Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మైదానం BY చలం

#81

    "ఆ మాట నాకు చెప్పడానికి అతను పడ్డ సిగ్గు - ! ఒకరోజు ఒక చిన్న బాకు తీసుకొచ్చి యిచ్చి అది తలకింద పెట్టుకుని పడుకోమన్నాడు. ఎందుకంత ప్రేమ అతనికి నాపైన అనిపించేది.
    ఒకనాడు మేమిద్దరమూ యేరుదాటి జీడిమామిడి గుబురులో దూరి కూచున్నాము. గాలి వచ్చి రాలిన ఆకులన్నిటినీ యిటూ అటూ తోసి ఆడిస్తోంది. ఆకాశాన తెల్లని మబ్బులు వరుసగా లేచి బయలుదేరి పోతున్నాయి. మీరాకి కోపం తెప్పించడం చాలా సులభం.. అతని కోపం మొహం చూడడం నాకెంతో యిష్టం. ఆ తెల్లని చర్మంలోకి యెర్రని మెరుపువచ్చి గులాబి మొహమల్ వలె ప్రకాశిస్తుంది. మీరా తన వేళ్ళతో నా పెదిమల మీద మెల్లిగా తాకుతూ పాడుతున్నాడు. నేను పరధ్యానంగా వేళ్ళని తీసేశాను. వెంటనే కోపం వచ్చి తల తిప్పేశాడు. అతన్నింకా వుడికించాలని దూరంగా జరిగాను. నా వంక చూశాడు. నేను పలకలేదు. బాగా వుడుక్కుని చప్పున లేచివొచ్చి యెదురుగా ఉధృతంగా నన్ను కావలించుకొన్నాడు. అతని మొహం బాగా యెర్రనయింది. శ్వాస నా మొహాన తుఫానువలె కొడుతోంది. కళ్ళు తళతళ మెరుస్తున్నాయి. నా భుజం మీద రవికెను పట్టుకున్న వేళ్ళు వణుకుతున్నాయి. కొత్త ఆవేశం తెలుస్తూ వుంది. తన నోటితో నా పెదిమల్ని వెతుకుతున్నాడు. చాలా మచ్సికగా వున్న పులిపిల్ల రక్తమాసించి తిరగబడినట్లయింది. భయంతో, కోపంతో "యేమిటది మీరా?" అన్నాను. మెల్లిగా పట్టు వొదిలింది.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82

సాయంత్రపు పశ్చిమదిశవలె యెరుపుజారి మొహంలో సిగ్గు సలుపు కమ్మింది. చప్పున నన్ను వొదిలి పరుగెత్తి వెళ్ళిపోయినాడు. ఇంక రాడేమోనని భయమేసింది నాకు. కాని సాయంత్రం మెల్లగా తలవంచుకుని వచ్చి వొంగి నా కాళ్ళు పట్టుకున్నాడు.
    "ఇంకెప్పుడూ చెయ్యను."
    లేవనెత్తి గట్టిగా కావలించుకున్నాను.
    "నా కట్లా బాగుండదు. ఏం?" అన్నాను.
    "మరి నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు?"
    నా తప్పు తెలిసింది.
    "మీ అక్క ముద్దు పెట్టుకోదూ. పోనీ మానేస్తాలే."
    "వొద్దు, మానెయ్యవొద్దు. నాకు కోపం తెప్పించకు మరి" అన్నాడు.
    అమీర్లేని సంగతి వూళ్ళో తెలీడం కొంత కాలం పట్టింది.
    అతనికి పట్టిన అదృష్టాన్ని చూసి యీర్ష్యపడి నావంక కన్ను వేసి వుంచినవారు లేకపోలేదనీ మీరా పుచ్చుకున్న ముందు జాగ్రత్త వృధా కాదనీ. నా కొకనాటి రాత్రి స్వప్నమయింది. నిద్రపోతున్న నాకు ఎవరో దగ్గిరగా నడుస్తున్నట్లు తోచి మెలుకువ వొచ్చింది. చీకట్లో యింకా నల్లగా కనబడ్డది.
    "ఎవరు?" అన్నాను భయంతో.
    "నువ్వెవరే?"
Like Reply
#83

    "ఇదే మా యిల్లు. నువ్వెందుకొచ్చావు."
    "దారితప్పి-"
    కంఠమే చెపుతోంది అబద్ధమని.
    "వూరు అటు"
    "నాకు తెలీదు. కొత్తవాణ్ణి. ఈ రాత్రి ఇక్కడ పడుకుంటాను."
    "వీల్లేదు."
    "నేను కదలలేను."
    దగ్గిరగా వచ్చి కూచున్నాడు.
    "నువ్వొక్కత్తెవేనా?"
    "వెళ్ళమంటే; నీకు కాదూ చెప్పేది?"
    "వొక్కత్తెకూ భయంలేదూ? ఏం తోస్తుంది? నేను సహాయం వుంటానంటే సంతోషించక, పొమ్మంటావేం?"
    "నాకేం సహాయ మక్కర్లేదు."
    "నీకు సహాయ మక్కర లేకపోతే నాక్కావాలి?"
    చప్పున నా మీదికి వచ్చాడు కంఠానికి గురిచూపిన బాకు భుజంలో గుచ్చుకుంది. కేకేసి బూతులు తిట్టుకుంటూ పోయినాడు. మర్నాటినించి మీరా ఎవత్తెనో మొగాడాంతదాన్ని నాకు సహాయం పడుకోబెట్టాడు కొన్నాళ్లు.
Like Reply
#84

