Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#24
ప్రొమీథియస్: మానవుల శ్రేయోభిలాషి


ప్రొమీథియస్ (Prometheus) కథ ఈ ఆధునిక సాంకేతిక యుగానికి చాల పొంతన కల కథ. ఎందుకంటే మానవుల హితవు కోరి ప్రొమీథియస్ దేవలోకం నుండి అగ్నిని దొంగిలించి మానవులకి బహుమానంగా ఇచ్చేడు. నిప్పు లేకుండా ఉండి ఉంటే మనం ఇంకా అడవుల్లో చెట్ల మీద మన ముత్తాతలతో మనుగడ సాగిస్తూ ఉండేవాళ్ళం కదా! సాంకేతిక ప్రగతికి నిప్పుని మచ్చిక చేసుకోవడం మొదటి మెట్టు అని మన అందరికి తెలిసిన విషయమే!

ప్రొమీథియస్ (ముందుచూపు అని అర్థం) టైటనుల ప్రవరలో పుట్టిన వ్యక్తి. టైటను అయినప్పటికీ టైటనులకి ఒలింపియనులకి మధ్య జరిగిన మొదటి మహా సంగ్రామంలో ప్రొమీథియస్ ఒలింపియనుల పక్షం కాసి దేవతల రాజైన జూస్ గెలుపుకి సహాయపడ్డాడు. ఈ యుద్ధంలోనే జూస్ తన తండ్రి క్రోనస్‌ని చంపి ఒలింపియనులకి అధిపతి అయేడు. అంతే కాదు. ఎథీనా జూస్ శిరస్సు చీల్చుకుని బయటకి వచ్చినప్పుడు ప్రొమీథియస్ దగ్గరే ఉండి ఆ కార్యక్రమం సజావుగా జరగడానికి తోడ్పడ్డాడు. కనుక ప్రొమీథియస్ అంటే జూస్‌కి అభిమానం ఉండాలి. మొదట్లో వీరిరువురి మధ్య సత్సంబంధాలే ఉండేవి. కానీ క్రమేపి మానవ సంతతి భూమి మీద పెరిగి వర్ధిల్లడం మొదలయే వేళకి ప్రొమీథియస్ మానవ పక్షపాతం చూపించి వారికీ సాంకేతిక విద్యలు నేర్పడం, వారికి అగ్నిని ఇవ్వడం వంటి ప్రాపక చర్యలు చేయడం జూస్‌కి నచ్చలేదు. స్వతహాగా జూస్‌కి మనుష్యులు బలవంతులు అవడం అంటే ఇష్టం ఉండేదికాదు. ఈ కారణాల వల్ల ప్రొమీథియస్‌కి తరచు జూస్‌తో భేదాభిప్రాయాలు వచ్చి ఘర్షణపడుతూ ఉండేవాడు.

ఇలా అంతర్గతంగా రగులుతూన్న కోపం ఒక్కసారి పెల్లుబికి పైకి రావడానికి కారణం ప్రొమీథియస్ చేసిన ఒక కొంటెపని. దేవతలు చేసిన ఒక యజ్ఞంలో ఒక మహిషాన్ని బలి ఇస్తారు. ఆ యజ్ఞఫలంగా ఆ ఎనుబోతు దుమ్ములని ఒక పెద్ద పళ్ళెంలో అమర్చి, వాటి మీద ఒక పొర కొవ్వుని పరచి, వాటి మీద పువ్వుల వంటి అలంకారాలు జతపరచేడు, ప్రొమీథియస్. వేరొక చిన్న పళ్ళెంలో ఆ ఎనుబోతు మాంసాన్ని వెగటు పుట్టించే పేగులతో కప్పి, రెండు పళ్ళేలని జూస్ ముందు ఉంచి ప్రథమ ప్రసాద భక్షకుడిగా ఒక పళ్ళెం ఎంచుకోమంటాడు ప్రొమీథియస్. పైకి అందంగా కనిపిస్తూన్న పెద్ద పళ్ళేన్ని జూస్ ఎంచుకుంటాడు. ప్రొమీథియస్ రెండవ పళ్ళేన్ని పట్టుకెళ్లి ఆకలితో అలమటిస్తున్న మానవులకి ఇచ్చేస్తాడు. తనని మోసంచేసి తనకి బొమికలు ఉన్న పళ్లెం అంటగట్టడం మొదటి తప్పు. తనకి ఇష్టంలేని మానవులకి మంచి మాసం ఉన్న పళ్లెం ఇవ్వడం రెండవ తప్పు. ఇలా రెండు విధాలుగా జూస్ అహం దెబ్బతింది కాబట్టి జూస్ ప్రొమీథియస్ మీద కక్ష కట్టేడు.


[Image: promet.jpg]


రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలకి కొదువా? కాకేసస్ (Caucausus) పర్వతాలలో ఒక రాతికి ప్రొమీథియస్‌ని గొలుసులతో కట్టి అతనిని కాలం అంతరించే వరకు చిత్రవధ చెయ్యమని ఆజ్ఞాపించేడు, జూస్. ఎలా? ప్రొమీథియస్‌కి చావు ఒకేసారి రాకుండా, పగటి పూట ఒక డేగ వచ్చి, అతని కాలేయాన్ని నెమ్మది నెమ్మదిగా పొడుచుకుని తింటూ ఉండాలి. ఆ కాలేయం రాత్రిపూట తిరిగి పుంజుకుని పెరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి రోజు సూర్యచంద్రనక్షత్రాదులు ఉన్నంత కాలం బాధ అనుభవిస్తూ ఉండమని ఆజ్ఞాపించేడు (శపించాడు) జూస్.

మానవకోటి మనుగడకి, పురోభివృద్ధికి ముఖ్యంగా కావలసిన నిప్పుని దేవతల దగ్గర నుండి దొంగిలించి మానవులకి ఇచ్చినందుకు ప్రొమీథియస్ ఇలా యమయాతన అనుభవించేడు. తన శరీరాన్ని డేగ పొడుచుకుని తింటూ ఉంటే ఆ బాధకి అతను పెట్టే పెనుబొబ్బలు గ్రీసులో ఉన్న ఒలింపస్ పర్వతం వరకు వినిపించేవిట. ఆ బొబ్బలు విని జూస్ ఆనందపడేవాడట. మరెవరైనా తనని ధిక్కరించి ప్రవర్తిస్తే వాళ్ళ గతి కూడా ఇలాగే ఉంటుందని హెచ్చరించేవాడుట.

మహా బలశాలి హెర్క్యులిస్ ఆ డేగని చంపి, ప్రొమీథియస్‌కి విముక్తి కలిగించి ఉండకపోతే ఇప్పటికీ ఆ కాకేసస్ పర్వతాలలో ప్రొమీథియస్ పెట్టే పెడ బొబ్బలు మనకి వినిపిస్తూ ఉండేవి!
(సశేషం)

Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 11:46 PM



Users browsing this thread: 1 Guest(s)