటలేక పోతున్నాడు. 


 ఎంతసేపు ఇంటిపని, వ్యవసాయo పని, ఏటి గట్టున పశువుల మేపుడు అవే గుర్తుకు వస్తున్నాయి.. కానీ పుస్తకం మీద మనసు నిలవదు లోలోపల అనుకుంటూ.. 


“నక్షత్ర అక్కా! నాకు అష్టా చెమ్మ ఆట నేర్పుతావా?" అంటూ వచ్చింది పిన్ని కూతురు శ్రియ. 


“అమ్మాయిగారూ! నాకు చదువు రాదు కానీ మీరు పిల్లలతో ఆడుకోండి" అని తప్పించు కుంటుంటే.. 


“నా పెళ్లి అయ్యే లోపల నీకు చదువు నేర్పిస్తాను చంద్రం” అంటూ శ్రియ దగ్గరికి వెళ్లి.. 


“శ్రియ !" నువ్వు పెళ్ళి అనే శుభకార్య సమయం లో అష్టాచెమ్మా ఆటలు ఆడకూడదు. జూదం వల్ల మహాభారత యుద్ధం జరిగింది. చoపుడు పంజం అంటారు. అది చెడు పదం, పదే పదే అంటే అశుభం. "


“అయితే వద్దు నక్షత్ర అక్కా! మేము దస్తీ, బిస్తీ ఆడు కుంటాం” అంటూ లేడి పిల్లల్లా ఎగురుకుంటూ పరుగెత్తారు. 
*****************
పెళ్లి ఘనంగా జరిగింది. బాజా భజంత్రీల తో ఊరేగింపు జరుగుతుంటే.. ఆకాశంలో మెరుస్తున్న తారలా పల్లకిలో ఉన్న నక్షత్రకు బంతిపూల తోరణాలు వీడలేక వీడ్కోలు చెప్తున్నట్లు, పచ్చి తాటాకు పందిళ్ళు కూడా తెల్ల బోయి చూస్తున్నాయి. 
*******************
“పెద్దయ్య.. మిమ్మల్ని ఇలా ఎప్పుడూ సూడ లేదు. అమ్మాయి గారిని అత్తగారింటికి పంపించి నప్పటి నుండి అదోలా ఉంటున్నారు. మేమంతా ఉన్నాం కదా అయ్యా అంటూ అన్ని పనులు చేస్తూ సంతోష పెడుతున్నా కూడా మీ జబ్బు నయం కావడం లేదు. పైగాఆరోగ్యo క్షీణిస్తుంది”. 


 “అలా ఏం లేదు చంద్రం. వయసు మీద పడితే అంతే”. 
“మీరు మా అందరితో సమానంగా లేచి తిరిగి నడవాలి అయ్యా. మీకు ఏం కాలేదు.. అని చెప్పు..” 
 మెల్లగా వెళ్లి డాక్టర్ తో మాట్లాడి అసలు విషయం తెలుసుకున్నాడు. 


“మీ అయ్యగారు మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. అది ఏమిటో తెలుసుకొని తగిన మందులు ఇచ్చినా లేదా ఆ బాధ ఏమిటో తీసివేసినట్లయితే అయినా ఆయన వ్యాధి నయం కావచ్చు”. 


ఒకరోజు పెద్దయ్య చేతిలో ఒక ఉత్తరం కనిపించింది. అది చదువుతూ కన్నీళ్లు పెట్టుకుంటు న్నాడు. తనకేమో సదువు రాదు.. అయినా సరే ఏమిటో తెలుసు కుందాం అని.. 
“అయ్యగారూ” అని పిలవగానే అనగానే కళ్ళు తుడుచు కున్నాడు. 


“ఎవరయ్యా ఆ ఉత్తరం రాసింది? చదివి బాధపడుతున్నారు మీరు..”
 
“బాధ కాదు ఆనందభాష్పాలు” అని జీవం లేని నవ్వు నవ్వాడు. 


 చంద్రానికి అర్థమయింది. ఏదో దాస్తున్నాడని.. 


“ఎంత ఆస్తిపరుడ నయినా అమ్మాయికిమంచి జీవితం ఇవ్వలేకపోయాను. సవతి తల్లి పోరుతో తన బంధువుల అబ్బా యికే ఇవ్వాలని కోరుకోవడంతో కాదనలేక బాగా ధనవంతులే కదా అని వెళ్లి చేశాను. 