    ఆ రాత్రి దీపావళి వెళ్ళిన పౌర్ణమి. యాడాదిక్రింద ఆ రాత్రి అమీర్ తో నేను గడిపిన గడియలు ఆ చిన్న చలితోనూ, ఆ కొండలమీద వెలుగుతోనూ, అవ్యక్తమైన పరిమళంతోనూ, జ్ఞాపకం వొస్తున్నాయి. వ్యర్థంగా శూన్యంగా నేను గడుపుతున్న కాలపు దుర్భలత్వం మనసుకి గాఢంగా తడుతోంది. మీరా నా వొళ్ళో పడుకుని మాట్లాడుతున్నాడుగాని అతని మాటల ధోరణి మధ్య మధ్య మరిచిపోయి పరధ్యానంగా వూఁ కొడుతున్నాను.
    "నువ్వు వినటం లేదు"
    "కానీ...."
    "వినటం లేదు. ఏమాలోచిస్తున్నావు?"
    ఇట్లాంటి వెన్నెలలో అమీర్ ఒక నిమిషం యిట్లా తీరుబడిగా తోచకుండా కూచోనిచ్చేవాడా?"
    "మాట్లాడవేం"
    "అబ్బా మధురమైన అమీరు ఆలోచనలలో మునిగి కలలన్నా కననీకుండా యీ మీరా యేమిటి గోల!'
    మీరా నాకెంతో ప్రేమాస్పదుడైనా, అమీర్ ధ్యాస తిరగబెట్టిందా? యింక నా మనసంతా అతని ఆయత్తమై ప్రపంచాన్నే మరిపిస్తుంది.
   "వుండు మీరా."
Like Reply
#85

    ఆనాడు అమీర్ కొండకింద ప్రవహించే యేట్లోకి నన్ను తోస్తానని బెదిరించాడు. నేనతని మెడ పట్టుకుని వేళ్ళాడ్డమూ, నన్ను కావులించుకుని "అమ్మా! నాదాన్ని, ప్రాణాన్ని, నేను ఒకరవ్వ విడుస్తానా? అనడమూ; ఆ కొండ పెద్ద నల్లరాతి ముందు నన్ను నుంచోబెట్టి తను కొంచెం కిందికి దిగి నన్ను చూస్తూ అక్కడనించే తన ఆనందాన్నీ ఆశ్చర్యాన్నీ వెలిబుచ్చడమూ, పిచ్చిపాటలు పాడుతూ ఆ వెన్నెలనంతా చేర్చి బట్టని చేసి నాకు కట్టుకోడానికి కిస్తానని నవ్వడమూ; నిద్రపోతానంటే వెన్నెల వృధా అవుతుందని చంద్రుడు పచ్చగా పెద్దగా పడమట కుంకే వరకూ మాటిమాటికీ మూతపడే నా కళ్ళని బలవంతంగా తెరిచి చూపుతో వుండడమూ.
    మీరా యేడీ? లేచి పిలిచాను.
    ఇంటికి వెళ్ళాడా?
    లేచి సగం వెతుకుతూ సగం ఆలోచిస్తూ తిరుగుతూ వున్నాను. మీరా కూడా వెళ్ళిపోయినాడా నన్ను ఒంటరిదాన్ని జేసి యీ రాత్రి? ఏటివొడ్డున పడుకుని కనబడ్డాడు యిసుకలో-"మీరా?" కదలలేదు. లేపాను. వూయించాను. ఏడుస్తున్నాడు.
    మనసుకు తట్టింది?
    "నీతో మాట్లాడలేదనా? అవునా? చెప్పు. నన్ను క్షమించు. నిజంగా చాలా దిగులుపడుతున్నాను. ఎప్పుడో ఒకప్పుడు అట్లా మరుపు వొస్తే యింత ఆగ్రహిస్తావా! లేదు. ఏం! నిజం అట్లా అనుకుంటావా? కాదు. నిర్లక్ష్యమచేసి కాదు కాదు. కాదు"-
Like Reply
#86

    "యేమిటి? నువ్వు నాకు చవక కాలేదు. ఎన్నటికీ కావు....నాతో మాట్లాడవా!"
    "పోనీలే అమ్మా అంత కోపమైతే"
    నాకు విసుగూ రోషమూ వస్తున్నాయి. అమీర్ లేని బాధ ఎక్కువవుతోంది. అంత అందమైన వెన్నెలకి బలిచేసి వెళ్ళిపోయిన నా నాధుడి క్రూరత్వం నన్ను కోస్తోంది. జీవితం దుర్భరం. జీవితం నిష్ఫలం. నాకింక ఆనందం లేదు. ఇంక ఆశలేదు. ఎందుకు బతికి? నన్ను వెక్కిరించినట్లు యీ సౌందర్యమంతా ఏమిటి!
    "మీరా ఎందుకు నన్నిట్లా యేడిపిస్తావు?" మీరా లేడు.
    వొంటరిగా ఆ యేటివొడ్డున కూచున్నాను. మా ప్తానాలు, మా ప్రేమ, మా ఈతలు, మా సరసాలు అన్నీ ఆనందించిన యేరు నన్ను చూసి జాలిపడ్డట్టే వుంది ఆ యేరు. 'నదీ, నా తల్లీ? నువ్వే నా దిక్కు' అన్నాను. ఏడుపోచ్చింది నా మీద? నా జీవితం మీద నాకు చాలా జాలి కలిగింది.
    ఈ నదిలోనే పడి మునిగిపోతాను. అమీరు వచ్చి యేడుస్తాడు. ఒంటరిగా యీ కొండలు, ఈ మైదానం, ఈ దుబ్బులు చూసి నన్ను పిలుస్తూ పశ్చాత్తాపపడుతూ యేడుస్తూ వెతుకుతాడు. అతని దుఃఖం తలుచుకుని వెక్కివెక్కి యేడుస్తున్నాను కాబోలు. మెల్లిగా మీరా వచ్చి నా చెంపల్ని తాకేదాకా నాకు తెలీదు.
    "ఎందుకేడుస్తావు?"
Like Reply
#87

    అమీర్ కోసం అంటే మళ్ళీ వెళ్ళిపోతాడేమో.
    "ఎందుకు వెళ్ళిపోయినావు?"
    "నా మనసు మంచిదికాదు. దుష్టుణ్ణి. నా సంగతి పోనీ, నువ్వేమిటి యీ రాత్రి యోచిస్తున్నావు?"
    "చెపితే నీకు కోపం వస్తుంది."
    "అమీర్ని గురించేనా?"
    "అవును"
    "నాకు కోపమెందుకు? నాతో చెప్పు."
    అమీర్ నన్నెందుకు వొదిలాడో మీరాకి తెలీదు.
    కన్నీళ్ళతో, నిట్టూర్పులతో అంత సంగతీ మధ్యమధ్య సిగ్గుపడుతూ చెప్పాను, నిదానంగా విన్నాడు. అమీర్ని తిట్టలేదు, నాకోసం జాలిపడలేదు. ఆ సంగతి మరిపించేసి నాతో ఆదుకుని నేను నిద్రపోయిం తర్వాత వెళ్ళిపోయినాడు. మర్నాడు ఒకత్తె వొచ్చింది.
    "ఎన్ని నెల్లు అయింది?" దాని మాట నా కర్థం కాలేదు.
    రాత్రంతా అమీరు కలలు కన్నాను. పగలంతా, అతను లేడనే విరహంతో మాడిపోతున్నాను. నా వికారంతో, డోకులతో, వొంటరి తనంతో, విరహంతో, శూన్యభావంతో, నా మాతృభావం అడుగంటింది. నేను వెర్రిపట్టుపట్టి నా అమీర్ని వెళ్ళగొట్టానా? ఈ బిడ్డ పుడితే మాత్రం యెట్లా పెంచను? ఏం చేసుకోను? పోషణ యెట్లా?
Like Reply
#88

మా ఆనందానికీ, మా షికార్లకీ ఆటంకమనేకదా, అమీరు యీ కడుపు వొద్దన్నది అనుకున్నాను. ఆ పిల్లకి పాలిచ్చుకుంటూ, ఆ పిల్ల ఏడుపు సముదాయిస్తూ, దాని మురికితో నిండి, ఆ ధ్యానలోనే మునిగి....ఆ బిడ్డ మా ప్రేమని నాశనం చెయ్యదా? నాకంటె దూరదృష్టి కలవాడు అమీర్. అతనికి కోపం వచ్చిందంటే తప్పా మరి!
    ఇప్పుడు నన్ను అమీర్ వొదిలి వెడితేనే దిక్కుమాలిన పక్షినైనానే. ఆ పిల్లతో సహా ఏనాడో నన్ను వొదిలేస్తే యిద్దరమూ యామైపోతాము? ఇప్పుడు బతుకు దుర్భరమైతే యే యేటిలోనో ముంచి అంతం చేసుకోగలను నా బాధని! అప్పుడో? అని అనుకుంటూ వుండగా వొచ్చిందా మనిషి.
    "నెల లేమిటి?"
    "మీరాగారి అక్కగారు నన్ను పంపించారు."
    "ఎందుకు?"
    తెలిసింది. వొప్పుకోనా?
    కాని నా చిన్నపాపని. నన్ను నమ్ముకుని నాలో దాక్కున్న పాపని....కాని మళ్ళీ అమీర్ రావడమూ, నేనూ అతనూ ఆ మైదానంలో పూర్వం మల్లేనే....'సరే' అన్నాను.
    ఒక్కమాటలో, ఒక్క తలవూపుతో యీ దుస్వప్నం చెదిరిపోతుంది. మళ్ళీ మెలకువ వచ్చేటప్పటికి, మళ్ళీ అమీర్ నా ప్రక్కన వుంటాడు. మళ్ళీ జీవితమంతా ఆనందమయ మవుతుంది.
Like Reply
#89

ఈ పిల్ల లేకపోతేనేం-కాలమంతా గంతులేస్తే, నా ముందు నవ్వుతూ పరుగెత్తుతూ వుంటే! ఎంత వెర్రివాళ్ళీ మనుషులు! ఆశపడి నవ్వుల్ని చేతుల్నిండా పోగుచేసుకుని అతి ఆశతో గుప్పెట్లు తెరిచి చూసుకుంటే, భరించలేని కన్నీళ్ళుగా మారి కనపడతాయి.
    ఆ మూడు రోజులూ యమ బాధపడ్డాను. ఇంక మీరా నన్నంటి పెట్టుకొని నాకు పరిచర్య చేస్తూ నీతో కలిసి పడ్డ వేదన, రుణం యెన్ని జన్మాలలో తీర్చుకోగలను? నానించి యేమాత్రం ప్రత్యుపకారమూ వొస్తుందనే ఆశైనా లేక నాకు చూపిన అట్లాంటి ప్రేమని పొందిన నా జీవితాన్ని తలుచుకుంటే నా వొళ్ళు పొంగిపోతుంది. నన్ను తాకుతూ, నా జుట్టు దువ్వుతూ, నా నోట్లో జావా పోస్తూ, 'తగ్గిందా?' అని ప్రతి నిమిషం అడుగుతూ, నా కళ్ళలోకి చూస్తూ, నా చీర సర్దుతూ నా పక్కన కూచుంటే, నిజంగా యింకా నాలుగు రోజులు బాధలో పడుకోవాలనిపించింది.
ఆదుర్దాతో వెలవెలబోయే అతని మొహం చూస్తూంటే నా బాధ మరచి అతని బాధకై బాధపడేదాన్ని. నేనొక్క పెద్ద మూలుగు మూలిగి నప్పుడల్లా అతను విలవిలలాడి హడలిపోయేవాడు. అతని కళ్ళలోని వ్యథని చూడలేక ఆ నెప్పినంతా కుక్కుకుని కళ్ళు మూసుకు పడుకుంటే మళ్ళీ మళ్ళీ పలకరిస్తాడు. నేనెటు తిరిగితే అటు వొచ్చి కూచుంటాడు. నేను నిద్రపోతూంటే పాదాల దగ్గిర తల పెట్టుకుని పడుకుని నేను కదలినప్పుడల్లా చప్పున లేచి కూచుంటాడు. నా మీరాని, ఉరితీస్తారుట అతన్ని. యామవుతుందో అతని అందం, అతని హృదయం?
Like Reply
#90

యే గులాబి పువ్వులకి కొత్తరంగు, యే నక్షత్రానికో కొత్తమెరుపు, ఏ మబ్బులకి కొత్త నునుపు నిస్తుందో? ఏ దేవతల హృదయాలు కొత్తజాలిని, ఏ గంధర్వుల బాహువులకి కొత్తరసన, ఏ కిన్నెరుల కంఠాలు కొత్త పాట నిస్తుందో! మీరా! మీరా! 
    ఆ రాత్రి నేను పక్కమీదపడి మూలుగుతున్నాను. అంతసేపు నా పక్కమీద పడి కూచున్న మీరా కుండపట్టుకుని యేటి దగ్గరికి వెళ్ళాడు. మీరా తెచ్చిన లాంతరు గుడిసెలో వెలుగుతోంది. గుమ్మంలో నించి తూలుతూ నల్లని గడ్డం మనిషి వొస్తున్నాడు. వాడే ఆనాటి రాత్రి గడ్డం వాడని నాకు వెంటనే తెలిసి ప్రాణా లెగిరిపోయాయి. వాడు తాగి వుండకపోతే నా స్థితి అర్థమై వెళ్ళేవాడేనేమో? మీరా కోసం పెద్ద కేక వేశాను. వాడు తొరగా వచ్చి నా చేతులదిమి మీదపడి అల్లరి చేస్తున్నాడు. వాడితో పెనగడానికైనా శక్తిలేదు. మూలిగాను. బతిమాలాను. యింకా రాడేం మీరా! వొచ్చినా మాత్రం యీ రాక్షసి యెదుట యేం చేయగలడనే ఆలోచన తోచనేలేదు. మీరాని ముందే బైటవాణ్ని బైటనే యామన్నాచేసి రాలేదు కద వీడు? నా మూలాన, నాకోసం మీరా గతి యామైంది? ఆ తలుపుతో నా అవస్థని నేను మరిచిపోయి అతనికోసం గోలపడ్డాను. నన్ను రక్షించుకునే ధ్యాసే రాలేదు. ఐనా యేం చెయ్యగలను. వాడు నన్ను కిందికి అదిమి మరీ అశక్తురాలిగా చేశాడు. కళ్ళు తిరిగి బలహీనంతో మూతలు పడ్డాయి. ఎంతసేపయిందో పెద్ద కేకలు వినబడి కళ్ళు తెరుచుకున్నాయి.
Like Reply
#91

మీరాని వాడు మెడ పట్టుకుని లాక్కెడుతున్నాడు. రక్తం కనబడ్డది. మళ్ళీ తెలివితప్పి పడిపోయినాను. లేచేటప్పటి కంతా నిశ్శబ్దం. దీపం మాత్రం వెలుగుతోంది. మీరా లేని సంగతి మొహాన కొట్టినట్లు అయి నాకు దిమ్మ తిరిగింది. ఆ రాత్రి నేను పడ్డ బాధ యీ కోర్టువారు నన్ను ఉరి తీసేటప్పుడు కూడా పడను. అంతే కావాలి అనుకుంటున్నావు. అట్లాంటి బాధ, నా మీరా, నా ప్రాణదానం జేసి, నాకోసం బలిపడ్డ మీరా కోసం పడ్డ తపన యెంత ప్రేమలోనించి వొచ్చి వుండాలి? అది ఆలోచించు, ఆ ప్రేమ చాలదూ?
    నేను పెద్ద రక్తపు మడుగులో దొర్లుతున్నాను. దాహంతో నాలిక లోపలికి లాక్కుపోతోంది, లేచి నీళ్ళ చెంబందుకోలేను. మీరా! మీరా! మీరా యేడీ! యామైబోయినాడు? చప్పున నాకళ్ళముందు ఇందాక చూసిన పటం కనపడ్డది. ఆ రక్తం! వాడి చేతుల్లో కత్తి! వాడుపోనీ, తన దుర్మార్గం నెరవేర్చుకొనడానికైనా వెనక్కి రాకపోవడం! ఏం జరిగింది! తలచుకున్న కొద్దీ భయమేసింది. ఎక్కడ యే నూతిలో పారేశాడో! ఇప్పుడేదో గోతిలో కత్తిపోటు తిని మూలుగుతున్నాడేమో. మధ్యాహ్నం నా మెడచుట్టూ చేతులేసుక్కూచున్న మీరా? అక్కడైనా, ఆ బాధలోనైనా నన్నే తలుచుకుంటూ వుంటాడు ఏమైనానో అని, నా కాళ్ళు చేతులు ఇటూఅటూ కొట్టుకున్నాను. ఏం చెయ్యను? తీసుకురాగలిగితే ఎవరన్నా పిలవగలిగితే! తమాషా. అమీర్ వస్తే బావుండును. అతన్ని పంపిద్దును అని తోచి, యేడుపొచ్చింది? ఇంకేం మీరా? వాళ్ళ అమ్మ యెంత యేడుస్తుంది?
Like Reply
#92

నన్నెంత తిడుతుంది? ఆమెకన్నా తెలియజేయ గలిగితే! లేవబోయినాను. కిందపడ్డాను మళ్ళీ!
    గుడిశ తలుపులోంచి ఉత్తరాభాధ్ర కనబడుతోంది. దాని వెనక నించి చంద్రవంక విచారంగా ఉదయిస్తోంది. ఆ యర్రని కాలయముడు ప్రాణులపై పంపిన మరణపాశం వలె కనబడ్డది. దానికి నా మీరా కనపడుతున్నాడు? యే గోతిలోనో రక్తంకారే మీరాని చూసి కాదుగదా ఆ అరుణ కాంతి.... నక్క కూస్తోంది....యే గోతిలోనో, మీరా శవాన్ని వెన్నెట్లో చూసి కాదు కదా? అయ్యో మీరా! ఆ యేరట్లా యేడుస్తుందేం, యీరాత్రి! దాంట్లో పారెయ్యలేదు కదా మీరాని చంపి! ఈ దాహం యెట్లా? లేవలేను. ఎందుకు లేవడం? యెవరికోసం, కాని యీ బాధ! యింకెవరొస్తారీవేపు మీరా పోయిన తర్వాత! యింతే! నేనింక చావవలసిందేనా? అంతే కావాలి....అమీరు వొచ్చి తన క్రూరత్వం వల్ల యేం జరిగిందో తెలుసుకుని, పశ్చాత్తాపంతో మండిపోవాలి. కాని అతనికేం!(ఇంకెవ్వరినో తెచ్చుకుంటాడు. యిప్పటికప్పుడే తెచ్చుకున్నాడేమో!.... యీ ఘోరానికంతా అతనే కారణం? అతని కోసం) నేనీ తీవ్రత్యాగం చేశాను. చాలా కోపం వచ్చింది. అట్లాంటి క్రూరుణ్నెట్లా ప్రేమించానా అనుకున్నాను. మీరా నన్నింకా ఆక్రమించుకున్నాడు. మీరా కోసం దేవుణ్ని ప్రార్థించాను. వాళ్ళ అల్లాను వేడుకొన్నాను.... 'మీ వాడిని, మీరాని రక్షించ'మని కాని అమీరుని రప్పించమని ఏడ్చినపుడు నా మొర నెవరు విన్నారు!
Like Reply
#93

పోనీ అమీరు రాకపోయినా సరే మీరాను రప్పిస్తే చాలునన్నాను. తన ప్రాణాన్ని నాకు ఆహుతి చేసిన ప్రణయధీరుడు నా మీరా? కాని పాపాత్మురాలిని. నా యేడుపు దేవుడు వింటాడా? యెట్లా తెల్లవారిందాకా యీ 'సస్పెన్సు'లో కాలం గడపటం! తెల్లవారితే మాత్రం! పోనీ చచ్చిపోకూడదా? దాహం యింక బతకలేను. దాహం, బలవంతంగా లేచి కూచున్నాను. బట్టలన్నీ రక్తంతో తడిసి వున్నాయి. ఆ రక్తం మధ్య చిన్ని నోరెరగని పిల్ల? చిన్న కళ్ళు మూసుకుని, చిన్న కాళ్ళు, పొట్ట - భరించలేక పోయినాను. కళ్ళు తిరిగి పడిపోయినాను గావును-మళ్ళీ మెళుకువ వొచ్చింది. భయమేసింది. ఆ గుడిశక్తి- ఆమె దానానికి పిల్లా నేనూ! అదీ! అది కదిలితే! లేచి బైటికిపోతే! చంపినందుకు నా మీద కసి తీసుకుంటే ప్రేమా దిగులూ మాయమై, భయం పట్టుకుంది. భరింపలేని దాహం! అమ్మా! ఏం బాధ పడ్డానో! రాత్రి ప్రతినిమిషమూ చస్తాననుకున్నాను. ప్రతిచప్పుడికీ ఉలికిపడి వొణికాను. కాని చావను. నిద్రో! మూర్చో!
    మృదు పాదపద్మాల చప్పుడు నా హృదయంమీద కొట్టి లేపింది. వేగుచుక్కలో నించి వూడిపడ్డాడు. నా మీరా పీక్కుపోతున్న నాలికతో- "వొచ్చావా? నా మీరా? నువ్వేమైనావు చెప్పు" అన్నాను.
    చెప్పక "నువ్వెట్లా వున్నావు?" అంటూ నా రక్తాన్ని చూసి పెద్ద కేకేశాడు.
    "నిన్నేం చేశాడు."
    "ఏం చెయ్యలేదు. అసలు మళ్ళీ రాలేదు."
    "రాలేదు కదా! ఆ రక్తమేమిటి?"
Like Reply
#94

