Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#16
ట్రాయ్ సంగ్రామం నిజమా? కల్పనా?


మహాభారత యుద్ధం గురించి చదువుతున్నప్పుడు వచ్చే రకం సందేహాలే ట్రాయ్ సంగ్రామం గురించి కూడా వస్తాయి. ఈ కథ పురాణమా? ఇతిహాసమా? ఈ యుద్ధం నిజంగా జరిగిందా? జరిగితే ఎప్పుడు జరిగింది? యుద్ధంలో కనిపించే సంఘటనలు, పాత్రలు (మనుష్యులు, దేవతలు) నిజమా? కల్పనా? ఈ యుద్ధం గురించి ఎవ్వరు రాసేరు? ఎప్పుడు రాసేరు? వగైరా, వగైరా!

ఈ యుద్ధం గురించి మనకి ఉన్న ముఖ్యమైన ఆధారాలు గ్రీకు సాహిత్యంలో కనిపిస్తాయి; కానీ ఏ ఒక్క చోటా మనకి సాధికారంగా ఆధారాలు కనబడవు. ఈ యుద్ధం నిజంగా జరిగి ఉంటే అది సా. శ. పూ. 1194-1184 మధ్య కాలంలో జరిగి ఉండవచ్చని గ్రీకు శాస్త్రవేత్త ఎరతోస్తనీస్ (Eratosthenes) వేసిన అంచనా నమ్మదగ్గదే అనడానికి అధారాలు కనిపిస్తున్నాయని పురావస్తు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అనగా, కంచు యుగపు చివరి దశలో అని మనం చెప్పుకోవచ్చు.

[Image: Troy.jpg]


సా. శ. 1870లో జెర్మనీ దేశపు పురావస్తు పరిశోధకుడు హైన్రిక్ ష్లీమన్ (Heinrich Schliemann) పశ్చిమ టర్కీలో (ట్రాయ్ నగరపు సమీపంలో) జరిపిన తవ్వకాలలో ఒక శిథిలమైన కోట దిబ్బ, దాని చుట్టూ 25 మీటర్ల లోతు వరకు శిథిలమైన భవనాల అవశేషాలు కనిపించేయి. వాటి చుట్టూ 46 ఇతర వాటికలు కనిపించేయి. ఇటీవల జరిపిన మరికొన్ని తవ్వకాలలో కనబడ్డ ఒక పురాతన నగరం హైన్రిక్ ష్లీమన్ కనుక్కున్న నగరం కంటే పదింతలు పెద్దది అని తెలిసింది. ఈ నగరం ఉన్న ప్రాంతాలలో సా. శ. పూ. 3000 నుండి సా. శ. పూ. 1350 వరకు అవిరామంగా జనావాసాలు ఉండేవని తీర్మానించేరు. అంతేకాదు. సా. శ. పూ. 1180కి సంబంధించిన స్తరాలలో వేడికి మాడిపోయిన అవశేషాలు, మానవ ఆస్థిపంజరాలు కనిపించడంతో అవి ఏదో యుద్ధానికి సంబంధించినవే అయుంటాయని నమ్ముతున్నారు.

ఈ నగరం గురించి, అక్కడ జరిగిన యుద్ధం గురించి, ఆనోటా ఈనోటా జానపదుల నోటా 400 సంవత్సరాల తరువాత విన్న కథలని హోమర్ ఇలియడ్, ఆడిస్సి అనే రెండు ఉద్గ్రంథాలలో పొందుపరచి ఉంటాడు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇలియడ్ సంకలనం సా. శ. పూ. 750లోను, ఆడిస్సి సంకలనం సా. శ. పూ. 725లోను పూర్తి అయి ఉంటాయి. ఇలా సంకలించబడ్డ కథల సమాహారం లిఖిత రూపం దాల్చేసరికి మరికొన్ని దశాబ్దాలో, శతాబ్దాలో పట్టి ఉండవచ్చు.

అసలు హోమర్ అనే వ్యక్తి ఉన్నాడా అని ప్రశ్నించేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని గ్రీకు మాండలికాలలో హోమర్ అంటే గుడ్డివాడు అని అర్థం వస్తుంది కనుక హోమర్ గుడ్డివాడయి ఉంటాడని కొందరి తీర్మానం. ఎందుకంటే ఆడిస్సిలో ఒక చోట ఒక అంధుడు పాత్రగా వచ్చి యుద్ధంలో విశేషాలని కథల రూపంలో చెబుతాడు. హోమర్ ఈ విధంగా తాను చెబుతున్న కథలో తానే ఒక పాత్రలా వచ్చేడని వీరి అభిప్రాయం. వ్యాసుడు కూడా భారత కథలో అక్కడక్కడ అతిథి నటుడిగా వస్తూ ఉండడం గమనార్హం.

ఈ కథని చారిత్రక పరిశోధన కోణం నుండి విశ్లేషించడం కష్టం. ఈ కథలో తారసపడే చాల పాత్రలు దైవాంశ సంభూతులు (demigods), అనగా దేవతలు, మానవులు కలవగా పుట్టినవారు. ఉదాహరణకి హెలెన్ ఒలింపియను దేవత అయిన జూస్ ఒక హంస రూపంలో వచ్చి మానవ వనిత లేడాని బలవంతం చెయ్యగా పుట్టిన సంతానం. అదే విధంగా హెలెన్‌ని పేరిస్ వశపరచుకోడానికి టైటన్ దేవత ఏఫ్రొడైటి ఇచ్చిన వరం కారణభూతం అవుతుంది. ఈ రకం సంఘటనలు నిజజీవితాలలో జరగడం అనేది మన అనుభవాలకి అతీతం. అలాగే యుద్ధం పది సంవత్సరాలు జరుగుతుంది. కంచు యుగంలో ట్రాయ్ నగరాన్ని పది రోజులు దిగ్బంధం చేసేరంటే నమ్మవచ్చేమోకాని పదేళ్లు కొంచెం అతిశయోక్తి అనిపిస్తుంది.

ఈ సమాచారం అంతటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ట్రాయ్ అనే నగరం ఉండి ఉండవచ్చు. ఆ నగరం వద్ద పెద్ద యుద్ధం జరిగి ఉండవచ్చు. ఆ యుద్ధం జరగడానికి హెలెన్ అనే అందమైన ఆడదానిని పేరిస్ అనే యువకుడు అపహరించడం కారణం అయి ఉండవచ్చు. ఆ యుద్ధంలో గ్రీకు సైనికులు ఒక కొయ్య గుర్రంలో దాగుని దొంగచాటుగా ట్రాయ్ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని నాశనం చేసి ఉండవచ్చు. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలే కావచ్చు. కానీ ఈ కథలో కనిపించే దేవతలు, వారికీ మానవులకీ మధ్యనున్న సంబంధ బాంధవ్యాలు మన అనుభవ పరిధిలో నమ్మడానికి వీలు లేనివి. వీటిని కవి కల్పించిన ఉత్ప్రేక్షలు అనే అనుకోవాలి.

Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 10:48 PM



Users browsing this thread: 1 Guest(s)