Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిన్న విన్నపము.
#1
చిన్న విన్నపము.
ఆచరించాలా? లేదా? అన్నది మీ యిష్టం.
భయపడే విశేషాలు ఏమీ లేవు కంగారు పడకండి.
మీకు 60 ఏళ్ళు దాటాయా? పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయా?
అయితే ఒకసారి ఈ వ్యాసం చదవండి! 

మొదటి విషయం 'సర్దడం'.

కిచెన్....
వంటగది ఒక్కసారి చూద్దాం! ఎన్ని ఎక్స్ట్రా గిన్నెలు, డబ్బాలు, కంచాలు, క్యారేజులు, క్యాన్లు, ఇత్తడివి, రాగివి, కంచువి, దేముడి సామాన్లు, ప్లాస్టిక్, గాజు, టప్పర్వేర్, ఇంకో వేర్, ఆ వేర్, ఈ వేర్. 

పిల్లల పెళ్ళిళ్ళకీ, వ్రతాలు, నోములకీ, ఆఖరికి మనవల బారసాల,అన్నప్రాసనల లాంటి శుభకార్యాలలో  ఇరవై, ముఫైమందికి కూడా బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ క్యాటరింగ్. 
మంచినీళ్ళు, నెయ్యి, తినే విస్తరి, తాగేందుకు ప్లాస్టిక్ గాజులూ అన్నీ ఆ ప్యాకేజ్ లోనే. మరి మనకి అన్ని గిన్నెలు, కంచాలు ఎందుకటా? మిగిలిన ఫుడ్ తీసుకోవడానికి మన దగ్గర రెగ్యులర్ గా వాడే బొచ్చెలు బోలెడు. 

ఒకసారి , నిచ్చెన వేసుకుని పైన ఉన్న సామాన్లు చూద్దాం!
ఏం చేస్తాం ఆ ఇత్తడి సామాను? మనం పోతే, ఒక్కసారి ఊహించుకోండి!
అవన్నీ ఓ కూలివాడికిచ్చి దింపించి, పట్టుకుపోండి ఎవరికి కావాల్సినవి వాళ్ళు అంటారు మన పిల్లలు. అంతేనా? లేదంటే వాళ్ళింటికి తీసుకువెళతారంటారా? వాళ్ళిల్లు ఏమైనా ఖాళీగా ఉంటుందంటారా? 
వాళ్ళ విసుగు, చిరాకు చూపులు ఓ సారి ఊహించుకోండి. "ఇవన్నీ దాచుకున్నారు , వెళ్ళేటప్పుడు పట్టుకెళదామనుకున్నారేమో " అని  గొణుక్కుంటారు కదా! ఔనా? 

ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఏదో ఒక అనాధ శరణాలయంకి గానీ, వృద్ధుల ఆశ్రమానికి కానీ ఇచ్చేయాలి.
అక్కడ ఎవడు తినేస్తాడో, అసలువాళ్ళకి అందుతుందో లేదో, ఇవన్నీ ఆలోచించకూడదు. మనం ఒక అనాధ శరణాలయానికి ఇచ్చేసాం, అక్కడితో మన పనయిపోయింది, అంతే, అనుకుని ప్రశాంతంగా ఉండాలి. 

అలాగే మధ్య తరగతి వారయితే, అమ్మేయాలి. ఆ డబ్బులు ఉంచుకొని పనిమనుషులకి , హౌస్ కీపింగ్, వాచ్మాన్, సెక్యూరిటీ ఇలా అందరికీ పంచేయాలి. మినిమమ్ వస్తువులు ఉంచుకోవాలి అంతే . 

దేముడి మందిరం విగ్రహాలతో నింపేయకూడదు. దేముళ్ళని కూడా తీసుకువెళ్ళకుండా పిల్లలు అమ్మి పారేసారు, అన్న అప్రదిష్ట పిల్లలకు రానీయకూడదు.

ఇక బీరువా నిండా చీరలు
చీరలు. 
అసలు మనకు చీరలు ఎన్ని కావాలి? ఓ 30, పోనీ ఓ 50, అవి ఉంచుకోవాలి. పదేళ్ళ క్రితం కొన్న చీరలు తీసేయాలి. పట్టుచీరలైనా ఎక్కువ రోజులు బీరువాలో ఉన్నా చీకిపోతాయి. 
కొన్ని చీరలు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి మన చుట్టాలలో పిల్లలకు ఇచ్చేయాలి. మేము రిచ్ అని గోల పెట్టేవారికి కాదు. ఎవరికి ఇవ్వాలో మనకు తెలుసు. 

ఇక లాకర్....
చిన్నా చితకా వాడని వెండి సామానూ, కాయిన్స్ తీసేసి ఓ వెండి కంచంగా కానీ, పూజ ప్లేట్ గా కానీ మార్చేయాలి. పిల్లలు పంచుకోవడం ఈజీ. లేదంటే గంధం గిన్ని 10 తులాలంటే, కుంకుమ భరిణె 10తులాల 10 మిల్లీ గ్రాములుందని కూడా గొడవలొస్తాయి.

ఇక ఓ 4 రకాల  ముక్కు పుడకలు, ఓ పది రకాల చెవుల దిద్దులు , శ్రావణమాసం రూపులు వీటన్నిటినీ కూడా సర్దేయాలి. 70 ఏళ్ళు వచ్చాక ఒకే రకమైన చెవుల దిద్దులు , ముక్కుపుడకలు, ఉంగరాలు అవీ మనకు నచ్చినట్లుగా చేయించుకుని పెట్టుకోవాలి.

