Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అంతిమలేఖ
#6
అంతిమలేఖ - 3





రచన: ఆటీను రాజు


రమ్మీ, డియరెస్ట్. 



ఆ ముత్యాల జల్లు కురిసేవరకు ... సెలవు!  ఉంటాను. 



* * *

అతని కళ్ళమ్మట ధారగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. 


తను రాసినది  చదివిన మనిషి కంటతడి పెట్టాలనే అతను ఆశిస్తున్నాడు. కానీ తానే భావోద్వేగానికి లోనయ్యి ఏడవటం అతన్ని ఒక పక్క ఇబ్బంది పెట్టింది. కానీ ఇంకో పక్క ... 


ఉత్తరం పూర్తయ్యింది. తృప్తిగా ఉంది. గుండెల్లోని మంట మటుకు తగ్గలేదు. ఇంకొక టాబ్లెట్ తీసుకుని వేసుకున్నాడు. ఆ మందులు ఫాస్ట్ గా పనిచెయ్యాలంటే నమలాలి, చప్పరించాలి,  మింగకూడదు అని వినటం గుర్తొచ్చింది.  


కాళ్ళూ చేతులూ విదిలించుకున్నాడు. కాలు విదిలిస్తుంటే నొప్పి మళ్ళీ తన్నుకుని వచ్చింది. 


టేబుల్ లాంప్ ఆఫ్ చేసాడు. గది అంతా  చీకటి వ్యాపించింది.  ఒక మూల నుంచి విసుగు పుట్టించే ఆ శబ్దం వస్తోంది.


కిటికీలోకి చూసాడు. చీకటికి అలవాటు పడిన కళ్ళు ఏదో  గమనించాయి. చేతులు అడ్డంపెట్టుకొని కనుబొమలు ముడిచి కళ్ళు చిట్లించి మళ్ళీ చూసాడు. 


చూస్తున్నది నిజమేనా? ఎప్పుడూ ఇలా జరగదే? 


నమ్మలేక  లేచి నుంచున్నాడు, కాలి నొప్పిని భరిస్తూ. కిటికీకి  దగ్గరగా మొహం ఆనించి  తొంగి చూసాడు. 


గాలి వీస్తోంది. మామిడి ఆకులు గాలికి ఊగుతున్నాయి. మామిడి చెట్లకు వేలాడుతున్న మామిడి కాయలు కూడా ఊగుతున్నాయి. తోటలో ఒక్క మనిషి లేడు!


ఒక్క వాచ్ మాన్ కూడా లేడు! 


తోట నిర్మానుష్యంగా ఉంది! నిశ్శబ్దంతో సద్దుమణిగి ఉంది! చొరబడి మామిడి కాయలు కొట్టేయటానికి  ఇంతకన్నా మంచి అవకాశం లేదు! 


హాస్టల్ ప్రహరీ గోడకి  వెనుక మామిడి తోట ఉంది. పంటని కాంట్రాక్టు కి ఇస్తారు. ప్రతి ఏడాదీ పిందె మొలిచినప్పటినుంచీ పంట కోత ముగిసేదాకా అందులో వాచ్ మాన్ లు ఉంటారు. ఆ వాచ్ మాన్ లకి తలనొప్పిని ఎక్కువగా ఇచ్చేది హాస్టల్ లోని జనాలే! ఆ దోపిడీదారులనుంచి మామిడి పంట ని కాపాడటమే వాచ్ మాన్ల మెయిన్ డ్యూటీ. వాళ్ళకీ హాస్టల్ లోని స్టూడెంట్ లకీ టామ్ అండ్ జెర్రీ లకి మధ్య మల్లె నిరంతర యుద్ధం జరుగుతూ ఉంటుంది.  


కిందటి ఏడాది సీజన్లో  జరిగిన అవమానం అతడికి గుర్తుకి వచ్చింది. సిగ్గుతో పగతో  గుండె మండిపోయింది.  ఒక రోజు రాత్రిపూట ఇంకో  ఇద్దరితో కలిసి తోటలోకి పిల్లిలా చొరబడి  కాయలు కోస్తున్నాడు. అత్యాశకి పోయి ఎక్కువ కాయలు కొయ్యటంతో బుట్ట బరువై తెగి అవి చెల్లా చెదురు అయ్యాయి. ముగ్గురూ వాటిని వదిలేసి పరిగెత్తారు. ఆ సందడికి నిద్రపోతున్న వాచ్ మాన్ లు లేచారు. ఫ్రెండ్స్ తప్పించుకున్నారు. తాను దొరికిపోయాడు. హాస్టల్ వార్డెన్  కాంట్రాక్టర్ కి ఫోన్ చేసి బతిమాలాటంతో బతికిపోయాడు. లేకుంటే వాచ్ మాన్లు ఆ రోజున ఒంట్లోని బొమికెలు లెక్కిపెట్టి ఉండేవారు. 

