02-12-2018, 07:28 AM
అమెరికాలో చదివిన వారికి ప్రాధాన్యం
16% అధికంగా హెచ్-1బి వీసాలు దక్కే అవకాశం
దరఖాస్తు ప్రక్రియలో కొత్త మార్పులు
సంస్థలు ఆన్‌లైన్‌లో ముందుగానే నమోదు చేసుకోవాలని నిబంధన
హెచ్-1బి వీసా దరఖాస్తు ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు ప్రతిపాదించింది. అమెరికాలో చదువుకున్నవారికి దీనిలో పెద్దపీట వేసింది. మెరుగైన నైపుణ్యాలతోపాటు పెద్దమొత్తంలో వేతనాలు పొందే అర్హత కలిగిన విదేశీయులే లక్ష్యంగా వీటిని సిద్ధంచేసింది. మరోవైపు సంస్థలు తమ హెచ్-1బి దరఖాస్తులను ముందుగానే ఆన్‌లైన్‌లో అమెరికా పౌరసత్వం, వలసల సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్)కు సమర్పించాలని కొత్త నిబంధన తీసుకొచ్చింది. భారత ఐటీ సంస్థలు, నిపుణులు పెద్దయెత్తున ఈ వీసాల కోసం దరఖాస్తుచేసే సంగతి తెలిసిందే. ఏటా 65,000 హెచ్-1బి వీసాలను అమెరికా జారీచేస్తుంది. అమెరికాలో మాస్టర్ డిగ్రీ లేదా ఉన్నత విద్య అభ్యసించిన వారికిచ్చే 20,000 వీసాలు వీటికి అదనం. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఈ 20,000 వీసాల కోసం దరఖాస్తులను విడిగా సేకరిస్తారు. వీటిలో పరిమితికి సరిపడా ఎంపిక చేసిన అనంతరం మిగిలిన దరఖాస్తులను సాధారణ దరఖాస్తుల్లో కలిపి 65,000 దరఖాస్తులను ఎంపిక చేస్తారు. ఈ విధానంలో తాజాగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) మార్పులు ప్రతిపాదించింది. ఇకపై మొదటగా ఉన్నత విద్య కేటగిరీ దరఖాస్తులను, సాధారణ హెచ్-1బి దరఖాస్తులను కలిపి 65,000 ఎంపిక చేస్తారు. ఎంపిక అనంతరం మిగిలిన వాటిలో అమెరికా మాస్టర్ డిగ్రీ లేదా ఉన్నత విద్య అభ్యసించిన వారి దరఖాస్తులను వేరుచేస్తారు. వీటి నుంచి 20,000 వీసాలను ఎంపిక చేస్తారు. ఈ మార్పులతో అమెరికా మాస్టర్ డిగ్రీ లేదా ఉన్నత విద్య పట్టా ఉండేవారికి వీసాలు వచ్చే అవకాశం పెరుగుతుందని డీహెచ్‌ఎస్ తెలిపింది. మొత్తంగా 16 శాతం (5340 వీసాలు) వరకు ఎక్కువ వీసాలు అమెరికాలో విద్యాభ్యాసం చేసేవారికి దక్కనున్నట్లు అంచనా వేసింది. సోమవారం నుంచి జనవరి 2 వరకూ ప్రజలు ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలు తెలియజేయొచ్చని పేర్కొంది.
20,000 మంది భారతీయులు ఆశ్రయం కోరుతూ అభ్యర్థన
2014 నుంచి 20,000 మందికిపైగా భారతీయులు ఆశ్రయం కోసం అభ్యర్థించారని డీహెచ్‌ఎస్ తెలిపింది. వీరిలో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉందని వివరించింది. ఉత్తర అమెరికా పంజాబీ సంఘం (ఎన్‌ఏపీఏ) సమాచారం కోరడంతో డీహెచ్‌ఎస్ స్పందించింది.
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish