Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
గ్రీకు పురాణ గాథలు 1
రచన: వే వేం
ముందుమాట
నేను ఈ వ్యాసాలు రాయడానికి ప్రేరణ కారణం ఒక విమాన ప్రయాణం. భారతదేశం వెళుతూ, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉదయం 8గంటలకి బయలుదేరి, నూ యార్క్ చేరుకునేసరికి సాయంత్రం అయిదు అయింది. పరుగుబాట (runway) మీదకి దిగడానికి విమానం సంసిద్ధం అవుతూ ఉండగా, ‘మనం దిగబోయే పరుగుబాట మీద మరొక విమానం ఉంది. కంట్రోలు టవర్‌లో ప్రజలు నిద్రపోతున్నట్లు ఉన్నారు. మరో చుట్టు తిరిగి వస్తాను. అరగంట సేపు ఓపిక పట్టండి,’ అని చోదకుడు విమానం జోరు పెంచుతూ పైకి లేపేసరికి ఇహ చేసేది ఏమీ లేకపోవడంతో నా కుర్చీకి ఎదురుగా ఉన్న టి.వి. లో ఏదైనా ఇరవై నిమిషాల కార్యక్రమం చూద్దామని వెతకడం ఉపక్రమించేను. ‘అపస్వరం అనే ఏపిల్ పండు కథ. పదిహేను నిముషాలుట. చూడడం మొదలుపెట్టేను.
పురాతన గ్రీసు దేశపు కథ. ఇంతకు పూర్వం నేనెప్పుడూ వినలేదు. ఆసక్తితో చూసేను. గమ్యం చేరుకోగానే గూగుల్‌లో వెతికేను. చాల ప్రాచుర్యం ఉన్న కథ. మా అమ్మాయిని అడిగితే, ‘చిన్నప్పుడు హైకాలేజ్లో చదివేను’ అని చెప్పింది. పుస్తకాల పురుగుని అయినా ఈ కథ నా కళ్ళపడడానికి ఎనభై ఏళ్ళు పట్టిందంటే ఈ కథని వినని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారో అనిపించింది. ఈ కథ గురించి పరిశోధన చేస్తూ ఉంటే ఆసక్తికరమైన అంశాలు ఎన్నో తెలుసుకున్నాను. వాటన్నిటిని క్రోడీకరించి వ్యాసాలుగా రాసేను. మన పురాణ గాథల గురించి లోతుగా అర్థం చేసుకోవాలంటే ఇతరుల పురాణ గాథలు కూడా అధ్యయనం చెయ్యాలి.
ఇంగ్లీషులో myth అనే మాటని తెలుగులో పురాణ గాథ అనొచ్చు. పురాణ గాథలకి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం: పిల్లలు కుతూహలంతో అడిగే, ఇబ్బంది పెట్టే, ప్రశ్నలకి తేలికగా సమాధానాలు చెప్పడానికి. ఏమిటా ప్రశ్నలు? ఈ ప్రపంచాన్ని ఎవ్వరు తయారుచేసేరు? ఎప్పుడు తయారుచేసేరు? ఈ ప్రపంచం ఎన్నాళ్ళు ఉంటుంది? మొట్టమొదట ఎవ్వరు పుట్టేరు? చచ్చిపోయిన తరువాత ఎక్కడకి వెళ్తాము? మొదలైనవి. రెండవ ప్రయోజనం: మనం ఉంటున్న సాంఘిక వ్యవస్థని, మన ఆచార వ్యవహారాలని సమర్ధించడం కొరకు. సనాతన కాలపు గ్రీసు దేశపు సమాజంలో దేవుళ్ళ గురించి, దేవతల గురించి, సాహసోపేతమైన ధీరుల గురించి, భయంకరమైన రాక్షసాకారాల గురించి, వికృతమైన చంపూ మానవులు (human-animal hybrids) గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తుఫానులు ఎందుకు వస్తున్నాయి? అగ్నిపర్వతాలు ఎందుకు పేలుతున్నాయి? భూకంపాలకి కారణం ఏమిటి? పూజలు, వ్రతాలు, మొదలైన కర్మకాండలు ఎందుకు చెయ్యాలి? మొదలైన ప్రశ్నలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు. వీటికి సమాధానాలు చెప్పడం కోసం పురాణ గాథలు పుట్టుకొచ్చాయి.
హిందువులకి వేదాల వంటి పురాతన ప్రమాణ గ్రంథాలు ఉన్నాయి. క్రైస్తవులకి బైబిల్ ఉంది. కంచు యుగం (Bronze age) రోజులలో, గ్రీసు దేశంలో, వారికి ఉన్నవల్లా తరతరాలుగా వస్తున్న మౌఖిక సాహిత్యము, సంప్రదాయాలూ. ఆ కథలు ఈ నోటా ఆ నోటా ప్రయాణం చేసి, కాలక్రమేణా మార్పులు చెంది, చివరికి లిఖిత రూపంలో గ్రంథస్థం అయేయి. ఈ రకంగా గ్రంథస్థం అయిన వాటిల్లో చెప్పుకోదగ్గవి హోమర్ (Homer) సాధారణ శకానికి పూర్వం 8వ శతాబ్దంలో రాసిన ఇలియడ్ (Iliad), ఆడిసీ (Odyssey) అనే రెండు గ్రంథాలు. వీటిల్లో ట్రోయ్ యుద్ధం గురించి కొన్ని వివరాలు కనిపిస్తాయి. ఈ యుద్ధం పైకి చూడడానికి రెండు మానవ సైన్యాల మధ్య యుద్ధంలా కనిపించినా, ఈ యుద్ధానికి ప్రేరణకారకులు దేవతలు, వారి మధ్య ఉండే ఈర్ష్య, అసూయ, మొదలైన వైషమ్యాలు.
హోమర్ తరువాత ఒక శతాబ్దం గడచిన పిమ్మట (ఉరమరగా సా. శ. పూ. 7వ శతాబ్దంలో) హెసియోడ్ (Hesiod) అనే చరిత్రకారుడు రాసిన థియోగనీ (Theogony) అనే గ్రంథంలో ఈ ప్రపంచం ఎలా పుట్టిందని ప్రాచీన గ్రీకులు నమ్మేవారో మొదటిసారి చూస్తాం. ఈ గ్రంథంలోనే ఆదిలో ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి నుండి గయేఅ(Gaea) అనే భూదేవత పుట్టడం, తరువాత ఆమె ప్రాథమిక ప్రకృతి శక్తులకు ఎలా జన్మనిచ్చిందో, తదుపరి వారి నుండి రాక్షసగణాలు, దేవగణాలు ఎలా పుట్టుకొచ్చేయో, ఆయా వంశవృక్షాలతో సహా కూలంకషంగా వర్ణించబడ్డాయి. కాలక్రమేణా ఈ కథలని ఆధారంగా చేసుకుని శిల్పులు శిల్పాలు మలిచేరు, చిత్రకారులు బొమ్మలు గీసేరు, కవులు గ్రంథాలు రచించేరు, నిర్మాతలు సినిమాలు తీసేరు. చిట్టచివరకు అధునాతన కాలంలో వ్యాపార సంస్థలు కూడా ఆ కాలపు పేర్లని, శాల్తీలని వాడుకుంటున్నారు.
నేడు మనం బజారులో కొనుక్కునే అనేక వస్తువుల పేర్లు గ్రీకు పురాణ గాథల నుండి సేకరించినవే! పాదరక్షలని చేసే నైకీ (Nike) సంస్థ పేరు ఎక్కడినుండి వచ్చిందని అనుకుంటున్నారు? చంద్రుడి దగ్గరకు మానవులని మోసుకెళ్లిన రాకెట్ అపాలో (Apollo) పేరు ఎక్కడిదో తెలుసా? అమెజాన్.కామ్ కంపెనీ పేరులో అమెజాన్ ఎక్కడినుండి వచ్చిందో తెలుసా? అమెరికాలో బట్టలు ఉతుక్కునే ఒక సబ్బు వ్యాపార నామం ఏజాక్స్ (Ajax), అమెరికాలో ఆటలాడే జట్లు పేర్లు టైటన్స్, స్పార్టన్స్, ట్రోజన్స్, వగైరా పేర్లు అన్నీ గ్రీసు దేశపు పురాణాలలో పేర్లే.
గ్రీసు దేశపు (లేదా, గ్రీకు) నాగరికత పతనం అయిన తరువాత, ట్రోయ్ యుద్ధంలో బతికి బయటపడ్డ యోధులు కొందరు ఇటలీ చేరుకుని రోమ్ సామ్రాజ్యపు సంస్థాపనకి కారకులు అయేరు. అప్పుడు గ్రీకు కథలకి సమాంతరంగా రోమ్ పురాణ గాథలు పుట్టుకొచ్చేయి. ఈ కథలలో పాత్రల పేర్లు మారేయి కానీ మౌలికంగా గ్రీకు పాత్రలనే పోలి ఉంటాయి.
ఇక్కడ ఉటంకించిన అంశాలన్నిటినీ కేవలం ఒక నఖచిత్రంలా స్పర్శించినా ఇది పెద్ద గ్రంథం అవుతుంది. అందుకని కొన్ని ముఖ్యమైన అంశాలని మాత్రమే ముచ్చటించేను.
"క్రీస్తు శకం" కు నవీన రూపమే సామాన్య శకం. ఇంగ్లీషులో దీన్ని కామన్ ఎరా (Common Era) అని లేదా కరెంట్ ఎరా (Current Era) అనీ అంటారు. లాటిన్ భాషలో యానో డొమిని (Anno Domini -AD) ని కామన్ ఎరా (Common Era -CE) గాను,
"క్రీస్తు పూర్వం" (Before Christ -BC) ను బిఫోర్ కామన్ ఎరా (Before Common Era -BCE) గానూ వాడుతున్నారు.
వీటిని తెలుగులో సామాన్య శకం (సా.శ.), సామాన్య శక పూర్వం (సా.పూ. లేదా సా.శ.పూ.) గా వ్యవహరిస్తున్నారు.
ఈ మార్పుకు, మతతటస్థత ప్రధాన కారణం. ఈ మార్పు, పేరులోనే తప్ప కాలగణనలో కాదు.
ఉదాహరణకు క్రీ.పూ. 512, సా.శ.పూ. 512 గాను,
క్రీ.శ 1757, సా.శ. 1757 గాను మారుతాయి.
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
1. పరిచయం
మనకి వేదాలు, అష్టాదశ పురాణాలు, రామాయణ మహాభారతాల వంటి ఇతిహాసాలు ఉండగా, గ్రీకు (గ్రీసు దేశపు) పురాణ గాథలు ఎందుకు చదవడం?
ఆధునిక పాశ్చాత్య నాగరికత యొక్క పునాదులు గ్రీసు దేశంలో కనిపిస్తాయి. పైథాగరోస్, సోక్రటీస్, ప్లూటో, అరిస్టాటిల్ వంటి ఆద్యులకి గ్రీసు దేశం పుట్టినిల్లు. ఆధునిక శాస్త్రాల మీద గ్రీసు దేశపు ప్రభావం అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. అంతే కాదు. పాశ్చాత్య సాహిత్యం మీద, శిల్పాల మీద, తైలవర్ణ చిత్రాల మీద, సినిమాల మీద, ఆటల మీద కూడా గ్రీసు దేశపు పురాణ గాథల ప్రభావం మెండు. కనుక గ్రీసు దేశపు పురాణ గాథలపై అవగాహన మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మౌర్య సామ్రాజ్యపు రోజుల నుండి భారత దేశం మీద గ్రీసు ప్రభావం మెండుగా ఉందనే చెప్పాలి.
గ్రీసు దేశపు పురాణ గాథలు చదువుతూ ఉంటే వాటికీ హిందూ పురాణ గాథలకీ మధ్య పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పోలికలు పేర్లలో కావచ్చు, సంఘటనలలో కావచ్చు, వ్యక్తుల ప్రవర్తనలో కావచ్చు, దేవతల ఆయుధాలలో కావచ్చు, దేవతల వాహనాలలో కావచ్చు, దేవతలకి మానవులకి మధ్య సంబంధబాంధవ్యాల రూపేణా కావచ్చు. ఈ పోలికలకి కారణాలు రకరకాల కోణాలలో వెతకవచ్చు. కానీ హిందూ పురాణ గాథలకి, గ్రీసు పురాణ గాథలకి మధ్య మౌలికమైన తేడాలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతానికి వాటన్నిటిని పక్కన పెట్టి వారి పురాణ గాథలని ఒక నఖచిత్రంలా అర్థం చేసుకుందాం.
మనకే కాదు, చాలా సమాజాలలో పురాణ గాథలు ఉన్నాయి; ఈజిప్షియన్, నోర్స్, గ్రీక్ వగైరా. ఈ కథలు అన్నిటిలోను ఈ ప్రపంచం ఎలా పుట్టుకొచ్చిందో, అందులో మానవుడు ఎలా ఉద్భవించేడో, రకరకాల కోణాలలో ఆవిష్కరణ జరుగుతుంది. అంతే కాకుండా దేవతలు, స్వర్గం, నరకం, మొదలైన విషయాల మీద పరిశీలన జరుగుతుంది. వీటిని సునిశితంగా పరీక్షించి చూస్తే వీటన్నిటిలోను కొన్ని పోలికలు కనిపిస్తాయి. దీనికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, విభిన్న ప్రదేశాలలో, విభిన్న కాలాలలో నివసిస్తున్న మానవుల మేధలో, ఈ విశ్వం యొక్క ఆవిర్భావాన్ని గురించి పోలికలు ఉన్న ఆలోచనలు వచ్చి ఉండవచ్చు. రెండు, అనాది కాలంలో ఈ విశ్వం యొక్క ఆవిర్భావం గురించి ఒకచోట వచ్చిన మౌలికమైన ఊహా తరంగాలు నాలుగు దిశలకి వ్యాపించి, కాలక్రమేణా దేశ, కాల, పరిస్థితులకి మార్పులు చెంది, రకరకాల కథలుగా అవతరించి ఉండవచ్చు. స్వర్గం, నరకం, దేవతలు, దానవులు, మంచి, చెడు అనే భావాలకి భౌగోళిక పరిధులు ఉన్నట్లు తోచదు.
పురాతన కాలపు గ్రీసు దేశంలో ప్రజలు బహుదేవతారాధకులు. ప్రకృతిలో మనకి కనిపించే శక్తులు దేవతల ఆధీనంలో ఉంటాయని నమ్మేవారు. ఆయా దేవతలు ప్రసన్నమైతే ఆయా శక్తులు మనకి అనుకూలంగా ఫలితాలని ఇస్తాయని నమ్మేవారు.
గ్రీసు దేవతలలో ఏకోదరుల మధ్య వివాహాలు జరిగితే తప్పుకాదు; అదే విధంగా తల్లికి కొడుకుకి మధ్య వైవాహిక సంబంధం కానీ, తండ్రికి, కూతురుకి మధ్య వైవాహిక సంబంధం కానీ సమ్మతమే. సృష్ట్యాదిలో ఈ రకం సంబంధాలు తప్పనిసరి. ఈ రకం సంబంధాలు మన పురాణాలలోను కనబడతాయి. దేవతలని, అమరులని మానవ లోకంలో ఉన్న విలువల పట్టకం ద్వారా విమర్శించి ప్రయోజనం లేదు. అదే విధంగా ఇరవై ఒకటవ శతాబ్దపు విలువలని, శాస్త్ర పరిజ్ఞానాన్ని గజంబద్దలా వాడి వీరిని విమర్శించి లాభం లేదు.
మన ప్రాచీన పురాణ గాథలు రామాయణ, మహాభారతాలలో ఇమిడి ఉన్నాయి. ఇదే విధంగా గ్రీసు దేశానికి సంబంధించిన ప్రాచీన పురాణ గాథలు హోమర్ (Homer) (సా. శ. పూ. 750) రాసిన ఇలియడ్ (Iliad), ఆడిసీ (Odyssey) అనే గ్రంథాలలోను, హెసియోడ్ (Hesiod) (సా. శ. పూ. 700) రాసిన థియోగనీ (Theogony) లోను, వర్జిల్ (Virgil) (సా. శ. పూ. 20) రాసిన ఎనియడ్ (Aeneid) వగైరా గ్రంథాలలోనూ కనిపిస్తాయి. (ఇక్కడ ఇచ్చిన తేదీలు అన్ని సుమారుగా తీసుకోవాలి; కచ్చితంగా ఎవ్వరికి తెలియదు. సా. శ. పూ. అంటే సాధారణ శకానికి పూర్వం, అనగా పాత పద్ధతిలో, క్రీస్తు పూర్వం అని అర్థం.)
గ్రీకు పురాణ గాథలలో దేవతలే కాదు, శూరులు, వీరులు అయిన మానవులు కూడా ఉన్నారు, ఉదాహరణకి మహా బలవంతుడైన హెర్క్యులిస్ (Herculis) పేరు తెలియనివారు ఉండరు. మొట్టమొదటి మానవ స్త్రీ పేండోరా (Pandora) తెరవకూడని పెట్టె తెరచి మానవ లోకానికి పెద్ద సమస్య తెచ్చి పెడుతుంది. దంతపు విగ్రహల అందాన్ని చూసి, ప్రేమలో పడడం పిగ్మేలియన్ (Pygmalion) కథాంశం. అరాక్ని (Arachne) అనే సాలె వనిత పొగరుబోతు ప్రవర్తనకి శిక్షగా సాలెపురుగుగా మారిపోతుంది. ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవడం వల్ల మైడస్ (Midas) పడ్డ పాట్లు మనకి తెలియనివి కావు. నార్సిసస్ (Narcissus) అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని దాని మీద ప్రేమలో పడడం అనే కథని ఆధారంగా చేసుకునే ఇంగ్లీషులో నార్సిసిజమ్ అనే మాట వచ్చింది. పోతే, గ్రీకు కథలలో వచ్చే రాక్షసాకారాలు, వికృతమైన జంతు-నర సంకరాకారాలు చాలామట్టుకి కథలలో చదివే ఉంటాం. పెగసస్ (Pegasus) అనే గుర్రానికి రెక్కలు ఉంటాయి. సెంటార్ (Centaur) ముందు భాగం మనిషిలా ఉంటే వెనక భాగం గుర్రంలా ఉండే నరతురంగం. ఈ రకం నరతురంగాలనే హిందూ పురాణాలలో కింపురుషులు అన్నారు. మనకి ఉన్నట్లే వారికీ కిన్నరులు (satyrs) ఉన్నారు. స్ఫింక్స్ (Sphynx) అనేది స్త్రీ రూపంలో ఉన్న నరసింహం. ఇంకా విచిత్రమైన శాల్తీలు చాల ఉన్నాయి.
గ్రీకు పురాణాలలో కథలకి, మన పురాణ గాథలకి మధ్య ఎంత గట్టి పోలికలు అంటే ఒకరి నుండి మరొకరు అనుకరించారా? అన్న అనుమానం రాక మానదు. ఎవరి నుండి ఎవరు? అనే ప్రశ్న వేసుకుని అనవసరంగా ఆరాటపడేకంటే ఆ పోలికలు కొన్ని చూద్దాం.
ఉదాహరణకి మేషాది మీన పర్యంతం ఉన్న ద్వాదశ రాసులనే తీసుకుందాం. భూమి నుండి సూర్య చంద్రులని చూసినప్పుడు నేపథ్యంలో కనిపించే నక్షత్ర సమూహాలకి మన పూర్వులు మేషం, వృషభం, …., మీనం అని పేర్లు పెట్టేరు. ఎందుకని ఈ పేర్లు పెట్టేరుట? ఆ నక్షత్ర సమూహాలు ఆయా శాల్తీల ఆకారాలలో ఆనాటి వీక్షకులకి కనిపించి ఉంటాయి. నా కంటికి ఈ ఆకారాలు అలా అనిపించలేదు. ఎక్కడో, ఎవ్వరికో ఒక నక్షత్ర సమూహం మేషం ఆకారం లోనో, వృషభం ఆకారం లోనో కనిపించి ఉండు గాక. కానీ అవే నక్షత్ర సమూహాలు అన్ని దేశాలలో అవే ఆకారాలలో కనిపించేయనడం నమ్మశక్యం కాని ఊహ. ఈ రాసి చక్రం లోని పేర్లు ఇటు నుండి అటు అయినా వెళ్లి ఉండాలి, లేదా అటు నుండి ఇటు వచ్చి ఉండాలి.
మరొక ఉదాహరణగా మన వారాల పేర్లు చూడండి. ఇంగ్లీషులో మనం వాడే వారాల పేర్లు పాశ్చాత్యుల పురాణాలలోని పాత్రల పేర్లని ఆధారంగా చేసుకుని పెట్టినవి. వాటిని యధాతథంగా సంస్కృతంలోకి అనువాదం చేసి పెట్టిన పేర్లే మనం ఇప్పుడు వాడుతున్నవి అని నా నమ్మకం. ఎందుకంటే గ్రీసు, రోమన్ పురాణ గాథలలో వీటి వెనుక చాల లోతైన కథలు ఉన్నాయి. మన వరాల పేర్లకి, మన పురాణం గాథలకి మధ్య లంకె ఉందేమో కానీ నాకు కనబడలేదు. నెలల పేర్లు వచ్చేసరికి మన చైత్ర వైశాఖాదులకి, జనవరి, ఫిబ్రవరి, వగైరాలకి ఇటువంటి సంబంధం కనిపించదు. గ్రహాల పేర్లు చూసినా, నక్షత్రాల పేర్లు చూసినా కూడా దగ్గర సంబంధం ఉన్నట్లు అనిపించదు.
మనకి కైలాస పర్వతం ఉంటే వారికి ఒలింపస్ పర్వతం ఉంది. కైలాస పర్వతం మీద శివుడు ఉంటాడు, ఒలింపస్ పర్వతం మీద వారి దేవతలు అందరూ ఉంటారు. మన దేవతలూ, వారి దేవతలూ అమరులే. మన దేవతలకి అమృతం తాగితే అమరత్వం సిద్ధించింది. వారి దేవతలు అంబ్రోసియా (Ambrosia) తింటారు, నెక్టర్ (Nectar) తాగుతారు. విష్ణుమూర్తి దేవతలకి అమృతం పంచిపెడుతున్న సమయంలో ఒక రాక్షసుడు దేవతల వరసలో చేరి దొంగతనంగా అమృతం తాగినందుకు శిక్షగా విష్ణుమూర్తి అతని తలని తన చక్రంతో నరుకుతాడు. గ్రీసు పురాణాలలో టాన్టలస్ (Tantalus) అంబ్రోసియాను దొంగిలించి తిన్నందుకుగాను ఆకలిదప్పికలతో పాతాళంలో పడి ఉండమని శాపం పొందుతాడు.
తనకి పుట్టిన సంతానమే తన మరణానికి కారణం అవుతుందని తెలుసుకుని రియా (Rhea)కి పుట్టిన ప్రతి బిడ్డని క్రోనస్ (Cronus) మింగేస్తాడు. చిట్టచివరికి కడసారపు బిడ్డ జూస్ (Zeus) ప్రాణం కాపాడడానికి రియా కుట్ర పన్నుతుంది. ఇక్కడ శంతనుడు-గంగ కథ కానీ కంసుడు-కృష్ణ కథ కానీ గుర్తుకి వస్తుంది. ఇలా వెతికితే బహిరంగంగా ఇంకా చాల పోలికలు కనిపించినా ఇలియడ్, ఆడిసీ వగైరాలలో కనిపించే గ్రీసు పురాణ గాథలకి రామాయణ, మహాభారతాలలోను, హిందూ పురాణాలలోను కనిపించే కథలకి మధ్య మౌలికమైన తేడాలు ఉన్నాయి. ఈ కథల ద్వారా ఈ పోలికలు, తేడాలు ఏమిటో వివరంగా ముందు ముందు తెలుసుకుందాం.
(సశేషం)
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
గ్రీకు పురాణ గాథలు 2
గ్రీసు దేశపు పురాణం గాథలలో మూడు తరాల శాల్తీలు కనిపిస్తారు: మొదటి తరం సృష్ట్యాదిలో ఉండే అస్తవ్యస్తత (chaos) నుండి పుట్టినవారు. వీరిని దేవుడు, దేవత, అని అభివర్ణించడానికి బదులు వీటిని మూర్తిత్వం లేని అభిజ్ఞానాలుగా (amorphous symbols) కానీ, అపరావతారాలుగా (personified concepts) కానీ భావించవచ్చు. రెండవ తరం వారు టైటనులు (Titans). సాంప్రదాయికంగా వీరిని దేవగణాలలో ఉంచుతారు కానీ ఒక విధంగా చూస్తే వీరిలో కొందరు మన రాక్షసులని పోలిన శాల్తీలలా అనిపిస్తారు. మూడవ తరం వారు ఒలింపస్ పర్వతం మీద స్థిరనివాసం ఏర్పరచుకున్న ఒలింపియనులు. ఈ మూడవ తరం వారు మనకి పరిచయమైన దేవగణాల (దేవుళ్ళు, దేవతలు) కోవలోకి వస్తారు.
ఇక్కడ gods అనే ఇంగ్లీషు మాటని దేవుళ్ళు, దేవతలు అని అనువదించడం జరిగింది కానీ, నిదానం మీద ఆలోచిస్తే gods అన్న మాటని సురులు, అసురులు అని తెలిగించి సురులని దేవతలుగా పరిగణించి, అసురులులో మంచివాళ్ళని దేవతల కోవలో పడేసి, చెడ్డవాళ్ళని రాక్షసులుగా లెక్కలోకి తీసుకోవచ్చు. కానీ ఈ సూక్ష్మ భేదాలని విస్మరించి లింగ భేదం లేకుండా అందరినీ దేవుళ్ళు అనే అనడం జరిగింది.
గ్రీసు దేవుళ్ళు హిందూ దేవుళ్ళలాంటి వాళ్లు కాదు; వీళ్లల్లో ఈర్హ్య, అసూయ, పగ, జుగుప్స వంటి లక్షణాలు మానవులలో కంటె ఎక్కువ మోతాదులో ఉన్నట్లు అనిపిస్తుంది. వీరు మానవులని సృష్టించి వారిని చదరంగంలో పావులని నడిపినట్లు నడిపి ఆడుకుంటారు. ఉదాహరణకి అందంలో ఎవరు గొప్ప అని పోటీ పడి ముగ్గురు దేవతలు ట్రోయ్ నగరంలో మహా సంగ్రామానికి కారకులు అవుతారు.
మొదటి తరం దేవతలు
సృష్టి మొదట్లో అంతా అస్తవ్యస్తం. ఆ అస్తవ్యస్తం (chaos) నుండి గాయా (Gaia) లేదా భూదేవి, మరి కొన్ని ఇతర ప్రాథమిక శక్తులు (లేదా అపరావతారాలు, లేదా దైవాంశాలు) పుట్టుకొచ్చేయి. ఎబిస్ (Abyss) పుట్టింది; ఇక్కడే పాతాళ లోకానికి అధిపతి అయిన టార్టరస్ (Tartarus) ఉంటాడు. అతని పేరనే ఒక బందిఖానా ఉన్నది. ఎరోస్ (Eros) అనే కామాధిపతి; ఎరెబస్ (Erebus)అనే చీకటికి అధిపతి; నిక్స్ (Nyx) అనే ఈమె రాత్రికి అధిపత్ని, మొదలైనవి.
టార్టరస్
టార్టరస్ (పాతాళలోకం పేరు కూడా ఇదే) నుండి రకరకాల రాక్షసాకారాలు పుట్టుకొచ్చేయి. వాటిల్లో ముఖ్యమైనవి: 1. సెర్బెరస్ (Cerberus): ఒక మూడు తలకాయల కుక్క. ఇది నరకపు ద్వారాల దగ్గర కాపలా కాస్తూ ఉంటుంది. 2. డ్రాగన్ (Dragon): ఇక్కడ నుండే జేసన్, ఆర్గోనాట్లు, బంగారు ఉన్ని కథ మొదలవుతుంది. 3. స్ఫింక్స్ (Sphinx): మనిషి ముఖం, సింహం శరీరం, పక్షి రెక్కలు కల ఒక వింత జంతువు. 4. హార్పీలు (Harpies): సగం మనిషి సగం పక్షి ఆకారాలు. 5. సైరన్లు (Sirens): ఇవి సముద్రచరాలు. తమ తీయటిగొంతుతో పాటలు పాడి సముద్రయాత్రికులను వశం చేసుకొని తినేస్తాయి. 6. గోర్గన్లు (Gorgons): వీళ్ళగురించి రకరకాల వర్ణనలు ఉన్నాయి కాని ప్రముఖంగా చెప్పుకొనేది వారి జుట్టు గురించి. వెంట్రుకల బదులు విషసర్పాలు ఉండే వికృతాకాకారులు వీళ్ళు. వారిని చూసినవారు శిలలైపోతారు. ఎకిడ్నా, టైఫన్ అనేవారికి పుట్టిన ముగ్గురు అక్కచెళ్ళెల్లలో పేరెన్నిక గన్నది మెడూసా (Medusa).
ఎరెబస్కీ నిక్స్కీ పుట్టిన ఖెరాన్ (Charon) పాతాళలోకంలో ఉన్న నరకానికి వెళ్లే దారిలో వచ్చే స్టిక్స్ (Styx) వంటి నదులని దాటడానికి పడవ నడుపుతూ ఉంటాడు. చనిపోయినవారు ఈ నదులని దాటుకుని అటు వెళ్ళాలి. మన వైతరణికి ఇక్కడ స్టిక్స్‌కి పోలిక చూడండి.
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
రెండవ తరం టైటనులు
హెకటాంకీర్‌లు
పురుషుని సహాయం లేకుండా గాయా, ఆకాశానికి అధిపతి అయిన యూరెనస్కి (Uranus) జన్మనిచ్చింది, అప్పుడు అతను ఆమెని ఫలవంతురాలిని చేశాడు. వారి కలయిక నుండి మొదట టైటనులు (కాసింత రాక్షస అంశ ఉన్నవారులా అనిపిస్తారు కానీ వీరిని ‘టైటన్ దేవగణాలు’ అనే అంటారు) జన్మించారు. తరువాత ఒంటికన్నుతో ఉండే సైక్లాపులు (Cyclops) ముగ్గురు పుట్టేరు. తరువాత అందవికారంగా, ఏభయ్ తలలు, వందేసి చేతులతో, హెకటాంకీర్‌లు (Hecatonchieres) అనే శతబాహులు ముగ్గురు పుట్టేరు. వారి పేర్లు ప్రస్తుతానికి అనవసరం.
అందవికారంగా ఒంటికన్నుతో ఉన్న సైక్లాపులని, వందేసి చేతులు ఉన్న హెకటాంకీర్‌లని చూసి యూరెనస్ అసహ్యించుకుని వారిని తిరిగి తల్లి గాయా (అనగా భూదేవి) గర్భకుహరం లోకి (అనగా పాతాళం లోకి) తోసేసేడు. ఈ అమానుషచర్యకి కడు దుఃఖపడి ప్రతీకారం కోసం గాయా ఒక కొడవలిని తయారు చేసి, అదను కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సైక్లాపులు, హెకటాంకీర్‌లు జన్మించిన తరువాత ఇంక రాక్షస ఆకారాలు ఉన్న పిల్లలు పుట్టకుండా గాయా-యూరెనస్లు విడిపోయారు.
యూరెనస్-గాయాల కలయిక వల్ల పుట్టిన పన్నెండుమంది టైటనులలో ఆరుగురు మగ, ఆరుగురు ఆడ.
మగవారు: 1. ఓషనస్ (Oceanus-సముద్రాలకి అధిపతి), 2. హైపిరియన్ (Hyperion-కాంతికి అధిపతి), 3. కీయస్ లేదా కోయస్ (Coeus-బుద్ధి, దూరదృష్టికి అధిపతి), 4. క్రియస్ (Creus-గగన వీధిలోని నక్షత్ర రాసులకి అధిపతి), 5. క్రోనస్ (Cronus-కాలానికి అధిపతి), 6. ఇయపిటస్ (Iapitus-నీతికి అధిపతి).
ఆడవారు: 1. టెథిస్ (Tethys-మంచినీటికి అధిపత్ని), 2. థియా (Theia-దృష్టికి అధిపత్ని), 3. నెమోసీన్ (Mnemosyne-జ్ఞాపక శక్తికి అధిపత్ని), 4. ఫీబీ (Phoebe-వర్చస్సుకి అధిపత్ని), 5. రెయా (Rhea-మాతృత్వానికి అధిపత్ని), 6. థెమిస్ (Themis-ధర్మదేవత లేదా చట్టబద్ధతకి అధిపత్ని).
ఈ టైటన్ దేవతల గురించి తరువాత సావధానంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి కొన్ని ఆసక్తికరమైన చిల్లర విషయాలని చూద్దాం. (ఇక్కడ ఏకోదరుల మధ్య వివాహాలు గమనించండి.)
-సముద్రపు జంట అయిన ఓషనస్కీ టెథిస్కీ అనేకమంది జలదేవతలు పుట్టేరు.
-ఆకాశపు జంట అయిన హైపిరియన్కీ థియాకీ పుట్టిన పిల్లలలో హీలియోస్ (Helios-సూర్యుడు), సెలీన్ (Celine-చంద్రుడు) ముఖ్యులు.
-భూ జంట అయిన క్రోనస్కీ రేయాకీ పుట్టిన పిల్లలే టైటనులు.
-ఇయపిటస్కి పుట్టిన పిల్లలలో చాలా మందిని మనం గుర్తించగలం: 1. ఏట్లస్ (Atlas) నిరంతరం భూమిని భుజాల మీద మోసే శాల్తీ; 2. ప్రొమిథియస్ (Prometheus) మనుష్యుల పుట్టుకకి కారకుడు; 3. ఎపిమిథియస్ (Epimetheus) మొట్టమొదటి మానవ స్త్రీ పెండోరాని (Pandora) జూస్ (Zeus) ఆజ్ఞానుసారం తయారు చేసేడు.
