Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#20
ఆర్టెమిస్, ఒరాయన్‌ల ప్రేమగాథ


గ్రీకు పురాణాలలో ఆర్టెమిస్ (Artemis), ఒరాయన్‌ల (Orion) ప్రేమ గాథ రకరకాల మూలాలలో రకరకాలుగా, చిన్నచిన్న తేడాలతో కనిపిస్తుంది. అపాలో యొక్క కవల సహోదరి ఆర్టెమిస్. ఈమె మృగయావినోదాలకి అధిపత్ని. పసితనం నుండి ఈమెకి వేటాడం మీద అభిమానం మెండుగా ఉండేది. అందుకని ఆర్కేడియాలో ఉన్న కొండలలోను, కోనలలోను వేటాడుతూ, క్రొంగొత్త అనుభవాలని అన్వేషిస్తూ తిరుగాడడానికి ఇష్టపడుతూ ఉండేది. తండ్రి జూస్ అమె అభిలాషలని ప్రోత్సహించేవాడు. ఆమె రక్షణ కోసం ఆమెకి ఏడుగురు వనదేవతలని(nymphs) చెలికత్తెలుగా నియమించేడు. ఈమెకి పేన్ (Pan) రెండు వేట కుక్కలని కానుకగా ఇచ్చేడు. [ఈ పేన్ నడుం దిగువ భాగం గొర్రె ఆకారంలోనూ, ఎగువ భాగం మనిషి ఆకారంలోనూ ఉండే ఒక వనదేవుడు; అడవులలోను గడ్డి మైదానాలలోను గొర్రెలని కాసుకుంటూ, పిల్లనగ్రోవి ఊదుకుంటూ తిరుగాడుతూ ఉంటాడు. ఇతను మధ్యాహ్నం వేళ కునుకు తీస్తున్న సమయంలో ఎవరైనా అకస్మాత్తుగా లేపితే పెడబొబ్బ పెడతాడు. ఆ శబ్దానికి భయపడి అతని గొర్రెలు చిందరవందరగా చెల్లాచెదరు అయిపోతాయి. ఈ సంఘటనని పురస్కరించుకుని అకస్మాత్తుగా భయపడే సందర్భాన్ని వర్ణించడానికి ఇంగ్లీషులో ‘పేనిక్’ (panic) అన్న మాట పుట్టింది.] ఒంటి కన్ను సైక్లాప్స్ ఈమెకి వెండితో చేసిన విల్లమ్ములని బహూకరించేడు. వీటితో నిత్యసాధన చేసిన ఆర్టెమిస్ ప్రతిభ అతి త్వరలోనే అపాలోతో సరితూగడం మొదలయింది.

[Image: artemis.jpg]


ఆర్టెమిస్ అహోరాత్రాలు వేటలో మెళుకువలు నేర్చుకుంటూ, నేర్చిన వాటికి పదనుపెడుతూ, ఏకాంతంగా రోజులతరబడి గడిపేసేది. ఆమె ఏకాంతానికి భంగం కలిగితే ఆమెకి ఎక్కడ కోపం వస్తుందో అని మానవులు ఆమెకి దూరంగా ఉండేవారు. అడవులలో ఏకాంతంగా ఆమె వేటాడుతూ ఉంటే వనదేవతలైన ఆమె చెలికత్తెలు కేరింతలుకొడుతూ ఆడుకునేవారు!

ఒకనాడు ఆర్టెమిస్ ఒక జలాశయంలో జలకాలాడుతూ ఉన్న సమయంలో ఆక్టియన్ (Actaeon) అనే మానవుడు అటువైపు వెళ్ళడం తటస్థించింది. అతను ఇదివరలో ఆర్టెమిస్ అందచందాల గురించి వినివున్నాడు కానీ, ఆమె ఇంత అందంగా ఉంటుందని కలలోనైనా ఊహించలేదు. ఆమెని చూస్తూ, నిర్విణ్ణుడై స్థాణువులా ఉండిపోయేడు.

కొలనులో జలకాలాడుతూన్న ఆర్టెమిస్ తనవైపే రెప్ప వాల్చకుండా చూస్తూన్న ఆక్టియన్‍ని చూసి ఉగ్రురాలయింది. చేతితో నీళ్లు తీసుకుని అతని వైపు వెదజల్లింది. ఆ నీటి బిందువులు అతని శరీరాన్ని తాకేసరికి అతను ఒక దుప్పిగా మారిపోయేడు. అప్పుడు ఆర్టెమిస్ బిగ్గరగా ఒక ఊళ వేసేసరికి ఆమె వేట కుక్కలు రెండూ పరుగు పరుగున వచ్చి, ఆ దుప్పిని చీల్చిచెండాడి చంపేసేయి.
దయనీయ పరిస్థితులలో ఆక్టియన్ ఎదుర్కున్న దారుణ మరణ వార్త ఆ అడవిలో దావానలంలా వ్యాపించింది. అందరూ ఆర్టెమిస్‌ని కన్నెత్తి చూడడానికే భయపడేవారు; ఒక్క ఒరాయన్ (Orion) తప్ప. ఒరాయన్ తండ్రి పోసైడన్ (Poseidon), తల్లి యురియెల్ (Euryale) అనే మానవ స్త్రీ. ఒరాయన్ భూలోక సుందరుడు అని పేరు పొందేడు; ఒకరికి భయపడే రకం కాదు. ఒరాయన్‌కి ఆ అడవిలో వేటాడుతూ తిరగడం అంటే బహు ప్రీతి. అంతే కాదు; ఒరాయన్ వనకన్య మెరోపీని (Merope) ప్రేమించేడు. ఆమె ఎక్కడ ఉంటే అతను అక్కడే తిరుగాడేవాడు. అయినా భయంవల్లో, భక్తివల్లో, మర్యాద కొరకో ఎల్లప్పుడూ ఆర్టెమిస్‌కి దూరంగానే ఉండేవాడు.

ఒకనాడు బృహత్ లుబ్ధకం (Canis Major), లఘు లుబ్ధకం (Canis Minor) అనే పేర్లు గల తన కుక్కలని వెంటేసుకుని ఒరాయన్ వేటాడుతున్నాడు. అకస్మాత్తుగా ఎదురుగా ఉన్న తుప్పలలో తెల్లగా ఉన్నది ఏదో కదిలింది. అది ఏదో అపురూపమైన పక్షి మూక అయి ఉంటుందని ఊహించి చాటుమాటున పొంచి మెదలడం మొదలుపెట్టేడు ఒరాయన్. అతను సమీపించేసరికి ఆ తెల్లగా ఉన్నది మెరుపులా పరుగుతీసింది. సావధానంగా చూసేసరికి అవి పక్షులు కావు, ఆ కదిలేవి తెల్లటి ఉడుపులతో ఉన్న ఏడుగురు వనకన్యలు అని తేలింది.

ఒరాయన్ వారిని వెంబడించేడు. వనకన్యల గుంపు వాయువేగంతో ముందుకు పొతోంది. ఒరాయన్ వేగంలో వారిని ఏమాత్రం తీసిపోలేదు. పైగా ఒరాయన్ బలశాలి. పరుగున వచ్చి ఒరాయన్ మెరోపీ కొంగు పట్టుకున్నాడో లేదో ఆమె కెవ్వున కేక వేసింది. ఆ కేక ఆర్టెమిస్ విన్నది. విన్న వెంటనే ఆర్టెమిస్ ఆ ఏడుగురు వనకన్యలని ఏడు తెల్లటి పావురాలుగా మార్చేసింది. అవి రివ్వున ఆకాశపు లోతుల్లోకి ఎగిరిపోయాయి. అలా ఆ పావురాలు వినువీధి లోకి ఎగిరిపోతూ ఉంటే ఆర్టెమిస్ తన తండ్రి జూస్‌ని పిలచి ఆ వనకన్యలకి ఏ హాని జరగకుండా చూడమని ప్రార్థించింది. అప్పుడు జూస్ ఆ ఏడుగురు వనకన్యలని ఏడు నక్షత్రాలుగా మార్చేసి ఆకాశంలో శాశ్వతంగా ఉండిపొమ్మని చెప్పేడు. ఆ ఏడు నక్షత్రాలనే ప్లయేడిస్ (Pleiades లేదా Seven Sisters) అని అంటారు. (ఇవే వృషభరాశిలో కృత్తికలు అన్న పేరుతో కనిపించే నక్షత్రాలు.)

ఈ అలజడికి కారణం ఏమిటా అని ఆర్టెమిస్ ఇటూ, అటూ చూసేసరికి ఎదురుగా ఒరాయన్ కనిపించేడు. అతని అందం, అతని వర్ఛస్సు, అతని వేగం ఆర్టెమిస్‌ని అపరిమితంగా ఆకర్షించేయి. అప్రయత్నంగానే ఇద్దరూ కలసి వేటాడడం మొదలుపెట్టేరు. ఒకరితో మరొకరు పోటీలుపడుతూ వేటాడేవారు. చీకటిపడ్డ తరువాత నెగడు దగ్గర చలి కాగుతూ, కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. వారి నవ్వుల సవ్వడితో ఆ అడవి ప్రతిధ్వనించేది.

శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతూన్న వీరి స్నేహం అపాలోకి నచ్చలేదు. ‘కేవలం ఒక మానవమాత్రుడిని ఎలా ప్రేమించగలుగుతున్నావ్?’ అని నిలదీశాడు.
‘మానవుడైతేనేం? ఒరాయన్ బలశాలి, ధైర్యవంతుడు.’ ఆర్టెమిస్ ఎదురుతిరిగి సమాధానం ఇచ్చేసరికి అపాలో అహం దెబ్బతింది. తన సోదరి సమీకరణం నుండి ఒరాయన్‌ని ఎలాగైనా తప్పించాలని అపాలో ఒక నిశ్చయానికి వచ్చేడు.

ఒక రోజు ఒక మండ్రగబ్బ ఒరాయన్ మీదకి వస్తోంది. ఒరాయన్ దానిని ఎదుర్కుని చంపడానికి శతథా ప్రయత్నం చేస్తున్నాడు. అయినా అతని కృషి సఫలం కావటంలేదు. ఒరాయన్ అంతటి ధీరుడు కేవలం ఒక నల్ల తేలుని ఎదుర్కుని చంపలేకపోతున్నాడు. ఒరాయన్‌కి ముచ్చెమటలు పోస్తున్నాయి. తేలు మీదమీదకి వచ్చి అతని వక్షస్థలం మీద కాటు వెయ్యడానికి కొండిని పైకి ఎత్తింది. ఒరాయన్ ఒక్క పెడబొబ్బ పెట్టేడు. అతని ఒళ్ళంతా స్వేదావృతం అయిపోయింది. మెలకువ వచ్చింది. అదంతా నిద్రలో వచ్చిన ఒక పీడకల అని గ్రహించి స్థిమితపడ్డాడు. నిద్రలోంచి తేరుకుందామని, బయటికి చల్లగాలిలోకి వచ్చాడు. ఎదురుగా నల్లటి మండ్రగబ్బ! కలలో కనిపించినదే! ఒరాయన్ ఆ తేలుతో హోరాహోరీ పోరాడేడు. చిట్టచివరికి ఆ తేలు వేసిన కాటుకి ఒరాయన్ మరణించేడు.
ఒరాయన్ మరణం ఆర్టెమిస్‌ని కృంగదీసింది. ఒరాయన్ ప్రాణాలు తీసిన తేలు ఇంకా అక్కడే ఉంది. ఆర్టెమిస్ కోపంతో ఆ తేలుని పట్టుకుని రివ్వున ఆకాశంలోకి విసిరేసింది. అదే ఇప్పుడు మనకి ఆకాశంలో కనిపించే వృశ్చిక రాశి. ఈ తేలు గుండెకి సమీపంలో కనిపించే నక్షత్రమే జ్యేష్ఠ (Antares). అటు తరువాత రాశి చక్రంలో, వృశ్చిక రాశికి బహుదూరంలో ఉండేలా, అతిశయించిన ప్రేమతో ఒరాయన్ పార్థివ దేహాన్ని, అతని వేట కుక్కలని ఆర్టెమిస్ నక్షత్రాల రూపంలో అమర్చింది. అందుకనే ఒరాయన్ నక్షత్ర కూటమి తూర్పున ఉదయించే వేళకి వృశ్చిక రాశి పడమట అస్తమిస్తుంది.

