Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కాలస్వరూపమే విశ్వరూపం
#1
2105E2F1037.22052G2-7.
270923-5.
???????????


       కాలస్వరూపమే విశ్వరూపం
                 ➖➖➖✍️


కౌరవులు కృష్ణుణ్ణి బంధించడానికి వచ్చినపుడు, అర్జునుడు యుద్ధభూమిలో చతికిలపడ్డప్పుడు కృష్ణుడు విశ్వరూపం ప్రదర్శించడం చూశాం. 

దేవతలు, రాక్షసులు మొదలైన అనేక ముఖాలతో కనిపించే రూపమది. దీని అర్థమేమిటి?

“పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!”

సజ్జనులను రక్షించి, దుర్జనులను శిక్షించి ధర్మసంస్థాపన చేయడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే  ఉంటానని లోకానికి భరోసా ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.  

కురుక్షేత్రంలో మోహరించిన సేనలను చూసి,   విచలితుడైన అర్జునుడు ధనుర్బాణాలు విడిచి,  చేష్టలుడిగి కూలబడిపోతే, తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ‘గీత’బోధ చేశాడు.

మనిషి ఏదో ఒక విషయంపై నిర్ణయం తీసుకోవాలంటే తనకు ఆ విషయంపై తెలిసిన పూర్తి సమాచారాన్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటాడు. అర్జునుడికి యుద్ధభూమిలో వచ్చిన సందేహం తాను చేస్తున్న యుద్ధం గురించి. యుద్ధానికి సన్నద్ధం కావడానికి ముందు అతడే మిత్రరాజులందరితో మాట్లాడి సైన్యాలు సమకూర్చుకున్నాడు. కృష్ణుడి దగ్గరికి స్వయంగా వెళ్లి సహాయం కోరాడు. 

అలాంటివాడికి ఒక సందేహం. యుద్ధంలో అనేక మంది వీరులు మరణించాల్సి వస్తుంది.. అదెంత వరకు సమంజసం అని!

అతనికి అప్పటికున్న అవగాహనతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక కృష్ణ భగవానుడిని అడిగాడు. బహుశా గ్రంథకర్త వేదవ్యాసుడు అర్జునుడి నోట అడిగించిన ప్రశ్న ఇది. ఇది అన్ని కాలాల్లో, అన్ని దేశాలకూ అన్వయించే ప్రశ్న. 


మొదటి ప్రపంచయుద్ధానికి ముందు యుద్ధాన్ని సమర్థిస్తూ "the war to end all wars' అని వర్ణించారు. రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన అణుబాంబుల వల్ల లక్షలాది ప్రజలు మరణించారు, ఆ సందర్భంగా అమెరికా చర్య కూడా శాంతి కొరకే అని చరిత్రకారులు చెప్పారు.

విశ్వరూపం విషయానికి వస్తే అది కృష్ణుడు అర్జునుడి సంశయాన్ని పోగొట్టడానికి చూపెట్టిన రూపం. అది నిజంగా దేవుడి స్వరూపమా..? అంటే అది భగవంతుని స్వరూపం కాదు. కేవలం ప్రకృతి రూపంలో కనిపిస్తున్న భగవంతుని శక్తి మాత్రమే.

భగవంతుడు అంటే కేవలం చైతన్యం మాత్రమే ప్రకృతిలోని సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే వాటి పరిణామంతో ఏర్పడిన విశ్వమే ఇది. 

కేవలం అర్జునుడి అవగాహన కొరకు కృష్ణుడు చూపించిన రూపమిది. ఋగ్వేదంలో పురుషసూక్తం ఉంది. మనం ఏ గుడికి వెళ్లి పూజ చేయించినా అక్కడ ముఖ్యంగా వినిపించే సూక్తమిది.
 ‘సహస్రశీర్షా పురుషః..’ అంటూ మొదలవుతుంది. విశ్వాన్నంతా ఒకే వ్యక్తిగా కల్పించి వర్ణించిన భావన ఇది. ఈ వ్యక్తిని విరాట్‌ పురుషుడు అన్నారు. ఈ వ్యక్తికి వేయి తలలు అన్నారు. అంటే సరిగ్గా లెక్కపెట్టి వేయి అని కాదు. లెక్కించడానికి వీలులేని సంఖ్యలో (infinite) ఉన్న తలలు అని అర్థం. అలాగే అనంతమైన సంఖ్యలో కళ్లు, పాదాలు, అవయవాలు. ఇవన్నీ ఎక్కడివి అంటే ఇవన్నీ మనమే అన్నారు. 

సృష్టిలోని ప్రతీ జీవి తల, అవయవాలు, ఇంద్రియాలు అన్నీ ఆ విరాట్‌ పురుషునికి చెందినవే. సృష్టి ప్రారంభం నుంచి పుట్టి, నశించిన జీవులన్నీ ఈ విరాట్‌ స్వరూపమే. 

మన శరీరంలో ఎన్నో కోట్ల జీవకణాలు పుడుతూ, మరణిస్తున్నట్లు.. ఈ విరాట్‌ స్వరూపంలో భూత, వర్తమాన, భవిష్యత కాలాల్లోని జీవరాశులన్నీ ఇమిడిపోయాయి. మన మిత్రులు, శత్రువులు ఇందులో భాగమే.

 ఇలాంటి రూపాన్ని చూడడానికి శ్రీకృష్ణుడు దివ్యదృష్టి ఇచ్చాడట. దివ్యదృష్టి అంటే అదేదో ఒక త్రీడీ అద్దాలలాంటిది కాదు. భగవంతుని గురించి సూక్ష్మంగా ఆలోచించగలిగిన మనసునే ఈ దివ్యదృష్టిగా అభివర్ణించారు. 

ప్రపంచాన్ని ప్రపంచంగా, శత్రువులు, మిత్రులుగా కాకుండా భగవంతుని స్వరూపంలో చూడడమే దివ్యదృష్టి. 

ఈ రూపంలో అతడు చూసినదేమిటి? బ్రహ్మ, రుద్రులు, ఆదిత్యులు మొదలైన దేవుళ్లనంతా. వీరంతా వేర్వేరు వ్యక్తులు కారు. నిరంతరం జరుగుతున్న లయమే రుద్రుడు. దీనిలోనే అనేకమైన కోరలతో వికృతమైన నోళ్లతో భీష్ముడు, ద్రోణుడు మొదలైనవారు ప్రవేశిస్తున్నారట. భయంకరమైన కోరలతో కొందరి తలలు నలుగుతున్నాయట. అర్జునుడే ఆ రూపాన్ని చూసి కంపించిపోయాడు. 
నీ స్వరూపమేమిటి అని ప్రశ్నించాడు. 

నేను కాలస్వరూపుణ్ని అన్నాడు కృష్ణుడు. 
కాలప్రవాహంలో రాజ్యాలు, రాజులు అన్నీ సమసిపోతుంటాయి. గ్రీకు పురాణాల ప్రకారం కాలపురుషుడు ఒక రెక్కల రథంపై గొప్ప కొడవలి తీసుకుని లోకాన్ని నరుక్కుంటూ వెళ్తుంటాడు. అలాంటి కాలస్వరూపాన్నే ఇక్కడ అర్జునుడు చూస్తాడు. 

కృష్ణుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతాడు. భీష్ముడు, కర్ణుడు మొదలైనవారంతా ఇప్పటికే నాచే చంపబడ్డారు. నీవు లేకున్నా వీరందరూ మరణించడం జరుగుతుంది. నీవు కేవలం నిమిత్తమాత్రుడుగా విల్లంబులు పట్టుకుని యుద్ధం చేయి. వీళ్లందరినీ జయించి కీర్తిపొందు అని అన్నాడు. 

దీనిలో ఒక శాశ్వతమైన సత్యం ఉంది. ప్రపంచంలో ధర్మానికీ, అధర్మానికీ ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు పోటీపడి బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఒక్కొక్కసారి మంచివాళ్లు హింసకు గురవుతుంటారు. దుర్మార్గులు లాభం పొందుతుంటారు. ధర్మానికి తీవ్రమైన గ్లాని ఏర్పడినపుడు మనిషి రూపంలోనే మళ్లీ ధర్మాన్ని ప్రతిష్ఠించే ప్రక్రియ సృష్టిలో ఉంది. ఈ ప్రక్రియను చూడటమే విశ్వరూప దర్శనం. 

విశ్వరూపం అంటే ప్రపంచ చరిత్రను ఒక తెరపై చూసినట్లు అవగాహన చేసుకోవడం. మనం సాధారణంగా వర్తమానాన్ని మాత్రమే చూస్తూంటాం. అలాకాకుండా చరిత్ర మొత్తాన్ని, రాబోయే కాలాన్ని చూడటమే ఈ దర్శనం. 

అన్నీ మంచే చూడాలని మనం సాధారణంగా కోరుకుంటాం. కొన్ని భయంకర సత్యాల్ని చూడడానికి ఇష్టపడం. మంచి చెడు అన్నింటినీ నిర్లిప్తతతో చూడడమే విశ్వరూప దర్శనం. 

మొదట్లో అర్జునుడు కృష్ణుడితో ‘నన్నెందుకు ఈ ఘోరమైన కార్యానికి వినియోగిస్తున్నావు?’ అని అడిగాడు. 

విశ్వరూపం దర్శనం తర్వాత అతని ప్రశ్నకు సమాధానం దొరికింది. అనంతమైన కాలచక్రంలో తాను ఒక చిన్న ముక్కను మాత్రమే అని, నిమిత్త మాత్రుడనే అని. తన ధర్మాన్ని అర్థం చేసుకుని కర్తవ్యాన్ని చేయడమే కర్మ యోగమనే పేరిట అర్జునుడికి చెప్పిన పాఠం. 
ప్రపంచం అనే కురుక్షేత్రంలో అంటే కార్య క్షేత్రంలో మనందరికీ వర్తించే పాఠమే ఇది.

మనకు తెలిసిన దశావతారాల లెక్క ప్రకారం శ్రీకృష్ణుడు నారాయణుడి ఎనిమిదో అవతారం. ధర్మగ్లాని సంభవించినప్పుడు దుష్ణశిక్షణ శిష్టరక్షణ కోసం భగవంతుడు ఎత్తే అవతారాలను లీలావతారాలంటారు. శ్రీకృష్ణుడి అవతారం కూడా లీలావతారమే! 

భాగవత కథనం ప్రకారం నారాయణుడి లీలావతారాలు ఇరవైరెండు. వాటిలో శ్రీకృష్ణావతారం ఇరవయ్యవది. 

లీలావతరాల్లోని ముఖ్యమైన పదింటినే పురాణాలు దశావతారాలుగా చెబుతున్నాయి. 

శ్రీకృష్ణావతారం నారాయణుడి పరిపూర్ణావతారంగా భావిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో ఎక్కువగా భక్తులు ఆరాధించేది శ్రీకృష్ణుడినే! 

శ్రీకృష్ణుని ప్రస్తావన ఉన్న తొలిగ్రంథం ఛాందోగ్యోపనిషత్తు. సామవేదానికి చెందిన ఈ ఉపనిషత్తు క్రీస్తుపూర్వం        8–6 శతాబ్దాల నాటిదని చరిత్రకారులు చెబుతారు. 

ఛాందోగ్యోపనిషత్తులో శ్రీకృష్ణుని ప్రస్తావన, ధృతరాష్ట్రుడి ప్రస్తావన కనిపిస్తాయి. మెగస్తనీస్‌ తన రచనల్లో మధురలోని శూరసేనుడనే రాజు ‘హెరాకిల్స్‌’ను పూజించేవాడని రాశాడు. హెలియోడోరస్‌ శ్రీకృష్ణ భక్తుడిగా మారి, భాగవత ధర్మాన్ని అవలంబించాడు. 

అతడు మధ్యప్రదేశ్‌లోని విదిశా (ఇదివరకటి బేస్‌నగర్‌) నగరంలో గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించి, దానిపై ‘దేవదేవుడైన వాసుదేవుని కోసం ఈ గరుడ స్తంభాన్ని వేయించిన భాగవత ప్రభుభక్తుడు హెరిడోరస్‌’ అని శిలాశాసనం వేయించాడు. 