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
క్రోనస్ పతనం
మొదటి తరం టైటనులలో క్రోనస్ కడసారం. క్రోనస్ కుతంత్ర బుద్ది కలవాడు, అత్యంత భయంకరమైనవాడు. తల్లి గాయాకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోగల సమర్ధుడు. క్రోనస్ ఒక రాత్రి యూరెనస్ మీదకి లంఘించి అతని జననాంగాలని తల్లి ఇచ్చిన కొడవలితో నరికేసి వాటిని సముద్రంలో విసిరేస్తాడు. ఆ జననాంగాల నుండి స్రవించిన స్రావములతో ఒక రకం రాక్షసులు, జలకన్యలు, తదితరులు పుట్టుకొస్తారు. అలా పుట్టుకొచ్చిన వారిలో ఏఫ్రడిటి (Aphrodite) ఒకామె. ఈ సౌందర్యవతి లైంగిక ప్రేమకి చిహ్నం.
క్రోనస్
అంగవిహీనుడైన యూరెనస్ భూమిని వదలిపోతూ తనకి చేసిన అవమానానికి క్రోనస్ ప్రతిఫలం అనుభవిస్తాడనిన్నీ, తనకి జరిగినట్లే క్రోనస్కి అతని పిల్లల చేతిలోనే ప్రతీకారం జరుగుతుందనిన్నీ శపిస్తాడు. తండ్రిని పదవీభ్రష్టుడిని చేసి రాజ్యం నుండి బహిష్కరించిన తరువాత క్రోనస్ సైక్లాపులని, హెకటాంకీర్‌లని టార్టరస్‌లో బంధిస్తాడు. క్రోనస్ తన తండ్రిని తరిమేసిన తరువాత తన యొక్క సోదరి అయిన రియాని జీవిత భాగస్వామినిగా స్వీకరిస్తాడు. క్రోనస్-రియాలకి పుట్టిన సంతానంలో ముగ్గురు మగ, ముగ్గురు ఆడ.
మగ వారు: హేడెస్ (Haydes), పొసైడన్ (Poseidon), జూస్ (Zeus).
ఆడ వారు: హెస్టియా (Hestia), డిమిటర్ (Demeter), హేరా (Hera).
హేడెస్ పాతాళానికి, పొసైడన్ సముద్రాలకి, జూస్ ఆకాశానికి అధిపతులు అవుతారు. జూస్ దేవలోకానికి అంతటికి పాలకుడుగా చెలామణి అవుతాడు. ఇతర టైటనులు అతని సభికులుగా అవుతారు. తండ్రి యూరెనస్ ఇచ్చిన శాపం పదేపదే గుర్తుకి రాగా, రియాకి పుట్టిన పిల్లల్ని పుట్టిన వెంటనే క్రోనస్ కబళించడం మొదలు పెడతాడు. అప్పుడు రియా తన కడసారపు కొడుకు జూస్ని ఒక పన్నాగం పన్ని రక్షిస్తుంది.
చాలమంది స్త్రీలతో సంపర్కం ఉండడం వల్ల క్రోనస్కి చాలమంది పిల్లలు ఉన్నారు. ఉదాహరణకి క్రోనస్కి సముద్రపు జలకన్య ఫిలిరాకి పుట్టిన కుమారుడు ఖైరన్ (Chiron). బొమ్మలలో ఖైరన్ని నరాశ్వంగా (centaur) చిత్రిస్తారు; అనగా ముందు భాగం మనిషి ఆకారంలోను, పృష్ఠ భాగం గుర్రం ఆకారంలోనూ ఉండే నాలుగు కాళ్ళ శాల్తీ.
(సశేషం)
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
గ్రీకు పురాణ గాథలు 3
ఒలింపియనులు
మౌంట్ ఒలింపస్
ఒలింపస్ పర్వతం (Mt Olympus) గ్రీసు దేశంలో మిక్కిలి ఎత్తయిన పర్వతం (2,918 మీటర్లు). దాని ఠీవి, దాని రాజసం, దాని అందంతో పాటు అది అందరికి అందుబాటులో లేని కారణంగా ప్రాచీన గ్రీసు దేశస్తులు దానిని దేవతల ఆలవాలంగా ఆరాధించేరు. ఈ పర్వతం మీదనే ముఖ్యమైన పన్నెండుమంది దేవతలు నివాసమున్నారని ప్రాచీన కాలంలో గ్రీసు దేశస్తులు నమ్మేవారు. ఈ పన్నెండుమందిని ‘ఒలింపియనులు’ అని పిలుస్తారు.
ఈ పన్నెండుమంది ఒలింపియను దేవతలలో —
క్రోనస్కి రేయాకి పుట్టినవారు ఐదుగురు: జూస్ (Zeus), పొసైడన్ (Poseidan), హేరా (Hera), డిమిటర్ (Demeter), హెస్టియా (Hestia).
జూస్‌కి హేరాకి పుట్టిన పిల్లలు ఇద్దరు: ఏరీస్ (Aris), హెఫీస్టస్ (Hephaestus).
జూస్
జూస్‌కి ఇతరులతో ఉన్న వివాహేతర సంబంధాల వల్ల పుట్టినవారిలో ఒలింపియను దేవతలుగా లెక్కలోకి వచ్చేవారు నలుగురు: హెర్మీస్ (Hermes), ఎథీనా (Athena), ఆర్టెమిస్ (Artemis), అపాలో (Apollo).
చిట్టచివరగా, యూరెనస్ వృషణాల నుండి పుట్టిన ప్రేమ దేవత ఏఫ్రొడిటి (Aphrodite). (పాతాళలోకానికి అధిపతి అయిన హేడీస్ని ఈ పన్నెండుమందిలో లెక్కించరు.)
జూస్ కొలువులో ఉన్న పన్నెండుమంది ఒలింపియను దేవతలని మరొకసారి మరొక కోణంలో చూద్దాం.
- జూస్: దేవతలకి అధిపతి; మన ఇంద్రుడి లాంటివాడు; రోమను పురాణాలలో ఇతనే జూపిటర్ (Jupiter).
- హేరా: జూస్ పట్టమహిషి, జూస్ చెల్లెలు, క్రోనస్ – రేయాల కూతురు; రోమను పురాణాలలో జూనో (Juno).
- పొసైడన్: సముద్రాలకి అధిపతి; జూస్ తోబుట్టువు; రోమను పురాణాలలో నెప్ట్యూన్ (Neptune).
- డిమిటర్: పాడిపంటలకి అధిపత్ని, క్రోనస్-రేయాల కూతురు; జూస్ తోబుట్టువు; జూస్కీ పొసైడన్కీ ప్రియురాలు; రోమను పురాణాలలో సీరీస్ (Ceres).
- ఎథీనా: యుద్ధ విద్యలకి అధిపత్ని; జూస్ శిరస్సు నుండి సచేలంగా, సాలంకృతంగా పుట్టింది; రోమను పురాణాలలో మినర్వా (Minerva).
- అపాలో: జూస్-లేతోలకి పుట్టిన కొడుకు. ఆర్టెమిస్-అపాలోలు కవలలు. ఇతను రెండవ తరం ఒలింపియను.
- ఆర్టెమిస్: జూస్-లేతోలకి పుట్టిన కూతురు. ఆర్టెమిస్-అపాలోలు కవలలు. ఈమె రెండవ తరం ఒలింపియను; రోమను పురాణాలలో డయానా (Diana).
- ఎరీస్: యుద్ధ విద్యలకి అధిపతి; జూస్-హేరాలకి పుట్టిన కొడుకు; రోమను పురాణాలలో మార్స్ (Mars).
- ఏఫ్రొడిటి: లైంగిక ప్రేమకి అధిపత్ని; యూరెనస్ జననాంగాలని కోసి సముద్రంలో పారేసినప్పుడు వాటి నుండి స్రవించిన తెల్లటి నురుగు నుండి పుట్టిన వ్యక్తి అని ఒక కథనం ఉంది. (టైటనుల తరం ఒలింపియను); రోమను పురాణాలలో వీనస్ (Venus).
- హెర్మీస్: దేవదూత; వీణ లాంటి వాయిద్యాన్ని పట్టుకుని విశ్వ పర్యటన చేస్తూ ఇక్కడి వార్తలు అక్కడకి చేర్చుతూ ఉంటాడు. మన నారదుడి పోలిక కొంత ఉంది; రోమను పురాణాలలో మెర్కురీ (Mercury).
- హెఫీస్టస్: అగ్నిదేవుడు, దేవతల కమ్మరి; ఏఫ్రొడిటిని పెళ్లి చేసుకున్నాడు; హేరాకి కొడుకు; తండ్రి ఎవ్వరో తెలియదు (జూస్ కావచ్చు); రోమను పురాణాలలో వల్కన్ (Vulcan).
- హేస్టియా, డయనీసిస్: క్రోనస్కి రేయాకి పుట్టిన ప్రథమ సంతానం హేస్టియా. జూస్కీ మానవ వనితకు పుట్టిన బిడ్డ కనుక డయనీసిస్ సంపూర్ణ దైవత్వం లేని వ్యక్తి (demigod) కనుక ద్వాదశ ఒలింపియనుల జాబితాలో ఇమడకపోవచ్చు.
ఒలింపస్ పర్వతం మీద నివాసం ఉండే ఈ మూడవ తరం దేవతలలో జూస్-హేరాల సంతానమే ఎక్కువమంది!
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
ముఖ్యమైన పాత్రల వంశవృక్షం, టూకీగా:
యూరెనస్ + గాయా → క్రోనస్, రేయా, థేమిస్ (పెద్ద)
క్రోనస్ + రేయా → జూస్, హేరా, పొసైడన్, హేడిస్, డిమిటర్, హేస్టియా
జూస్ + హేరా → ఎరీస్, హెఫీస్టస్ (లేదా, హేరా → హెఫీస్టస్?)
జూస్ + మేటిస్ → ఎథీనా
జూస్ + లేతో → అప్పాలో, ఆర్టిమిస్
జూస్ + మయియా → హెర్మీస్
జూస్ + సెమిలీ → డయొనీసన్
జూస్ + డయోన్ → ఏఫ్రొడిటి? లేదా యురేనస్ వృషణాల నుండి → ఏఫ్రొడైటి? (లేదా, జూస్ + డయోన్ → ఏఫ్రొడైటి?)
జూస్ + ఇతరులతో → పెర్సిఫొనీ (Persephone), పెర్సియస్ (Perseus), హెరాక్లిస్ (Heracles), ట్రోయ్కి చెందిన హెలెన్ (Helen), మినోస్ (Minos) కాకుండా తొమ్మిది మంది మ్యూజ్లు (Muses). (ఈ మ్యూజ్లు కళలకి, విద్యలకి అధిపత్నులు.)
థెమిస్
థెమిస్
క్రోనస్-రేయాల పుత్రిక. ఈమె ధర్మపరిపాలనకి అధినేత్రి. ఈమె కుడి చేతిలో దుష్టశిక్షణకి ఒక కత్తి, ఎడమ చేతిలో నిష్పక్షపాత ధర్మపాలనకి గురుతుగా ఒక త్రాసు ఉంటాయి. ఈమె కళ్ళకి కట్టిన గుడ్డ తీర్పు కొరకు వచ్చిన ప్రత్యర్థుల సాంఘిక స్థాయికి అతీతంగా ఆమె తీర్పు ఉంటుందని సూచిస్తుంది.
జాస్ అంతటివాడు తనకి వచ్చిన ధర్మసందేహాలని తీర్చుకుందుకి ఈమెని సంప్రదిస్తూ ఉంటాడు.
గ్రీసు చరిత్రలో మరొక థేమిస్ ఉంది ఈ ‘పెద్ద’ థెమిస్ యూరెనస్-గాయాల కూతురు. ఈమెకి భవిష్యత్తు చూడగలిగే శక్తి ఉంది. ఈ శక్తిని ఆమె తన పెరింటిగత్తె అయిన ‘చిన్న’ థెమిస్కి ధారపోసిందని ఒక ఐతిహ్యం ఉంది.
జూస్ని పోలిన వ్యక్తి ఇంద్రుడు అని అనుకున్నాం కదా. హిందూ పురాణాలలోని దత్తాత్రేయ పురాణం ప్రకారం బ్రహ్మ మానసపుత్రులలో ఒకడైన మరీచి కొడుకు కశ్యపుడు. ఇతను (బ్రహ్మ మానసపుత్రులలో మరొకడైన) దక్షప్రజాపతి యొక్క ఎనమండుగురు కూతుళ్ళని పెళ్లి చేసుకుంటాడు. వీరిలో పెద్ద కూతురు అదితికి పుట్టిన వారిలో ఆదిత్యులు పన్నెండుమంది, వసువులు ఎనమండుగురు, రుద్రులు పదకొండుమంది, అశ్వినీ దేవతలు ఇద్దరు. జూస్ పన్నెండుగురు ఒలింపియనులలో ఒకడైతే, ఇంద్రుడు పన్నెండుగురు ఆదిత్యులలో (అనగా, అదితి కొడుకులలో) ఒకడు.
ఋగ్వేదం (1.164.33) ప్రకారం ఇంద్రుడు ద్యయుస్కి (ఆకాశం), పృధ్వికి (భూదేవి) పుట్టిన కొడుకు.
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
గ్రీకు పురాణ గాథలు 4
జూస్
జాస్ (Zeus) దేవలోకానికి–గ్రీసు దేవతలకి ఆవాసమైన ఒలింపస్ పర్వతం మీద ఉన్న అమర లోకానికి–అధిపతి. పోలికలు ముమ్మూర్తులా సరిపోవు కానీ జూస్ని మన ఇంద్రుడితో పోల్సవచ్చు. ఋగ్వేదంలో ఆకాశానికి అధిపతి అయిన ద్యౌస్ (Dyaus) పేరుకి, జూస్‌కి మధ్య ఉన్న పోలిక కేవలం కాకతాళీయం కాదు. వీరిరువురి ఆయుధాలు మెరుపులు, పిడుగులు అవడం గమనార్హం.
క్రోనస్-రేయాలకి పుట్టిన పిల్లల్లో కనిష్ఠుడు అయిన జూస్ జన్మ వృత్తాంతం, జూస్ గద్దెకి ఎక్కిన వయినం చూస్తే క్రోనస్ చరిత్ర పునరావృతమయిందా అని అనిపిస్తుంది. తన తండ్రిని పదవీభ్రష్టుడిని చేసి, టార్టరస్‌లో బందీ చేసి జూస్ గద్దెకి ఎక్కిన ఉదంతం ఎలా నడుస్తుందో చూద్దాం.
జూస్ జన్మ వృత్తాంతం
తన తండ్రి యూరెనస్ శాపం ఏ విధంగా పరిణమిస్తుందో అనే భయంతో క్రోనస్ తన సంతానాన్ని మింగేసి తన కడుపులో బంధిస్తాడు. కానీ రేయా పన్నుగడ పన్ని జూస్ స్థానంలో ఒక రాయికి దుప్పటిగుడ్డ చుట్టబెట్టి క్రోనస్కి ఇస్తుంది. ఆ రాయిని క్రోనస్ మింగేస్తాడు. ఈ విధంగా క్రోనస్ కడుపులోకి జూస్ వెళ్లకుండా రక్షణ పొందుతాడు. రేయా జూస్ని తీసుకుని క్రీట్ ద్వీపంలో, ఒక గుహలో దాచిపెడుతుంది. అక్కడ వసంత దేవతలు ముగ్గురు జూస్ని పెంచి పెద్ద చేస్తారు.
జూస్ పెద్దవాడు అయిన తరువాత అతని భార్య మేటిస్ ఇచ్చిన మత్తు పదార్థం కలిపిన పానీయాన్ని తన తండ్రికి ఇచ్చి క్రోనస్ వాంతి చేసుకోనేటట్టు చేస్తాడు. ఫలితంగా అప్పటి వరకు క్రోనస్ పొట్టలో కూర్చొని ఎదుగుతూన్న రేయా యొక్క మిగతా సంతానం, రాయి బయటకి వచ్చేస్తాయి.
తన తోబుట్టువులు క్రోనస్ కడుపు నుండి విడుదల అయిన తరువాత గద్దె కొరకు యుద్ధం చెయ్యమని జూస్ క్రోనస్కి సవాలు విసురుతాడు. పదవిలో ఉన్న టైటన్లతో పదేళ్ళపాటు యుద్ధం చేసి, చివరకి సైక్లాప్స్ (వీరికి టార్టరస్ నుండి జూస్ విముక్తి కల్పించాడు) సహాయంతో జూస్, అతని సహోదరులు విజయం సాధి్స్తారు. అదే సమయంలో క్రోనస్, ఇతర రాక్షసులు టార్టరస్‌లో ఖైదుపాలవుతారు. ఆ తరువాత జూస్ తన సోదరి హేరాని పెళ్లి చేసుకుంటాడు. జూస్, అతని మిత్ర బృందం, ఒలింపస్ పర్వతం మీద స్థిరనివాసం ఏర్పరచుకుంటారు.