   సిగ్గుతో నేను మాట్లాడలేదు.
    "తాగడానికి నీళ్ళియ్యి ముందు"
    నాకు నీళ్ళిచ్చి, శుభ్రంచేసి పడుకోబెట్టాడు. నాకు వేరే చీర లేదు. దుప్పటి కప్పుకున్నాను.
    "అదంతా యేం చేస్తావు?"
    నా చిన్నిపాపని బట్టలో లుంగచుట్టాడు.
    "పారేస్తా!"
    "నువ్వా! నీచేత యీ పనికూడా చేయించుకుంటున్నానా నిర్భాగ్యురాల్ని!"
    "మాట్లాడకు"
    వెళ్ళివొచ్చాడు.
    "ఎక్కడ పారేశావు?"
    "ఇంక నీకు కనబడదు."
    ఎందుకో ఆ పిల్ల దిక్కులేకుండా పారెయ్యడమంటేనే నాకు కష్టంగా వుంది.
    "నువ్వేమైనావో చెప్పు. నీకే అపాయం వొచ్చిందో అని"
    "నేను యేటినుంచి తిరిగివచ్చి వాణ్ని చూసి వెంటనే మీదపడ్డాను. మా వాళ్ళు వాడికి బాగా తెలుసు. నన్ను లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి పోయినాడు. మళ్ళీ నీ దగ్గరికి వచ్చి యేం చేస్తున్నాడో, నువ్వేమైనావో, నీ బలహీనంతో అని నా భయం. 'ఆమెని తాకావా నిన్ను చంపేదాకా నేను నిద్రపో'నని అన్నాను కాని కుర్రవాణ్ణి నా మాట లక్ష్యం చేస్తాడా? అని సందేహమేసింది. వాడు వెళ్ళిన నిమిషాన్నించి ఆ తాళ్ళు కొరుక్కుని యిప్పటికి వొదిలించుకున్నాను" అన్నాడు.
    అతని నోరంతా రక్తమే! మెత్తని చేతులు నగిలిపోయినాయి తాళ్ళ బిగుసుతో. 'ఇంత వోర్చుకున్నావా బాబూ?' ఆ మాటలు చెప్పి నా చేతుల్లోకి తూలాడు. అట్లాగే వుత్తవొంటికి అతన్నదుముకున్నాను. ఇద్దరమూ నిద్రపోయినాము. మధ్యాహ్నం దాకా.
Like Reply
#95

7
 
    రమ్మని అమీర్ కి మీరా కబురు పంపాడు. కాని అతను వొస్తాడంటే నాకు అర్థంకాని భయం పట్టుకుంది. రాకుండా వుంటేనే బావుంటుందేమో ననిపించింది. అతను రాగానే మీరాతో జరుగుతున్న యీ మధుర స్వప్నంలోంచి మెలుకువ వస్తుందని భయం.
    ఇట్లా ప్రేమ మాగడమూ, ప్రేమలో సందేహాలు రావడమూ, ఒకేసారి యిద్దరిమీద ప్రేమ వున్నట్లు తోచడమూ, ఆ ప్రేమే చెరొకరిమీద చెరొక విధంగా, వేరు కారణాల వల్ల కలిగినట్టుండడమూ - ఇదంతా మీవంటివారు వొప్పుకోరు. వొళ్ళు కొవ్వెక్కితే, అట్లానే వుంటుందిలే. పశుకామం, అంటారు. అట్లా ఇద్దరిమీద వుండడం అసంభవమని తమ నీతి శాసనాలతో సృష్టినే, ప్రపంచంలోని హృదయాల్నే పాలించి అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు రాస్తారు కొందరు పుస్తకాల్లో! మీని గాలి మాటలు, నావి రక్తపు అనుభవాలు.
    వారం రోజుల కిందటే కదా అమీర్ని అంత గాఢంగా కోరాను? యీ బాధంతా అతను రావాలనేకదా అనుకున్నాను. కాని ఆ మూడురోజుల నరకమూ నాకు మీరాని అపరిమితంగా సన్నిహితుణ్ణి చేసింది. మీరా నా జీవిత వృక్షాన్నంతా పెనవేసుకున్నాడు. నేను పడ్డ యమబాధంతా మీరా అనే మంత్రంతో ఆనందమయంగా కనబడుతోంది. మళ్ళీ జబ్బుగా పడుకుంటేనేమి అనుకున్నాను. మీరా నాకు చూపిన మహాప్రేమ ప్రవాహం అవసరం లేక సన్నగిల్లింది. మళ్ళీ ఆ తీవ్ర త్యాగం అవసరమై నా కోసం ప్రవహిస్తే అతని ప్రేమ ననుభవించాలనిపిస్తోంది. కాని అతని రుణం తీర్చుకోగలనా? ఏం చేస్తే తీరుతుంది?
    ఒకనాటి రాత్రి మీరాని పిలిచి చెయ్యి పట్టుకుని పక్కన కూచోపెట్టుకున్నాను. 'మీరా నేను నీకు కావాలా?' అర్థంకాక నావంక చూశాడు.
    'అవాళ మధ్యాహ్నం....? అర్థమయిందని నా చేతుల్లోని అతని వేళ్ళు నాకు చెప్పాయి.
Like Reply
#96