దాదాపు ఇదే కాలానికి చెందిన మరో శాసనం మధుర సమీపంలోని మోరాలో ఉంది. ఇందులో వృష్టి వంశానికి చెందిన ఐదుగురు వీరుల ప్రస్తావన ఉంది. అందులో ప్రస్తావించిన ఐదుగురు వీరులు: బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు. 

‘కృష్‌’ అంటే దున్నడమనే అర్థం ఉంది. భూమిని దున్నడానికి ఉపయోగించే నాగలి మొన నల్లగా ఉంటుంది. అందుకే ‘కృష్ణ’ అనే శబ్దానికి ‘నల్లని’ అనే అర్థం ఏర్పడింది. భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు. 

శ్రీకృష్ణ భక్తుడైన చైతన్యప్రభు గౌడీయ వైష్ణవ తత్వానికి ప్రాచుర్యం కల్పించాడు. ‘హరేకృష్ణ’ నామాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చాడు.

చైతన్యప్రభు బోధలతో గౌడీయ వైష్ణవంలోని కృష్ణతత్వం, ‘హరేకృష్ణ’ భక్తి ఉద్యమం దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించింది. శ్రీల ప్రభుపాదగా ప్రసిద్ధి పొందిన అభయచరణారవింద భక్తివేదాంత స్వామి తాను నెలకొల్పిన ‘ఇస్కాన్‌’పశ్చిమబెంగాల్‌లోని ‘ఇస్కాన్‌’ ప్రధానకేంద్రమైన మాయాపూర్‌లో ‘చంద్రోదయ మందిరం’ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే, కంబోడియాలోని ఆంగ్‌కోర్‌వాట్‌ ఆలయం తర్వాత అతి పెద్ద ఆలయం ఇదే కానుంది. దీని నిర్మాణానికి 75 మిలియన్‌ డాలర్లు ఖర్చవుతుండగా, ఇందులో సింహభాగం ‘ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ’ వ్యవస్థాపకుడైన హెన్రీఫోర్డ్‌ మునిమనవడు ఆల్ఫ్రెడ్‌ బీ ఫోర్డ్‌ ఖర్చు చేస్తున్నారు. ‘హరేకృష్ణ’ ఉద్యమానికి ఆకర్షితుడైన ఆయన ‘ఇస్కాన్‌’లో చేరారు. అంబరీష్‌ దాస్‌గా వైష్ణవనామాన్ని స్వీకరించి, ప్రస్తుతం ‘ఇస్కాన్‌’ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

గీతోపనిషత్తుగా ప్రసిధ్దికెక్కిన భగవద్గీతకు 18 పేర్లున్నాయి. అవి వరుసగా: 1. గీత  2. గంగ   3. గాయత్రి   4. సీత   5. సత్య    6. సరస్వతి   7. బ్రహ్మవిద్య    
8. బ్రహ్మవల్లి    9. త్రిసంధ్య   
10. ముక్తిగేహిని   11. అర్ధమాత్ర 
12. చిదానంద    13. బవఘ్ని   
14. భ్రాన్తినాశని   15. వేదత్రయి 
16. పర     17. అనంత మరియు 
18. తత్యార్ధజ్ఙానమంజరి.
మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. 

కాగా మహాభారతం భీష్మపర్వంలోని 43వ అధ్యాయం నాలుగవ శ్లోకంలో వేదవ్యాసుడు గీతలో శ్లోకాల సంఖ్య 745గా చెప్పాడు. ఇందు శ్రీ కృష్ణుడు 574, అర్జునుడు 85, సంజయుడు 41 మరియు ధృతరాష్ట్రుడు ఒక శ్లోకం చెప్పారు.

భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క యోగము అంటారు. 1 నుండి 6 వ అధ్యాయాలను కలిపి ‘కర్మషట్కము’, 7 నుండి 12 వరకు ‘భక్తి షట్కము’ మరియు 13నుండి 18 వరకు ‘జ్ఞాన షట్కము’ అంటారు.

ఈ గీతా మహాత్మ్యాన్ని శివుడు పార్వతీదేవికి, విష్ణువు లక్ష్మీదేవికి చెప్పారు. కాగా, శ్రీ కృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా ప్రత్యక్షంగా విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు ఇంకా రథం (అర్జునుడి రథం) ధ్వజంపై నున్న ఆంజనేయస్వామి.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)