జూస్‌కి ఏడుగురు భార్యలు. ఏడుగురు భార్యలూ అమరులే. వారి పేర్లు: మెటీస్ (Metis), థెమీస్ (Themis), యురినోమి (Eurynome), డిమిటర్ (Demeter), నెమోసిన్ (Mnemosyne), లేతో (Leto), హేరా (Hera). అయినా జూస్‌కి స్త్రీ లోలత్వం పోలేదు. జూస్ అనేకమంది స్త్రీలతో మొత్తం 92 మంది పిల్లలకి తండ్రి అవుతాడు!
తనకంటే గొప్పవాడు అయిన కుమారునికి జన్మనిస్తుంది అని తెలిసి, జూస్ తన మొదటి భార్య అయిన మెటీస్‌ని మాయ చేసి, ఈగగా మార్చి మింగేస్తాడు. ఆమె అప్పటికే ఎథీనాని గర్భాన కలిగి ఉంది. ఏది ఏమయినప్పటికీ, ఎథీనా పూర్తిగా పెరిగి యుద్ధం కొరకు దుస్తులు, ఆయుధాలు ధరించి, జూస్ తల నుండి బయటికి వస్తుంది.
జూస్‌కి నెమోసిన్‌తో పుట్టిన తొమ్మిదిమంది ఆడపిల్లల్ని మ్యూజ్ (Muse) లంటారు. తల్లి నెమోసిన్ జ్ఞాపక శక్తికి అధిపత్ని అయితే తొమ్మిది మంది మ్యూజ్లు సాహిత్యాలకి, కళలకి, శాస్త్రాలకి అధిపత్నులు. ఒక గ్రంథ్ర రచన వంటి భృహత్కార్యం తలపెట్టినప్పుడు సాహిత్యాలకి అధిపత్ని అయిన మూజ్ని ఆహ్వానించి పనికి ఉపక్రమించడం ఆనవాయితీగా జరుగుతుంది.
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
గ్రీకు పురాణాలలో పేర్లు
గ్రీకు పురాణాలలో పేర్లు ఎలా రాయాలో, ఎలా ఉచ్చరించాలో అన్న విషయంలో స్పష్టత లేదు. ప్రపంచవ్యాప్తంగా సమాచారం ఇంగ్లీషులో దొరికినంత సులభంగా గ్రీకు భాషలో కూడ దొరకదు. ఉదాహరణకి ఈ మూడు పేర్లు చూడండి: ఈరోస్ (Eros), ఏరీస్ (Eris), ఆరిస్ (Ares). ఉచ్చారణలో ఇంత దగ్గరగా ఉన్న పేర్లు ఉండడానికి కారణం లేకపోలేదు; ఆ విషయం తరువాత చూద్దాం.
ఈరోస్ మన మన్మథుడి లాంటి వ్యక్తి. సృష్టికి ముందు ఉన్న అవ్యక్త అస్తవ్యస్త స్థితి నుండి ఉద్భవించిన త్రయం గాయా (భూదేవత), టార్టారస్ (పాతాళం), ఈరోస్ (కామ దైవం).
ఏరీస్ కలహభోజని. ఈర్ష్య, అసూయ ఈమె తత్త్వాలు. తగాదాలు పెట్టడంలో దిట్ట. ఈమెకి ఎక్కడా దేవాలయాలు లేవు. ఈమె తల్లిదండ్రులు ఎవ్వరు అన్న విషయం మీద నిర్ధిష్ఠమైన సమాచారం లేదు; ఒకొక్క పురాణంలో ఒకొక్కలా ఉంది. ఒక కథనం ప్రకారం ఈమె జూస్‌కి హేరాకి పుట్టిన బిడ్డ. ఈ లెక్కని ఈమె ఆరిస్‌కి తోబుట్టువు. మరొక కథనం ప్రకారం ఈమె నిక్స్‌కి (Nyx) మగ సంపర్కం లేకుండా పుట్టిన బిడ్డ. ఈ కోణం నుండి చూస్తే ఈమె ఈరోస్ వలెనే ఒక అపరావతారం (personified concept). వేరొక కథనం ప్రకారం ఈమె నిక్స్‌కి ఎరిబస్కి (Eribus) పుట్టిన బిడ్డ. ఆకాశంలో కనిపించే ఒక చిరు గ్రహానికి కూడా ఈమె పేరే పెట్టేరు.
కామదైవం అయిన ఈరోస్ పేరు, కలహభోజని అయిన ఏరీస్ పేరు ఒకదానితో మరోకటి పోలి ఉండడం కేవలం కాకతాళీయం కాకపోవచ్చు. తొలిచూపులో కలిగిన కామోద్రేకం కాలక్రమేణా కలహాలకి దారితీయడం చూస్తూనే ఉన్నాం కదా!
ఆరిస్ ద్వాదశ ఒలింపియనులలో ఒకడు. జూస్కీ హేరాకీ పుట్టిన బిడ్డ. యుద్ధాలకి అధిపతి. ఇతడే గిత్త రూపం దాల్చి మానవమాత్రుడైన పేరిస్ పెట్టిన పందెంలో గెలిచినప్పుడు పేరిస్ నిష్పక్షపాత బుద్ధి దేవలోకంలో తెలుస్తుంది.
•
Posts: 3,467
Threads: 0
Likes Received: 2,229 in 1,714 posts
Likes Given: 9
Joined: Feb 2020
Reputation:
29
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
గ్రీకు పురాణ గాథలు 5
హిందూ పురాణ గాథలలో సృష్టి జరిగిన విధానం
ఇంతవరకు చదివిన తరువాత, గ్రీకు పురాణ గాథలలో అస్తవ్యస్త పరిస్థితి నుండి సృష్టి జరిగిన విధానం, సంతానోత్పత్తి కొరకు మొదటి జంట ఏర్పడిన విధానాలలోని ఆచార వ్యవహారాలు చూస్తే కాసింత ఆశ్చర్యం, కాసింత జుగుప్స పుట్టుకొస్తాయి. ఇటీవలి కాలంలో డార్విన్ ప్రవచించిన పరిణామ సృష్టివాదం బలం పుంజుకొనక పూర్వపు రోజులలో మానవుడి పుట్టుక గురించి మనకి ఉన్న అవగాహన పూజ్యం. ఉదాహరణకి ఒక పురాణంలో సృష్టి ఎలా ప్రారంభం అయిందని చెప్పేరో చూద్దాం*.
శ్రీమన్నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ పుట్టేడు. శ్రీమన్నారాయణుడు ఎలా పుట్టేడని అడగొద్దు. ఆద్యంతాలు లేని సర్వాంతర్యామి ఆయన!
బ్రహ్మ మనస్సులోంచి (గ్రీకు కథనంలో ‘శిరస్సుని చీల్చుకుని’ అన్న ప్రయోగం ఉత్ప్రేక్ష అయి ఉంటుంది.) పుట్టినవారిని బ్రహ్మ మానస పుత్రులు అంటారు. వీరు ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం ఒకొక్క పురాణంలో ఒకొక్కలా ఉంది. దత్తాత్రేయ పురాణం ప్రకారం అలా బ్రహ్మ మనస్సులోంచి పుట్టుకొచ్చినవారే సప్తమహర్షులు. బ్రహ్మ నీడ లోంచి కర్దమ ప్రజాపతి అనే పురుషుడు ఉద్భవించేడు. బ్రహ్మ దక్షిణ భాగం నుండి స్వాయంభువ మనువు అనే పురుషుడు జన్మించేడు. కనుక స్వాయంభువ మన్వంతరంలో సప్తమహర్షులు, కర్దమ ప్రజాపతి, స్వాయంభువ మనువు బ్రహ్మ కొడుకులే కదా! (ఇక్కడ లెక్క స్వాయంభువ మన్వంతరం ప్రకారం అని గమనించ గోరుతాను. ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరంలో సప్తమహర్షులు వేరు; వారు కశ్యప, అత్రి, వసిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ. వీరు బ్రహ్మ మానసపుత్రులు కారు.)
బ్రహ్మ వామభాగం నుండి శతరూప అనే స్త్రీ ఆవిర్భవించింది. అనగా, శతరూప మొదటి స్త్రీ. స్వాయంభువ మనువు శతరూపని వివాహం చేసుకుంటాడు. వీరు ఆదిదంపతులు. అనగా స్వాయంభువ మనువు తన సోదరిని పెళ్లి చేసుకున్నాడన్నమాట! ఇది మొదటి జంట.
ఆదిదంపతులకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కొడుకులు, అకూతి, దేవహూతి, ప్రసూతి అనే కూతుళ్ళు పుట్టేరు. బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన రుచి అకూతిని వివాహం చేసుకుంటాడు. అనగా, రుచి తన సోదరుడికి, సోదరికి మధ్య ఉన్న వైవాహిక బంధం వల్ల పుట్టిన కుమార్తెని పెండ్లి చేసుకున్నట్లే కదా! ఇది రెండవ జంట.
కర్దమ ప్రజాపతి దేవహూతిని వివాహం చేసుకుంటాడు. ఇది మూడవ జంట. ఈ మూడవ జంటకి తొమ్మండుగురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగేరు. ఈ కుమార్తెల పేర్లు: కల, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఊర్ధ్వ, చితి, భ్యాతి. విష్ణువు అంశతో పుట్టిన కుమారుడు కపిలుడు.
బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన అత్రి, ఈ తొమ్మండుగురులో రెండవ అమ్మాయి అనసూయ నాలుగవ జంట! అత్రి ఒక విధంగా తమ్ముడి కూతుర్నీ మరొక విధంగా మనవరాలినీ పెళ్ళాడినట్లే కదా!
అత్రి ఆయుర్వేదాన్ని సృష్టించిన మహాముని. ఊర్ధ్వరేతస్కుడైన అత్రి తేజస్సు భావనాపూర్వక మిథునం ద్వారా అతని కంటినుండి కిందకి పడబోతుండగా వాయుదేవుడు దానిని అనంతంలోకి విసిరికొట్టాడు. దిగంగన దానిని స్వీకరించి, గర్భం ధరించి, బ్రహ్మంశతో అమృత స్వభావుడు, ఓషధీ గణపతి, రజోగుణ ప్రధానుడు అయిన చంద్రుడిని కన్నది.
అత్రి, అనసూయల మరొక పుత్రుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాంశలతో, మూడు శిరస్సులతో జనియించిన దత్తాత్రేయుడు. మహా శక్తిసంపన్నుడు.
అత్రి, అనసూయలకు శివాంశతో పుట్టిన మూడవ పుత్రుడు నిర్లిప్తుడు, మహాకోపి అయిన దుర్వాస మహాముని.
దత్తాత్రేయ పురాణంలో ఉన్న ఈ అంశాలు చాలు సృష్టి ఎలా ఆరంభమయి, విస్తరించిందో చెప్పడానికి! వేదాలలో దృక్పథం వేరుగా ఉంటుంది. ఉపనిషత్తులలో మరొక విధంగా ఉంటుంది. ఇతర పురాణాలలో ఇదే సంగతి మరొక విధంగా ఉంటుంది.
ఈ కోణంలో చూస్తే గ్రీకు పురాణం గాథలు అంత ఏవగింపుగా అనిపించవు.
(*ఆధారం: 1. మేనమామ బిడ్డ – పింగళి రమణరావు (ఎలక్ట్రాన్), ఆంధ్రప్రదేశ్, జులై 1999. 2. విలువల వెల ఎంత? (కథాసంకలనం), వాహిని బుక్ ట్రస్ట్, హైదరాబాద్, 2006.)
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
అపస్వరం అనే ఏపిల్ పండు కథ
గ్రీకు పురాణ గాథలలో ఒక కథ ఇది. ప్రస్తుతం టర్కీ దేశం ఆక్రమించిన ప్రాంతాన్ని పూర్వం ఏసియా మైనర్ అనేవారు. ఈ ప్రాంతపు ఈశాన్య మూలకి ట్రాయ్ అనే నగరం ఉండేది. గర్భవతిగా ఉన్న ఈ నగరపు రాణి హెకూబా (Hecuba) ఒక రాత్రి ఒక వింతైన జ్వాలని ప్రసవించినట్లు కల కన్నది. రాజు ఆస్థాన జ్యోతిష్కుడిని పిలిపించి కలకి అర్థం చెప్పమని అడిగేరు. ‘రాజా! రాణివారు ప్రసవించబోయే బాలుడు ట్రాయ్ నగరపు వినాశనానికి కారకుడు అవుతాడు! ఈ రాజ్యాన్ని, ప్రజలని రక్షించుకోవాలంటే ఈ బాలుడిని హతమార్చవలసిందే.’ అని జోస్యంతో పాటు ఆయన సలహా కూడా చెప్పేడు.
భూపతనమైన వెంటనే బాలుడిని హతమార్చమని భటుడికి ఆదేశం ఇచ్చేడు రాజు. ముక్కుపచ్చలారని పసికందు ప్రాణాలు తియ్యలేక భటుడు ఆ పసికూనని ఇడా పర్వతం మీద ఒక చెట్టు కింద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పసికందుని ఒక ఎలుగుబంటి చూసింది. పాపని చూసి, జాలిపడిందో ఏమో రాత్రల్లా కాపలా కాసింది. మరునాడు బాలుడు ఏమయ్యాడో చూద్దామని భటుడు తిరిగివచ్చేడు. ఆ బాలుడు ప్రాణాలతో కనిపించేసరికి ’ఈ బాలుడు భవిష్యత్తులో ఏదో సాధించవలసి ఉంది. అందుకనే ప్రాణాలతో బయట పడ్డాడు’ అనుకుంటూ ఆ పసివాడిని రహస్యంగా తన ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నాడు. శుక్లపక్ష చంద్రుడిలా పెరిగిన పేరిస్ (Paris) స్ఫురద్రూపి, సత్యసంధుడు, శీలవంతుడుగా ముల్లోకాలలోను పేరు తెచ్చుకున్నాడు.
పందేలలో పోటీకని పేరిస్ కోడె దూడలని పెంచేవాడు. పందెంలో తన గిత్తని ఎవ్వరి గిత్త ఓడగొడితే వారికి బంగారు కిరీటం బహుమానంగా ఇస్తానని పేరిస్ ఒకసారి సవాలు విసిరేడు. స్వర్గలోకంలో ఉన్న ఆరిస్ (Ares) ఈ సవాలు విన్నాడు. తానే స్వయంగా ఒక గిత్త రూపం దాల్చి పోటీలోకి దిగేడు. యుద్ధాలకి అధినేత అయిన ఆరిస్ ఈ పోటీని అనాయాసంగా గెలిచేడు. పేరిస్ పెద్దమనిషి తరహాలో ఓటమిని అంగీకరించి ఆరిస్‌కి బంగారు కిరీటాన్ని బహూకరించేడు. ఈ సంఘటనతో సత్యసంధుడు, మాట తప్పని పెద్దమనిషి అని పేరిస్ భూమి మీద, స్వర్గంలోనూ పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నాడు. ఇలాంటి పేరు రావడంతో ఒక అనూహ్యమైన పందేనికి పేరిస్ ఎలా న్యాయనిర్ణేత అయేడో చూద్దాం.
స్వర్గానికి అధినేత జూస్ భార్యలలో ఒకరైన థేమిస్ (Themis) జూస్ కొడుకులలో ఒకడు జూస్ని పదవీభ్రష్టుడిని చేస్తాడని జోస్యం చెప్పింది. ఈ జోస్యం ఇలా ఉండగా జూస్ ఒక రోజు సముద్రపుటొడ్డుకి విహారానికని వెళ్లి, అక్కడ థేటిస్ (Thetis) అనే జలకన్యని చూసి మనసుపడి, గాంధర్వ విధిని పెళ్లి చేసుకుంటానంటాడు. అప్పుడు థేటీస్‌కి పుట్టబోయే కొడుకు తండ్రిని మించినవాడు అవుతాడు అని మరొకరు జోస్యం చెప్పేరు. జూస్ రెండు రెండు కలిపితే నాలుగు అని లెక్క వేసుకుని, పెద్ద ఎత్తున కంగారుపడి, థేటిస్‌ని పీలియస్ అనే ముసలి మానవుడికి ఇచ్చి పెళ్లిచెయ్యడానికి తాంబూలాలు ఇప్పించేసేడు. విందుకి జూస్ అందరినీ ఆహ్వానించేడు, కలహభోజని అని పేరు తెచ్చుకున్న ఒక్క ఏరీస్‌ని (Eris) తప్ప!
తనకి ఈ విధంగా జరిగిన అవమానానికి ఏరీస్ కోపోద్రిక్తురాలు అయింది. అసహనంతో రగులుతున్న ఏరీస్ అతిథులు బారులు తీర్చి భోజనాలు చేస్తున్న మందిరానికి గాలివానలా దూసుకు వచ్చింది. ఆమె లోపలికి రాకుండా హెర్మీస్ (Hermes) అటకాయించి అగ్గి మీద గుగ్గిలం జల్లేడు. ఏరీస్ బయట నుండే ‘ఇదే నా పెండ్లి కానుక’ అంటూ ఒక బంగారు ఏపిల్ పండుని అతిథుల మధ్యకి విసిరింది. ఆ బంగారు ఏపిల్ పండు మీద ‘ఇది ముల్లోకాలలోను అందమైన ఆడదానికి మాత్రమే’ అని రాసి ఉంది. ఇంకేముంది. ఆ పండు నాదే! అంటూ అక్కడ ఉన్న దేవతలంతా ఎగబడ్డారు. ఆ దొమ్మీలో హేరా, ఎతీనా, ఏఫ్రొడిటి అనే ముగ్గురు దేవతలు ఆ పండుని స్వాధీనపరచుకుందుకి పోటీపడ్డారు.
హేరా సాక్షాత్తు జూస్ భార్య. పైపెచ్చు పట్టమహిషి. ఈమె స్త్రీలకి, వివాహ జీవితాలకి అధినేత్రి.
ఎతీనా విద్యలకి అధినేత్రి.
ఏఫ్రొడిటి అందాలకి దేవత.
ఈ ముగ్గురిలోను పండు ఎవ్వరికి చెందాలి? ముగ్గురూ దేవతలకి రాజైన జూస్ని తీర్పు చెప్పమన్నారు! జూస్‌కి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది. ఎవరి పక్షాన్న తీర్పు చెబితే ఎవ్వరికి కోపం వస్తుందో! వారిలో ఒకామె తన భార్య కూడా!
’ఈ సమస్యని న్యాయబద్ధంగా పరిష్కరించగలిగే స్థోమత భూలోకంలో ఉన్న ఒక్క పేరిస్‌కి తప్ప మరెవ్వరికీలేదు’ అంటూ తన కొడుకు హెర్మీస్‌ని తోడు ఇచ్చి అందరిని భూలోకంలో ఇడా పర్వతం మీద ఉన్న పేరిస్ దగ్గరకి పంపి ఇబ్బంది నుండి తప్పుకున్నాడు జూస్!
సాక్షాత్తు స్వర్గలోకానికి అధిపతి అయిన జూస్ తనయుడు హెర్మీస్ స్వయంగా వచ్చి అడుగుతూ ఉంటే పశువులని కాసుకుంటూన్న పేరిస్ కాదనలేకపోయేడు. దేవతల ముందు నిలబడి ముగ్గురిని పరకాయించి చూస్తున్నాడు. దేవతలు ముగ్గురూ ఎలాగో ఒకలాగ పేరిస్‌ని మభ్యపెట్టి తీర్పు తమవైపు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.
“నన్ను ఎంపిక చేస్తే నిన్ను ఐరోపాకీ, ఆసియా మైనరుకి చక్రవర్తిని చేస్తాను.” అని ఆశ పెట్టింది హేరా.
ఎతీనా ముందుకి వచ్చి, “నీకు విద్యాబుద్ధులు ప్రసాదిస్తాను. యుద్ధరంగంలో తిరుగులేని అస్త్రాలు ఇస్తాను.” అని ఎర చూపించింది.
చిట్టచివరికి తన కురులని సుగంధం వెదజల్లే పువ్వులతో అలంకరించుకున్న ఏఫ్రొడిటి ముందుకి వచ్చి, “పేరిస్! నువ్వు నన్ను ఎన్నుకున్నావంటే నీకు మరపురాని అనుభవాన్ని ప్రసాదిస్తాను. స్త్రీ యొక్క ప్రేమ ఎలా ఉంటుందో చవి చూపిస్తాను. స్పార్టా రాణి హెలన్‌ని (Helen of Sparta) మించిన అందగత్తె ఈ భూలోకంలో లేదు. ఆమె పొందు నీకు దక్కేలా వరం ఇస్తాను. ఆమె నీ సందిట బందీ అయేలా చేస్తాను. ఏమంటావు?” అంటుంది
హెలెన్ అసాధారణమైన అందగత్తె. ఆమె చేతినందుకోవడం కోసం ఎందరో యువకులు ఉవ్విళ్ళూరేవారు. శూరులు, వీరులు, మేధావులు, ఒకరేమిటి? ఎవరిని ఎన్నుకుంటే ఎవరికి కోపం వస్తుందో? హెలెన్‌ని వరించడానికి వచ్చిన యువరాజులందరి దగ్గర మెనలౌస్ (Menelaus) ఒక హామీ తీసుకున్నాడు. భవిష్యత్తులో ఈ కొత్త దంపతులకి ఏ ఆపద వచ్చినా అందరూ సైన్యసమేతంగా వచ్చి హెలెన్‌ని రక్షించాలి. అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు హెలెన్ తండ్రి టిండరియుస్ (Tyndareus) స్పార్టా రాజైన మెనలౌస్‌ని హెలన్ భర్తగా ఎంపిక చేసేడు.
ఇలా పెళ్ళి అయిపోయి, కాపురం చేస్తున్న హెలెన్‌ని పేరిస్‌ని ప్రేమించేలా చేస్తుంది ఏఫ్రోడిటి. ఈ సంఘటన మహాభారత యుద్ధాన్ని పోలిన మహాసంగ్రామానికి దారి తీసింది. గ్రీకులకి, ట్రాయ్ నగరానికి మధ్య జరిగిన ఈ భీకర పోరాటాన్ని హోమర్ అనే రచయిత తన ఇలియడ్, ఆడెస్సీ అనే ఉద్గ్రంథాలలో పొందుపరిచేడు. ఈ కథలో కొన్ని పాత్రలు భువి నుండి దివికి, దివి నుండి భువికి సునాయాసంగా తిరుగుతూ ఉంటాయి. దేవతలు పోటీ పడి, పందెం కట్టి, దాని పర్యవసానంగా భూమి మీద లక్షలాది ప్రజలు నాశనం అవడానికి కారణభూతులు అవుతారు.
(సశేషం)
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
గ్రీకు పురాణ గాథలు 6
ట్రాయ్ మహా సంగ్రామం
గ్రీకు పురాణ గాథలలో ప్రసిద్ధికెక్కిన ఈ మహా సంగ్రామానికి, తద్వారా జరిగిన మారణహోమానికి మూల కారణం ఏరిస్ (Eris) అనే ఒలింపియన్ దేవత అని మనం తీర్మానం చెయ్యవచ్చు. (ఏఫ్రొడైటి (Aphrodite) కొడుకు ఈరోస్ (Eros) మన మన్మథుడికి పోలిక! ఏరిస్ బంగారు ఏపిల్ పండుని పెళ్లి పందిరిలోకి విసిరిన వ్యక్తి.)
ఒక వివాహ సందర్భంలో ఒలింపియను దేవతల అధినేత అయిన జూస్ ఒక బ్రహ్మండమైన విందు చేస్తాడు. కోరుకుని కొరివితో తలగోక్కోవడం ఎందుకని పేచీకోరు ఏరిస్‌ని ఆ విందుకి పిలవడు. జరిగిన పరాభవానికి ఆత్మాభిమానం దెబ్బతిన్న ఏరిస్ పిలవని పేరంటంలా విందుకి రానే వచ్చింది. జూస్ ఆజ్ఞానుసారం హెర్మీస్ ఆమెని లోపలికి రాకుండా అటకాయిస్తాడు. ఏరిస్ తక్కువ తిన్నదా? బయట నుండే బంతి భోజనాల మధ్యకి ఒక బంగారు ఏపిల్ పండుని విసరి వెళ్లిపోతుంది. ఆ పండు మీద ’మీలో అందమైన ఆడదానికి ఈ బహుమానం’ అని రాసి ఉంటుంది.
విందులో ఉన్న ముగ్గురు దేవతలు–హేరా, ఎథీనా, ఏఫ్రొడైటి, ఆ పండు నాకోసమే అంటే నాకోసమే అంటూ ఎగబడి తగువులాడుకుంటారు. తీర్పు చెప్పమని ముగ్గురూ జూస్ని అడుగుతారు. ఎటు తీర్పు చెప్పినా ఇబ్బందే అని జూస్ ఈ ముగ్గురికీ హెర్మీస్‌ని తోడు ఇచ్చి భూలోకంలో ఉన్న పేరిస్ దగ్గరకి పంపుతాడు. ముగ్గురిలోనూ ఏఫ్రొడైటి అందమైనదని పేరిస్ తీర్పు చెబుతాడు. దానికి బహుమానంగా పేరిస్‌ని భూలోక సుందరి హెలెన్–మెనలౌస్ భార్య–వరించేలా వరం ఇస్తుంది.
హెలెన్ కన్నతల్లి స్పార్టాకి రాణి అయిన లేడా (Leda). హంస రూపంలో జాస్ వచ్చి లేడాని అనుభవించగా హెలెన్ పుట్టిందని ఒక కథనం ఉంది. కనుక హెలెన్ దైవాంశ సంభూతురాలు. స్పార్టాకి రాజైన టిండరియుస్ (Tyndareus) హెలెన్‌ని తన సొంత కూతురిలాగే చూసుకున్నాడు. హెలెన్ అందాన్ని చూసి ఎంతోమంది రాజులు, ధీరులు ఆమెని చేపట్టటానికి ముందుకి వచ్చేరు. ఒకరి వైపు మొగ్గు చూపితే మరొకరికి కోపం వస్తుందని టిండరియుస్ భయపడ్డాడు. చివరికి ఇథాకా రాజైన ఒడీసియస్ (Odysseus) తనకి పెనెలొపిని (Penelope) ఇచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేస్తే ఒక పరిష్కార మార్గం సూచిస్తానన్నాడు. ఆ మార్గం ఏమిటంటే హెలెన్ ఎవ్వరిని పెళ్లి చేసుకున్నా సరే మిగిలిన రాజులంతా ఆ వివాహాన్ని సమర్థించాలి. అంతా ఒప్పుకున్నారు. అప్పుడు టిండరియుస్ తన కోరిక మేరకు హెలెన్‌ని మెనలౌస్కు (Menelaus) ఇచ్చి పెళ్లి చేసేడు.
మెనలౌస్‌కి హెలెన్‌ని ఇవ్వడంలో రాజకీయం లేకపోలేదు. మెనలౌస్ ధనవంతుడు. అతనికి పెద్ద సైన్యం ఉంది. పెద్దల యెడల ఎలా ప్రవర్తించాలో ఎరిగిన వ్యక్తి. పెళ్లి విషయంలో కూడా తనంత తానుగా ఎగబడలేదు; తన అన్నగారైన అగమెమ్నాన్ (Agamemnon) ద్వారా వర్తమానం పంపేడు. ఈ అగమెమ్నాన్ మరెవరో కాదు; హెలెన్‌కి సాక్షాత్తు మరిది. ఎందుకైనా మంచిదని ఈ పెళ్లి జరిగితే ప్రేమదేవత ఏఫ్రొడైటికి వంద గిత్తలు బలి ఇస్తానని మెనలౌస్ మొక్కుకున్నాడు కూడా. ఆ మొక్కు సంగతి మరచిపోయి ఏఫ్రొడైటి ఆగ్రహానికి గురి అవుతాడు; అది వేరే సంగతి!
ట్రాయ్ నగరపు రాయబారి వర్గంలో ఒక వ్యక్తిగా పేరిస్ చొరబడి స్పార్టాలో ప్రవేశిస్తాడు. పేరిస్ రాజప్రాసాదంలోకి ప్రవేశించేలోగా ఏఫ్రొడైటి అందాల పోటీలో తాను పేరిస్‌కి ఇచ్చిన వరం నెరవేర్చడానికిగాను ఈరోస్ (Eros) సహాయం కోరుతుంది. ఈరోస్ తన పువ్వుల బాణంతో హెలెన్‌లో కామాతురతని రెచ్చగొడతాడు. ఏఫ్రొడైటి ఇచ్చిన వరం ప్రకారం పేరిస్‌ని చూడగానే హెలెన్ ప్రేమలో పడుతుంది. హెలెన్‌ని వెంటపెట్టుకుని పేరిస్ ట్రాయ్ వెళ్ళిపోతాడు.
హెలెన్ అపహరణ అనే పని ఆ రోజుల్లో కొత్తేమీ కాదు. ఇటువంటి ’స్త్రీ గ్రహణాలు’ ఆ రోజుల్లో తరచుగా జరిగేవి. మైసినే (Mycenae) నుండి లో (Lo) అపహరణ, ఫినీషియా (Phoenicia) నుండి యూరోపా (Europa) అపహరణ కేవలం రెండు ఉదాహరణలు. కొల్చిస్ (Colchis) నుండి మెదీయాని (Medea) జేసన్ (Jason) అపహరిస్తాడు. ట్రాయ్ నగరం నుండి హెరాక్లిస్ (హెర్క్యులిస్) రాకుమారి హెసియోనెని (Hesione) అపహరించి ఆమెని టెలమాన్కి (Telamon) కానుకగా ఇస్తాడు. ఈ అపహరణలు జరిగినప్పుడు పర్యవసానంగా అనుకోని విపత్తులు ఏవీ రాకపోవడంతో హెలెన్‌ని దొంగిలించడానికి పేరిస్‌కి ధైర్యం వచ్చిందని చరిత్రకారుడు హెరొడోటస్ వ్యాఖ్యానిస్తాడు.
హోమర్ చెప్పిన కథనం ప్రకారం మెనలౌస్ తన స్నేహితుడైన ఒడీసియస్‌ని వెంటబెట్టుకుని ట్రాయ్ నగరంతో సంప్రదింపులు జరిపి హెలెన్‌ని వెనక్కి తెచ్చుకుందామని ప్రయత్నిస్తాడు. ఆ రాయబారం విఫలం అవుతుంది. ఇది సంగ్రామానికి నాంది అవుతుంది.
రాయబారం విఫలం అవడంతో హెలెన్ వివాహాన్ని రక్షిస్తానని మాట ఇచ్చిన అగమెమ్నాన్‌ని మాట నిలుపుకోమని మెనలౌస్ అడుగుతాడు. అప్పుడు మైసినేకి (Mycenae) రాజు అయిన అగమెమ్నాన్ గ్రీకు యోధులని సమకూర్చుకుని, వెయ్యి పడవల బలగంతో ట్రాయ్ మీదకి దండయాత్ర చేసి, నగరాన్ని ముట్టడించి, నగరాన్ని పదేళ్ళపాటు దిగ్బంధం చేస్తాడు. ఈ ఘోరమైన యుద్ధంలో ఎఖిలీస్ (Achilles), ఏజాక్స్ (Ajax) వంటి గ్రీకు యోధులు, హెక్టర్ (Hector), పేరిస్ (Paris) వంటి ట్రాయ్ యోధులు వీరస్వర్గం పొందుతారు.
యుద్ధంలో పేరిస్ మరణించిన తరువాత హెలెన్ అతని అన్నదమ్ముడైన డియ్ఫోబస్‌ని (Deiphobus) పెళ్లి చేసుకుంటుంది. ట్రాయ్ నగరం పతనమైపోయిన తరువాత డియ్ఫోబస్‌ని వదిలేసి తిరిగి మెనలౌస్‌తో కలిసి స్పార్టా వచ్చేసి శేషజీవితం గడుపుతుంది.
యుద్ధం ముగిసిన తరువాత ఒడీసియస్ (యులిసిస్) తిరుగు ప్రయాణం చేసి ఇథాకా చేరుకుందికి పదేళ్లు పడుతుంది. ఈ తిరుగు ప్రయాణంలో ఒడీసియస్ ఎదుర్కున్న సవాళ్ళని హోమర్ తన రెండవ గ్రంథం ఆడిస్సిలో వర్ణిస్తాడు. ఆడిస్సి రూఢ్యర్థం మహా ప్రస్థానం. ఇలియడ్ రూఢ్యర్థం కష్టకాలం.
సా. శ . పూ. 1వ శతాబ్దంలో రోమ్‌కి చెందిన కవి వర్జిల్ (Virgil) ఎనియాడ్ (Aeneid) అనే గ్రంథంలో యుద్ధం ముగిసిన తరువాత కొందరు గ్రీకు యోధులు, ఎనియస్ (Aeneas) నేతృత్వంలో సముద్రం దాటుకుని ప్రస్తుతం టునీషియాలో ఉన్న కార్తేజ్ (Carthage) వచ్చి, అక్కడ నుండి ఇటలీ వచ్చి, రోమ్ నగరం స్థాపనకి కారణభూతులు అవుతారు.
