Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#22
గ్రీకు పురాణ గాథలు 8
 

ఈడిపస్ విషాద గాథ

గ్రీకు పురాణ గాథలలో ఈడిపస్ (Oedipus) కథ పేరెన్నికగన్న కథ. సంస్కృతంలో కాళిదాసు శాకుంతలమ్ ఎంత పేరు పొందిందో గ్రీకు భాషలో సొఫొక్లీస్ (Sophocles) రచించిన ఈడిపస్ రెక్స్ (Oedipus Rex) అనే నాటకం అంత చెప్పుకోదగ్గది. చిఱుతప్రాయంలో పిల్లలు ఎదుర్కొనే ఒక విచిత్రమైన మనోస్థితిని వర్ణించడానికి ఆధునిక మానసిక శాస్త్రవేత్త సిగ్మున్డ్ ఫ్రాయ్‌డ్ ఈడిపస్ కాంప్లెక్స్ అనే పదబంధాన్ని ప్రవేశపెట్టి ఈడిపస్ కథకి ఒక రకం ప్రాచుర్యం తీసుకొచ్చేడు; అంతే కానీ ఈడిపస్ ఈ రకం మనోస్థితిని ఎదుర్కొనలేదు.

ఈడిపస్ కథ ఈడిపస్ పుట్టక మునుపే మొదలయింది. థీబ్స్ (Thebes) రాజ్యానికి రాజైన లైయస్‌కు (Liaus) పుత్ర సంతతి లేకపోవడంతో డెల్ఫైలో (Delphi) ఉన్న ఒరాకిల్‌ని సంప్రదించడానికి భార్యాసమేతంగా వెళతాడు. ‘మీ ఇద్దరికి పుట్టబోయే సంతానమే నీ చావుకి కారకుడవుతాడు. కనుక ఆ కోరిక విరమించుకో’ అని ఒరాకిల్ లైయస్‌కు సలహా చెబుతాడు. ఒరాకిల్ సలహా తు.చ. తప్పకుండా పాటించడానికి లైయస్ నిశ్చయించుకొని భార్య పట్ల అతి జాగరూకతతో ఉంటాడు. కానీ వసంతఋతువు విజృంభించిన ఒక వెన్నెల రాత్రి, మధుపానపు మత్తులో నిగ్రహాన్ని కోల్పోతాడు. రాణి యొకాస్టా (Jocasta) గర్భవతి అవుతుంది. నెలలు నిండగానే పండంటి మగబిడ్డను కంటుంది. ఒరాకిల్ చెప్పిన జోస్యపు బారినుండి తప్పించుకోడానికి శిశువు చీలమండలు రెండింటికి సూదులు గుచ్చెయ్యమని భటులకి ఆదేశాలు ఇస్తాడు రాజు. అలా చేస్తే శిశువు పాకడం, నడవడం వంటి పనులు చెయ్యలేడు కనుక తన చావుకి కారకుడు కాలేడని రాజు ఊహ. రాజాజ్ఞ శిరసావహించేరు సేవకులు. ‘ఎందుకైనా మంచిది, శిశువుని హతమార్చడమే శ్రేయస్కరం!’ అని మంత్రులు సలహా ఇవ్వగా శిశువుని కొండలలోకి తీసికెళ్ళి చంపెయ్యమని తన భటుడికి ఆదేశాలిచ్చాడు రాజు. పసివాడి ప్రాణాలు తియ్యడానికి మనసు ఒప్పక ఆ భటుడు కోరింత్ రాజ్యపు గొర్రెల కాపరి చేతులలో ఆ బిడ్డను పెడతాడు.

కోరింత్ (Corinth) రాజ్యపు రాజు పోలిబస్ (Polibus), రాణి మెరోపి (Merope)లకి పిల్లలు లేరు. అందుకని ఈ గొర్రెల కాపరి పసివాడిని రాజుకి కానుకగా ఇచ్చేడు. సూదిపోట్ల వల్ల పసివాడి చీలమండలు రెండూ వాచి ఉండడం చూసి పోలిబస్ పసివాడికి ఈడిపస్ అని పేరు పెట్టేడు. ఈడిపస్ అంటే ‘వాచిన పాదం’ అని అర్థం. వైద్య పరిభాషలో ఎడీమా (edima) అంటే వాపు అని అర్థం ఉంది కదా!