[Image: orion.png]


ఇప్పటికీ తలెత్తి చూస్తే ఆకాశంలో తేలికగా పోల్చుకోగలిగే నక్షత్ర రాశి ఒరాయన్! దీనినే మనం మృగవ్యాధుడు అని భారతీయ భాషలలో అంటాం. చీకటి రాత్రి పశ్చిమ ఆకాశం వైపు చూస్తే కొట్టొచ్చినట్లు దగ్గరదగ్గరగా మూడు చుక్కలు వరసగా కనిపిస్తాయి. వీటిని వేటగాడి నడుం చుట్టూ ఉన్న పటకాలా ఊహించుకుంటే ఆ పటకా నుండి కిందకి కాని, కుడి పక్కకి కాని మరి రెండు చుక్కలు కనిపిస్తాయి; అవి మృగవ్యాధుడి కాళ్లు. ఎడమ మోకాలి దగ్గర ఉన్న నక్షత్రం పేరు రైజెల్ (Rigel, వృత్రపాద నక్షత్రం). పటకా నుండి పైకి చూస్తే రెండు బాహుమూలాలు, వాటి మీద తలకాయ ఉండవలసిన చోట మరొక తార కనబడతాయి. కుడి చంక దగ్గర ఎర్రగా కనిపించే నక్షత్రం పేరు బీటిల్‌జూస్ (Betelguese, ఆర్ద్రా నక్షత్రం). బాగా ముందుకి చాపిన ఎడమ చేతిలో విల్లు, పైకి ఎత్తిన కుడి చేతిలో రెండు బాణాలు (లేదా, ఒక దుడ్డు కర్ర) కూడ చూడవచ్చు.

మృగవ్యాధుడు పాదాల దిగువన, కాసింత వెనకగా Canis Major (పెద్ద కుక్క) లేదా బృహత్ లుబ్ధకం ఉంటుంది. ఇది ఉత్తరాకాశంలో మరొక నక్షత్ర రాశి; మృగవ్యాధుడుకి ఆగ్నేయంగా ఉన్న ఈ రాశిలోనే మన ఆకాశంలో కనిపించే అత్యంత ప్రకాశమానమైన సిరియస్ (Sirius, మృగశిర) నక్షత్రం ఉంది.

అమెరికా 1960 దశకంలో చంద్రుడి మీద కాలు మోపడానికి చేసిన ప్రయత్నానికి అపాలో అని పేరు పెట్టేరన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇప్పుడు మళ్లా రాబోయే దశకంలో చంద్రుడి మీద రెండోసారి కాలు మోపడానికి చేస్తూన్న ప్రయత్నానికి ఆర్టెమిస్ అన్న పేరు, ఈ ప్రయత్నంలో వాడబోయే నభోనౌక పేరు ఒరాయన్ అని గమనిస్తే గ్రీకు సంస్కృతి సైన్సుని ఎంతగా ప్రభావితం చేస్తూందో అవగతం అవుతుంది!


* (ఆధారం: Carl Sagan, Croesus and Cassandra, Chapter 9 in Billions & Billions, Random House, New York, NY 1997.)

Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 11:19 PM



Users browsing this thread: 1 Guest(s)