“నాన్న నన్ను వచ్చి తీసుకపో” అని కూడా రాయలేదు. తన జీవితం వాడిపోతున్నా కూడా..
 
వెళ్లి చూసి వద్దామని అనుకున్నా తను మంచానికి అంటుకపోవడం ఏమీ చేయలేని పరిస్థితి.. అనే దీర్ఘాలోచనతో రోజులు గడిచిపోతున్నాయి. 


భర్తకు క్యాన్సర్ వ్యాధి ముదిరింది .ఇంకా వారం పది రోజుల కంటే ఎక్కువ కాలం బ్రతకడం అని వైద్యులు చెప్పారు.. అని తలుచుకుంటూ మళ్లీ కళ్ళ నీళ్లు కారుతున్నాయి. 
 తన వైధవ్యం తండ్రికి చూపించి బాధ పెట్టడం కూడా ఇష్టం లేన ట్టుంది నా తల్లికి.. నిండు జీవితం నిస్సారo చేశాను” అని తప్పు తనదే అని కృషించి పోయాడు. 
*********************
అమ్మాయిగారు తండ్రిని కడ చూపు చూసుకోవడానికి కూడా రాలేదు అని ఆలోచిస్తుంటే.. 


 కొన్ని దినాల తరువాత పెద్ద ఉత్తరం వచ్చింది చంద్రానికి. పూర్తిగా అర్ధమయ్యేట్లు చదవలేక పాయినా, ఒక్కొక్క అక్షరం ఒత్తులు దీర్ఘాలతో ఉచ్చరించి నక్షత్ర అమ్మాయిగారికి తీరని బాధ మిగిలింది అనితెలుసుకున్నాడు. 


ప్రయాణం మధ్యలో గబ గబ వచ్చి ‘అమ్మాయిగారు’ అంటూ చేతికి బంతిపూవు ఇస్తుండగా బండి చక్రం కింద నలిగిన బంతి పూవు గుర్తుకు వచ్చింది. 


నక్షత్రo కాంతివంతం కావాలి అంటే చంద్రుని రాక తప్పనిసరి అన్నట్లు చంద్రం, నక్షత్ర వద్దకు బయలుదేరాడు. 


ఏనాడో చదివిన చదువు సార్థకo చేసుకుంటూ పాఠశాల ప్రారంభించింది. పాప ను ఎత్తుకుని ఉన్న ఫోటోలను చూసి కళ్లు చెమర్చాయి. 


 నా భర్త నాకు మిగిల్చిన ఈ జ్ఞాపకం తో కొత్త జీవితం ప్రారం భించాను అని గర్వంగా చెప్పింది. జరిగిందంతా తెలుసుకుని తనూ ఒక విద్యార్థి అయి, లా చదివి పట్టభద్రుడు అయ్యాడు. నక్షత్ర కు మంచి జీవితాన్ని ఇచ్చాడు. 


సమాప్తం.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Rainbow 

పెళ్ళిచూపులు

[Image: Picture5.png]
 

రచన: తాత మోహనకృష్ణ
 
"ఒరేయ్ సుందు.. ! నీకు పెళ్లి అవట్లేదని నాకు చాలా బెంగగా ఉందిరా.. " అంది జానకమ్మ


"ఎందుకే అమ్మా.. ! నాకు పెళ్లి ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది.. నువ్వు బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడుచేసుకుంటే, చాలా కష్టం.. ఎవరో అమ్మాయి నా కోసం పుట్టే ఉంటుంది లే.."


"అది కాదు రా.. నీకు ఎందుకు పెళ్లి అవట్లేదో నీకు తెలుసు.. ! నాకు తెలుసు.. !"


"అయితే ఏం చెయ్యమంటావు..? కొంత మంది సన్నగా ఉంటారు..నేనేమో బొద్దుగా ఉన్నాను. చిన్నప్పటినుంచి నేతి సున్నుండలు తెగ తినిపించావు.. అందుకే ఇలా అయిపోయానేమో.. "


"నిన్ను చూసిన అందరూ.. అబ్బాయి బాగున్నాడు కానీ.. అని మాట్లాడుకుంటున్నారు. అందుకే, ఈ సారి పెళ్ళిచూపులు కాఫీ షాప్ లో ఏర్పాటు చేసాను. రాకరాక చాలా రోజులకి నీకు ఒక సంబంధం వచ్చింది. నీ ఫోటో కూడా వారికి పంపలేదు. అక్కడ మీ ఇద్దరే ఉంటారు.. జాగ్రతగా మేనేజ్ చేసి.. ఈ సంబంధం 'ఓకే' చేసుకోరా బాబూ.. నా బాధ్యత కూడా తీరిపోతుంది.. "


"అలాగే ట్రై చేస్తాను అమ్మా.. ! ఇంతకీ పెళ్ళిచూపులు ఎప్పుడు.. ? ఎక్కడ.. ?"


"రేపే రా.. ఫేమస్ కాఫీ షాప్ లో.."


"మరి ఆ అమ్మాయిని ఎలా గుర్తుపట్టడం..?"


"అమ్మాయి గ్రీన్ కలర్ చుడీదార్ లో వస్తానని చెప్పింది.. పేరు కళ్యాణి.."


"ఈ డీటెయిల్స్ చాలు.."


"రేపు కొంచం నీట్ గా రెడీ అయి.. టీ షర్ట్ వేసుకో.. ముప్పై ఐదైనా, పాతిక లాగ కనిపిస్తావు. ఆ టోపీ కూడా పెట్టుకుని వెళ్ళు.. ఆ బట్టతల కనిపించదు.."


"అలాగే లేవే.. నా గురించి అన్నీ నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చెయ్యకు.."


"నువ్వు ఎలా ఉన్నా.. నాకు ముద్దుల కొడుకువే. కానీ అమ్మాయి కి నచ్చడం కోసం ఇవన్నీ తప్పవు. మీ నాన్న ఇప్పుడు ఉండి ఉంటే, నిన్ను ఇలా వదిలేస్తారా చెప్పు..? ఈ పాటికే నీకు పెళ్ళి అయిపోయి ఉండేది.."


"ఏం చేస్తాం చెప్పు అమ్మా.. ! నాన్న యాక్సిడెంట్ లో చనిపోవడం మన దురదృష్టం.. "
"మీ నాన్న కూడా నీలాగే ఉండేవారు కదా.. నీకూ అదే పోలిక వచ్చిందేమో. బట్టతలతో, బొద్దుగా ఉండేవారు. అలా ఉండే, నన్ను ప్రేమించారు. నా మనసు దోచారు. అప్పట్లో మీ నాన్నని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోనని నేను మా ఇంట్లో చెప్పేసాను. మొత్తానికి మీ నాన్నని నేను పెళ్ళి చేసుకోలేదూ.. ? మీ నాన్నలాగే నీదీ మంచిమనసు.. నీకూ మంచి అమ్మాయి దొరుకుతుంది.."


మర్నాడు అమ్మాయిని కలవడానికి కాఫీ షాప్ కి వెళ్ళాడు సుందరం.. 


‘అక్కడ ఎవరో అమ్మాయి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని కూర్చొని ఉంది. ఎదురుగా ఎవరూ లేరు.. కుర్చీ ఖాళీగా ఉంది. ఆ అమ్మాయి ముఖం లో ఏదో టెన్షన్ కనిపిస్తోంది. నా ఫోటో కూడా చూడలేదుగా.. నేను ఎలా ఉంటానో అని తెగ అలోచిస్తునట్టుగా ఉంది.. డౌట్ లేదు, ఈ అమ్మాయి.. ఆ అమ్మాయే. నేనెవరో చెప్పకుండా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి.. ' అని మనసులో అనుకున్నాడు సుందరం 


"ఇక్కడ కూర్చోవచ్చా మిస్..?" అని సుందరం అమ్మాయిని అడిగాడు.
 
"కూర్చోండి.." అని అమ్మాయి సైగ చేసి చెప్పింది.
 
"ఏమిటి మిస్.. డల్ గా ఉన్నారు..? ఎనీ ప్రాబ్లం..?" అడిగాడు సుందరం.
 
"అయినా మీకెందుకు.. నేను ఎలా ఉంటే..?"


"మీ ఫేస్ కి అలా డల్ గా ఉండడం సూట్ కాలేదు. నా గురించి మీకు చెప్పనేలేదు కదా; నేను ఒక ప్రైవేటు కంపెనీ లో జాబ్ చేస్తాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలనేది నా ఫిలాసఫీ.. ఇప్పటికైనా చెప్తారా ఎందుకు అలా ఉన్నారో..?"


"నా జీవితానికి సంబంధించి ఒక వ్యక్తిని కలుసుకోవాలని వచ్చాను.. అందుకే వెయిట్ చేస్తున్నా.."