ఇప్పుడు వాచ్ మాన్ లు లేరు! ఖచ్చితం గా లేరు! వాళ్ళు ఎందరు ఉన్నారో, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో, ఎక్కడెక్కడ కూచుంటున్నారో ... అన్నీ వివరంగా  ప్రతి రోజూ నోట్ చేసుకుంటూనే ఉన్నాడు. ఇదే ఛాన్స్! రూమ్మేటు గాడిని లేపి తోటని ఎటాక్ చెయ్యాలి! పగ తీర్చుకోవాలి!


మితిమీరిన ఉత్సాహం లో కాలు సంగతి మర్చిపోయి  రివ్వున  వెనక్కి తిరిగాడు. నొప్పి సర్రున కొట్టింది.  "హమ్మా!" అని మోకాలు పట్టుకుని అరుస్తూ కుర్చీలో కూలబడ్డాడు. ఆ శబ్దానికి రూమ్మేట్ గురక ఆగిపోయింది. ఆ గురక తను రాస్తున్నంత సేపూ డిస్టర్బ్ చేసి విసుగు పుట్టించింది. ఇప్పుడు తను చేసిన శబ్దానికి అతను డిస్టర్బ్ అయినట్టుకున్నాడు.  బెడ్ మీద కదిలాడు. 


"ఏంది  బ్రో? ఆల్ ఓకే?" అడిగాడు రూమ్మేట్. 


"ఆల్ ఓకే బ్రో, ఆల్ ఓకే", చెప్పాడు మూలుగుతూ, తోటమీద ఎటాక్ ప్రస్తావన వదిలేసి.  


రూమ్మేట్ అటు దొర్లి ఇటు దొర్లి మళ్ళీ గురక మొదలుపెట్టాడు. 


తొడని మర్దనా చేసుకుంటూ దాని వంక చూసాడు. దీనబ్బ జీవితం! తిట్టుకున్నాడు. 


దీనబ్బ జీవితం, ఇవ్వాళ్ళే జరగాలా ఇది? 


ఎమ్ టెక్ టీమ్ వాళ్లతో నడుస్తోంది మేచి. మంచి రసపట్టు లో ఉంది. తమ ఇన్నింగ్స్ లో ముప్ఫయిమూడు రన్స్ కొట్టాడు. నాట్ బేడ్.  స్క్వేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. షార్ట్ పిచ్ బాల్ ని బేట్స్ మాన్ అడ్డంగా హుక్ షాట్ కొట్టాడు. గాల్లో ఎగురుతూ బాల్  తనవైపే వస్తోంది. "కేచ్ ఇట్! కేచ్ ఇట్!" అంటూ టీమ్మేట్ లు అరుస్తున్నారు. దానివంకే చూస్తూ వెనక్కి పరిగెడుతున్నాడు. పరిగెడుతున్నాడు .. పరిగెడుతున్నాడు ... ఓ పక్క బౌండరీని దాటేస్తానేమోనని ఆదుర్దా...   ఇంకోపక్క  కళ్ళల్లో  పొడుస్తున్న సూర్యుడు... ఆ గందరగోళంలో ఎలా పడ్డాడో తెలియదు .. ఒంటి  కాలిమీద బొంగరంలా గిర్రున తిరిగి దభేల్ మని కింద పడ్డాడు. కాలు బెణికింది. మొదట్లో  ఇంత నొప్పి లేదు. కానీ రూమ్ కి వచ్చినప్పటినుంచీ పెరుగుతూ వచ్చింది.   


తనకేదో బేడ్ పీరియడ్ నడుస్తోంది, గ్యారంటీగా. ఎందుకంటే  కడుపు మంట చంపేస్తున్నపుడే ఈ కాలు నొప్పి కూడా వచ్చి చావాలా?


ఆ కడుపు నొప్పిని, గుండె మంటని భరించినంత కాలం భరించి, నిన్న సాయంత్రం ఇక తప్పదనుకొని కేంపస్ డిస్పెన్సరీ కి పోయాడు. అక్కడి డాక్టర్ అంటే అతనికి పడదు. స్టూడెంట్లని  చిన్న పిల్లల్లా చూస్తాడు. కుళ్ళు జోకులు వేస్తాడు. చైన్ స్మోకింగ్ చేస్తాడు!


"ఏంటి రెగ్యులర్ డయెట్టు?" అడిగాడు డాక్టర్, పొట్ట నొక్కి చూస్తూ. నోట్లో సిగరెట్ ఉంది.


"అంటే?" అడిగాడు, అర్ధం కాక. 


"అదే తమ్ముడూ, ఏం గడ్డి తింటున్నావ్? సుబ్బయ్య కొట్లో కరెంట్ అకౌంట్ ఖాతా, య్యెస్స్? రోజుకి అరకిలో మిరపకాయ బజ్జీలు మింగేస్తుంటావని అంచనా"


"మెస్ లో  లంచీ డిన్నరూ తింటున్నా", చెప్పాడు కోరగా చూస్తూ.


"సర్లేవోయ్. పానీపూరీ కూడా తింటున్నావ్ లే. ఎసిడిటీ. నీ పొట్టలో అంతా హైడ్రోక్లోరిక్ యాసిడ్. దానికి విరుగుడు మాగ్నీజియం హైడ్రాక్సైడ్. వేస్కోపోతే పొట్ట బిగ్ బేంగ్ లా పేలిపోద్ది!"


నవ్వు, అన్నట్టు చూసాడు డాక్టరు. అతను నవ్వలేదు. 


"క్లాస్ కి పోయే హేబిట్టుందా?", అడిగాడు మళ్ళీ డాక్టర్. 


చుర చుర చూసాడు. "వెళ్తుంటాను", చెప్పాడు. 


"సరే, ఇవి తీస్కో", పింక్ కలర్ టాబ్లెట్ లు ఇచ్చాడు. డైజీను. "క్లాస్ కి జేబు లో వేసుకుపో.  తిన్నాక వేస్కో. ఇదే బాటిల్ లో కూడా వస్తుంది. కొనుక్కో", సలహా ఇచ్చాడు. 


అప్పటినుంచి ఆ డైజీను టాబ్లెట్ లని చాక్లెట్లు మింగినట్లు మింగుతున్నాడు. కొంతసేపు ఉపశమనం ఇస్తాయి, కానీ గుండెమంట మళ్ళీ వస్తోంది. 


ఏదయితేనేం, మామిడికాయలు కొట్టెయ్యలేకపోవచ్చు, క్రికెట్ మేచి ఓడి ఉండవచ్చు, కాలి నొప్పితో, కడుపు నొప్పితో బాధ పడుతూ ఉండి ఉండవచ్చు.  కానీ రాయాల్సింది మటుకు రాయటం పూర్తి చేసాడు. అదీ  అన్నిటికన్నా ఇంపార్టెంటు! ఓవరాల్ గా రోజు బానే గడిచింది. 


అతనికి సంతృప్తి గా ఉంది. బీర్ బాటిల్ ని నిలువెత్తునా వొంచి నోట్లో పెట్టుకున్నాడు, ఒక చుక్కేమైనా రాల్తుందేమోనని. రాల్లేదు. 


కుంటుకుంటూ వెళ్లి మంచం మీద పడుకున్నాడు. దొర్లాడు. నిద్ర ఎంతకూ రావటం లేదు. 


ఏదైనా చదివితే వస్తుందేమో. బెడ్ లాంప్ ఆన్ చేసి, పక్కనే ఉన్న అలమారా తెరిచి, చేతికి అందిన పుస్తకం బయటికి లాగాడు. "ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ యారేస్, సెకండ్ ఎడిషన్, స్టీఫెన్ బ్రౌన్", వచ్చింది. టెక్స్టు బుక్కు.  "దీనికన్నా దొర్లటమే బెటరు" అని నిర్దారించుకుని దాన్ని లోపలికి తొయ్యబోతుంటే  పైనుంచి ఇంకో పుస్తకం కింద పడింది. పాత మాగజైన్. మాసిపోయి ఉంది. కాగితాలు కుక్క చెవుల్లా వేలాడుతున్నాయి. ప్లే బోయ్. ఎప్పటిదో అమెరికన్ ఎడిషన్. 


హాస్టల్ లో ఒక బేచి నుంచి ఇంకో బేచి కి అలాటి శృంగార గ్రంధాలు చేతులు మారటం మామూలే, వంశపారంపర్యంగా ఆస్తులు సంక్రమించినట్టు. ఈ పుస్తకం అతనికి సుపరిచితం కూడా. అందులోని సెంటర్ ఫోల్డ్ బ్లాండ్ సుందరి అతని ఫేవరెట్టు. ఎన్నోసార్లు చూసాడు. ఆమెని లోతుగా అధ్యయనం చేసాడు. ఆమె సర్వాంగాల్లోనూ బొడ్డే హైలైట్ అని అతని తిరుగులేని అభిప్రాయం. 