ఈడిపస్ పెద్దవాడైన తరువాత ఒక తాగుబోతు మైకంలో ఉన్నప్పుడు, ‘రాజు పోలిబస్, రాణి మెరోపి నీ పుట్టుతల్లిదండ్రులు కారు తెలుసా?’ అని అంటాడు. ఈ వదరుబోతు మాటలలో నిజం ఎంతో, ప్రేలాపన ఎంతో తేల్చుకుందామని ఈడిపస్ డెల్ఫై వెళ్లి అక్కడ ఒరాకిల్‌ని సంప్రదించేడు. అడిగిన ప్రశ్న ఏమిటో కానీ ఒరాకిల్ ఇచ్చిన సమాధానం ఈడిపస్‌ని కలవరపరస్తుంది: ‘నువ్వు నీ తండ్రిని చంపేసి నీ తల్లిని వివాహం చేసుకుంటావు.’ ఈ జోస్యం విన్న ఉత్తరక్షణంలో ఈడిపస్ కోరింత్ రాజ్యపు పొలిమేరలు దాటి ఎంత దూరం వీలయితే అంత దూరదేశాలకి వెళ్ళిపోదానికి నిశ్చయించుకుని, ఉత్తర దిశగా ప్రయాణంచేసి, చిట్టచివరికి, విధి వెంట తరమగా, థీబ్స్ రాజ్యం పొలిమేరలకి చేరుకుంటాడు!

[Image: lai_oed.JPG]

థీబ్స్ రాజ్యపు పొలిమేరలలో, ఒక మూడు బాటల మొగలో, ఈడిపస్ దారికి ఒక రథం అడ్డుపడుతుంది. ఆ రథ సారథి ‘పక్కకి తప్పుకో, దారి విడు’ అని అరుస్తాడు.’నేను ముందొచ్చాను. నేనెందుకు తప్పుకోవాలి? నువ్వే తప్పుకో’ అని ఈడిపస్ అంటాడు. మాట మీద మాట పెరిగి, పోరాటంలోకి దిగగా రథసారథినీ, రథారూఢుడైన రాజునీ ఈడిపస్ చంపేస్తాడు. ఒక భటుడు మాత్రం తప్పించుకుని పారిపోతాడు. ఆ రథంలో ఉన్న వ్యక్తి థీబ్స్ రాజ్యపు రాజన్న విషయం కాని, ఆతను తన కన్నతండ్రే అన్న విషయం కాని, ఈడిపస్‌కి తెలియదు. ఈ విధంగా ఒరాకిల్ చెప్పిన జోస్యంలో మొదటి భాగం నిజం అయింది!

[Image: sph_oed.jpg]


థీబ్స్ రాజ్యపు పొలిమేరలు దాటుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించేసరికి ఈడిపస్‌కి స్ఫింక్స్ రూపంలో మరొక సమస్య ఎదురవుతుంది. ఈ స్ఫింక్స్ (Sphinx) అనే శాల్తీ ఒక రకం కంచర ‘నరసింహ’ రూపం! ఈ శాల్తీ తల మానవాకారంలోను, సింహపు శరీరంతోనూ ఉండడమే కాకుండా దీనికి డేగ రెక్కలు కూడా ఉంటాయి! ఏకచక్రపురాన్ని బకాసురుడు వేధించుకుతిన్నట్లు థీబ్స్ రాజ్యాన్ని కొంతకాలంబట్టి ఈ స్ఫింక్స్ వేధించుకుతింటోంది. ఈ స్ఫింక్స్ ఊరి పొలిమేరలో ఉన్న ఒక రాతితిన్నె మీద తిష్ఠవేసి ఊళ్లోకి వెళ్ళేవాళ్లందరినీ పొడుపుకథ లాంటి ఒక కఠిన ప్రశ్న అడుగుతుంది. ఆ ప్రహేళికకి సరి అయిన సమాధానం చెప్పలేనివారిని చంపుకుతింటుంది. ఊరి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించే ఈడిపస్‌ని స్ఫింక్స్ అడ్డుకుని అందరినీ అడిగే ప్రశ్ననే అడిగింది: ‘ఉదయం నాలుగు కాళ్ళతోటి, మధ్యాహ్నం రెండు కాళ్ళతోటి, సాయంత్రం మూడు కాళ్ళతోటీ నడచేది ఏది?’ అప్పటివరకు ఈ ప్రహేళికకి సరి అయిన సమాధానం చెప్పినవారు లేరు. ఈడిపస్ ఆలోచించి, తర్జనభర్జనపడి, చిట్టచివరికి, ‘మనిషి: బాల్యంలో నాలుగు కాళ్ళ మీద పాకుతాడు, నడివయస్సులో రెండు కాళ్ళ మీద నడుస్తాడు, ముసలితనంలో చేతికర్ర పట్టుకుని మూడు కాళ్ళతో నడుస్తాడు’ అని చెపుతాడు. ఇలా గర్వభంగం చెందిన స్ఫింక్స్ జరిగిన పరాభవాన్ని తట్టుకోలేక తను కూర్చున్న ఎత్తుగా ఉన్న రాయి మీంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది.

థీబ్స్ రాజ్యానికి పీడ విరగడ అవడంతో, ప్రజల సంతోషానికి అవధులు లేవు. వారు ఈడిపస్‌కి బ్రహ్మరథం పట్టేరు. వారి రాజు లైయస్ బందిపోట్ల బల్లేలకి ఆహుతి అయిపోయాడని నమ్మి, ఇప్పుడు ఆ రాజు లేని లోటు తీరిందని సంతోషంతో ప్రజలు ఈడిపస్‌కి పట్టం కట్టేరు. అప్పటి ఆచారం ప్రకారం భర్తని కోల్పోయిన లైయస్ భార్య యొకాస్టా ఈడిపస్‌కి పట్టమహిషి అయింది! తను చంపినది తన తండ్రినే అనిన్నీ, తను వివాహం చేసుకున్నది తన తల్లినే అనిన్నీ ఈడిపస్‌కి కానీ అనుచరులకి కానీ ఊహామాత్రంగానైనా తెలియలేదు. విధి వైపరీత్యం! ఈడిపస్-యొకాస్టాల దాంపత్యానికి ఫలితంగా నలుగురు పిల్లలని కంటారు: ఇటైయాక్లిస్, పొలినైసిస్, ఏంటిగోనీ, ఇస్మీనీ (Eteocles, Polynices, Antigone, Ismene).

కొన్ని ఏళ్ళు గడచిన తరువాత థీబ్స్ నగరానికి మహామ్మారి ప్లేగు పట్టుకుంటుంది. ప్రజలని పీడిస్తున్న ఈ వ్యాధి పట్టునుండి విముక్తి కలిగించడానికి తరుణోపాయం ఏదైనా ఉందేమో కనుక్కుని రమ్మని బావమరిది క్రియోన్‌ని డెల్ఫైలో ఉన్న ఒరాకిల్ దగ్గరకి సంప్రదింపులకి పంపుతాడు, ఈడిపస్. ‘థీబ్స్ రాజైన లైయస్‌ని అన్యాయంగా చంపిన వ్యక్తి తాను చేసిన దుష్కృత్యానికి ప్రాయశ్చిత్తం పొందలేదు కనుక ప్రజలకి ఈ ఇక్కట్లు వస్తున్నాయి.’ అని ఒరాకిల్ చెబుతాడు. ఈ వార్త విన్న తరువాత లైయస్‌ని అన్యాయంగా చంపిన వ్యక్తిని దండించి తీరుతానని ప్రతిన పడతాడు, ఆ వ్యక్తి తానేనన్న ఊహ లేశమాత్రమైనా లేని ఈడిపస్! లైయస్‌ని చంపిన వ్యక్తి ఎవ్వరో తెలుసుకోవడం ఎలా? ఈడిపస్ తన ఆస్థాన జ్యోతిష్కుడు టైరీసియస్‌ని (Tiresias) సంప్రదిస్తాడు. పుట్టుగుడ్డి అయిన టైరీసియస్ నేరస్తుడు ఎవ్వరో ఈడిపస్ వైపు వేలు పెట్టి చూపిస్తాడు. ఇదేదో బావమరిది క్రియోన్, జ్యోతిష్కుడు టైరీసియస్‌తో కలసి తనని పదవీభ్రష్టుడిని చెయ్యడానికి చేసిన కుట్ర అని వారిరువురి మీద నింద మోపుతాడు ఈడిపస్.