మరోసారి ఆ అమ్మాయి.. తనే అని కన్ఫర్మ్ చేసుకుని సంబరపడ్డాడు సుందరం.. 


"ఎందుకండీ బాధపడతారు.. చూస్తే మీరు చాలా మంచివారి లాగా ఉన్నారు. మీకు అంతా మంచే జరుగుతుంది లెండి.. కొంచం స్మైల్ ఇవ్వరాదూ.." అన్నాడు సుందరం.


ఎదురుగా అమ్మాయి ముఖంలో కొంచం నవ్వు ప్రవేశించింది.. 


"అలా నవ్వితే మీరు చాలా బాగున్నారు. నవ్వుతూ బతకాలనేది నా సిద్దాంతం.. మిమల్ని ఇబ్బంది పెడితే సారీ. నాది పెద్ద ఉద్యోగం కాకపోయినా.. ఉన్న జాబ్ లో హ్యాపీ గానే ఉన్నాను.. కాకపోతే మా అమ్మే నా పెళ్ళి కోసం చాలా టెన్షన్ పడుతోంది.. పైగా అమ్మ హార్ట్ పేషెంట్"


"మీకు ఇంకా పెళ్ళి అవలేదా.. ?" అడిగింది అమ్మాయి.
 
"లేదండీ.. ఉన్న నిజం దాచి పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంత బొద్దుగా ఉన్నాను.. పైగా బట్టతల.." అని క్యాప్ తీసి చూపించాడు సుందరం.


"నాకు ఎవరూ లేరు.. అమ్మ లేదు. నాన్న లాస్ట్ ఇయర్ చనిపోయారు.. మీకు ఉన్న దానిలో హ్యాపీ గా ఉన్నారు. సరదాగా మాట్లాడుతున్నారు. మీతో మాట్లాడుతుంటే, నా జీవితంలో బాధను మరచిపోయాను. అందం ఉండి, అన్నీ ఉన్నవారు ఎంతమంది హ్యాపీ గా ఉన్నారు చెప్పండి..? మిమల్ని పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ.. మీతో హ్యాపీ గా ఉంటుంది" అంది ఆ అమ్మాయి.
 
"అదేంటి అలా అంటున్నారు కళ్యాణి గారు..?"


"నా పేరు కళ్యాణి కాదు.. జయ.."


"మరి మీరు ఇక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు..?"
"నా ఫ్రెండ్ ని చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవబోతున్నాను.. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్" అంది జయ.
 
"అంతే లెండి.. ! నాకంత అదృష్టమా.. చెప్పండి..?"


"ఎందుకు అలా అంటున్నారు.. ఇంతకీ ఏమైంది..?"


"నేను పెళ్ళిచూపులు కోసం, కళ్యాణి అనే అమ్మాయిని కలవడం కోసం ఇక్కడకి వచ్చాను. మీరే కళ్యాణి అనుకుని.. మిమల్ని పెళ్ళి చేసుకుంటే బాగున్ను అనుకున్నాను.. కానీ.."


"నిజమా.. ? మరి మీ కళ్యాణి సంగతి ఏమిటి.. ? ఆమె వస్తుందేమో.."


"మీ కన్నా మంచి అమ్మాయి నాకు దొరకదు జయ.." అంటూ లేచి వెళ్లిపోవడానికి రెడీ అయ్యాడు సుందరం.
 
"ఉండండి.. మా నాన్న చెబుతుండేవారు.. అందం, డబ్బు కన్నా మనల్ని ఆనందంగా ఉంచగలిగే మనిషి, మనల్ని సపోర్ట్ చేసే లైఫ్ పార్టనర్ జీవితంలో దొరకడం అదృష్టం అని.. అందుకే, మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీతో నా లైఫ్ హ్యాపీ గా ఉంటుంది. మీకూ.. మీ కళ్యాణి కి అభ్యంతరం లేకపోతే, నన్ను పెళ్ళి చేసుకుంటారా..?"


"కళ్యాణి రాకపోవడం మంచిదే అయ్యింది.. లేకపోతే మీలాంటి మంచి అమ్మాయిని మిస్ అయ్యేవాడిని.." అంటూ ఎగిరి గంతేసాడు సుందరం.


"మీకు ఇంకో విషయం చెప్పనా.. ! నా పూర్తి పేరు జయ కళ్యాణి.." అని నవ్వుతూ చెప్పింది జయ. 


*************

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: 2 Guest(s)