పాశ్చాత్యులు హోమర్ రాసిన ఇలియడ్ (Iliad), ఆడిస్సిలతో (Odyssey) వ్యాసుడు రాసిన భారతాన్ని పోలుస్తారు. కేవలం ఉపరితలం మీద కనిపించవచ్చేమో కానీ లోతుగా పరిశీలిస్తే ఈ పోలిక సరికాదు. హోమర్ రాసిన ఇలియడ్, ఆడిస్సిలు రెండింటికంటే భారతం రెట్టింపుకి మించి పొడుగు ఉంటుంది! అంతే కాదు; భారతంలో ఆద్యంతం ఒక కథ ఉంది. ఆ కథ వెనుక ఒక బందుకట్టు ఉంది. భారత యుద్ధం మానవుల అత్యాశ వల్ల జరిగితే ట్రాయ్ యుద్ధం దేవతల చెలగాటాల వల్ల జరుగుతుంది. ట్రాయ్ యుద్ధంలో మానవులు దేవతల చేతిలో కేవలం పావులు. భారతం మీద వ్యాఖ్యానాలు చేసిన అనేక పాశ్చాత్యులు గ్రీకు పురాణ గాథల వల్ల ప్రభావితులై గ్రీకు పురాణ కాలపు పట్టకం ద్వారా చూస్తూ చేసేరు తప్ప స్వతంత్రమైన దృక్పథంతో చేసినవారు కారని నా అభిప్రాయం.
Posts: 1,861
Threads: 1
Likes Received: 1,304 in 1,059 posts
Likes Given: 124
Joined: Apr 2021
Reputation:
22
80 yearsa ante mee degara chala stuff unde untundhi. piga chala bhaga handle cheyagalaru anukunta mee mida emina hope pettukovachu anukunta well come sir,miru Edo okkati rayandi sir rayandi.emmi rastaro mee istam.
Posts: 41
Threads: 0
Likes Received: 41 in 33 posts
Likes Given: 156
Joined: May 2019
Reputation:
0
Mana puranalalo jana bahulyamlo prasasthi ganchina saraswati Nadi mayamypoyindi sumaru 13000 years kritham ante mana samskruti Inka purathanamynadi antaru. Inkoka study prakaram vedalu puttindi sumaru 21000 years kindavta ani antaru.
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
ట్రాయ్ సంగ్రామం నిజమా? కల్పనా?
మహాభారత యుద్ధం గురించి చదువుతున్నప్పుడు వచ్చే రకం సందేహాలే ట్రాయ్ సంగ్రామం గురించి కూడా వస్తాయి. ఈ కథ పురాణమా? ఇతిహాసమా? ఈ యుద్ధం నిజంగా జరిగిందా? జరిగితే ఎప్పుడు జరిగింది? యుద్ధంలో కనిపించే సంఘటనలు, పాత్రలు (మనుష్యులు, దేవతలు) నిజమా? కల్పనా? ఈ యుద్ధం గురించి ఎవ్వరు రాసేరు? ఎప్పుడు రాసేరు? వగైరా, వగైరా!
ఈ యుద్ధం గురించి మనకి ఉన్న ముఖ్యమైన ఆధారాలు గ్రీకు సాహిత్యంలో కనిపిస్తాయి; కానీ ఏ ఒక్క చోటా మనకి సాధికారంగా ఆధారాలు కనబడవు. ఈ యుద్ధం నిజంగా జరిగి ఉంటే అది సా. శ. పూ. 1194-1184 మధ్య కాలంలో జరిగి ఉండవచ్చని గ్రీకు శాస్త్రవేత్త ఎరతోస్తనీస్ (Eratosthenes) వేసిన అంచనా నమ్మదగ్గదే అనడానికి అధారాలు కనిపిస్తున్నాయని పురావస్తు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అనగా, కంచు యుగపు చివరి దశలో అని మనం చెప్పుకోవచ్చు.
సా. శ. 1870లో జెర్మనీ దేశపు పురావస్తు పరిశోధకుడు హైన్రిక్ ష్లీమన్ (Heinrich Schliemann) పశ్చిమ టర్కీలో (ట్రాయ్ నగరపు సమీపంలో) జరిపిన తవ్వకాలలో ఒక శిథిలమైన కోట దిబ్బ, దాని చుట్టూ 25 మీటర్ల లోతు వరకు శిథిలమైన భవనాల అవశేషాలు కనిపించేయి. వాటి చుట్టూ 46 ఇతర వాటికలు కనిపించేయి. ఇటీవల జరిపిన మరికొన్ని తవ్వకాలలో కనబడ్డ ఒక పురాతన నగరం హైన్రిక్ ష్లీమన్ కనుక్కున్న నగరం కంటే పదింతలు పెద్దది అని తెలిసింది. ఈ నగరం ఉన్న ప్రాంతాలలో సా. శ. పూ. 3000 నుండి సా. శ. పూ. 1350 వరకు అవిరామంగా జనావాసాలు ఉండేవని తీర్మానించేరు. అంతేకాదు. సా. శ. పూ. 1180కి సంబంధించిన స్తరాలలో వేడికి మాడిపోయిన అవశేషాలు, మానవ ఆస్థిపంజరాలు కనిపించడంతో అవి ఏదో యుద్ధానికి సంబంధించినవే అయుంటాయని నమ్ముతున్నారు.
ఈ నగరం గురించి, అక్కడ జరిగిన యుద్ధం గురించి, ఆనోటా ఈనోటా జానపదుల నోటా 400 సంవత్సరాల తరువాత విన్న కథలని హోమర్ ఇలియడ్, ఆడిస్సి అనే రెండు ఉద్గ్రంథాలలో పొందుపరచి ఉంటాడు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇలియడ్ సంకలనం సా. శ. పూ. 750లోను, ఆడిస్సి సంకలనం సా. శ. పూ. 725లోను పూర్తి అయి ఉంటాయి. ఇలా సంకలించబడ్డ కథల సమాహారం లిఖిత రూపం దాల్చేసరికి మరికొన్ని దశాబ్దాలో, శతాబ్దాలో పట్టి ఉండవచ్చు.
అసలు హోమర్ అనే వ్యక్తి ఉన్నాడా అని ప్రశ్నించేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని గ్రీకు మాండలికాలలో హోమర్ అంటే గుడ్డివాడు అని అర్థం వస్తుంది కనుక హోమర్ గుడ్డివాడయి ఉంటాడని కొందరి తీర్మానం. ఎందుకంటే ఆడిస్సిలో ఒక చోట ఒక అంధుడు పాత్రగా వచ్చి యుద్ధంలో విశేషాలని కథల రూపంలో చెబుతాడు. హోమర్ ఈ విధంగా తాను చెబుతున్న కథలో తానే ఒక పాత్రలా వచ్చేడని వీరి అభిప్రాయం. వ్యాసుడు కూడా భారత కథలో అక్కడక్కడ అతిథి నటుడిగా వస్తూ ఉండడం గమనార్హం.
ఈ కథని చారిత్రక పరిశోధన కోణం నుండి విశ్లేషించడం కష్టం. ఈ కథలో తారసపడే చాల పాత్రలు దైవాంశ సంభూతులు (demigods), అనగా దేవతలు, మానవులు కలవగా పుట్టినవారు. ఉదాహరణకి హెలెన్ ఒలింపియను దేవత అయిన జూస్ ఒక హంస రూపంలో వచ్చి మానవ వనిత లేడాని బలవంతం చెయ్యగా పుట్టిన సంతానం. అదే విధంగా హెలెన్‌ని పేరిస్ వశపరచుకోడానికి టైటన్ దేవత ఏఫ్రొడైటి ఇచ్చిన వరం కారణభూతం అవుతుంది. ఈ రకం సంఘటనలు నిజజీవితాలలో జరగడం అనేది మన అనుభవాలకి అతీతం. అలాగే యుద్ధం పది సంవత్సరాలు జరుగుతుంది. కంచు యుగంలో ట్రాయ్ నగరాన్ని పది రోజులు దిగ్బంధం చేసేరంటే నమ్మవచ్చేమోకాని పదేళ్లు కొంచెం అతిశయోక్తి అనిపిస్తుంది.
ఈ సమాచారం అంతటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ట్రాయ్ అనే నగరం ఉండి ఉండవచ్చు. ఆ నగరం వద్ద పెద్ద యుద్ధం జరిగి ఉండవచ్చు. ఆ యుద్ధం జరగడానికి హెలెన్ అనే అందమైన ఆడదానిని పేరిస్ అనే యువకుడు అపహరించడం కారణం అయి ఉండవచ్చు. ఆ యుద్ధంలో గ్రీకు సైనికులు ఒక కొయ్య గుర్రంలో దాగుని దొంగచాటుగా ట్రాయ్ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని నాశనం చేసి ఉండవచ్చు. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలే కావచ్చు. కానీ ఈ కథలో కనిపించే దేవతలు, వారికీ మానవులకీ మధ్యనున్న సంబంధ బాంధవ్యాలు మన అనుభవ పరిధిలో నమ్మడానికి వీలు లేనివి. వీటిని కవి కల్పించిన ఉత్ప్రేక్షలు అనే అనుకోవాలి.
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
ఇలియడ్
హోమర్ రాసిన ఇలియడ్లో కథనం గ్రీసు సేనలకి, ట్రాయ్ సేనలకి మధ్య యుద్ధం తొమ్మిదో సంవత్సరంలో ఉండగా మొదలవుతుంది. కవి సాహిత్యాధిదేవత అయిన మూజ్ని (Muse) ప్రార్థించి గ్రీకు యోధులలో అగ్రేసరుడైన ఎఖిలీస్ కోపోద్రేకాలకి కారణమేమిటో చెప్పడంతో గ్రంథ రచన ప్రారంభం అవుతుంది. యుద్ధం మొదలయి తొమ్మిదేళ్లు గడచిన తరువాత గ్రీకు సైన్యం ట్రాయ్ మిత్రరాజ్యం అయిన క్రిసిని ముట్టడించి లొంగదీసుకుంటుంది. ఈ సందర్భంలో ఓడిపోయిన రాజ్యానికి చెందిన ఇద్దరు కన్యలు–క్రిసేయిస్ (Chryseis), బ్రెసేయిస్ (Briseis)–గ్రీకుల వశం అవుతారు. గ్రీకుల సేనాధిపతి అగమెమ్నాన్ క్రిసేయిస్‌ని తనకి దక్కిన బహుమానంగా తీసుకుంటాడు. ఏఖిలీస్ బ్రెసేయిస్‌ని తీసుకుంటాడు. క్రిసేయిస్ తండ్రి క్రిసెస్–సాక్షాత్తు ఒలింపియను దేవుడైన అపాలోకి (Apollo) హితుడు–కూతురు బంధ విమోచనకి అగమెమ్నాన్కి ఎంతో విలువైన నగలు, ఆభరణాలు పణంగా పెడతాడు కానీ అగమెమ్నాన్ లొంగడు. తన హితునికి ఎదురవుతున్న పరాజయం చూడగానే అపాలోకి కోపం వచ్చి అగమెమ్నాన్ సేనల మీద ప్లేగు మహమ్మారి పడాలని శపిస్తాడు.
తమ సేనలు ఎండలలో పిట్టలలా రాలిపోతూ ఉంటే చూసి కంగారుపడి, ఎఖిలీస్ దైవజ్ఞులని సంప్రదించగా, కాల్చస్ (Calchas) అనే దైవజ్ఞుడు లేచి, ఇదంతా అపాలో శాపం వల్ల జరుగుతోంది అని చెబుతాడు. అప్పుడు అగమెమ్నాన్ అయిష్టంగానే క్రిసేయిస్‌ని వదలుకుందుకి ఆమోదిస్తాడు; కానీ ఒక మెలిక పెడతాడు. ఏమిటా మెలిక? తాను క్రిసేయిస్‌ని వదులుకుంటే ఆ స్థానంలో ఎఖిలీస్ తనకి బ్రెసేయిస్‌ని ఇచ్చెయ్యాలి! ఈ వంకాయల బేరం విని ఎఖిలీస్ కోపోద్రేకుడయి, కత్తి దూసి, అగమెమ్నాన్‌తో ద్వంద్వ యుద్ధానికి తయారవుతాడు. ఒక పక్క ట్రాయ్ సేనలు భీకర పోరాటంలో ఉండగా ఈ గిల్లికజ్జాలు ఏమిటని కాబోలు ఒలింపియను దేవత హేరా ఈ యోధుల మధ్య సంధి కుదర్చమని ఎథీనాని పంపుతుంది. నెస్టర్ సహాయంతో ఎథీనా చేసిన హితోపదేశం ఎఖిలీస్ కోపాన్ని చల్లార్చుతుంది. తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారంగా తాను ఇటుపైన యుద్ధం చెయ్యనని ప్రతిన పూని తన గుడారానికి చేరుకుంటాడు. ఎఖిలీస్ తన కోపం చల్లారక ముందే తన తల్లి అయిన సముద్రపు జలకన్య థేటిస్‌ని పిలచి తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారం చెయ్యడానికి దేవతల రాజైన జూస్ నుండి సహాయం అర్థించమని అడుగుతాడు.
ఇది ఇలా ఉండగా అగమెమ్నాన్ క్రిసేయిస్‌ని ఆమె తండ్రి దగ్గరకు పంపేసి, బ్రెసేయిస్‌ని తన దగ్గరకి రప్పించుకుంటాడు. ఒడీసియస్ తన పడవలో క్రిసేయిస్‌ని తీసుకువెళ్ళి ఆమె తండ్రికి అప్పగించగా, అతను సంతృప్తి చెందినవాడై గ్రీకు సైనికులని శాపం నుండి విముక్తి చెయ్యమని అపాలోని కోరుకుంటాడు. గ్రీసుకీ ట్రాయ్‌కి మధ్య తాత్కాలికంగా యుద్ధ విరమణకి ఒప్పందం జరుగుతుంది.
గ్రీకు సేనలకి, ట్రాయ్ సేనలకి మధ్య యుద్ధం ఆగింది కానీ ఎఖిలీస్‌కి అగమెమ్నాన్‌కీ మధ్య విరోధ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. దేవతల రాజైన జూస్ని కలుసుకోడానికి థేటిస్‌కి పన్నెండు రోజులు పట్టింది. జూస్ ట్రోయ్ పక్షం కాస్తే భార్య హేరాకి కోపం వస్తుంది; ఆమె గ్రీకుల పక్షం! కాని థేటిస్ కోరికని కాదనలేకపోయాడు, జూస్. హేరాకి కోపం రానే వచ్చింది. మానవుల మధ్య జరుగుతూన్న ఈ పోరాటంలో దేవతలు తల దూర్చడం శ్రేయస్కరం కాదని ఆమె కొడుకు హెఫయెస్టస్ హేరాకి హితోపదేశం చేస్తాడు.
ఈలోగా ట్రాయ్ పక్షంవారు యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అప్పుడు జూస్ ట్రాయ్ పక్షం వహించి వారికీ సహాయం చెయ్యడానికి వస్తాడు. జూస్ ట్రాయ్ పక్షం కాయడం, ఎఖిలీస్ అస్త్ర సన్యాసం చేసి ఇహ పోరాడనని భీష్మించుకుని కూర్చోవడం వల్ల గ్రీకు సేనలు బాగా నష్టపోతారు. చాల రోజులు జరిగిన ఆ భీకర పోరాటంలో పేరిస్-మెనలౌస్‌ల మధ్య, హెక్టర్-ఏజాక్స్‌ల మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధాలు చిరస్మరణీయమైనవి. అయినా సరే ట్రాయ్ సైన్యాలు గ్రీకు సేనావాహినిని తరిమి కొట్టాయి.
భారత యుద్ధంలో వ్యాసుడు పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని, దినాలవారీగా, వ్యూహాలవారీగా, అస్త్రాలవారీగా ఎలా వర్ణిస్తాడో హోమర్ కూడా అలా ఆ యుద్ధాన్ని వర్ణించుకుంటూ వస్తాడు. చిట్టచివరికి ట్రాయ్ నగరాన్ని పడగొట్టలేక గ్రీసు సేనలు పడవలలో ఎక్కి పారిపోతారు. ఆ హడావిడిలో ఒక కొయ్యగుర్రాన్ని సముద్రపుటొడ్డున వదిలేసి మరీ పోతారు. ట్రాయ్ సేనలు వారి విజయానికి ఆ గుర్రం ఒక అభిజ్ఞానం అనుకుంటూ దానిని ఈడుచుకుని పట్టణం లోపలికి తీసుకుపోతారు. లోపలికి వెళ్లిన తరువాత ఆ కొయ్యగుర్రం తలుపులు తెరుచుకుని గ్రీకు సేనావాహిని బయటకి వచ్చి ట్రాయ్ నగరాన్ని పరిపూర్ణంగా కొల్లగొట్టి పోతారు.
భారత యుద్ధం ధర్మయుద్ధానికి ప్రతీక అయితే ట్రోయ్ యుద్ధం దేవతల అహానికి, స్వల్పబుద్ధికి ప్రతీక అనుకోవచ్చు.
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
గ్రీకు పురాణ గాథలు 7
కసాండ్రా (Cassandra) కథ
కసాండ్రా గ్రీసు దేశపు పురాణ గాథలలో వచ్చే శాపగ్రస్తురాలైన ఒక వ్యక్తి. భవిష్యత్తులో ఏమి జరగబోతోందో చెప్పగలిగే శక్తి ఉన్న వ్యక్తి ఈమె, ఈ శక్తిని ఈమె అపాలో (Apollo) దగ్గర నేర్చుకుంది. కానీ అపాలో ఇచ్చిన శాపం వల్ల ఈమె మాటని ఎవ్వరూ నమ్మరు. అదెంత ప్రమాదానికి దారితీసిందో ఈ కథలో చూద్దాం.