ఇక, కప్ బోర్డ్స్...
రిటర్న్ గిఫ్ట్ గా వచ్చిన రకరకాల సామాన్లు ఉంచుకుని ఏం చేస్తాం? అనాధాశ్రమాల్లో పెళ్ళిళ్ళు చేసుకునే ఆడపిల్లలకి సారె గా ఇవ్వచ్చు!

షాల్స్, వాడని దుప్పట్లు ఒక పెద్ద బ్యాగ్ లో వేసుకుని కార్ లో పెట్టుకొని రోడ్లమీద పడుకునే వారికి కప్పిరావాలి.
తిరిగి ఏమీ ఆశించకుండా చేసిన దానాలకే పుణ్యం వస్తుంది. ఆశించి చేసేవి ఏవీ ఫలితాన్ని ఇవ్వవు. 

ఇల్లు, మనసు, బుర్రా కూడా  ఎంత ఖాళీ చేసుకుంటే అంత మంచిది.  పిల్లలకి కావాల్సిన వస్తువులే ఉంచాలి. వారిని ఇబ్బంది పెట్టకూడదు.

మన ఇన్స్యూరెన్స్ ఫైల్స్, హెల్త్ ఫైల్స్ అన్నీ జాగ్రత్త చేసుకోవాలి. మందుల బాక్స్ ఎప్పటికప్పుడు సర్ది ఉంచుకోవాలి.

ఇక మనం పోయాక, పిల్లలు వస్తే కనుక అయోమయం, అంధకారంలో ఉంటారు. వారికి అందరూ సలహాలు ఇచ్చేవారే! ఏం చేయాలో తోచక బిక్కు బిక్కు మంటారు. అందుకే, మనమే వీలు చేసుకుని అన్ని విషయాలు చెప్పి ఉంచాలి, లేదా వ్రాసి ఉంచాలి ఏం చేయాలో ఎలా చేయాలో అన్న విషయం.

ఆ పన్నెండురోజులూ అయ్యాక, వాళ్ళకి ఉద్యోగ హడావుడిలే! అందుకే మన సామాను ఈజీగా క్లియరాఫ్ చేసుకునే వీలు కల్పించాలి.

భాగస్వాముల్లో ఒకరు పోతే, ఇంకొకరు ఎప్పుడూ లేని ఎమోషన్స్ చూపి పిల్లల్ని  విసిగిస్తారు. మనిషే శాశ్వతం కాకపోయిన తర్వాత, ఇంక దేనికి విలువ ఇవ్వాలో మనమే విజ్ఞతగా నిర్ణయం చేయాలి, వ్యవహరించాలి.

ఫొటోలు కూడా మనం అలా వెళ్ళగానే, ఇలా డస్ట్బిన్ లోకి వెళతాయి. వాళ్ళేం చేసుకుంటారు? మన అభిలాషలన్నీ మన పిల్లల మీద రుద్దకూడదు. 

మరో ముఖ్యమైన మాట. ఆడపిల్లలకి ఇవ్వాలనుకున్నవి మన చేతులమీదుగానే ఇచ్చేసుకోవాలి. వాళ్ళు అన్నదమ్ములని అడిగి, వాళ్ళు ఇవ్వక, పిల్లలు గొడవ పడి  , కొట్టుకుని, తిట్టుకునే వరకూ విషయం రచ్చకెక్కించకూడదు. మన సంపాదన మన ఇష్టం అది స్పష్టంగా కోడళ్ళకి/ అల్లుళ్ళకీ తెలియచెప్పాలి. ఈ విషయంలో మొహమాటం కూడదు.

సర్దడం మొదలుపెడదాం! ఈ రోజునుండే.  చాలా టైముంది అని మాత్రం అనుకోకూడదు. హాయిగా ఫ్రీ బర్డ్ లా ఉండాలి. జీవితాన్ని మనకు నచ్చినట్లుగా ఆనందంగా, ఆధ్యాత్మికంగా మలచుకోవాలి.

ఇప్పటివరకూ పట్టుక్కూర్చున్న ఇల్లు, ఆస్తులు, ఆభరణాలు, దుస్తులు, పిల్లలు, మనవలు, బాధ్యతలు మీద మమకారం తగ్గించుకోవాలి. రోజు రోజూ పూట పూటా విచారాలను వదిలి ఆనందంగా ప్రయాణానికి సిద్ధం కావాలి. 
పిల్లలతో మనసా వాచా హృదయం లోంచి మంచి మాటలు మాట్లాడాలి. కొడుకు విషయాలు కూతురు దగ్గర, కూతురు విషయాలు కొడుకు దగ్గర చెప్పడం తగ్గించుకోవాలి.

కోపాలు, తాపాలు పూర్తిగా మర్చిపోవాలి. పిల్లలను మనవలను మనసారా దగ్గరకు తీసుకుని ఆప్యాయతలు పంచి, దీవించాలి 

మనం వెళ్ళిపోయాక కూడా  , మనల్ని కనీసం ఒకరో, ఇద్దరో ఆదర్శంగా తీసుకొనేటట్లు జీవించాలి. మన మరణానంతరం పిల్లలు గొడవలతో, చికాకులతో కాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసే బాధ్యత కూడా మనదే!

చివరగా....
 "నేత్రదానం" గురించి ఆలోచించిడం. మన వల్ల ఇద్దరు అంధులకి చూపు వస్తుంది. 
అంతేకాదు శరీర అవయవదానం చేస్తే, మన వలన ఏందరికో విజ్ఞానాన్ని, జీవితాలను ప్రసాదించినవారావుతాము.
ఆలోచించి ఆచరణలో పెడదాం!
ఆనందంగా బ్రతుకుదాం!
ఆనందంగా వెళదాం!
స్వస్తి!?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: