04-09-2021, 08:17 PM
గ్రీకు పురాణ గాథలు 2
గ్రీసు దేశపు పురాణం గాథలలో మూడు తరాల శాల్తీలు కనిపిస్తారు: మొదటి తరం సృష్ట్యాదిలో ఉండే అస్తవ్యస్తత (chaos) నుండి పుట్టినవారు. వీరిని దేవుడు, దేవత, అని అభివర్ణించడానికి బదులు వీటిని మూర్తిత్వం లేని అభిజ్ఞానాలుగా (amorphous symbols) కానీ, అపరావతారాలుగా (personified concepts) కానీ భావించవచ్చు. రెండవ తరం వారు టైటనులు (Titans). సాంప్రదాయికంగా వీరిని దేవగణాలలో ఉంచుతారు కానీ ఒక విధంగా చూస్తే వీరిలో కొందరు మన రాక్షసులని పోలిన శాల్తీలలా అనిపిస్తారు. మూడవ తరం వారు ఒలింపస్ పర్వతం మీద స్థిరనివాసం ఏర్పరచుకున్న ఒలింపియనులు. ఈ మూడవ తరం వారు మనకి పరిచయమైన దేవగణాల (దేవుళ్ళు, దేవతలు) కోవలోకి వస్తారు.
ఇక్కడ gods అనే ఇంగ్లీషు మాటని దేవుళ్ళు, దేవతలు అని అనువదించడం జరిగింది కానీ, నిదానం మీద ఆలోచిస్తే gods అన్న మాటని సురులు, అసురులు అని తెలిగించి సురులని దేవతలుగా పరిగణించి, అసురులులో మంచివాళ్ళని దేవతల కోవలో పడేసి, చెడ్డవాళ్ళని రాక్షసులుగా లెక్కలోకి తీసుకోవచ్చు. కానీ ఈ సూక్ష్మ భేదాలని విస్మరించి లింగ భేదం లేకుండా అందరినీ దేవుళ్ళు అనే అనడం జరిగింది.
గ్రీసు దేవుళ్ళు హిందూ దేవుళ్ళలాంటి వాళ్లు కాదు; వీళ్లల్లో ఈర్హ్య, అసూయ, పగ, జుగుప్స వంటి లక్షణాలు మానవులలో కంటె ఎక్కువ మోతాదులో ఉన్నట్లు అనిపిస్తుంది. వీరు మానవులని సృష్టించి వారిని చదరంగంలో పావులని నడిపినట్లు నడిపి ఆడుకుంటారు. ఉదాహరణకి అందంలో ఎవరు గొప్ప అని పోటీ పడి ముగ్గురు దేవతలు ట్రోయ్ నగరంలో మహా సంగ్రామానికి కారకులు అవుతారు.
మొదటి తరం దేవతలు
సృష్టి మొదట్లో అంతా అస్తవ్యస్తం. ఆ అస్తవ్యస్తం (chaos) నుండి గాయా (Gaia) లేదా భూదేవి, మరి కొన్ని ఇతర ప్రాథమిక శక్తులు (లేదా అపరావతారాలు, లేదా దైవాంశాలు) పుట్టుకొచ్చేయి. ఎబిస్ (Abyss) పుట్టింది; ఇక్కడే పాతాళ లోకానికి అధిపతి అయిన టార్టరస్ (Tartarus) ఉంటాడు. అతని పేరనే ఒక బందిఖానా ఉన్నది. ఎరోస్ (Eros) అనే కామాధిపతి; ఎరెబస్ (Erebus)అనే చీకటికి అధిపతి; నిక్స్ (Nyx) అనే ఈమె రాత్రికి అధిపత్ని, మొదలైనవి.
టార్టరస్
టార్టరస్ (పాతాళలోకం పేరు కూడా ఇదే) నుండి రకరకాల రాక్షసాకారాలు పుట్టుకొచ్చేయి. వాటిల్లో ముఖ్యమైనవి: 1. సెర్బెరస్ (Cerberus): ఒక మూడు తలకాయల కుక్క. ఇది నరకపు ద్వారాల దగ్గర కాపలా కాస్తూ ఉంటుంది. 2. డ్రాగన్ (Dragon): ఇక్కడ నుండే జేసన్, ఆర్గోనాట్లు, బంగారు ఉన్ని కథ మొదలవుతుంది. 3. స్ఫింక్స్ (Sphinx): మనిషి ముఖం, సింహం శరీరం, పక్షి రెక్కలు కల ఒక వింత జంతువు. 4. హార్పీలు (Harpies): సగం మనిషి సగం పక్షి ఆకారాలు. 5. సైరన్లు (Sirens): ఇవి సముద్రచరాలు. తమ తీయటిగొంతుతో పాటలు పాడి సముద్రయాత్రికులను వశం చేసుకొని తినేస్తాయి. 6. గోర్గన్లు (Gorgons): వీళ్ళగురించి రకరకాల వర్ణనలు ఉన్నాయి కాని ప్రముఖంగా చెప్పుకొనేది వారి జుట్టు గురించి. వెంట్రుకల బదులు విషసర్పాలు ఉండే వికృతాకాకారులు వీళ్ళు. వారిని చూసినవారు శిలలైపోతారు. ఎకిడ్నా, టైఫన్ అనేవారికి పుట్టిన ముగ్గురు అక్కచెళ్ళెల్లలో పేరెన్నిక గన్నది మెడూసా (Medusa).
ఎరెబస్‌కీ నిక్స్‌కీ పుట్టిన ఖెరాన్ (Charon) పాతాళలోకంలో ఉన్న నరకానికి వెళ్లే దారిలో వచ్చే స్టిక్స్ (Styx) వంటి నదులని దాటడానికి పడవ నడుపుతూ ఉంటాడు. చనిపోయినవారు ఈ నదులని దాటుకుని అటు వెళ్ళాలి. మన వైతరణికి ఇక్కడ స్టిక్స్‌కి పోలిక చూడండి.