కసాండ్రా గ్రీసు దేశపు పురాణ గాథలలో వచ్చే ట్రాయ్ నగరపు రాకుమారి. ఈ ఉదంతం ట్రాయ్ సంగ్రామం జరగడానికి ముందు జరిగిన కథ. కసాండ్రా ట్రాయ్ నగరాన్ని పాలిస్తున్న రాజు ప్రియమ్కీ (Priam) రాణి హెకూబాకీ (Hecuba) పుట్టిన కవల పిల్లలలో ఆడపిల్ల; ఈమె కవల అన్నదమ్ముడు హెలెనస్ (Helenus). నల్లటి కురులు, కలువ రేకుల లాంటి కళ్ళతో ఎంతో అందంగా ఉండేదని పేరు! అందమైన అమ్మాయిల కోసం అదేపనిగా వేటలో ఉన్న (దరిదాపు ఒలింపియా కొండ మీద ఉన్న దేవతలంతా చేసేపని ఈ రకం వేటే!) అపాలో దృష్టి కసాండ్రా మీద పడింది. ప్రేమలో పడ్డాడు. వెంటపడ్డాడు. ప్రేమలో పడ్డ దేవతలని నిరాకరించే మనుష్యులు ఉంటారా? కానీ అదేమి విడ్డూరమో అపాలో అవస్థని చూసి కసాండ్రా నవ్వుకుంది; అతని ప్రేమని నిరాకరించింది.
కసాండ్రా మనస్సుని ఎలాగో ఒకలాగ గెలవాలనే తపనతో ఆమెకి అపూర్వమైన కానుకని ఇవ్వడానికి ప్రయత్నించేడు అపాలో. అన్నీ ఉన్న రాకుమారికి తను కొత్తగా ఏమి ఇవ్వగలడు? ఆమెకి అందం ఉంది. ఐశ్వర్యం ఉంది. కాని ఆమెకి లేనిది, తన దగ్గర ఉన్నది ఒకటి ఉంది. అది దివ్యదృష్టి. భవిష్యత్తులోకి చూడగలిగే శక్తి. ఇంత ఆసక్తికరమైన ప్రేమబహుమానం ఎదురైనప్పుడు కసాండ్రా కాదనలేకపోయింది. ప్రతిఫలం మీద ఆశతో అపాలోతో ‘వీపు గోకుడు బేరానికి’ కస్సాండ్రా ఒప్పుకుంది. తన వంతుగా అపాలో దివ్యదృష్టి ఇచ్చే మంత్రాన్ని కసాండ్రాకి ఉపదేశించేడు. మంత్రం నేర్చుకున్న తరువాత అపాలోకి ముట్టవలసిన ‘పారితోషికం’ ఇవ్వకుండా ఎగ్గొట్టింది; అపాలో ఎగబడుతూ చేస్తూన్న పురోగమనాలని కసాండ్రా నిరాకరించింది.
ఆత్మాభిమానం దెబ్బతిన్న అపాలో ఉగ్రుడయాడు. తను కసాండ్రాకి నేర్పిన మంత్రాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేడు! తను చెయ్యగలిగిందల్లా ఆ మంత్రం వల్ల కసాండ్రాకి లాభం లేకుండా చెయ్యడం. అందుకని ‘నువ్వు దివ్యదృష్టితో చూసి చెప్పగలిగే జోస్యాన్ని ఎవ్వరూ నమ్మరు’ అని శపించేడు. చెయ్యగలిగేది ఏమీ లేక కసాండ్రా తను నేర్చుకున్న దివ్యదృష్టి మంత్రాన్ని తన కవల అన్నదమ్ముడు హెలెనస్‌కి ఉపదేశించింది. (కచ-దేవయాని కథ ఇలాగే నడుస్తుంది!)
కసాండ్రా చాలా సందర్భాలలో జోస్యం చెప్పింది; కాని ఎవ్వరూ నమ్మలేదు. అదే విషయాన్ని హెలెనస్ చెబితే నమ్మేవారు! ఒకసారి కసాండ్రా తన దివ్యదృష్టితో చూసి పేరిస్ ‘తప్పిపోయిన’ తన అన్నదమ్ముడే అని గుర్తించింది. పేరిస్ స్పార్టా రాణీ హెలెన్‌ని దొంగిలించి వివాహం చేసుకుని ట్రాయ్ తీసుకు వస్తాడనిన్నీ, ఆ సంఘటన ట్రాయ్ నగరపు విధ్వంసానికి కారణభూతం అవుతుందనిన్నీ, కనుక పేరిస్‌ని స్పార్టా వెళ్ళవద్దని బ్రతిమాలుతుంది. ఎవ్వరూ వినిపించుకోరు. ట్రాయ్ నగరం మీదకి దండెత్తి వచ్చే గ్రీసు దేశపు సేనాధిపతి అగమెమ్నాన్ యుద్ధంలో చనిపోతాడని జోస్యం చెబుతుంది. ఎవ్వరూ పట్టించుకోరు. తను కూడా ఆ యుద్ధంలో చచ్చిపోతానని చెబుతుంది. అంతా ‘పిచ్చి వాగుడు’ అని పెడచెవిని పెడతారు. చిట్టచివరికి గ్రీకులు రణరంగంలో వదలిపెట్టి వెళ్లిన కర్రగుర్రం ప్రమాదానికి దారి తీస్తుంది, దానిని లోపలికి తీసుకురావద్దని కసాండ్రా హెచ్చరిస్తే ఎవ్వరూ వినరు.
ఈ రోజుల్లో అయితే కసాండ్రా లాంటి వ్యక్తిని ‘శకున పక్షి’ అని గేలిచేసి ఉండేవారు. మనకి అవగాహనలో లేని ఏదైనా శక్తివంతమైన ప్రభావం వల్ల మనకి ఏదో కీడు కలగబోతోందని జోస్యం చెప్పేమనుకోండి. ఉదాహరణకి ‘పర్యావరణం వెచ్చబడడం వల్ల పల్లపు ప్రాంతాలు ముంపుకి గురవుతాయి’ అని ఒక శాస్త్రవేత్త జోస్యం చెప్పేడనుకోండి. మనకి వెంటనే నమ్మబుద్ది కాదు. రాబోయే ప్రమాదం నుండి తప్పించుకుందికి కానీ, ఆ ప్రమాదం వల్ల కలిగే హానిని తగ్గించడానికి కానీ వ్యయ ప్రయాసలు, కాలయాపన కావచ్చు. మన రాజకీయ నాయకులకి రాబోయే ఎన్నికల మీద ఉన్న దృష్టి ఎప్పుడో పాతిక సంవత్సరాల తరువాత రాబోయే ముంపు మీద ఉండదు. ఇటువంటి సందర్భాలలో శాస్త్రవేత్తలు చెప్పే జోస్యానికి కసాండ్రా చెప్పిన జోస్యానికి పట్టిన గతే పడుతుంది.*
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
04-09-2021, 11:15 PM
(This post was last modified: 04-09-2021, 11:16 PM by WriterX. Edited 1 time in total. Edited 1 time in total.)
క్రీసస్ ఉదంతం
ద్వాదశ ఒలింపియను దేవతలలో అపాలో ఒకడు. అతనికి వచ్చిన అనేక విద్యలలో దివ్యదృష్టి ఒకటి; అతను భవిష్యత్తులోకి చూసి ఏమి జరగబోతోందో చెప్పగల సమర్థుడు. ఒలింపియను దేవతలలో చాలమందికి ఈ రకం దివ్యదృష్టి ఉంది కానీ ఒక్క అపాలో మాత్రమే ఈ విద్యని మానవులతో పంచుకోడానికి సుముఖత చూపేవాడు. ఇందుకని అపాలో అనేక మందిరాలు స్థాపించి, ప్రతి మందిరంలోనూ ఒరాకిల్ (Oracle) అనే ఒక దివ్యవాణిని ప్రతిష్ఠ చేసేడు. ఒరాకిల్ అంటే సర్వజ్ఞుడు, ద్రష్ట, ప్రవక్త అనే అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ ఒరాకిల్ అనేది ఒకరి ఒంటి మీదికి ఆవహించి వారి నోట పలికే భవిష్యవాణి. మన దేశంలోనూ గణాచారుల ఒంటి మీదికి అమ్మవారు రావడం (పూనకం రావడం), ఏదైనా చెప్పడం ఉన్నాయి. ఇప్పటికీ సమ్మక్క జాతరలో ఇలా అమ్మవారు ఒంటి మీదకు వచ్చి ప్రజలకు సందేశం ఇవ్వడం జరుగుతూనే ఉంది. అపాలో స్థాపించిన ఇటువంటి మందిరాలలో డెల్ఫైలో (Delphi) ఉన్న మందిరం ప్రసిద్ధి చెందినది. ఈ డెల్ఫై మందిరంలో ఉన్న గణాచారిణి పేరు పైథియా (Pythea). పెద్దలు, పిన్నలు, రాజులు, పేదలు, ఇలా అనేక మంది డెల్ఫైకి వచ్చి వాళ్ళకి భవిష్యత్తులో ఏమి ‘రాసిపెట్టి ఉందో’ చెప్పమని దివ్యవాణిని అర్థించడం, దివ్యవాణి వారి కోరికని పైథియా వాక్కు ద్వారా మన్నించడం జరుగుతూనే ఉంటుంది.
ఇలా డెల్ఫైలో ఉన్న ఒరాకిల్ని సంప్రదించడానికి వచ్చిన వారిలో సాక్షాత్తూ లిడియా దేశపు రాజు క్రీసస్ (Croesus) ఒకడు. హిరాడటస్ (Herodotus) రాసిన చరిత్ర ప్రకారం లిడియా రాజ్యాన్ని క్రీసస్ 14 సంవత్సరాలు పరిపాలించేడు (సుమారు సా. శ. పూ. 595 నుండి 546 వరకు). అనగా క్రీసస్ నిజంగా చరిత్రలో ఒక మానవుడు. క్రీసస్ అత్యంత ధనవంతుడు. అతను ఎంత ధనవంతుడంటే ఇప్పటికీ ‘వాడు క్రీసస్ అంత ధనవంతుడు’ అనే నానుడి పాశ్చాత్య భాషలలో ఉంది.
క్రీసస్ అంత ధనవంతుడు అవడానికి రెండు కారణాలు ఉండే సావకాశం ఉంది. లిడియా రాజ్యానికి ముఖ్యపట్టణం అయిన సార్డిస్ గుండా పాక్టోలస్ (Pactolus) అనే నది ప్రవహిస్తోంది. ఆ నదీ గర్భంలో ఉన్న ఒండ్రుమట్టిలో వెండి, బంగారం కలిసిన మిశ్రమ లోహం దొరుకుతుంది. రాజు మైడస్ (Midas) ఈ పాక్టోలస్లో స్నానంచేసి తాను పట్టిందల్లా బంగారంగా మారుతున్న ‘వరం’ నుండి విముక్తి పొందేడు అనే ఒక కథ ఉంది. అదే ఈ బంగారానికి కారణం అంటారు. నిజానికి క్రీసస్ అంత ధనవంతుడు అవడానికి అతని సామంతులు కట్టే కప్పాలు కూడా కారణం కావచ్చు.
క్రీసస్ తనకున్న ఐశ్వర్యంతో తృప్తి పొందలేదు. ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో కానీ పశ్చిమ ఆసియాలో ఏకఛత్రాధిపత్యంతో అలరారుతున్న పారశీక సామ్రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని తన వశం చేసుకోవాలనే బుద్ధి అతని పుర్రెలో పుట్టింది. ఈ రోజుల్లో అమెరికా ఎలాంటిదో ఆ రోజుల్లో సైరస్ (Cyrus, the Great) చక్రవర్తి పరిపాలనలో ఉన్న పారశీక సామ్రాజ్యం అంత శక్తిమంతమైన దేశం!
బుద్ధి పుట్టడం పుట్టింది కానీ క్రీసస్ మనస్సు పీకుతోంది. యుద్ధం ముగిసే వరకు పర్యవసానం ఎలా ఉంటుందో తెలియదు కదా. అందుకని డెల్ఫైలో ఉన్న ఒరాకిల్ని అడిగి తెలుసుకురమ్మని కానుకలు ఇచ్చి ప్రత్యేక ప్రతినిధిని పంపేడు. క్రీసస్ డెల్ఫైలో ఉన్న ఒరాకిల్కి ఇచ్చిన కానుకలు ఆ ఆలయంలో హెరాడొటస్ కాలం వరకు ఉన్నాయిట! క్రీసస్ తరఫున రాయబారులు డెల్ఫైలో ఉన్న ఒరాకిల్ని అడిగిన ప్రశ్న: పారశీక దేశం మీదకి క్రీసస్ దండయాత్ర జరిపితే పర్యవసానం ఎలా ఉంటుంది?
ఈ ప్రశ్నకి సమాధానంగా పిథియా ద్వారా ఒరాకిల్ ఇచ్చిన సమాధానం: క్రీసస్ ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాడు.
‘దేవుడు మన పక్షం. దండయాత్రకు సంసిద్ధం అవండి!’ అని క్రీసస్ ఆజ్ఞ జారీ చేసేడు. క్రీసస్ సేనావాహిని గట్లు తెంచుకుని పెల్లుబికి ప్రవహించిన నదిలా ఒక్కుమ్మడిగా పారశీక సామ్రాజ్యం మీద విరుచుకుపడింది. పారశీక చక్రవర్తి సైరస్ సైన్యం క్రీసస్‌ని చిత్తుచిత్తుగా ఓడించి క్రీసస్‌ని బందీగా తీసుకుపోయింది. చిట్టచివరికి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన సైరస్ కొలువులో క్రీసస్ చిన్న గుమస్తా ఉద్యోగం చేస్తూ శేష జీవితం గడిపేడు.
తనని ఈ విధంగా ఓరకిల్ పచ్చి మోసం చేస్తుందని క్రీసస్ కలలో కూడా అనుకోలేదు. ఓరకిల్ని ఊరకనే సలహా ఇమ్మని అడగలేదు. బిళ్లకుడుములులా పారితోషికం (లంచం) సమర్పించుకున్నాడు కదా! పట్టపగలు బహిరంగంగా ఇంత పచ్చి మోసమా? మునుపటిలా ఇప్పుడు ఆస్తులు, అంతస్తులు లేవు. అయినా ఉన్న దాంట్లో కాసింత గోకి గోకి చిన్న పారితోషికంతో తోటి గుమస్తాని పంపేడు – జరిగిన అన్యాయానికి కారణం ఏమిటో తెలుసుకు రమ్మని.
తాను రాసిన హిస్టరీ అనే గ్రంథంలో హిరాడొటస్ జరిగిన అన్యాయానికి కారణం ఈ విధంగా చెబుతాడు: డెల్ఫైలో ఉన్న ఒరాకిల్ చెప్పిన జోస్యం ప్రకారం క్రీసస్ పారశీక దేశం మీద దండయాత్ర చేస్తే ఒక మహా సామ్రాజ్యం సర్వనాశనం అయిపోవాలి. ఆ నాశనం అయిపోబోయే సామ్రాజ్యం ఎవరిది? తనదా? శత్రువుదా? అని అడగవలసిన కనీసపు బాధ్యత క్రీసస్ది. అధికారంలో ఉన్న పాలకులకి సలహాదారులు సలహాలు ఇచ్చినప్పుడు, ఆ సలహా అమలుపరచితే పర్యవసానం ఎలా ఉంటుంది? అని అడగకుండా ‘లేడికి లేచిందే పయనం’ అన్న రీతిలో రాజ్యం ఏలితే ఇలానే ఉంటుంది. ఇది స్వయంకృతాపరాధం.
క్రీసస్ పరాజయం గ్రీసు దేశపు చరిత్రలో విస్మరించడానికి వీలులేని మైలురాయి.
ప్రచ్ఛన్న అర్థ సందిగ్ధతలతో మాట్లాడడం ఈ నాటి జ్యోతిష్కుల ఆయుధం ఎలాగయిందో అలాగే అలనాటి ఒరాకిల్లకి కూడా ఆయుధం అయి ఉండాలి. ఎంత సర్వజ్ఞుడిని అయినా సరే మనం అడిగే ప్రశ్నలు అర్థవంతంగా ఉండాలి, నిర్ద్వంద్వంగా ఉండాలి. సరి అయిన గురి పెట్టి అడగాలి. అదే విధంగా నిష్ణాతులు ఇచ్చే సలహాలని విధివిధానాలుగా మార్చి అవలంబించే ముందు ఆ సలహాల పర్యవసానాన్ని సరిగ్గా అర్థంచేసుకోవడం నేర్చుకోవాలి.
