Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#8
గ్రీకు పురాణ గాథలు 4


జూస్
[Image: zeus.JPG]
జాస్ (Zeus) దేవలోకానికి–గ్రీసు దేవతలకి ఆవాసమైన ఒలింపస్ పర్వతం మీద ఉన్న అమర లోకానికి–అధిపతి. పోలికలు ముమ్మూర్తులా సరిపోవు కానీ జూస్‌ని మన ఇంద్రుడితో పోల్సవచ్చు. ఋగ్వేదంలో ఆకాశానికి అధిపతి అయిన ద్యౌస్ (Dyaus) పేరుకి, జూస్‌కి మధ్య ఉన్న పోలిక కేవలం కాకతాళీయం కాదు. వీరిరువురి ఆయుధాలు మెరుపులు, పిడుగులు అవడం గమనార్హం.
క్రోనస్-రేయాలకి పుట్టిన పిల్లల్లో కనిష్ఠుడు అయిన జూస్ జన్మ వృత్తాంతం, జూస్ గద్దెకి ఎక్కిన వయినం చూస్తే క్రోనస్ చరిత్ర పునరావృతమయిందా అని అనిపిస్తుంది. తన తండ్రిని పదవీభ్రష్టుడిని చేసి, టార్టరస్‌లో బందీ చేసి జూస్ గద్దెకి ఎక్కిన ఉదంతం ఎలా నడుస్తుందో చూద్దాం.

జూస్ జన్మ వృత్తాంతం


[Image: rheazeus.jpg]


తన తండ్రి యూరెనస్ శాపం ఏ విధంగా పరిణమిస్తుందో అనే భయంతో క్రోనస్ తన సంతానాన్ని మింగేసి తన కడుపులో బంధిస్తాడు. కానీ రేయా పన్నుగడ పన్ని జూస్ స్థానంలో ఒక రాయికి దుప్పటిగుడ్డ చుట్టబెట్టి క్రోనస్‌కి ఇస్తుంది. ఆ రాయిని క్రోనస్ మింగేస్తాడు. ఈ విధంగా క్రోనస్ కడుపులోకి జూస్ వెళ్లకుండా రక్షణ పొందుతాడు. రేయా జూస్‌ని తీసుకుని క్రీట్ ద్వీపంలో, ఒక గుహలో దాచిపెడుతుంది. అక్కడ వసంత దేవతలు ముగ్గురు జూస్‌ని పెంచి పెద్ద చేస్తారు.
జూస్ పెద్దవాడు అయిన తరువాత అతని భార్య మేటిస్ ఇచ్చిన మత్తు పదార్థం కలిపిన పానీయాన్ని తన తండ్రికి ఇచ్చి క్రోనస్ వాంతి చేసుకోనేటట్టు చేస్తాడు. ఫలితంగా అప్పటి వరకు క్రోనస్ పొట్టలో కూర్చొని ఎదుగుతూన్న రేయా యొక్క మిగతా సంతానం, రాయి బయటకి వచ్చేస్తాయి.

తన తోబుట్టువులు క్రోనస్ కడుపు నుండి విడుదల అయిన తరువాత గద్దె కొరకు యుద్ధం చెయ్యమని జూస్ క్రోనస్‌కి సవాలు విసురుతాడు. పదవిలో ఉన్న టైటన్లతో పదేళ్ళపాటు యుద్ధం చేసి, చివరకి సైక్లాప్స్ (వీరికి టార్టరస్ నుండి జూస్ విముక్తి కల్పించాడు) సహాయంతో జూస్, అతని సహోదరులు విజయం సాధి్స్తారు. అదే సమయంలో క్రోనస్, ఇతర రాక్షసులు టార్టరస్‌లో ఖైదుపాలవుతారు. ఆ తరువాత జూస్ తన సోదరి హేరాని పెళ్లి చేసుకుంటాడు. జూస్, అతని మిత్ర బృందం, ఒలింపస్ పర్వతం మీద స్థిరనివాసం ఏర్పరచుకుంటారు.

జూస్‌కి ఏడుగురు భార్యలు. ఏడుగురు భార్యలూ అమరులే. వారి పేర్లు: మెటీస్ (Metis), థెమీస్ (Themis), యురినోమి (Eurynome), డిమిటర్ (Demeter), నెమోసిన్ (Mnemosyne), లేతో (Leto), హేరా (Hera). అయినా జూస్‌కి స్త్రీ లోలత్వం పోలేదు. జూస్ అనేకమంది స్త్రీలతో మొత్తం 92 మంది పిల్లలకి తండ్రి అవుతాడు!
తనకంటే గొప్పవాడు అయిన కుమారునికి జన్మనిస్తుంది అని తెలిసి, జూస్ తన మొదటి భార్య అయిన మెటీస్‌ని మాయ చేసి, ఈగగా మార్చి మింగేస్తాడు. ఆమె అప్పటికే ఎథీనాని గర్భాన కలిగి ఉంది. ఏది ఏమయినప్పటికీ, ఎథీనా పూర్తిగా పెరిగి యుద్ధం కొరకు దుస్తులు, ఆయుధాలు ధరించి, జూస్ తల నుండి బయటికి వస్తుంది.

[Image: muses.jpg]

జూస్‌కి నెమోసిన్‌తో పుట్టిన తొమ్మిదిమంది ఆడపిల్లల్ని మ్యూజ్ (Muse) లంటారు. తల్లి నెమోసిన్ జ్ఞాపక శక్తికి అధిపత్ని అయితే తొమ్మిది మంది మ్యూజ్‌లు సాహిత్యాలకి, కళలకి, శాస్త్రాలకి అధిపత్నులు. ఒక గ్రంథ్ర రచన వంటి భృహత్కార్యం తలపెట్టినప్పుడు సాహిత్యాలకి అధిపత్ని అయిన మూజ్‌ని ఆహ్వానించి పనికి ఉపక్రమించడం ఆనవాయితీగా జరుగుతుంది.

Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 08:29 PM



Users browsing this thread: 1 Guest(s)