    అతని చంపల్లోని సిగ్గుని చూసి మురుస్తూ.
    'నీకు కావలిస్తే యీ రాత్రి అయినా సరే'
    'నీ కవసరమా?"
    "నా కిష్టమే." నాకు సిగ్గేస్తోంది.
    'అదికాదు. నేను నీకు అవసరమా? అమీర్ మల్లె కావాలా!'
    ఎంత ఔదార్యమో? ఎంత లోతైన నాజూకైన స్వభావామో! అతన్ని గట్టిగా పక్కకి అదుముకుని మొహాన్ని తిప్పుకుని ముద్దు పెట్టుకున్నాను. నేను వొదిలిన అతని వేళ్ళు నా జుట్టులోంచి కదలలేదు. "నీతో అబద్ధం చెప్పలేనోయ్. నేను అమీర్ దాన్నే అనిపిస్తుంది. నాకిష్టముండదు. నేనేం గొప్పదాన్నీ, పతివ్రతనీ అని కాదు."
    "అయితే యెందుకడిగావు?" ఆ ప్రశ్న నన్ను గుచ్చుకుంది, సిగ్గుతో.
    "నిన్ను సంతోష పెడదామని. యెందుకంటే నేను అమీర్ దాన్నైనా అతనిమీద కంటే నీపైనే నాకు ప్రేమ యెక్కువ."
    మాటలు తప్పించి యేవో మాట్లాడి వెళ్ళిపోయినాడు. మీరా లాంటి వాణ్ణి మళ్ళీ చూస్తానా? తురకలని గుమ్మంలోనికి రానియ్యరు పవిత్రులైన మీరందరు.
    "దీదీ అమీరు వస్తే?" అన్నాడు ఒకరోజు.
    "ఏమిటి?"
    "నాకు భయంగా వుంది."
Like Reply
#97

    "భయం?" నాకు తెలుసు కాని అడిగాను. ఆడదాన్ని.
    "వొప్పుకోడేమో?"
    "ఎందుకు మీరా?" అడిగాను కాని ఆ ప్రశ్న నన్నూ బాధిస్తోంది.
    "మనమింత స్నేహంగా వుండడం"
    "తప్పేముంది?"
    "లేదు. కాని అతనేమనుకుంటాడో?"
    "అంతమాత్రం  విచక్షణ లేనివాడా?"
    "విచక్షణ వుంటుందా? నాకు భయమేస్తోంది" అన్నాడు.
    "భయపడకు నేనున్నానుగా...."
    "ఎందుకు; నిన్నేమైనా చేస్తాడని భయమా? నేను కాపాడనా?"
    అమీర్ నా మాట వినడా?
"నన్నా! నన్నేమి చెయ్యడు. నాకా భయమేమీలేదు. పోనీ నన్నేం చేసినా చెయ్యనీ. ఏం చేస్తేనేం? అది కాదు, నిన్ను" అంటున్నాడు మీరా.
    "నన్నేమి చెయ్యడు?"
    "నీకు తెలీదు."
    "నాకంటే పెద్దవాడిమల్లే మాట్లాడుతున్నావే?"
    "నాకు లోకం తెలీదనా? అమీరు సంగతి తెలీదనా! నాకంటే ఏం పెద్దదానివి నువ్వు? నీకేం తెలుసు?"
Like Reply
#98

    నిజమే. నేనతనికన్న యేమాత్రం పెద్దదాన్ని! ఆడదాన్ని గనక అట్లా మాట్లాడుతున్నావు కాని - అన్నాడు గదా "నీకు తెలీదు; అందులో తురకవాళ్ళ సంగతి నీకేం తెలుసు?" ఊరుకున్నాను, ఆలోచిస్తే అమీరు రక్తపు మాటలు జ్ఞాపకం వొస్తున్నాయి. మీరా కూడా ఆలోచిస్తూ కూచుని అన్నాడు కదా.
    "ఇదుగో, నా కంఠం నులమనీ, నీమీద చెయ్యి వేశాడా-అమీరు- అందుకనే నిన్ను విడిచిపోను. నా మూలాన నిన్నేమన్నా చేస్తే-చేస్తే చంపేస్తాను. పొడిచేస్తాను గుండెల్లో"
    నేను మాట్లాడలేదు. నా పులిపిల్ల కళ్ళలోని నిప్పుల్ని, చంపలమీద మంటల్ని చూస్తున్నాను.నా చిన్నబాబు తక్తుమీద నించి మాట్లాడుతున్నాడు. "మాట్లాడవేం? అప్పుడు నా మొహం చూడను పొమ్మంటావా దీదీ?"
    ఏం చెప్పను?
    "మాట్లాడవా?" అన్నాడు అనుమానంతో. నేను మాట్లాడలేదు. చప్పున లేచి గుమ్మంలోకి నడిచాడు.
    "నేను రాను రాను. అమీరు వచ్చిం తరువాత."
    "నువ్వు రాకపోయేట్టయితే, అమీర్ రానక్కరలేదు" అన్నాను.
    "ఎందుకఖ్కర్లేదు! నువ్వఖ్కర్లేదన్నా తనూరుకుంటానా? అతనూరుకుంటాడా?" పోట్లాట పోయింది. నా చూపుల్లో చప్పున స్త్రీ జాతికి సహజ ఆయుధం ధరించాను. నీళ్ళు నిండాయి.
    "మీరా, నన్ను వొదిలేస్తావా?"
    "అమీర్ కి కోపం వచ్చి నిన్నేమన్నా చేస్తే!"
    "మీరా! ఆ ఆపద రానీ ఆలోచిద్దాము"
Like Reply
#99