పేజీలు తిప్పాడు. బ్రా,  జీ-స్ట్రింగ్ లో  బ్లాండ్ సుందరి. బాగుంది. 


ఇంకో పేజీ తిప్పాడు. బ్రా వచ్చేసింది. కానీ సుందరి అటు తిరిగి ఉంది. సస్పెన్స్! 


ఇంకో పేజీ తిప్పాడు. రక్తం ఉరకలెత్తింది. సుందరి వంగోని  చెడ్డీని పిక్కల కిందుగా లాగుతోంది. ముందుకి వేలాడేసిన బంగారపు రంగు జుట్టు రహస్యాలని దాస్తోంది. సస్పెన్స్ పెరిగింది! 


హెచ్చిన ఉద్వేగంతో ఇంకో పేజీ తిప్పబోతుండగా, కిటికిలోంచి రివ్వున గాలి వీచికొట్టింది. దాని ధాటికి టేబుల్ మీద అప్పుడే రాసి పక్కనపెట్టిన కాగితాలు  రెపరెపలాడాయి. వాటి వైపు అతని చూపు మళ్లింది. 

ఒక్కసారిగా అతనిని  గిల్టీ ఫీలింగ్ నిలువెల్లా ఆవహించింది.


టేబుల్ మీద  కాగితాల్లో ... రగులుతున్న భగ్నప్రేమికుడి మనోవేదన ... 


పుస్తకంలోని కాగితాల్లో ... నగ్న సుందరి ప్రేరేపిస్తున్న కామోద్వేగం ... 


ఆ పేజీల్లో ఆర్ద్రత, భావుకత ... 


ఈ పేజీల్లో బూతు, అశ్లీలత ... 


రెండిటికీ పొంతన కనిపించలేదు. 


అతనిలోని రొమాంటిక్ పురుషుడు మళ్ళీ మేల్కున్నాడు. కామాంధుడి మీద తిరగబడ్డాడు. 


నో! తక్షణ తృప్తి, క్షణికావేశం నెగ్గటానికి వీల్లేదు. కనీసం ఈ రోజైనా  ప్రేమ, రొమాన్సు, అమాయకత్వం వగైరాలు గెలిచి తీరాలి. 


సుందరిని మూసేసి అలమారా లోకి నెట్టేశాడు. బెడ్ లాంప్ ఆర్పేశాడు. తన ఇరవైయ్యేళ్ల తలని దిండు మీద సున్నితంగా ఆనించి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. 


అతని తృప్తికి కారణం ఉంది. ఆ ఉత్తరం బాగా రాసాడని తెలుసు. తనే గెలుస్తాడని అతని గట్టినమ్మకం. కాలేజీ కల్చరల్ కమిటీకి హెడ్డు ఇంగ్లిష్ ప్రొఫెసరు సుభాషిణి గారు. ఆవిడ రచయిత్రి. ఆవిడకి తను రాసినది నచ్చి తీరుతుంది. అసలు ఆవిడే, కొద్దిరోజుల్లో రాబోతున్న కాలేజ్ డే ఫంక్షన్ కోసమని  కల్చరల్ కమిటీ పెట్టిన పోటీకి టైటిలు డిసైడ్ చేసి ఉంటుంది!  క్రేజీ ఐడియాలు ఆవిడకే వస్తాయి. "అత్యుత్తమ ఆత్మహత్యా పత్రం పోటీ! ది బెస్ట్ సూయిసైడ్ నోట్ కాంటెస్ట్!" లాంటి పిచ్చి ఐడియాలు  ఆమెకి తప్పితే ఇంకెవరికయినా తడతాయా? ఇంపాసిబుల్! 


~ అయిపోయింది ~ 
[+] 2 users Like KingOfHearts's post
Like Reply


Messages In This Thread
అంతిమలేఖ - by KingOfHearts - 15-03-2024, 07:37 PM
RE: అంతిమలేఖ - by sri7869 - 15-03-2024, 09:36 PM
RE: అంతిమలేఖ - by KingOfHearts - 16-03-2024, 10:32 PM
RE: అంతిమలేఖ - by sri7869 - 16-03-2024, 10:56 PM
RE: అంతిమలేఖ - by Rishithejabsj - 17-03-2024, 10:13 PM
RE: అంతిమలేఖ - by KingOfHearts - 18-03-2024, 09:07 PM
RE: అంతిమలేఖ - by sri7869 - 18-03-2024, 11:50 PM



Users browsing this thread: 1 Guest(s)