ఈనాటి ప్రభుత్వాలకి ఒరాకిల్‌లు ఎవరు? శాస్త్రవేత్తలు, స్మరణ తటాకాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్నత ఆసనాలు అధిష్టించిన ఆచార్యులు, వగైరాలు. ఈ పిదప కాలపు ఒరాకిల్లను ప్రభుత్వాలు అప్పుడప్పుడు, అయిష్టంగానే, సంప్రదిస్తాయి. కొండకచో కొన్ని ఒరాకిల్‌లు అడిగినా, అడగకపోయినా వారి విలువైన అభిప్రాయాలని ఉచితంగా జారీచేస్తూ ఉంటారు: ఆకాశంలో ఓజోన్ పొరలో చిల్లుపడడం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. పర్యావరణం వేడెక్కిపోవడం వల్ల ధ్రువప్రాంతాలలో మంచు కరిగిపోయి దాని వల్ల తీర ప్రాంతాలు ముంపుకి గురి అవుతాయి, వగైరా.
ఈ అభిప్రాయాలైనా సరళమైన, నలుగురికీ అర్థం అయే భాషలో ఉంటాయా? ఉండవు. శాస్త్రీయ పరిభాషలో, సంభావ్యతలు, శాతాలు, గంట ఆకారంలో ఉన్న చిత్రపటాల రూపంలో ఉంటాయి. రాజనీతి తంత్రజ్ఞులు విధివిధానాలని జారీచేసే ముందు ఈ పరిభాషని అర్థం చేసుకుని అప్రమత్తతతో మెలగాలి. ఆ అప్రమత్తతకి శాస్త్రీయ పరిజ్ఞానం, అవగాహన అత్యవసరం. మనం ఎన్నుకున్న ప్రతినిధులలో ఎంతమందికి ఈ రకం శాస్త్రీయ అవగాహన ఉంటోంది?*
•
Posts: 26
Threads: 1
Likes Received: 20 in 13 posts
Likes Given: 0
Joined: Oct 2019
Reputation:
3
ఆర్టెమిస్, ఒరాయన్‌ల ప్రేమగాథ
గ్రీకు పురాణాలలో ఆర్టెమిస్ (Artemis), ఒరాయన్‌ల (Orion) ప్రేమ గాథ రకరకాల మూలాలలో రకరకాలుగా, చిన్నచిన్న తేడాలతో కనిపిస్తుంది. అపాలో యొక్క కవల సహోదరి ఆర్టెమిస్. ఈమె మృగయావినోదాలకి అధిపత్ని. పసితనం నుండి ఈమెకి వేటాడం మీద అభిమానం మెండుగా ఉండేది. అందుకని ఆర్కేడియాలో ఉన్న కొండలలోను, కోనలలోను వేటాడుతూ, క్రొంగొత్త అనుభవాలని అన్వేషిస్తూ తిరుగాడడానికి ఇష్టపడుతూ ఉండేది. తండ్రి జూస్ అమె అభిలాషలని ప్రోత్సహించేవాడు. ఆమె రక్షణ కోసం ఆమెకి ఏడుగురు వనదేవతలని(nymphs) చెలికత్తెలుగా నియమించేడు. ఈమెకి పేన్ (Pan) రెండు వేట కుక్కలని కానుకగా ఇచ్చేడు. [ఈ పేన్ నడుం దిగువ భాగం గొర్రె ఆకారంలోనూ, ఎగువ భాగం మనిషి ఆకారంలోనూ ఉండే ఒక వనదేవుడు; అడవులలోను గడ్డి మైదానాలలోను గొర్రెలని కాసుకుంటూ, పిల్లనగ్రోవి ఊదుకుంటూ తిరుగాడుతూ ఉంటాడు. ఇతను మధ్యాహ్నం వేళ కునుకు తీస్తున్న సమయంలో ఎవరైనా అకస్మాత్తుగా లేపితే పెడబొబ్బ పెడతాడు. ఆ శబ్దానికి భయపడి అతని గొర్రెలు చిందరవందరగా చెల్లాచెదరు అయిపోతాయి. ఈ సంఘటనని పురస్కరించుకుని అకస్మాత్తుగా భయపడే సందర్భాన్ని వర్ణించడానికి ఇంగ్లీషులో ‘పేనిక్’ (panic) అన్న మాట పుట్టింది.] ఒంటి కన్ను సైక్లాప్స్ ఈమెకి వెండితో చేసిన విల్లమ్ములని బహూకరించేడు. వీటితో నిత్యసాధన చేసిన ఆర్టెమిస్ ప్రతిభ అతి త్వరలోనే అపాలోతో సరితూగడం మొదలయింది.
ఆర్టెమిస్ అహోరాత్రాలు వేటలో మెళుకువలు నేర్చుకుంటూ, నేర్చిన వాటికి పదనుపెడుతూ, ఏకాంతంగా రోజులతరబడి గడిపేసేది. ఆమె ఏకాంతానికి భంగం కలిగితే ఆమెకి ఎక్కడ కోపం వస్తుందో అని మానవులు ఆమెకి దూరంగా ఉండేవారు. అడవులలో ఏకాంతంగా ఆమె వేటాడుతూ ఉంటే వనదేవతలైన ఆమె చెలికత్తెలు కేరింతలుకొడుతూ ఆడుకునేవారు!
ఒకనాడు ఆర్టెమిస్ ఒక జలాశయంలో జలకాలాడుతూ ఉన్న సమయంలో ఆక్టియన్ (Actaeon) అనే మానవుడు అటువైపు వెళ్ళడం తటస్థించింది. అతను ఇదివరలో ఆర్టెమిస్ అందచందాల గురించి వినివున్నాడు కానీ, ఆమె ఇంత అందంగా ఉంటుందని కలలోనైనా ఊహించలేదు. ఆమెని చూస్తూ, నిర్విణ్ణుడై స్థాణువులా ఉండిపోయేడు.
కొలనులో జలకాలాడుతూన్న ఆర్టెమిస్ తనవైపే రెప్ప వాల్చకుండా చూస్తూన్న ఆక్టియన్ని చూసి ఉగ్రురాలయింది. చేతితో నీళ్లు తీసుకుని అతని వైపు వెదజల్లింది. ఆ నీటి బిందువులు అతని శరీరాన్ని తాకేసరికి అతను ఒక దుప్పిగా మారిపోయేడు. అప్పుడు ఆర్టెమిస్ బిగ్గరగా ఒక ఊళ వేసేసరికి ఆమె వేట కుక్కలు రెండూ పరుగు పరుగున వచ్చి, ఆ దుప్పిని చీల్చిచెండాడి చంపేసేయి.
దయనీయ పరిస్థితులలో ఆక్టియన్ ఎదుర్కున్న దారుణ మరణ వార్త ఆ అడవిలో దావానలంలా వ్యాపించింది. అందరూ ఆర్టెమిస్‌ని కన్నెత్తి చూడడానికే భయపడేవారు; ఒక్క ఒరాయన్ (Orion) తప్ప. ఒరాయన్ తండ్రి పోసైడన్ (Poseidon), తల్లి యురియెల్ (Euryale) అనే మానవ స్త్రీ. ఒరాయన్ భూలోక సుందరుడు అని పేరు పొందేడు; ఒకరికి భయపడే రకం కాదు. ఒరాయన్‌కి ఆ అడవిలో వేటాడుతూ తిరగడం అంటే బహు ప్రీతి. అంతే కాదు; ఒరాయన్ వనకన్య మెరోపీని (Merope) ప్రేమించేడు. ఆమె ఎక్కడ ఉంటే అతను అక్కడే తిరుగాడేవాడు. అయినా భయంవల్లో, భక్తివల్లో, మర్యాద కొరకో ఎల్లప్పుడూ ఆర్టెమిస్‌కి దూరంగానే ఉండేవాడు.
ఒకనాడు బృహత్ లుబ్ధకం (Canis Major), లఘు లుబ్ధకం (Canis Minor) అనే పేర్లు గల తన కుక్కలని వెంటేసుకుని ఒరాయన్ వేటాడుతున్నాడు. అకస్మాత్తుగా ఎదురుగా ఉన్న తుప్పలలో తెల్లగా ఉన్నది ఏదో కదిలింది. అది ఏదో అపురూపమైన పక్షి మూక అయి ఉంటుందని ఊహించి చాటుమాటున పొంచి మెదలడం మొదలుపెట్టేడు ఒరాయన్. అతను సమీపించేసరికి ఆ తెల్లగా ఉన్నది మెరుపులా పరుగుతీసింది. సావధానంగా చూసేసరికి అవి పక్షులు కావు, ఆ కదిలేవి తెల్లటి ఉడుపులతో ఉన్న ఏడుగురు వనకన్యలు అని తేలింది.
ఒరాయన్ వారిని వెంబడించేడు. వనకన్యల గుంపు వాయువేగంతో ముందుకు పొతోంది. ఒరాయన్ వేగంలో వారిని ఏమాత్రం తీసిపోలేదు. పైగా ఒరాయన్ బలశాలి. పరుగున వచ్చి ఒరాయన్ మెరోపీ కొంగు పట్టుకున్నాడో లేదో ఆమె కెవ్వున కేక వేసింది. ఆ కేక ఆర్టెమిస్ విన్నది. విన్న వెంటనే ఆర్టెమిస్ ఆ ఏడుగురు వనకన్యలని ఏడు తెల్లటి పావురాలుగా మార్చేసింది. అవి రివ్వున ఆకాశపు లోతుల్లోకి ఎగిరిపోయాయి. అలా ఆ పావురాలు వినువీధి లోకి ఎగిరిపోతూ ఉంటే ఆర్టెమిస్ తన తండ్రి జూస్ని పిలచి ఆ వనకన్యలకి ఏ హాని జరగకుండా చూడమని ప్రార్థించింది. అప్పుడు జూస్ ఆ ఏడుగురు వనకన్యలని ఏడు నక్షత్రాలుగా మార్చేసి ఆకాశంలో శాశ్వతంగా ఉండిపొమ్మని చెప్పేడు. ఆ ఏడు నక్షత్రాలనే ప్లయేడిస్ (Pleiades లేదా Seven Sisters) అని అంటారు. (ఇవే వృషభరాశిలో కృత్తికలు అన్న పేరుతో కనిపించే నక్షత్రాలు.)
ఈ అలజడికి కారణం ఏమిటా అని ఆర్టెమిస్ ఇటూ, అటూ చూసేసరికి ఎదురుగా ఒరాయన్ కనిపించేడు. అతని అందం, అతని వర్ఛస్సు, అతని వేగం ఆర్టెమిస్‌ని అపరిమితంగా ఆకర్షించేయి. అప్రయత్నంగానే ఇద్దరూ కలసి వేటాడడం మొదలుపెట్టేరు. ఒకరితో మరొకరు పోటీలుపడుతూ వేటాడేవారు. చీకటిపడ్డ తరువాత నెగడు దగ్గర చలి కాగుతూ, కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. వారి నవ్వుల సవ్వడితో ఆ అడవి ప్రతిధ్వనించేది.
శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతూన్న వీరి స్నేహం అపాలోకి నచ్చలేదు. ‘కేవలం ఒక మానవమాత్రుడిని ఎలా ప్రేమించగలుగుతున్నావ్?’ అని నిలదీశాడు.
‘మానవుడైతేనేం? ఒరాయన్ బలశాలి, ధైర్యవంతుడు.’ ఆర్టెమిస్ ఎదురుతిరిగి సమాధానం ఇచ్చేసరికి అపాలో అహం దెబ్బతింది. తన సోదరి సమీకరణం నుండి ఒరాయన్ని ఎలాగైనా తప్పించాలని అపాలో ఒక నిశ్చయానికి వచ్చేడు.
ఒక రోజు ఒక మండ్రగబ్బ ఒరాయన్ మీదకి వస్తోంది. ఒరాయన్ దానిని ఎదుర్కుని చంపడానికి శతథా ప్రయత్నం చేస్తున్నాడు. అయినా అతని కృషి సఫలం కావటంలేదు. ఒరాయన్ అంతటి ధీరుడు కేవలం ఒక నల్ల తేలుని ఎదుర్కుని చంపలేకపోతున్నాడు. ఒరాయన్‌కి ముచ్చెమటలు పోస్తున్నాయి. తేలు మీదమీదకి వచ్చి అతని వక్షస్థలం మీద కాటు వెయ్యడానికి కొండిని పైకి ఎత్తింది. ఒరాయన్ ఒక్క పెడబొబ్బ పెట్టేడు. అతని ఒళ్ళంతా స్వేదావృతం అయిపోయింది. మెలకువ వచ్చింది. అదంతా నిద్రలో వచ్చిన ఒక పీడకల అని గ్రహించి స్థిమితపడ్డాడు. నిద్రలోంచి తేరుకుందామని, బయటికి చల్లగాలిలోకి వచ్చాడు. ఎదురుగా నల్లటి మండ్రగబ్బ! కలలో కనిపించినదే! ఒరాయన్ ఆ తేలుతో హోరాహోరీ పోరాడేడు. చిట్టచివరికి ఆ తేలు వేసిన కాటుకి ఒరాయన్ మరణించేడు.
ఒరాయన్ మరణం ఆర్టెమిస్‌ని కృంగదీసింది. ఒరాయన్ ప్రాణాలు తీసిన తేలు ఇంకా అక్కడే ఉంది. ఆర్టెమిస్ కోపంతో ఆ తేలుని పట్టుకుని రివ్వున ఆకాశంలోకి విసిరేసింది. అదే ఇప్పుడు మనకి ఆకాశంలో కనిపించే వృశ్చిక రాశి. ఈ తేలు గుండెకి సమీపంలో కనిపించే నక్షత్రమే జ్యేష్ఠ (Antares). అటు తరువాత రాశి చక్రంలో, వృశ్చిక రాశికి బహుదూరంలో ఉండేలా, అతిశయించిన ప్రేమతో ఒరాయన్ పార్థివ దేహాన్ని, అతని వేట కుక్కలని ఆర్టెమిస్ నక్షత్రాల రూపంలో అమర్చింది. అందుకనే ఒరాయన్ నక్షత్ర కూటమి తూర్పున ఉదయించే వేళకి వృశ్చిక రాశి పడమట అస్తమిస్తుంది.
ఇప్పటికీ తలెత్తి చూస్తే ఆకాశంలో తేలికగా పోల్చుకోగలిగే నక్షత్ర రాశి ఒరాయన్! దీనినే మనం మృగవ్యాధుడు అని భారతీయ భాషలలో అంటాం. చీకటి రాత్రి పశ్చిమ ఆకాశం వైపు చూస్తే కొట్టొచ్చినట్లు దగ్గరదగ్గరగా మూడు చుక్కలు వరసగా కనిపిస్తాయి. వీటిని వేటగాడి నడుం చుట్టూ ఉన్న పటకాలా ఊహించుకుంటే ఆ పటకా నుండి కిందకి కాని, కుడి పక్కకి కాని మరి రెండు చుక్కలు కనిపిస్తాయి; అవి మృగవ్యాధుడి కాళ్లు. ఎడమ మోకాలి దగ్గర ఉన్న నక్షత్రం పేరు రైజెల్ (Rigel, వృత్రపాద నక్షత్రం). పటకా నుండి పైకి చూస్తే రెండు బాహుమూలాలు, వాటి మీద తలకాయ ఉండవలసిన చోట మరొక తార కనబడతాయి. కుడి చంక దగ్గర ఎర్రగా కనిపించే నక్షత్రం పేరు బీటిల్‌జూస్ (Betelguese, ఆర్ద్రా నక్షత్రం). బాగా ముందుకి చాపిన ఎడమ చేతిలో విల్లు, పైకి ఎత్తిన కుడి చేతిలో రెండు బాణాలు (లేదా, ఒక దుడ్డు కర్ర) కూడ చూడవచ్చు.
మృగవ్యాధుడు పాదాల దిగువన, కాసింత వెనకగా Canis Major (పెద్ద కుక్క) లేదా బృహత్ లుబ్ధకం ఉంటుంది. ఇది ఉత్తరాకాశంలో మరొక నక్షత్ర రాశి; మృగవ్యాధుడుకి ఆగ్నేయంగా ఉన్న ఈ రాశిలోనే మన ఆకాశంలో కనిపించే అత్యంత ప్రకాశమానమైన సిరియస్ (Sirius, మృగశిర) నక్షత్రం ఉంది.
అమెరికా 1960 దశకంలో చంద్రుడి మీద కాలు మోపడానికి చేసిన ప్రయత్నానికి అపాలో అని పేరు పెట్టేరన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇప్పుడు మళ్లా రాబోయే దశకంలో చంద్రుడి మీద రెండోసారి కాలు మోపడానికి చేస్తూన్న ప్రయత్నానికి ఆర్టెమిస్ అన్న పేరు, ఈ ప్రయత్నంలో వాడబోయే నభోనౌక పేరు ఒరాయన్ అని గమనిస్తే గ్రీకు సంస్కృతి సైన్సుని ఎంతగా ప్రభావితం చేస్తూందో అవగతం అవుతుంది!
* (ఆధారం: Carl Sagan, Croesus and Cassandra, Chapter 9 in Billions & Billions, Random House, New York, NY 1997.)
•
|