                                              8
    అమీరు వొచ్చినప్పుడు మీరా లేడు. రాగానే అతని కళ్ళు న దేహాన్ని ఆక్రమించుకుని వెతికాయి. సిగ్గుతో మెల్లిగా పక్కగా నుంచున్నాను. నా నడుం పక్కగా చెయ్యేసి నా మొహంవంక చూసి "మునుపటి కంటె కూడ ఎంత బావున్నావో! నీ కళ్ళలో కొత్త కాంతి వెలుగుతోంది" అన్నాడు.
    అవే అతని మొదటి మాటలు. నేను తనకోసం చేసిన త్యాగం సంగతి యెత్తి నన్ను మెచ్చుకుని లాలిస్తాడని పడుతున్న ఆశ భగ్నమై నన్ను బాధపెట్టింది. ఆ సంగతి సూచనగా ఒకటి రెండుసార్లు ఎత్తినా అతను వినదలుచుకోలేదు.
    అమీరు లేని నాలుగు నెలలూ, అసలు కాలంలో లేకుండా పోయినట్టే వుంది. తలచుకున్నా నాకు ఆ కాలం జరిగినట్టే తోచదు. ఎప్పుడూ మేమిద్దరమూ అనాదినించి, సృష్టి పూర్వంనించి అట్లానే కలిసి వున్నామనిపించింది. మేమిద్దరమూ లేకుండా యీ సృష్టి నిలుస్తుందనిగానీ ఆ కొండ గడ్డి అట్లా ఎత్తుగా పరిమళంగా ఎదుగుతుందని గాని వూహించలేను.
    "మనం పోయిం తర్వాత యీ గుడిశలో ఎవరన్నా వుంటారో, పాడుబడి, నక్కలు కూచుంటాయో?" అని అమీరంటే....
    "మనం లేకపోవడ మేమిటి?" అన్నాను.
    పూర్వం మల్లేనే సంతోషంగా గడిపాము వారం రోజులు. కాని అర్ధరాత్రి అతన్ని ఆనుకుని ఆకాశపు నలుపు లోపలికి చూసేటప్పుడు, అతను మెల్లిగా చల్లని గాలిలో పాడుతూ కూచుండగా, వెనకనించి నేను అతని కళ్ళకేసి చూస్తే యెప్పుడో త్వరలోనే ఆ శాంతం విరిగి నా తల పగిలేట్లు బద్దలై పడుతుందని భయం వేసింది. అంత సంతోషంలోనూ కూడా నా హృదయం "మీరా యేడీ రాడేం" అంటోంది. అమీర్ తానా నాలుగు నెలలూ యెక్కడ వున్నదీ, యేమి చేసిందీ చెప్పలేదు. నేనేం చేస్తున్నదీ అడగలేదు. గుచ్చిగుచ్చి అడుగుతాడని భయంగా వుంది. కాని అడగలేదని బాధగానూ వుంది.
    వారం రోజులైన తరువాత గావును. బియ్యం కోసం అమీర్ వూళ్ళోకి వెళ్ళాడో లేదో, చెట్ల వెనక మళ్లాడో లేదో వొచ్చి నా యెదుట తల వొంచుకొని నుంచున్నాడు.
    "మీరా! యిన్నాళ్ళేమైనావు?" కళ్ళంబడి నీళ్ళు పెట్టుకున్నాడు.
Like Reply

    "మీరా, ఎందుకోయ్. నా బాబూ!"
    "దీదీ, అంతా ఆఖరా?"
    "ఏమిటి?"
    నా కర్థమయింది కాని అడిగాను.
    "నీకు తెలీదూ".
    "ఏమిటోయ్ ఆ మాట? ఏమీ ఆఖరు కాదు. నువ్వు వుత్త భ్రమపడుతున్నావు." అంటున్నాను కానీ, ఏదో మార్పు కలిగిందని నా హృదయం అదుర్తోనే వుంది. "దీదీ! నేనీ బాధని భరించలేను. ఈ-"
    "ఏమిటాబాధ! ఎందుకు?"
    "నాకు తెలీటంలేదు. చాలాసార్లు ప్రశ్నించుకున్నాను, అర్థంకాదు కాని భరించలేను. మాట్లాడలేను? ఈ మూడు రోజులూ ఆ పొద వెనక కూచుని వున్నాను-రాత్రింబవళ్ళు..."
    పాపం?
    "అయ్యో, మీరా మూడురోజులు అక్కడ వున్నావా? ఎందుకు రాలేదూ? పిచ్చితండ్రి! నిన్ను మరిచిపోయి, నేను నా ఆనందంలోనే వున్నానా? కాని నిన్ను మరిచిపోలేదు. దుర్మార్గురాల్ని, నిర్భాగ్యపుదాన్ని, ఏం చెయ్యను నీ బాధని తీర్చడానికి!"
    నుంచుని అతనిని నా పక్కన కూచో పెట్టుకుని, అతని తలని గట్టిగా కావలించుకున్నాను.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)