Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#13
గ్రీకు పురాణ గాథలు 6
 

ట్రాయ్ మహా సంగ్రామం

గ్రీకు పురాణ గాథలలో ప్రసిద్ధికెక్కిన ఈ మహా సంగ్రామానికి, తద్వారా జరిగిన మారణహోమానికి మూల కారణం ఏరిస్ (Eris) అనే ఒలింపియన్ దేవత అని మనం తీర్మానం చెయ్యవచ్చు. (ఏఫ్రొడైటి (Aphrodite) కొడుకు ఈరోస్ (Eros) మన మన్మథుడికి పోలిక! ఏరిస్ బంగారు ఏపిల్ పండుని పెళ్లి పందిరిలోకి విసిరిన వ్యక్తి.)

ఒక వివాహ సందర్భంలో ఒలింపియను దేవతల అధినేత అయిన జూస్ ఒక బ్రహ్మండమైన విందు చేస్తాడు. కోరుకుని కొరివితో తలగోక్కోవడం ఎందుకని పేచీకోరు ఏరిస్‌ని ఆ విందుకి పిలవడు. జరిగిన పరాభవానికి ఆత్మాభిమానం దెబ్బతిన్న ఏరిస్ పిలవని పేరంటంలా విందుకి రానే వచ్చింది. జూస్ ఆజ్ఞానుసారం హెర్మీస్ ఆమెని లోపలికి రాకుండా అటకాయిస్తాడు. ఏరిస్ తక్కువ తిన్నదా? బయట నుండే బంతి భోజనాల మధ్యకి ఒక బంగారు ఏపిల్ పండుని విసరి వెళ్లిపోతుంది. ఆ పండు మీద ’మీలో అందమైన ఆడదానికి ఈ బహుమానం’ అని రాసి ఉంటుంది.

విందులో ఉన్న ముగ్గురు దేవతలు–హేరా, ఎథీనా, ఏఫ్రొడైటి, ఆ పండు నాకోసమే అంటే నాకోసమే అంటూ ఎగబడి తగువులాడుకుంటారు. తీర్పు చెప్పమని ముగ్గురూ జూస్‌ని అడుగుతారు. ఎటు తీర్పు చెప్పినా ఇబ్బందే అని జూస్ ఈ ముగ్గురికీ హెర్మీస్‌ని తోడు ఇచ్చి భూలోకంలో ఉన్న పేరిస్ దగ్గరకి పంపుతాడు. ముగ్గురిలోనూ ఏఫ్రొడైటి అందమైనదని పేరిస్ తీర్పు చెబుతాడు. దానికి బహుమానంగా పేరిస్‌ని భూలోక సుందరి హెలెన్–మెనలౌస్ భార్య–వరించేలా వరం ఇస్తుంది.

[Image: Ledaswan.jpg]

హెలెన్ కన్నతల్లి స్పార్టాకి రాణి అయిన లేడా (Leda). హంస రూపంలో జాస్ వచ్చి లేడాని అనుభవించగా హెలెన్ పుట్టిందని ఒక కథనం ఉంది. కనుక హెలెన్ దైవాంశ సంభూతురాలు. స్పార్టాకి రాజైన టిండరియుస్ (Tyndareus) హెలెన్‌ని తన సొంత కూతురిలాగే చూసుకున్నాడు. హెలెన్ అందాన్ని చూసి ఎంతోమంది రాజులు, ధీరులు ఆమెని చేపట్టటానికి ముందుకి వచ్చేరు. ఒకరి వైపు మొగ్గు చూపితే మరొకరికి కోపం వస్తుందని టిండరియుస్ భయపడ్డాడు. చివరికి ఇథాకా రాజైన ఒడీసియస్ (Odysseus) తనకి పెనెలొపిని (Penelope) ఇచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేస్తే ఒక పరిష్కార మార్గం సూచిస్తానన్నాడు. ఆ మార్గం ఏమిటంటే హెలెన్ ఎవ్వరిని పెళ్లి చేసుకున్నా సరే మిగిలిన రాజులంతా ఆ వివాహాన్ని సమర్థించాలి. అంతా ఒప్పుకున్నారు. అప్పుడు టిండరియుస్ తన కోరిక మేరకు హెలెన్‌ని మెనలౌస్‍కు (Menelaus) ఇచ్చి పెళ్లి చేసేడు.

మెనలౌస్‌కి హెలెన్‌ని ఇవ్వడంలో రాజకీయం లేకపోలేదు. మెనలౌస్ ధనవంతుడు. అతనికి పెద్ద సైన్యం ఉంది. పెద్దల యెడల ఎలా ప్రవర్తించాలో ఎరిగిన వ్యక్తి. పెళ్లి విషయంలో కూడా తనంత తానుగా ఎగబడలేదు; తన అన్నగారైన అగమెమ్నాన్ (Agamemnon) ద్వారా వర్తమానం పంపేడు. ఈ అగమెమ్నాన్ మరెవరో కాదు; హెలెన్‌కి సాక్షాత్తు మరిది. ఎందుకైనా మంచిదని ఈ పెళ్లి జరిగితే ప్రేమదేవత ఏఫ్రొడైటికి వంద గిత్తలు బలి ఇస్తానని మెనలౌస్ మొక్కుకున్నాడు కూడా. ఆ మొక్కు సంగతి మరచిపోయి ఏఫ్రొడైటి ఆగ్రహానికి గురి అవుతాడు; అది వేరే సంగతి!

ట్రాయ్ నగరపు రాయబారి వర్గంలో ఒక వ్యక్తిగా పేరిస్ చొరబడి స్పార్టాలో ప్రవేశిస్తాడు. పేరిస్ రాజప్రాసాదంలోకి ప్రవేశించేలోగా ఏఫ్రొడైటి అందాల పోటీలో తాను పేరిస్‌కి ఇచ్చిన వరం నెరవేర్చడానికిగాను ఈరోస్ (Eros) సహాయం కోరుతుంది. ఈరోస్ తన పువ్వుల బాణంతో హెలెన్‌లో కామాతురతని రెచ్చగొడతాడు. ఏఫ్రొడైటి ఇచ్చిన వరం ప్రకారం పేరిస్‌ని చూడగానే హెలెన్ ప్రేమలో పడుతుంది. హెలెన్‌ని వెంటపెట్టుకుని పేరిస్ ట్రాయ్ వెళ్ళిపోతాడు.

[Image: helenparis.jpg]

హెలెన్ అపహరణ అనే పని ఆ రోజుల్లో కొత్తేమీ కాదు. ఇటువంటి ’స్త్రీ గ్రహణాలు’ ఆ రోజుల్లో తరచుగా జరిగేవి. మైసినే (Mycenae) నుండి లో (Lo) అపహరణ, ఫినీషియా (Phoenicia) నుండి యూరోపా (Europa) అపహరణ కేవలం రెండు ఉదాహరణలు. కొల్చిస్ (Colchis) నుండి మెదీయాని (Medea) జేసన్ (Jason) అపహరిస్తాడు. ట్రాయ్ నగరం నుండి హెరాక్లిస్ (హెర్క్యులిస్) రాకుమారి హెసియోనెని (Hesione) అపహరించి ఆమెని టెలమాన్‍కి (Telamon) కానుకగా ఇస్తాడు. ఈ అపహరణలు జరిగినప్పుడు పర్యవసానంగా అనుకోని విపత్తులు ఏవీ రాకపోవడంతో హెలెన్‌ని దొంగిలించడానికి పేరిస్‌కి ధైర్యం వచ్చిందని చరిత్రకారుడు హెరొడోటస్ వ్యాఖ్యానిస్తాడు.

హోమర్ చెప్పిన కథనం ప్రకారం మెనలౌస్ తన స్నేహితుడైన ఒడీసియస్‌ని వెంటబెట్టుకుని ట్రాయ్ నగరంతో సంప్రదింపులు జరిపి హెలెన్‌ని వెనక్కి తెచ్చుకుందామని ప్రయత్నిస్తాడు. ఆ రాయబారం విఫలం అవుతుంది. ఇది సంగ్రామానికి నాంది అవుతుంది.

రాయబారం విఫలం అవడంతో హెలెన్ వివాహాన్ని రక్షిస్తానని మాట ఇచ్చిన అగమెమ్నాన్‌ని మాట నిలుపుకోమని మెనలౌస్ అడుగుతాడు. అప్పుడు మైసినేకి (Mycenae) రాజు అయిన అగమెమ్నాన్ గ్రీకు యోధులని సమకూర్చుకుని, వెయ్యి పడవల బలగంతో ట్రాయ్ మీదకి దండయాత్ర చేసి, నగరాన్ని ముట్టడించి, నగరాన్ని పదేళ్ళపాటు దిగ్బంధం చేస్తాడు. ఈ ఘోరమైన యుద్ధంలో ఎఖిలీస్ (Achilles), ఏజాక్స్ (Ajax) వంటి గ్రీకు యోధులు, హెక్టర్ (Hector), పేరిస్ (Paris) వంటి ట్రాయ్ యోధులు వీరస్వర్గం పొందుతారు.
యుద్ధంలో పేరిస్ మరణించిన తరువాత హెలెన్ అతని అన్నదమ్ముడైన డియ్‍ఫోబస్‌ని (Deiphobus) పెళ్లి చేసుకుంటుంది. ట్రాయ్ నగరం పతనమైపోయిన తరువాత డియ్‍ఫోబస్‌ని వదిలేసి తిరిగి మెనలౌస్‌తో కలిసి స్పార్టా వచ్చేసి శేషజీవితం గడుపుతుంది.

యుద్ధం ముగిసిన తరువాత ఒడీసియస్ (యులిసిస్) తిరుగు ప్రయాణం చేసి ఇథాకా చేరుకుందికి పదేళ్లు పడుతుంది. ఈ తిరుగు ప్రయాణంలో ఒడీసియస్ ఎదుర్కున్న సవాళ్ళని హోమర్ తన రెండవ గ్రంథం ఆడిస్సిలో వర్ణిస్తాడు. ఆడిస్సి రూఢ్యర్థం మహా ప్రస్థానం. ఇలియడ్ రూఢ్యర్థం కష్టకాలం.

సా. శ . పూ. 1వ శతాబ్దంలో రోమ్‌కి చెందిన కవి వర్జిల్ (Virgil) ఎనియాడ్ (Aeneid) అనే గ్రంథంలో యుద్ధం ముగిసిన తరువాత కొందరు గ్రీకు యోధులు, ఎనియస్ (Aeneas) నేతృత్వంలో సముద్రం దాటుకుని ప్రస్తుతం టునీషియాలో ఉన్న కార్తేజ్ (Carthage) వచ్చి, అక్కడ నుండి ఇటలీ వచ్చి, రోమ్ నగరం స్థాపనకి కారణభూతులు అవుతారు.
పాశ్చాత్యులు హోమర్ రాసిన ఇలియడ్ (Iliad), ఆడిస్సిలతో (Odyssey) వ్యాసుడు రాసిన భారతాన్ని పోలుస్తారు. కేవలం ఉపరితలం మీద కనిపించవచ్చేమో కానీ లోతుగా పరిశీలిస్తే ఈ పోలిక సరికాదు. హోమర్ రాసిన ఇలియడ్, ఆడిస్సిలు రెండింటికంటే భారతం రెట్టింపుకి మించి పొడుగు ఉంటుంది! అంతే కాదు; భారతంలో ఆద్యంతం ఒక కథ ఉంది. ఆ కథ వెనుక ఒక బందుకట్టు ఉంది. భారత యుద్ధం మానవుల అత్యాశ వల్ల జరిగితే ట్రాయ్ యుద్ధం దేవతల చెలగాటాల వల్ల జరుగుతుంది. ట్రాయ్ యుద్ధంలో మానవులు దేవతల చేతిలో కేవలం పావులు. భారతం మీద వ్యాఖ్యానాలు చేసిన అనేక పాశ్చాత్యులు గ్రీకు పురాణ గాథల వల్ల ప్రభావితులై గ్రీకు పురాణ కాలపు పట్టకం ద్వారా చూస్తూ చేసేరు తప్ప స్వతంత్రమైన దృక్పథంతో చేసినవారు కారని నా అభిప్రాయం.

[+] 1 user Likes WriterX's post
Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 08:43 PM



Users browsing this thread: 1 Guest(s)