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు కథనం ఇలా మలుపు తిరిగేసరికి రాణి యొకాస్టాకి అసలు ఏమి జరిగిందో తేల్చుకోవాలనే దుగ్ధ పెరిగి ఈడిపస్‌ని జరిగిన పాత సంఘటనలు అన్నిటిని కాలక్రమానుగతంగా చెప్పమని అడిగింది. ఈడిపస్ చెప్పిన ఉదంతంతో తనకి తెలిసినవాటితో పోల్చి చూసుకునేసరికి ఆమె అనుమానాలు పెనుభూతాలై కూర్చున్నాయి. నిజం తేలాలంటే థీబ్స్ రాజ్యపు సరిహద్దులలో, మూడు వీధుల మొగలో, ఈడిపస్ రథాన్ని ఎదుర్కొని యుద్ధంచేసిన వ్యక్తులు ఎవ్వరో నిర్ధారించాలి. ఆ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసి, యుద్ధరంగం నుండి ప్రాణాలతో పారిపోయిన వ్యక్తి ఒక భటుడు. ఆ భటుడి కోసం వేట మొదలయింది. ఈ వేట ముగిసేలోగా కోరింత్ రాజు, పోలిబస్ చనిపోయాడని ఒక వార్తావహుడు ఈడిపస్ కొలువులోకి వార్త తీసుకువచ్చాడు. తన తండ్రి చనిపోయాడన్న విచారం ఒక పక్క, తన తండ్రి మరణానికి తను కారణం కాలేదన్న ఉపశమనం మరొక పక్క పోటీపడుతున్నాయ్ ఈడిపస్ మనోఫలకంలో. తండ్రి అంత్యక్రియలు చెయ్యడానికి వెళితే తన తల్లిని చూడవలసి వస్తుంది. అప్పుడు ఒరాకిల్ చెప్పిన జోస్యంలో రెండవ భాగం నిజం ఆయే ప్రమాదం ఉంది. ఇలా ఆలోచించి ఈడిపస్ తన తండ్రి పార్థివదేహాన్ని కడసారి చూడ్డానికి కూడా వెళ్ళనంటాడు.’మీకా భయం అక్కరలేదు. కోరింత్ రాజ్యపు రాజు పోలిబస్, రాణి మెరోపికి పిల్లలు లేరు. నేనే అడవిలో దొరికిన ఒక పసిబాలుడిని వారికి కానుకగా ఇచ్చేను’ అని చావు కబురు తీసుకువచ్చిన వార్తావహుడు అశనిపాతం లాంటి వార్త మరొకటి చెబుతాడు.

రాణి యొకాస్టాకి కావలసిన ఋజువు దొరికింది. తన కొడుకునే భర్తగా స్వీకరించిన అఘాయిత్యానికి నిష్కృతి కనిపించలేదు. ఆమె వెంటనే రాజప్రాసాదపు అంతర్భాగంలోకి వెళ్లిపోతుంది.


[Image: jac_oed.JPG]


మూడు వీధుల మొగలో, ఈడిపస్‌తో జరిగిన యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసి, యుద్ధరంగం నుండి ప్రాణాలతో పారిపోయిన భటుడు చిట్టచివరికి దొరుకుతాడు. అతని సాక్ష్యంతో ఈడిపస్‌కి జరిగిపోయిన కార్యక్రమం అంతా అర్థం అవుతుంది. పరుగుపరుగున యొకాస్టా కోసం అంతఃపురంలోకి వెళతాడు. అక్కడ ఉరి పోసుకుని ప్రాణాలు విడిచిన రాణిని చూసి నిర్విణ్ణుడవుతాడు. నోట మాట రాదు. రాణి వస్త్రాలకి సూదితో గుచ్చి ఉన్న ఆభరణాన్ని తీసుకుని తన కళ్ళు రెండూ పొడిచేసుకుని గుడ్డివాడయిపోతాడు. థీబ్స్ సింహాసనాన్ని క్రియోన్ అధిష్టించి ఈడిపస్‌ని రాజ్యం నుండి బహిష్కరిస్తాడు.

Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 11:39 PM



Users browsing this thread: 1 Guest(s)